సాక్షి, హైదరాబాద్: ఆర్థిక మాంద్యం కారణంగా గతేడాది బడ్జెట్ కేటాయింపుల్లో పోలీసు శాఖకు కోతపడినా.. ఈసారి కేటాయింపులు ఫర్వాలేదనిపించాయి. గతేడాది బడ్జెట్‌లో ప్రగతిపద్దు రూ.167 కోట్లు, నిర్వహణ పద్దు కింద రూ. 4,788 కోట్లు కేటాయించింది. కోతల బడ్జెట్ కారణంగా స్టేషన్ల నిర్వహణ కూడా సరిగా జరగలేదు. గడిచిన 6 నెలల్లో పోలీసు స్టేషన్లలో పెన్నూ, పేపర్లకూ దిక్కులేకుండా పోయింది. ఈసారి బడ్జెట్‌లో నిర్వహణ పద్దుకు రూ. 5,179.22, ప్రగతి కింద రూ. 672.74 కోట్లుగా మొత్తం రూ. 5,852 కోట్లు కేటాయించింది. ఈసారి ప్రగతి పద్దు, నిర్వహణ పద్దులు కలిపి గతేడాది ప్రతిపాదించిన బడ్జెట్ కంటే దాదాపుగా రూ.890 కోట్ల (ప్రగతి పద్దులో రూ.500 కోట్లు, నిర్వహణ పద్దులో రూ. 390 కోట్లు)కుపైగా పెరగడంతో నిర్వహణ ఖర్చులకు ఇబ్బందులు తలెత్తవని ఆశాభావం వ్యక్తమవుతోంది.
ఈ ఏడాది దసరా అనంతరం దాదాపు 11 మంది ఐపీఎస్‌లు, 15 వేల మంది కొత్త కానిస్టేబుళ్లు, 12 వందల మంది ఎస్సైలు డిపార్ట్‌మెంటులోకి చేరుతున్నారు. ధరలు పెరుగుతున్న నేపథ్యాన్ని దృష్టిలో ఉంచుకుని నిర్వహణ వ్యయాన్ని పెంచారు. మరోవైపు కొత్త జిల్లాల్లో జిల్లా పోలీసు సూపరింటెండెంట్ (డీపీవో) కార్యాలయాలు పూర్తికావొచ్చాయని బడ్జెట్లో పేర్కొంది. ఈ ఏడాది పలు డీపీవోలు ప్రారంభించే అవకాశాలున్నాయని పోలీసు ఉన్నతాధికారులు వ్యాఖ్యానిస్తున్నారు. గ్రేటర్‌లో మహిళలు, పిల్లల భద్రత, కమిషనరేట్ భవనాల నిర్మాణం, సేఫ్‌సిటీ ప్రాజెక్టు, కమాండ్ కంట్రోల్ రూం నిర్మాణాల కోసం మొత్తం రూ.125 కోట్లు కేటాయించింది. నగరంలో సీసీటీవీల ఏర్పాటు కోసం రూ.50 లక్షలు ఇవ్వనుంది.
చిన్న పరిశ్రమల ప్రోత్సాహకాలు భారీగా పెంపు
గ్రామీణ, చిన్న పరిశ్రమలకు మంచి రోజులు రానున్నాయి. తాజా బడ్జెట్‌లో వీటికి రూ.1132.39 కోట్ల నిధులను ప్రభుత్వం కేటాయించింది. గతేడాది కేవలం రూ.21.90 కోట్లు మాత్రమే కేటాయించగా, ఈసారి భారీగా పెంచింది. ప్రధానంగా రాష్ట్రంలో నీటిపారుదల సదుపాయం పెరిగి కోటి ఎకరాలకుపైగా ఆయకట్టుకు సాగునీరు సరఫరా చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఫలితంగా భారీగా పెరగనున్న పంటల దిగుబడులకు మార్కెటింగ్ సదుపాయం కల్పించేందుకు ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలను ప్రోత్సహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. నిర్వహణ పద్దు కింద తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థకు పెట్టుబడి రుణం కింద కేటాయింపులను రూ.87.90 కోట్ల నుంచి రూ.257 కోట్లకు పెంచింది. ఈ నేపథ్యంలో గ్రామీణ, చిన్న పరిశ్రమలను ప్రోత్సహించేందుకు భారీగా కేటాయింపులు జరిపింది. పరిశ్రమలకు రాయితీలను 38.98 కోట్ల నుంచి 16.71 కోట్లకు తగ్గించింది.
గోదావరి తీరం సుందరీకరణకు రూ.250 కోట్లు
కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా వివిధ ప్రాంతాల్లో రూపుదిద్దుకున్న పంప్‌హౌస్‌లను ఆసరా చేసుకుని గోదావరి నదీ తీరాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు రంగం సిద్ధమవుతోంది. ఈ మేరకు ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నత స్థాయిలో సమీక్ష నిర్వహించి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. సుందర ఉద్యానవనాలు అభివృద్ధి చేయాలని, కశ్మీర్ తరహాలో ఎత్తయిన చెట్లను పెంచాలని ఆయన ఆదేశించారు. ఈ మేరకు అధికారులు ఇప్పటికే ప్రణాళికలు రూపొందించారు. దానికోసం తాజా బడ్జెట్‌లో పర్యాటక శాఖకు ప్రభుత్వం నిధులను కేటాయించింది. కన్నేపల్లి వద్ద ఉన్న లక్ష్మీ పంప్‌హౌస్ ప్రాంతానికి రూ.80 కోట్లు, మేడిగడ్డ వద్ద అభివృద్ధి పనులకు రూ.105 కోట్లు, కన్నేపల్లి నుంచి అన్నారం బ్యారేజీ మధ్య పనులకు రూ.40 కోట్లు, అన్నారం బ్యారేజీ వద్ద పనులకు రూ.25 కోట్లు కేటాయించారు. ఇక కళాకారుల వృద్ధాప్య పింఛన్ల కోసం రూ.6.75 కోట్లు, సాంస్కృతిక సారధికి రూ.16 కోట్లు కేటాయించారు.
Comments
Please login to add a commentAdd a comment