
గిరి బిడ్డలకు వరం
∙ఉమ్మడి జిల్లాకు మూడు డిగ్రీ గురుకుల కళాశాలలు మంజూరు
∙ఆదిలాబాద్‌లో పురుషుల, ఉట్నూర్, ఆసిఫాబాద్‌లలో మహిళల కాలేజీలు
ఆదిలాబాద్‌టౌన్: గిరిజన యువతీ, యువకుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం వరాల జల్లులు కురిపించింది. అక్షరాస్యతలో గిరిజనులు ముందుండాలనే ఉద్దేశ్యంతో ఉమ్మడి జిల్లాకు మూడు డిగ్రీ గురుకుల కళాశాలలను మంజూరు చేసింది. దీంతో ఆ విద్యార్థుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. చాలామంది గిరిజనులు ఉన్నత విద్యకు దూరంగా ఉన్నారు. పదో తరగతి, ఇంటర్మీడియెట్ పూర్తి చేసి ఆర్థిక స్థోమత లేకపోవడంతో ఇళ్లకే పరిమితం అవుతున్నారు.
ఈ విషయాన్ని గ్రహించిన ప్రభుత్వం అలాంటి వారు ఉన్నత చదువులు అభ్యసించేందుకు ప్రోత్సాహం అందిస్తోంది. గురుకుల కళాశాలలను ఏర్పాటు చేసి ఉన్నతవిద్య అందించేందుకు చర్యలు చేపడుతోంది. అదేవిధంగా గిరిజన మహిళల అక్షరాస్యత శాతం చాలా తక్కువగా ఉంది. వారి అక్షరాస్యతను పెంచేందుకు ఈ గురుకులాలు దోహదపడతాయని ప్రభుత్వం భావిస్తోంది. ఆదిలాబాద్‌లో పురుషుల, ఉట్నూర్, ఆసిఫాబాద్ ప్రాంతాల్లో మహిళల గురుకుల డిగ్రీ కళాశాలల ఏర్పాటుతో విద్యాపరంగా గిరిపుత్రులకు ప్రయోజనం చేకూరనుంది.
ఉమ్మడి జిల్లాలో..
ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో 11 ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు ఉన్నాయి. వీటితోపాటు 95 వరకు ప్రైవేట్ డిగ్రీ కళాశాలలు ఉన్నాయి. ఆదిలాబాద్ జిల్లాలోని ఆదిలాబాద్ పట్టణంలో ప్రభుత్వ మహిళల, పురుషుల డిగ్రీ కళాశాలలు ఉన్నాయి. ఉట్నూర్‌లో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఉంది. దీంతోపాటు ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల, చెన్నూర్, తదితర ప్రాంతాల్లో డిగ్రీ కళాశాలలు ఉన్నాయి. జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల్లో అధిక శాతం గిరిజనులు నివసిస్తున్నారు.
ఉట్నూర్‌లో ఒకే డిగ్రీ కళాశాల ఉండడంతో గిరిజన విద్యార్థులకు సరిపడా సీట్లు దొరకడం లేదు. దీంతో ప్రైవేట్ కళాశాలల్లో చదవలేక చదువుకు స్వస్తి పలుకుతున్నారు. గిరిజన గురుకుల కళాశాలల ఏర్పాటుతో ఇలాంటి విద్యార్థులు ఉన్నత చదువులు చదివే అవకాశాలు ఉంటాయి. గతకొన్ని సంవత్సరాలుగా గిరిజన గురుకుల డిగ్రీ కళాశాలలు ఏర్పాటు చేయాలనే డిమాండ్ ఉంది. ఈ నేపథ్యంలో విద్యార్థుల భవిష్యత్తుకు బాటలు వేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా 21 గిరిజన డిగ్రీ గురుకుల కళాశాలలను గిరిజన శాఖ మంత్రి చందులాల్ మంజూరు చేశారు. ఇందులో ఉమ్మడి జిల్లాకు 3 డిగ్రీ గురుకుల కళాశాలలు కేటాయించడం గిరిజనులకు వరం లాంటిది.
ఉన్నతవిద్యకు దూరమవుతున్న గిరిజన బాలికలు..
పదో తరగతి, ఇంటర్మీడియెట్ పూర్తి చేసుకున్న గిరిజన యువతీ, యువకులు స్థానికంగా డిగ్రీ కళాశాలలు లేకపోవడంతో ఉన్నత విద్యకు దూరం అవుతున్నారు. ఆర్థిక స్థోమత లేని వీరు శాశ్వతంగా ఇళ్లకే పరిమితం కావాల్సిన దుస్థితి నెలకొంది. ఇలాంటి యువతులను దృష్టిలో ఉంచుకుని వారిని ఉన్నత చదువులు చదివించేందుకు ప్రభుత్వం గురుకులాలను మంజూరు చేసింది.గిరిజన ప్రాంతంలో యువతీ, యువకులు చాలామంది రక్తహీనతతో బాధ పడుతున్నారు. సరైన పౌష్టికాహారం తీసుకోవడం లేదు. గురుకులాల్లో నాణ్యమైన భోజనంతోపాటు విద్యనందించనుండడంతో వారు ఆరోగ్యంతోపాటు ఉన్నత చదువులు చదువుకునే అవకాశాలు ఉన్నాయి.