25వేల ఇందిరమ్మ ఇళ్లు మంజూరు
Published Wed, Aug 21 2013 4:35 AM | Last Updated on Fri, Sep 1 2017 9:56 PM
కొత్తగూడెం రూరల్, న్యూస్‌లైన్: 2012 - 13 ఆర్థిక సంవత్సరంలో జిల్లాలో 25వేల ఇందిరమ్మ ఇళ్లు మంజూరయ్యాయని, ఆ ఇళ్ల నిర్మాణ ప్రారంభం కోసం ‘పునాదుల మహోత్సవం’ కార్యక్రమం కింద ప్రతీ రోజు గృహ నిర్మాణ శాఖ అధికారులు లబ్ధిదారుల ఇళ్లకు వెళ్తారని జిల్లా గృహ నిర్మాణ శాఖ పీడీ వైద్యం భాస్కర్ అన్నారు. మంగళవారం కొత్తగూడెం గృహనిర్మాణ శాఖ కార్యాలయానికి వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడారు. రచ్చబండ కార్యక్రమంలో వచ్చిన దరఖాస్తుల్లో జిల్లాకు 20 వేల ఇందిరమ్మ ఇళ్లు మంజూరయ్యాయని, నియోజకవర్గానికి రెండు వేల చొప్పున పది నియోజకవర్గాలకు 20 వేల ఇందిరమ్మ ఇళ్లు మంజూరయ్యాయని, స్టేట్ రిజర్వు నుంచి 5 వేల ఇందిరమ్మ ఇళ్లు మంజూరయ్యాయని అన్నారు.
వీటిలో పాలేరు, మధిర, పినపాక, అశ్వారావుపేట, భద్రాచలం నియోజకవర్గాలకు వెయ్యి ఇళ్లచొప్పున మంజూరు చేశామని అన్నారు. ఎస్సీలకు లక్ష రూపాయలు, ఎస్టీలకు రూ.1.5 లక్షలు, ఇతర కులాలకు చెందిన లబ్ధిదారులకు రూ.70 వేల చొప్పున ఇళ్లు నిర్మించుకునేందుకు ఇస్తామన్నారు. జిల్లా కలెక్టర్ శ్రీనివాస శ్రీనరేష్ ఆదేశాల మేరకు ఈనెలలో పునాదుల మహోత్సవ కార్యక్రమం కింద ప్రతిరోజు డీఈ, ఏఈ, వర్క్ ఇన్‌స్పెక్టర్ లబ్ధిదారుల ఇంటికి వెళ్లి పునాదులు నిర్మించుకోనేందుకు అవగాహన కల్పిస్తారని అన్నారు. జిల్లాలోని పినపాక, చింతకాని మండలాల్లో రూ.2.1 కోట్లతో మినీ స్టేడియాలు మంజూరయ్యాయని, వీటికి టెండర్లు వేశామన్నారు. జిల్లాలోని కొత్తగూడెం, భద్రాచలం, పాల్వంచ, ఖమ్మం నిర్మిత కేంద్రాలలో సిమెంట్ బ్రిక్‌లు, రింగులు తయారు చేస్తారని, 15 రోజుల్లో ఈ నిర్మిత కేంద్రాలు పనులు ప్రారంభమవుతాయని అన్నారు.
అంతేకాకుండా జిల్లాలోని ఖమ్మం, పాల్వంచలోని ప్రభుత్వ స్థలాలకు ప్రహారి నిర్మాణానికి రూ.20 లక్షలు ఖర్చు చేస్తున్నామన్నారు. ఇందుకోసం కొత్తగూడెంలో ప్రభుత్వ స్థలాలు పరిశీలించినట్లు తెలిపారు. జిల్లాలో ఇందిరమ్మ ఇళ్లు నిర్మించుకున్న లబ్ధిదారులకు అదనంగా మరుగుదొడ్లు మంజూరు చేస్తామని అన్నారు. మరుగుదొడ్లకు రూ.9,100 చెల్లిస్తామని తెలిపారు. జిల్లాకు 21,758 మరుగుదొడ్లు లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు తెలిపారు. ఈనెల 21న పినపాక, 22న మధిర, పాలేరు, 27న భద్రాచలం ఇలా జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో అధికారులతో సమావేశాలు పెట్టి ఇళ్ల నిర్మాణంపై చర్చించనున్నట్లు తెలిపారు. ఈయన వెంట ఈఈ మహేశ్వర్, డీఈ మల్లికార్జున్‌రావు, ఏఈ ఆర్.జయ సింహా పాల్గొన్నారు.
Advertisement