జల్లేరు.. కన్నీరు
అందని పరిహారం
నిర్వాసితుల నిరీక్షణ
సర్కారు వివక్ష
అవార్డు పాసై మూడేళ్లయినా.. దక్కని వైనం
అవినీతికి గేట్లు తెరిచిన అధికారులు!
సాక్షి ప్రతినిధి, ఏలూరు : సర్కారు నిర్లక్ష్యం వల్ల జల్లేరు నిర్వాసితులు కన్నీరు పెడుతున్నారు. భూసేకరణ అవార్డు పాసై మూడేళ్లు గడిచినా ఇప్పటి వరకూ పరిహారం అందకపోవడంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆదాయం వచ్చే అంశాలపై దృష్టి పెట్టిన ప్రజాప్రతినిధులు, అధికారులు ఈ విషయాన్ని గాలికి వదిలేయడంపై మండిపడుతున్నారు.
అసలేం జరిగిందంటే..
చింతలపూడి ఎత్తిపోతల పథకంలో భాగంగా జల్లేరు జలాశయాన్ని విస్తరించాలని సర్కారు నిర్ణయించింది. దీనివల్ల జీలుగుమిల్లి మండలం జిల్లేళ్లగూడెం, తాటిరామన్నగూడెం, బొత్తప్పగూడెం, పి.నారాయణపురం, పాకలగూడెం గ్రామాలు ముంపునకు గురవనున్నాయి. సుమారు 15 వందల ఎకరాల భూమి నీటిపాలుకానుంది. దీంతో రెండున్నర ఎకరాల భూమి ఉన్న గిరిజనులకు భూమికి భూమి, ఇంకా పైన ఉన్న వారికి ఎకరానికి రూ.ఏడు లక్షలు పరిహారం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. గిరిజనేతర రైతులకు పూర్తిగా పరిహారం మాత్రమే ఇస్తామని ప్రకటించింది. దీనికోసం అవార్డు విచారణ పూర్తయి మూడేళ్లు అవుతున్నా పరిహారం మాత్రం రైతులకు అందలేదు. పైగా భూమికి భూమి, పునరావాసం ఎక్కడ ఇస్తారన్నది ఇప్పటి వరకూ ఖరారు చేయలేదు.
సామర్థ్యం పెంపుతో నష్టం అపారం
జల్లేరు రిజర్వాయర్ సామర్థ్యం ఎనిమిది టీఎంసీల నుంచి 20 టీఎంసీలకు పెంచడంతో ఈ ప్రాంతం అంతా ముంపునకు గురయ్యే అవకాశం ఉందని స్థానికులు చెబుతున్నారు. జీలుగుమిల్లి మండలంలోని తాటిరామన్నగూడెం, జిల్లేళ్లగూడెం, పాకలగూడెం, బోత్తప్పగూడెంం, పి.నారాయణపురం, బుట్టాయగూడెం మండలం బెడదనూరు నీటిలో మునిగిపోనున్నాయి. ఎనిమిది టీఎంసీల సామర్థ్యం ప్రకారం విస్తరిస్తే అధికారిక లెక్కల ప్రకారం ఏడు గ్రామాలు, సుమారు అయిదు వేల మందికిపైగా ప్రత్యక్షంగా పరోక్షంగా నష్ట పోతారు. 20 టీఎంసీలకు పెంచితే ఈ సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉంది. 20 టీఎంసీలకు పెంచాలని నిర్ణయించినా.. ముంపు గ్రామాలు, నిర్వాసితుల గుర్తింపు చేయకుండానే, అవార్డు విచారణ పూర్తయిపోయింది. 2013 భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం ఇవ్వాలని అడిగినా సర్కారు స్పందించడం లేదు. పోలవరం నిర్వాసితులకు ఇచ్చే పరిహారమూ ఇవ్వడం లేదు. ఆర్ అండ్ ఆర్ విషయంలోనూ పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని, పోలవరానికి ఒకలా, జల్లేరు ఒకలా అధికారులు నిర్ణయం తీసుకున్నారని స్థానిక గిరిజనులు ఆరోపిస్తున్నారు.
పట్టా భూముల పరిస్థితేమిటీ?
జిల్లేళ్లగూడెం, బొత్తప్పగూడెం, తాటి రామన్న గూడెం గ్రామాలు అడవిని ఆనుకుని ఉన్నాయి. ఈ అడవిలో పోడు వ్యవసాయం చేసుకుంటున్న గిరిజనులకు వై.ఎస్.రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కలెక్టర్ జయలక్ష్మి పట్టాలు ఇచ్చారు. ఇప్పుడు ఆ పోడు భూములన్నీ ముంపులో ఉన్నాయి. అయితే ఆ భూములను భూసేకరణలో చూపించలేదు. దీంతో ఈ భూములను నమ్ముకుని జీవిస్తున్న గిరిజనులకు అన్యాయం జరుగుతోంది.
డబ్బులిస్తేనే!
ప్రాజెక్టుల భూసేకరణ సిబ్బందికి కాసుల వర్షం కురిపిస్తోంది. పరిహారం ఇవ్వడానికీ అధికారులు డబ్బులు డిమాండ్ చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అవార్డు పాసౌ మూడేళ్లు అయినా డబ్బుల కోసం కార్యాలయం చుట్టూ రైతులు తిరుగుతుండటంతో వీరి అవసరాలను ఆసరాగా తీసుకుని సిబ్బంది అవినీతికి గేట్లు తెరిచారు. ఎకరానికి రూ.లక్ష ఇస్తేనే పరిహారం మంజూరవుతున్నట్టు రైతులు ఆరోపిస్తున్నారు. వచ్చేదే రూ.ఏడు లక్షలయితే రూ.లక్ష లంచం ఇవ్వలేక అనేక మంది రైతులు పరిహారం క్లెయిమ్‌కు ముందుకు రావడంలేదు. లంచం ఇవ్వని రైతులను ముప్పు తిప్పలు పెడుతున్నారు. మేనెలలో కొరసా బుచ్చిరాజు అనే వ్యక్తి స్పెషల్ డెప్యూటీ కలెక్టర్ చెప్పిన వ్యక్తికి రాజమండ్రిలో లంచం ఇస్తుండగా.. విశ్వసనీయ సమాచారం మేరకు ఏసీబీ అధికారులు దాడి చేసి సబ్ కలెక్టర్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్ ప్రసాద్‌ను పట్టుకుని అతని వద్ద నుంచి రూ.మూడు లక్షలు స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. అరెస్టు అయిన వ్యక్తి ఈ డబ్బులు స్పెషల్ డెప్యూటీ కలెక్టర్ ప్రేమమణి తన ద్వారా తీసుకున్నట్టు చెప్పడంతో కొవ్వూరులో ఆమె పనిచేస్తున్న కార్యాలయంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు.
పోలవరం నిర్వాసితులకూ జల్లేరు బెడద
జీలుగుమిల్లి మండలం రాచన్నగూడెం,í ³నారాయణపురం గ్రామాలలో పోలవరం నిర్వాసితులకు పునరావాసం కింద కేటాయిస్తున్న భూములు, ఇళ్లు జల్లేరు జలాశయం విస్తరణ వల్ల ముంపునకు గురికానున్నాయి. రాచన్నగూడెం పి.నారాయణపురం గ్రామాలలో నిర్వాసితులకు కేటాయిస్తున్న భూములు, ఇళ్ల స్థలాలు రిజర్వాయర్ ముంపు ప్రాంతానికి కూతవేటు దూరంలో ఉన్నాయి. రిజర్వాయర్ సామర్థ్యాన్ని 8 నుంచి 20 టీఎంసీలకు పెంచుతుండటంతో ఈ పునరావాస కాలనీలూ ముంపులోకి వస్తాయన్న ఆందోళన వ్యక్తం అవుతోంది. అయితే ప్రభుత్వం మాత్రం ఈ విషయాన్ని పట్టించుకోవడం లేదు.
నష్టపరిహారం రాలేదు
అవార్డు విచారణ జరిగి ఇప్పటికి మూడుడేళ్లయింది. ఇప్పటి వరకూ పరిహారం రాలేదు. ముంపు గ్రామాల్లో ఉన్న గిరిజనులకు నష్టపరిహారం పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు ఇచ్చినట్టే 2013 చట్ట ప్రకారం ఇవ్వాలి. ప్రభుత్వం దీనిపై ఒక నిర్ణయం తీసుకోవాలి.
బుద్దా వీర్రాజు, పి.నారాయణపురం
మూడేళ్లుగా తిరుగుతున్నా
ముంపు పరిహారం కోసం మూడేళ్లుగా తిరుగుతున్నా. గిరిజనుల భూములకు కూడా ఇవ్వడం లేదు. వివాదాల పేరు చెప్పి సొంత భూములకూ పరిహారం ఇవ్వకుండా తిప్పుకుంటున్నారు. ఇప్పటికైనా న్యాయం చేయాలి.
చిర్రి బాలరాజు, బరికలపాడు