rehabitants
-
పెద్దలు కాదు గద్దలు
సాక్షి ప్రతినిధి, ఏలూరు : పోలవరం ప్రాజెక్ట్ నిర్వాసితుల కోసం చేపట్టిన భూసేకరణ అధికార పార్టీ పెద్దలకు కాసుల వర్షం కురిపిస్తోంది. వేరొకరి భూములను దర్జాగా అమ్మేసుకుంటున్నారు. గతంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఏజెన్సీ ప్రాంతంలోని జీలుగువిుల్లి, బుట్టాయగూడెం మండలాల్లో గిరిజనులు, గిరిజనేతరుల మధ్య భూ వివాదాలు తలెత్తాయి. వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత ఏజెన్సీ ప్రాంతంలో భూ వివాదాలు పూర్తిస్థాయిలో సద్దుమణిగాయి. గిరిజనులు, గిరిజనేతరులు ఎవరికి హక్కున్న భూయుల్లో వారు సాగు చేసుకుంటూ సోదర భావంతో మెలిగారు. 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక్కడ వివాదాలు మొదటికొచ్చాయి. అధికార పార్టీ నాయకుల ఆగడాలకు హద్దు లేకుండా పోయింది. తహసీల్దార్ కార్యాలయాల్లో తిష్టవేసి.. తెలుగు తమ్ముళ్లు తహసీల్దార్ కార్యాలయాల్లో తిష్టవేసి ఆన్లైన్లో భూమి రికార్డులను తమకు నచ్చిన విధంగా మార్చుకున్నారు. వీఆర్ఓ, ఆర్ఐలతో సంబంధం లేకుండా తహసీల్దార్లే కంప్యూటర్ ఆపరేటర్‌తో కూర్చుని భూముల వివరాలను కంప్యూటరీకరణ చేశారు. అదే ఇప్పుడు అధికార పార్టీ నాయకులు కాసుల వర్షం కురిపిస్తుంది. తమ భూములు కాకపోయినా అన్లైన్ రికార్డులను చూపించి భూ సేకరణలో వాటిని విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. తాజాగా జీలుగుమిల్లి మండల టీడీపీ అ«ధ్యక్షుడు వి.సోమసుందరం స్వర్ణవారి గూడెం రెవెన్యూ పరిధిలో ఉన్న 30 ఎకరాల భూమిని తన కుటుంబ సభ్యుల పేరిట ఆన్లైన్ రికార్డుల్లో నమోదు చేయించి.. పోలవరం ప్యాకేజీలో అమ్మకానికి పెట్డారు. అన్ని హక్కులూ తనకే ఉన్నాయని అదే గ్రామానికి చెందిన బుద్దే శ్రీనివాసరావు అనేకసార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోగా.. అతనిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ, హత్యాయత్నం కేసులు పెట్టారు. అధికార పార్టీ అ«ధ్యక్షుడు సోమసుందరం తనదిగా చెప్పుకుంటున్న భూమికి సంబంధించి 1997లో స్పెషల్ డెప్యూటీ కలెక్టర్ కోర్టు గిరిజనులకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. దీనిపై సోమసుందరం హైకోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకుని సాగు చేసుకుంటున్నాడు. హైకోర్టులో స్టే కొనసాగుతుండగానే అదే భూమిని పోలవరం భూసేకరణలో అమ్ముకుంటున్నట్టు సమాచారం. ఈ విషయమై భూసేకరణ అధికారులకు ఫిర్యాదులు వెళ్లినా పట్టించుకోవడం లేదని సమాచారం. దీనిపై అధికారులు దృష్టి సారించాలని గిరిజనులు కోరుతున్నారు. -
వంచన పంచన
పోలవరం : పోలవరం ప్రాజెక్ట్ కోసం సర్వం త్యాగం చేస్తున్న నిర్వాసితులకు ప్రభుత్వం చుక్కలు చూపిస్తోంది. వారికి పునరావాసం పేరిట నిర్మిస్తున్న ఇళ్లకు అతి తక్కువ మొత్తం కేటాయిస్తోంది. నిర్వాసితుల కోసం నిర్మించే ఒక్కొక్క ఇంటికి.. గిరిజనులైతే రూ.4.55 లక్షలు, గిరిజనేతరులైతే రూ.3.55 లక్షల చొప్పున వెచ్చించాలని జీఓ జారీ చేసినప్పటికీ అతీగతీ లేకుండా పోయింది. ఇందిరా ఆవాస్ యోజన (ఐఏవై) కింద ఒక్కొక్క ఇంటికి రూ.2 లక్షలు మాత్రమే కేటాయిస్తున్నారు. ఇదేం దారుణమని నిర్వాసితులు గగ్గోలు పెడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఇంటి నిర్మాణ సామగ్రి ధరలు విపరీతంగా పెరిగిన నేపథ్యంలో ప్రభుత్వం ఇచ్చే రూ.2 లక్షలు ఏ మూలకు సరిపోతాయని లబ్ధిదా రులు నిలదీస్తున్నారు. మోడల్ కాలనీల్లో.. స్నానపు గదుల తరహాలో.. పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం వల్ల జిల్లాలోని పోలవరం, కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లోని గ్రామాలు ముంపుబారిన పడనున్నాయి. పోలవరం మండలంలో 29 ముంపు గ్రామాలు ఉండగా, 3 గ్రామాల్లో జనావాసాలు లేవు. మిగిలిన 26 గ్రామాల్లోని 7 గ్రామాల ప్రజలకు ఇప్పటికే పునరావాసం కల్పించారు. మిగిలిన 19 గ్రామాలను ఖాళీ చేయించేందుకు అధికార యంత్రాంగం రెండో విడత పునరావాస కార్యక్రమం అమలు చేస్తోంది. ఈ గ్రామాల్లోని 2,480 కుటుంబాలతోపాటు వేలేరుపాడు, కుక్కునూరు మండలాల్లోని 29,545 కుటుంబాలకు పునరావాస కేంద్రాల్లో ఇళ్లు నిర్మించాల్సి ఉంది. మొదటివిడత పునరావాస గ్రామాల నిర్వాసితులకు సంబంధించి ఒక్కొక్క ఇంటి నిర్మాణానికి ప్రభుత్వం రూ.3.15 లక్షలు కేటాయించింది. కానీ.. ప్రస్తుతం ఖాళీ చేయాల్సిన నిర్వాసితులకు సంబంధించి ఒక్కొక్క ఇంటి నిర్మాణానికి కేవలం రూ.2 లక్షలు మాత్రమే కేటాయిస్తున్నట్టు అధికారులు చెబుతున్నారు. దీంతో నిర్వాసితులు ఘొల్లుమంటున్నారు. ఇప్పటికే పునరావాస కేంద్రాల్లో 26 మోడల్ కాలనీల నిర్మాణం చేపట్టారు. వాటిలో స్నానపు గదుల తరహాలో సిమెంట్ ఇటుకలతో ఇళ్లు నిర్మిస్తున్నారు. ఇప్పటికే 17 కాలనీల్లో ఇళ్ల నిర్మాణం చేపట్టి శ్లాబ్‌లు కూడా వేశారు. ఇంత దారుణమా జీఓ ప్రకారం గిరిజన నిర్వాసితుల ఇంటి నిర్మాణానికి రూ.4.55 లక్షలు, గిరిజనేతరుల ఇంటి నిర్మాణానికి రూ.3.55 లక్షలు కేటాయించాల్సి ఉందని ఆదివాసీ సంక్షేమ పరిషత్ జిల్లా కార్యదర్శి కారం వెంకటేష్, నాయకుడు సున్నం పోశీరావు పేర్కొన్నారు. జీఓను తుంగలో తొక్కి కేవలం రూ.2 లక్షలు మాత్రమే కేటాయించి నిర్వాసితులకు అన్యాయం చేస్తున్నారని వాపోయారు. ఇంత దారుణం తగదన్నారు. ప్రభుత్వం స్పందించి జీఓ ప్రకారం నిర్వాసితుల ఇళ్ల నిర్మాణానికి నిధులు కేటాయించాలని కోరారు. రూ.2 లక్షలతో ఇల్లు పూర్తవుతుందా మాది వాడపల్లి గ్రామం. పోలవరం ముంపు గ్రామం కావటంతో జీలుగుమిల్లి మండలంలోని వంకవారిగూడెంలో ఇంటిస్థలం ఇచ్చారు. ఇంటి నిర్మాణానికి రూ.4 లక్షలు పైగా వస్తుందని ఆర్డీఓ చెప్పారు. ఇప్పుడు రూ.2 లక్షలు మాత్రమే వస్తుందంటున్నారు. ఆ మొత్తంతో ఇంటి నిర్మాణం పూర్తవుతుందా. మొదట విడతలో గ్రామాలు ఖాళీ చేసిన వారికి రూ.3.15 లక్షలు ఇచ్చారు. ఇదెక్కడి న్యాయం. – నూనె గంగరాజు, నిర్వాసితుడు ఐఏవై పథకంలో నిర్మిస్తున్నారు కొత్త భూసేకరణ చట్టం–2013 ప్రకారం గ్రామీణ ప్రాంతాల్లో ఇందిరా ఆవాజ్ యోజన (ఐఏవై) కింద ఇళ్ల నిర్మాణం చేపట్టాలని ఉంది. నిర్వాసితులకు ఆ ప్రకారమే ఇళ్ల నిర్మాణం చేపట్టాల్సి ఉంది. ఈ పథకంలో ఇంటి నిర్మాణానికి రూ.2 లక్షలు మాత్రమే కేటాయిస్తారు. ఈ విషయం ఉన్నతాధికారుల దృష్టిలో ఉంది. – ఎం.ముక్కంటి, తహసీల్దార్, పోలవరం -
65 రోజుల పోరాటం ఫలించింది
పోలవరం రూరల్ : పునరావాస కేంద్రాల్లో సమస్యలు పరిష్కరించాలని కోరుతూ పోలవరం నిర్వాసితులు చేపట్టిన దీక్షలను ఎట్టకేలకు విరమించారు. ఎనిమిది గ్రామాల నిర్వాసితులు 65 రోజులుగా పోలవరంలో దీక్షలు చేపట్టారు. పలు రకాలుగా ఆందోళనలు తెలిపారు. ఈ నేపథ్యంలో బుధవారం దీక్షా శిబిరాన్ని తహసీల్దార్ ఎం.ముక్కంటి బుధవారం సందర్శించి నిర్వాసితులతో చర్చించారు. ఆర్అండ్ఆర్ ప్యాకేజీకి సంబంధించి 176 మంది నిర్వాసితులకు రూ.3,47,94,000 చెల్లించాల్సి ఉండగా ఈ మొత్తం మంజూరు కావాల్సి ఉందన్నారు. 12 రోజుల్లో నిర్వాసితులకు ఈ మొత్తాన్ని చెల్లిస్తామని హామీ ఇచ్చారు. ఈ విషయాన్ని లిఖిత పూర్వకంగా రాసి ఇవ్వాలని తహసీల్దార్‌ను నిర్వాసితులు కోరడంతో ఆయన అంగీకరించారు. 12 రోజుల్లోగా సమస్యలు పరిష్కరించకపోతే మరలా ఆందోళన కార్యక్రమాలు చేపట్టాల్సి ఉంటుందని చేగొండిపల్లి, దేవరగొంది సర్పంచ్‌లు మడకం పరమేశు, బొరగం కన్నపరాజు, నిర్వాసితులు స్పష్టం చేశారు. పునరావాస కేంద్రాల్లో గృహనిర్మాణ సంస్థకు సంబంధించి లీకవుతున్న ఇళ్లను, మరుగుదొడ్లను గుర్తించి వాటి మరమ్మతు పనులు కూడా చేస్తున్నారని తహసీల్దార్ చెప్పారు. ఆర్డబ్ల్యూఎస్, పంచాయతీరాజ్ శాఖలు కూడా అసంపూర్తిగా ఉన్న ఆలయాలు, చర్చిలు, రోడ్లు, డ్రెయిన్ నిర్మాణ పనులు త్వరలో పూర్తిచేస్తారన్నారు. భూమికి భూమి కింద కేటాయించిన 40 ఎకరాల భూమి నచ్చలేదని నిర్వాసితులు చెప్పారని, దీనిలో ఐదెకరాల భూమి మరోచోట ఇస్తామని అన్నారు. మిగిలిన భూమిలో అభివృద్ధి పనులు చేపట్టి సాగుచేసుకునేందుకు వీలు కల్పిస్తామన్నారు. పోలవరం ఎస్ఐ కె.శ్రీహరిరావు, ఆర్ఐ కాజా రమేష్ పాల్గొన్నారు. -
ముంచేస్తున్నారు
స్రాక్షి ప్రతినిధి, ఏలూరు : అధికారుల అనాలోచిత పనుల వల్ల పోలవరం ప్రాజెక్ట్ నిర్వాసితులు మరోసారి నిలువునా మునిగిపోయే పరిస్థితి తలెత్తుతోంది. జల్లేరు ముంపు ప్రాంతంలో పోలవరం నిర్వాసితులకు పునరావాసం కల్పించడం విమర్శలకు దారి తీస్తోంది. జల్లేరు రిజర్వాయర్ సామర్థ్యాన్ని పెంచనుండటంతో.. నిర్వాసితులకు కేటాయించిన భూములన్నీ భవిష్యత్‌లో ముంపునకు గురికావడం ఖాయమని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. జీలుగుమిల్లి మండలం రాచన్నగూడెం, పి.నారాయణపురం గ్రామాల్లో పోలవరం నిర్వాసితులకు పునరావాసం పేరిట భూములు కేటాయిస్తున్నారు. ఇవి జల్లేరు ముంపు ప్రాంతంలో ఉన్నాయి. జల్లేరు రిజర్వాయర్ ప్రస్తుత సామర్థ్యం 8 టీఎంసీలు కాగా.. 20 టీఎంసీలకు పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో, పోలవరం నిర్వాసితులకు జల్లేరు రిజర్వాయర్ వద్ద ప్రస్తుతం కేటాయించిన ప్రాంతం కూడా ముంపునకు గురయ్యే అవకాశం ఉంది. రాచన్నగూడెం, పి.నారాయణపురం గ్రామాల్లో నిర్వాసితులకు కేటాయిస్తున్న భూములు, ఇళ్ల స్థలాలు 8 టీఎంసీల రిజర్వాయర్ (డీపీఆర్) ప్రకారం ముంపు ప్రాంతం నిర్వాసితుల పునరావాస కాలనీకి కూత వేటు దూరంలోనే ఉంది. పి.నారాయణపురంలో టేకూరు గ్రామానికి చెందిన పోలవరం నిర్వాసితులకు కేటాయించిన ఇళ్ల స్థలాలు, భూమికి భూమి కింద కేటాయించిన స్థలం 8 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించే రిజర్వాయర్ ముంపు ప్రాంతంలోనే అర కిలోమీటర్ దూరంలో భూమిని కేటాయించారు. ఇప్పుడు రిజర్వాయర్ సామర్థ్యాన్ని 8 నుంచి 20 టీఎంసీలకు పెంచారు. రిజర్వాయర్‌కు కేవలం అర కిలోమీటర్ దూరంలో ఉన్న తాము ముంపునకు గురవుతామని నిర్వాసితులు ఆందోళన చెందుతున్నారు. వీరికి కేటాయించిన భూములు, ఇళ్లస్థలాలు పెంచిన రిజర్వాయర్ సామర్థ్యం ప్రకారం మళ్లీ ముంపులోకి వెళ్లడం ఖాయం. అదేవిధంగా రాచన్నగూడెంలో కేటాయిస్తున్న పునరావాస కాలనీలో ఇచ్చిన భూమికి భూమి ప్రాంతంలోనూ ఇదే పరిస్థితి ఉంది. మరోసారి నిర్వాసితులు కావాల్సిందేనా! జల్లేరు రిజర్వాయర్ ముంపు ప్రాంతంలో భూములు కేటాయించడంతో తాము ఎన్నిసార్లు నిర్వాసితులు కావాలంటూ పోలవరం పునరావాసులు ప్రశ్నిస్తున్నారు. జల్లేరు రిజర్వాయర్ సామర్థ్యం పెంపు నిర్ణయం గ్రామాలను కబళించే పరిస్థితి ఉండటంతో గిరిజనులకు కంటిమీద కునుకు పడటం లేదు. జీలుగుమిల్లి మండలంలోని తాటిరామన్న గూడెం, జిల్లెళ్ల గూడెం, పాకల గూడెం, బొత్తప్పగూడెం, పి.నారాయణపురం, బుట్టాయగూడెం మండలం బెడదనూరు నీటిలో మునిగిపోనున్నాయి. 8 టీఎంసీల సామర్థ్యం ప్రకారం ముంపు గ్రామాలు 7 ఉండగా, సుమారు 5 వేల మందికి పైగా ప్రత్యక్షంగా, పరోక్షంగా నష్టపోతారు. రిజర్వాయర్ సామర్థ్యాన్ని పెంచితే ఈ సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉంది. జల్లేరు రిజర్వాయర్ తమ హక్కులను కబళిస్తోందని స్ధానిక గిరిజనులు అంటున్నారు. ఇక్కడ 1/70 యాక్ట్ ఉల్లంఘన జరుగుతుందనేది గిరిజనుల వాదన. 2013 భూసేకరణ చట్ట ప్రకారం సెక్షన్–41 సబ్ క్లాజ్–3 ప్రకారం తప్పనిసరిగా గిరిజన గ్రామాల్లో పీసా గ్రామసభలు (గిరిజన కమిటీ) నిర్వహించి ప్రతిపాదనలకు ఆమోదం పొందాలి. జీవో ఎంఎస్ 262 ప్రకారం బాధితులను ముందుగా గుర్తించాలి. అయితే ముంపు గ్రామాల నిర్వాసితులను గుర్తించకుండానే అవార్డు విచారణలు ముగించేశారు. ఇది సుప్రీం కోర్టు తీర్పులకు వ్యతిరేకమని గిరిజనులు ఆరోపిస్తున్నారు. జల్లేరు రిజర్వాయర్ నిమిత్తం పర్యావరణ మండలి ఇచ్చిన అనుమతులను ప్రజల ముందు పెట్టాలనేది స్థానికుల డిమాండ్. ఎక్కడా ఈ పని చేసిన దాఖలాలు లేవు. ఈ ప్రాంతంలో అనేక ఎల్టీఆర్ కేసులు పెండింగ్‌లో ఉన్నా రిజర్వాయర్ విషయంలో ప్రభుత్వం ముందుకు వెళ్లడాన్ని గిరిజనులు తప్పు పడుతున్నారు. రిజర్వాయర్ నిర్మాణాన్ని తాము వ్యతిరేకించడం లేదని.. తమకు న్యాయం చేసిన తర్వాతే రిజర్వాయర్ నిర్మాణం విషయంలో ప్రభుత్వం ముందుకు వెళ్లాలనేది గిరిజనుల వాదన. -
కోరిన చోట ఇళ్లస్థలాలివ్వాల్సిందే
పోలవరం రూరల్ : ‘అధికారులు ఎక్కడో సేకరించిన ఇళ్లస్థలాలు మాకొద్దు.. మేం కోరిన చోట ఇవ్వాల్సిందే’నంటూ పోలవరం ప్రాజెక్టు గిరిజనేతర నిర్వాసితులు స్పష్టం చేశారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా రెండో విడత ఖాళీచేసే గ్రామాల్లోని గిరిజనేతర నిర్వాసితుల కోసం సేకరించిన ఇళ్ల స్థలాలపై అభిప్రాయ సేకరణకు గురువారం నిర్వహించిన గ్రామసభలు గందరగోళంగా ముగిశాయి. పోలవరం మండలంలోని టేకూరు, తూటికుంట, కోండ్రుకోట గ్రామాల్లో తహసీల్దార్ ఎం.ముక్కంటి గురువారం గ్రామసభలు నిర్వహించారు. కోండ్రుకోట గ్రామంలో తహసీల్దార్ మాట్లాడుతూ కొయ్యలగూడెం మండలం మంగపతిదేవీపేట వద్ద 70 ఎకరాల భూమిని ఇళ్లస్థలాల కోసం సేకరించామని, దీనికి అంగీకారం తెలపాలని కోరారు. దీంతో నిర్వాసితులు ముక్తకంఠంతో మంగపతిదేవీపేట వద్ద తమకు ఇళ్ల స్థలాలు వద్దని స్పష్టం చేశారు. తమకు ముందే చెప్పకుండా ఎందుకు భూమి సేకరించారని ప్రశ్నించారు. తమకు కొయ్యలగూడెం – బయ్యగూడెం గ్రామాల సమీపంలో ఇళ్ల స్థలాలు కేటాయించాలని డిమాండ్ చేశారు. అంతకుముందు టేకూరు, తూటికుంట గ్రామాల్లో జరిగిన గ్రామసభల్లో అక్కడి నిర్వాసితులు అధికారుల ప్రతిపాదనను నిర్ద్వద్వంగా తోసిపుచ్చా రు. ఆ తర్వాత అక్కడి నిర్వాసితులంతా ట్రాక్టర్‌పై కోండ్రుకోటకు చేరుకుని అధికారులను ప్రశ్నించారు. దీంతో అధికారులు గ్రామసభను మధ్యలోనే ముగించేశారు. సభల్లో మాజీ ఎమ్మెల్యే పూనెం సింగన్నదొర, ఆర్ఐ రమేష్, వీఆర్వో ఇబ్రహీం పాల్గొన్నారు.