65 రోజుల పోరాటం ఫలించింది
Published Thu, Jan 19 2017 1:50 AM | Last Updated on Tue, Sep 5 2017 1:32 AM
పోలవరం రూరల్ : పునరావాస కేంద్రాల్లో సమస్యలు పరిష్కరించాలని కోరుతూ పోలవరం నిర్వాసితులు చేపట్టిన దీక్షలను ఎట్టకేలకు విరమించారు. ఎనిమిది గ్రామాల నిర్వాసితులు 65 రోజులుగా పోలవరంలో దీక్షలు చేపట్టారు. పలు రకాలుగా ఆందోళనలు తెలిపారు. ఈ నేపథ్యంలో బుధవారం దీక్షా శిబిరాన్ని తహసీల్దార్ ఎం.ముక్కంటి బుధవారం సందర్శించి నిర్వాసితులతో చర్చించారు. ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీకి సంబంధించి 176 మంది నిర్వాసితులకు రూ.3,47,94,000 చెల్లించాల్సి ఉండగా ఈ మొత్తం మంజూరు కావాల్సి ఉందన్నారు. 12 రోజుల్లో నిర్వాసితులకు ఈ మొత్తాన్ని చెల్లిస్తామని హామీ ఇచ్చారు. ఈ విషయాన్ని లిఖిత పూర్వకంగా రాసి ఇవ్వాలని తహసీల్దార్‌ను నిర్వాసితులు కోరడంతో ఆయన అంగీకరించారు. 12 రోజుల్లోగా సమస్యలు పరిష్కరించకపోతే మరలా ఆందోళన కార్యక్రమాలు చేపట్టాల్సి ఉంటుందని చేగొండిపల్లి, దేవరగొంది సర్పంచ్‌లు మడకం పరమేశు, బొరగం కన్నపరాజు, నిర్వాసితులు స్పష్టం చేశారు. పునరావాస కేంద్రాల్లో గృహనిర్మాణ సంస్థకు సంబంధించి లీకవుతున్న ఇళ్లను, మరుగుదొడ్లను గుర్తించి వాటి మరమ్మతు పనులు కూడా చేస్తున్నారని తహసీల్దార్ చెప్పారు. ఆర్‌డబ్ల్యూఎస్, పంచాయతీరాజ్ శాఖలు కూడా అసంపూర్తిగా ఉన్న ఆలయాలు, చర్చిలు, రోడ్లు, డ్రెయిన్ నిర్మాణ పనులు త్వరలో పూర్తిచేస్తారన్నారు. భూమికి భూమి కింద కేటాయించిన 40 ఎకరాల భూమి నచ్చలేదని నిర్వాసితులు చెప్పారని, దీనిలో ఐదెకరాల భూమి మరోచోట ఇస్తామని అన్నారు. మిగిలిన భూమిలో అభివృద్ధి పనులు చేపట్టి సాగుచేసుకునేందుకు వీలు కల్పిస్తామన్నారు. పోలవరం ఎస్‌ఐ కె.శ్రీహరిరావు, ఆర్‌ఐ కాజా రమేష్ పాల్గొన్నారు.
Advertisement