కోరిన చోట ఇళ్లస్థలాలివ్వాల్సిందే
Published Fri, Oct 7 2016 2:04 AM | Last Updated on Tue, Aug 21 2018 8:34 PM
పోలవరం రూరల్ : ‘అధికారులు ఎక్కడో సేకరించిన ఇళ్లస్థలాలు మాకొద్దు.. మేం కోరిన చోట ఇవ్వాల్సిందే’నంటూ పోలవరం ప్రాజెక్టు గిరిజనేతర నిర్వాసితులు స్పష్టం చేశారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా రెండో విడత ఖాళీచేసే గ్రామాల్లోని గిరిజనేతర నిర్వాసితుల కోసం సేకరించిన ఇళ్ల స్థలాలపై అభిప్రాయ సేకరణకు గురువారం నిర్వహించిన గ్రామసభలు గందరగోళంగా ముగిశాయి. పోలవరం మండలంలోని టేకూరు, తూటికుంట, కోండ్రుకోట గ్రామాల్లో తహసీల్దార్ ఎం.ముక్కంటి గురువారం గ్రామసభలు నిర్వహించారు. కోండ్రుకోట గ్రామంలో తహసీల్దార్ మాట్లాడుతూ కొయ్యలగూడెం మండలం మంగపతిదేవీపేట వద్ద 70 ఎకరాల భూమిని ఇళ్లస్థలాల కోసం సేకరించామని, దీనికి అంగీకారం తెలపాలని కోరారు. దీంతో నిర్వాసితులు ముక్తకంఠంతో మంగపతిదేవీపేట వద్ద తమకు ఇళ్ల స్థలాలు వద్దని స్పష్టం చేశారు. తమకు ముందే చెప్పకుండా ఎందుకు భూమి సేకరించారని ప్రశ్నించారు. తమకు కొయ్యలగూడెం – బయ్యగూడెం గ్రామాల సమీపంలో ఇళ్ల స్థలాలు కేటాయించాలని డిమాండ్ చేశారు. అంతకుముందు టేకూరు, తూటికుంట గ్రామాల్లో జరిగిన గ్రామసభల్లో అక్కడి నిర్వాసితులు అధికారుల ప్రతిపాదనను నిర్ద్వద్వంగా తోసిపుచ్చా రు. ఆ తర్వాత అక్కడి నిర్వాసితులంతా ట్రాక్టర్‌పై కోండ్రుకోటకు చేరుకుని అధికారులను ప్రశ్నించారు. దీంతో అధికారులు గ్రామసభను మధ్యలోనే ముగించేశారు. సభల్లో మాజీ ఎమ్మెల్యే పూనెం సింగన్నదొర, ఆర్‌ఐ రమేష్, వీఆర్‌వో ఇబ్రహీం పాల్గొన్నారు.
Advertisement
Advertisement