మలిదశకు ‘పాలమూరు’!
♦ ఉద్ధండాపూర్– కేపీ లక్ష్మీదేవునిపల్లి అనుసంధానానికి ప్రణాళిక సిద్ధం
♦ రూ. 3,020 కోట్లతో రిజర్వాయర్, టన్నెళ్లు,
♦ కాల్వల తవ్వకానికి కార్యాచరణ
♦ మూడు ప్యాకేజీలుగా విభజించి టెండర్లు పిలవనున్న నీటిపారుదల శాఖ
సాక్షి, హైదరాబాద్: పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో మిగిలిన పనులను సైతం చేపట్టేందుకు నీటి పారుదల శాఖ నడుం బిగించింది. ఉద్ధండాపూర్ రిజర్వాయర్ నుంచి కేపీ లక్ష్మీదేవునిపల్లి వరకు చేపట్టిన పనులను మొదలు పెట్టేందుకు సిద్ధమైంది. మలిదశలో భాగంగా ఉద్ధండాపూర్ నుంచి కేపీ లక్ష్మీదేవునిపల్లి వరకు ఓపెన్‌చానల్, టన్నెళ్లు, పంప్‌హౌస్, రిజర్వాయర్ల నిర్మాణాలకు రూ. 3,020 కోట్లతో వ్యయ అంచనాలను సిద్ధం చేసిన నీటి పారుదల శాఖ ఈ పనులను మూడు ప్యాకేజీలుగా విభజించి టెండర్లు పిలిచేందుకు సన్నద్ధమవుతోంది.
వాస్తవానికి పాలమూరు ప్రాజెక్టుతో 12.30 లక్షల ఎకరాలకు సాగునీరు, హైదరాబాద్ నగరానికి తాగునీరు, పరిశ్రమలకు నీటి వసతిని కల్పించే ఉద్దేశంతో రూ. 35,200 కోట్ల వ్యయంతో చేపట్టారు. ఈ పథకం ద్వారా శ్రీశైలం నుంచి 60 రోజుల్లో 120 టీఎంసీల నీటిని, వరద జలాలను తీసుకొని ఆయకట్టుకు మళ్లించేందుకు మొత్తంగా 6 రిజర్వాయర్లు, 5 లిఫ్టులను ప్రతిపాదించారు. నార్లాపూర్, ఏదుల, వట్టెం, కరివెన, ఉద్ధండాపూర్, కేపీ లక్ష్మీదేవునిపల్లి వద్ద రిజర్వాయర్లు నిర్మించాలని ప్రతిపాదించారు.
ఇందులో రంగారెడ్డిలో నిర్మించే కేపీ లక్ష్మీదేవునిపల్లి మినహా ప్రాజెక్టులోని ఐదు రిజర్వాయర్లు, వాటికి అనుసంధానంగా నిర్మించే టన్నెల్, కాల్వల పనులను 18 ప్యాకేజీలుగా విభజించారు. మొత్తంగా రూ. 30 వేల కోట్ల పనులకు టెండర్లు పిలిచి గత ఏడాదిలోనే పనులు ఆరంభించారు. అయితే ఉద్ధండాపూర్ నుంచి కేపీ లక్ష్మీదేవుని పల్లి మధ్యలో కొత్త ప్రతిపాదనలు రావడంతో ఈ పనులు చేపట్టలేదు. అయితే ప్రస్తుతం అవన్నీ కొలిక్కి వస్తుండటంతో ఈ పనులకు టెండర్లు పిలవాలని అధికారులు నిర్ణయించారు.
రూ. 3 వేల కోట్లు.. 3 ప్యాకేజీలు..
ఉద్ధండాపూర్ నుంచి కేపీ లక్ష్మీదేవుని పల్లి అనుసంధాన ప్రక్రియను ప్యాకేజీ–19లో చేర్చిన అధికారులు.. ఇక్కడ 18 కిలోమీటర్ల మేర ఓపెన్ చానల్, 14 కిలోమీటర్ల మేర టన్నెల్ నిర్మించాల్సి ఉంటుందని తేల్చారు. ఇందుకోసం టన్నెల్ నిర్మాణానికి రూ. 541కోట్లు, ఓపెన్ చానల్‌కు రూ. 592 కోట్లు అంచనా వేశారు. భూసేకరణ, ఇతర అవసరాలతో కలిపి మొత్తంగా ఈ ప్యాకేజీకి రూ. 1372.20 కోట్లు వ్యయం కానుంది. ఇక ప్యాకేజీ–20లో స్టేజ్–5 పంప్‌హౌస్‌ను చేర్చగా, దీనికి మరో రూ. 876.70 కోట్లు ఖర్చవుతుందని లెక్కగట్టారు. ఇక 2.80 టీఎంసీల సామర్థ్యంతో లక్ష్మీదేవునిపల్లి రిజర్వాయర్ నిర్మాణానికి రూ. 751.50 కోట్లు అంచనా వేశారు.
ఈ రిజర్వాయర్ కింద ఏకంగా 4.13 లక్షల ఎకరాల మేర ఆయకట్టు ఉండగా, రిజర్వాయర్ కింద 1,340 ఎకరాల మేర ముంపు ఉండనుంది. మొత్తంగా మూడు ప్యాకేజీలకు రూ. 3,020.40 కోట్లతో ప్రణాళిక సిద్ధం చేయగా, వీటిని ఆమోదించి, టెండర్లు పిలిచేందుకు అనుమతి కోసం ప్రాజెక్టు అధికారులు ఉన్నతాధికారులకు పంపారు. అక్కడ ఆమోదం దక్కితే వెంటనే ఈ మూడు ప్యాకేజీలకు టెండర్లు పిలవనున్నారు.