మెదక్: మంజీర తీరాన మహా జలహారం రూపుదిద్దుకుంటోంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతోన్న వాటర్‌గ్రిడ్ పథకం పనులకు శ్రీకారం చుట్టనున్నారు. మూడు నియోజకవర్గాలను కలుపుతూ ఈ ప్రాజెక్టును రూపొందించారు. సుమారు పది లక్షల మందికి తాగునీటిని అందించాలనే లక్ష్యంతో రూపకల్పన చేశారు. గ్రిడ్ పైలాన్ కూడా సిద్ధమైంది. పంచాయతీ రాజ్ శాఖమంత్రి కేటీఆర్ ఈ పైలాన్‌ను శుక్రవారం ప్రారంభించే అవకాశం ఉంది.
జిల్లాలో చేపట్టనున్న వాటర్‌గ్రిడ్ ప్రాజెక్టుకు రూ.750 కోట్లు కేటాయించారు. 873 గ్రామాల్లో సుమారు పది లక్షల మందికి తాగు నీరందించేలా రూపకల్పన చేశారు. సింగూర్ ప్రాజెక్ట్ దిగువన గల పుల్కల్ మండలం పెద్దారెడ్డిపేట శివారులోని బ్యాక్ వాటర్ నుంచి సెకండ్ లెవల్ గ్రిడ్ ఏర్పాటు చేయనున్నారు. అక్కడి నుంచి ప్రత్యేక పైప్‌లైన్ ద్వారా నారాయణఖేడ్, అందోల్, మెదక్ నియోజకవర్గాలకు తాగునీటిని అందిస్తారు.
ఈ పథకం కింద నారాయణఖేడ్ నియోజకవర్గంలోని ఐదు మండలాలు, అందోల్‌లోని ఐదు మండలాలు, మెదక్‌లోని నాలుగు మండలాలతోపాటు మెదక్ మున్సిపాలిటీ, జోగిపేట నగర పంచాయతీలకు తాగునీరందిస్తారు. రోజుకు గ్రామీణ ప్రాంతంలో ఒక్కో వ్యక్తికి వంద లీటర్లు, మున్సిపల్ ప్రాంతంలో 130 లీటర్ల తాగునీటిని అందించేలా ప్రణాళిక సిద్ధం చేశారు. పెద్దారెడ్డిపేట నుంచి ప్రారంభమయ్యే పైప్‌లైన్ మధ్యలో ఓవర్‌హెడ్ ట్యాంకులు, సంపులు, గ్రౌండ్ లెవల్ ట్యాంకులు నిర్మించనున్నారు. రామాయంపేట మండలం వరకు సెకండ్ లెవల్ గ్రిడ్ ద్వారా తాగునీరందుతుందని ఆర్‌డబ్ల్యూఎస్ ఈఈ సురేశ్‌కుమార్ తెలిపారు.
నేడు పైలాన్ ఆవిష్కరణ..
మెదక్ పట్టణంలోని ఎంపీడీఓ కార్యాలయ ప్రాంగణంలో వాటర్ గ్రిడ్ పైలాన్ సిద్ధమైంది. రాష్ట్ర ఐటీ, పంచాయతీరాజ్ శాఖల మంత్రి కేటీఆర్, డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డిలు శుక్రవారం ఆవిష్కరించనున్నారు.
మంజీర తీరాన... మహా జలహారం
Published Fri, Jun 19 2015 1:30 AM | Last Updated on Tue, Oct 9 2018 4:48 PM
Advertisement
Advertisement