చెన్నై: తమిళనాడులోని కోరమండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్‌లో ఘోర ప్రమాదం జరిగింది. ఈ పరిశ్రమ పైపులైన్ నుంచి అమ్మోనియా గ్యాస్ లీక్ అయింది. ఈ ప్రమాదంలో 12 మంది ఆసుపత్రి పాలైనట్లు పోలీసులు తెలిపారు. అమ్మోనియా అన్‌లోడ్ చేస్తున్న సబ్-సీ పైప్‌లైన్‌లో లీకులు ఏర్పడినట్లు సమాచారం.
ఎన్నూర్‌లో ఉన్న కోరమండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ ఒక ప్రైవేట్ కంపెనీ. ఎరువులు తయారు చేస్తుంది. ఇందుకు అమ్మోనియాను ముడిసరుకుగా ఉపయోగిస్తారు. అయితే.. మంగళవారం అర్ధరాత్రి సమయంలో పరిశ్రమ పైప్‌లైన్ నుంచి అమ్మోనియా గ్యాస్ లీక్ అయింది. రాత్రి 12:45 సమయంలో పోలీసులకు సమచారం అందింది. పైప్‌లైన్ ప్రీ-కూలింగ్ ఆపరేషన్ సమయంలో ఈ ఘటన జరిగిందని పోలీసులు తెలిపారు.
గ్యాస్ లీకేజీ వల్ల స్థానిక పెరియకుప్పం, చిన్నకుప్పం వంటి గ్రామాల ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఘాటైన వాసన రావడంతో శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఏర్పడిందని తెలిపారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే అప్రమత్తమైన ఆరోగ్య శాఖా అధికారులు.. ఆయా గ్రామాల్లో అంబులెన్స్‌లు, ఇతర ట్రాన్స్‌పోర్టు సదుపాయాలను ఏర్పాటు చేశారు.
ప్రస్తుతం 12 మంది ఆస్పత్రిలో చేరినట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వెల్లడించారు. గ్యాస్ లీకేజీతో స్థానిక గ్రామాల ప్రజలను పునరావాస ప్రాంతాలకు తరలించినట్లు అధికారులు తెలిపారు.
సముద్ర తీరానికి సమీపంలో అమ్మోనియా అన్‌లోడ్ చేస్తున్న సబ్-సీ పైప్‌లైన్‌లో మంగళవారం రాత్రి 11.30 గంటలకు లీకు ఏర్పడినట్లు కోరమండల్ సంస్థ తెలిపింది. వెంటనే అమ్మోనియా సరఫరాను తక్కువ చేసి పరిస్థితిని సాధారణ స్థితికి తీసుకువచ్చామని పేర్కొంది. ఘటనపై సంబంధిత అధికారులకు సమాచారం అందించామని వెల్లడించింది. కోరమండల్ ఎల్లప్పుడూ అత్యున్నత భద్రతా ప్రమాణాలకు కట్టుబడి ఉంటుందని స్పష్టం చేసింది.
ఇదీ చదవండి: ఢిల్లీని కమ్మేసిన పొగమంచు.. వాహనదారులకు అవస్థలు
Comments
Please login to add a commentAdd a comment