Pipeline leak
-
అమ్మోనియా గ్యాస్ లీక్.. 12 మందికి అస్వస్థత
చెన్నై: తమిళనాడులోని కోరమండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్‌లో ఘోర ప్రమాదం జరిగింది. ఈ పరిశ్రమ పైపులైన్ నుంచి అమ్మోనియా గ్యాస్ లీక్ అయింది. ఈ ప్రమాదంలో 12 మంది ఆసుపత్రి పాలైనట్లు పోలీసులు తెలిపారు. అమ్మోనియా అన్లోడ్ చేస్తున్న సబ్-సీ పైప్‌లైన్‌లో లీకులు ఏర్పడినట్లు సమాచారం. ఎన్నూర్‌లో ఉన్న కోరమండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ ఒక ప్రైవేట్ కంపెనీ. ఎరువులు తయారు చేస్తుంది. ఇందుకు అమ్మోనియాను ముడిసరుకుగా ఉపయోగిస్తారు. అయితే.. మంగళవారం అర్ధరాత్రి సమయంలో పరిశ్రమ పైప్‌లైన్ నుంచి అమ్మోనియా గ్యాస్ లీక్ అయింది. రాత్రి 12:45 సమయంలో పోలీసులకు సమచారం అందింది. పైప్‌లైన్ ప్రీ-కూలింగ్ ఆపరేషన్ సమయంలో ఈ ఘటన జరిగిందని పోలీసులు తెలిపారు. గ్యాస్ లీకేజీ వల్ల స్థానిక పెరియకుప్పం, చిన్నకుప్పం వంటి గ్రామాల ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఘాటైన వాసన రావడంతో శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఏర్పడిందని తెలిపారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే అప్రమత్తమైన ఆరోగ్య శాఖా అధికారులు.. ఆయా గ్రామాల్లో అంబులెన్స్‌లు, ఇతర ట్రాన్స్‌పోర్టు సదుపాయాలను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం 12 మంది ఆస్పత్రిలో చేరినట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వెల్లడించారు. గ్యాస్ లీకేజీతో స్థానిక గ్రామాల ప్రజలను పునరావాస ప్రాంతాలకు తరలించినట్లు అధికారులు తెలిపారు. సముద్ర తీరానికి సమీపంలో అమ్మోనియా అన్లోడ్ చేస్తున్న సబ్-సీ పైప్‌లైన్‌లో మంగళవారం రాత్రి 11.30 గంటలకు లీకు ఏర్పడినట్లు కోరమండల్ సంస్థ తెలిపింది. వెంటనే అమ్మోనియా సరఫరాను తక్కువ చేసి పరిస్థితిని సాధారణ స్థితికి తీసుకువచ్చామని పేర్కొంది. ఘటనపై సంబంధిత అధికారులకు సమాచారం అందించామని వెల్లడించింది. కోరమండల్ ఎల్లప్పుడూ అత్యున్నత భద్రతా ప్రమాణాలకు కట్టుబడి ఉంటుందని స్పష్టం చేసింది. ఇదీ చదవండి: ఢిల్లీని కమ్మేసిన పొగమంచు.. వాహనదారులకు అవస్థలు -
శ్రీరామరెడ్డి తాగునీటి పైపులైన్‌కు లీకేజీ
శెట్టూరు(లక్ష్మంపల్లి): మండల పరిధిలోని లక్ష్మంపల్లి జెడ్పీ హైస్కూల్ వద్ద శ్రీరామరెడ్డి తాగునీటి పైపులైన్‌కు లీకేజీ ఏర్పడింది. దీంతో శుక్రవారం ఉదయం నుంచి నీరు పైకి ఎగజిమ్ముతూ ఫౌంటెయిన్‌ను తలపించింది. సాయంత్రానికి సంబంధిత అధికారులు స్పందించి లీకేజీని మరమ్మతు చేసినా అప్పటికే చాలా నీరు వృథాగా పోయింది. తరచూ ఇలా జరుగుతున్నా అధికారులు తాత్కాలిక మరమ్మతులతో సరిపెడుతున్నారని గ్రామస్తులు ఆరోపించారు. లీకేజీ వల్ల పలు గ్రామాలకు తాగునీటి సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని వాపోయారు. -
నత్తకు నడక..
⇒ ముందుకెళ్లని ఆర్అండ్బీ రోడ్ల పునరుద్ధరణ ⇒ రెండేళ్లు గడుస్తున్నా పూర్తికాని వైనం ⇒ పైపులైన్ లీకేజీలతో పరేషాన్ కరీంనగర్ కార్పొరేషన్ : జిల్లా అభివృద్ధికి ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉన్నా.. మంజూరు చేసిన పనులను పూర్తిచేయడంలో అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆర్అండ్బీ రోడ్ల పునరుద్ధరణ పనులు రెండేళ్లుగా కొనసాగుతూనే ఉన్నాయి. కోర్టు నుంచి వర్క్‌షాప్ వరకు పైలెట్ ప్రాజెక్టుగా చేపట్టిన జగిత్యాల రోడ్డు పను లు ఇంకా పూర్తికావడం లేదు. మున్సిపల్, ఆర్అండ్బీ శాఖల మధ్య లోపించిన సమన్వయం ప్రజలకు శాపంగా మారింది. ప్రభుత్వ లక్ష్యానికి అడ్డంకులు తెచ్చిపెడుతోంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు చేశాక సెంటిమెంట్‌గా ముఖ్యమంత్రి కేసీఆర్ 2014 ఆగస్టు 5న కరీంనగర్లో తొలిసారి పర్యటించారు. ఆయన పర్యటనలో ఆర్అండ్బీ రోడ్ల పునరుద్ధరణకు రూ.46 కోట్లు మంజూరు చేశారు. ఆగస్టు 12న నిధులు విడుదల చేస్తూ జీవో జారీ చేశారు. ఆ తర్వాత నిధులు సరిపోవని మరో రూ.29 కోట్లు కేటాయించారు. మొత్తం రూ.70 కోట్ల నిధులతో పునరుద్ధరణ పనులు చేపట్టారు. ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పనులను అనుకున్న సమయానికి పూర్తిచేయాలని సీఎం కేసీఆర్ స్వయంగా అధికారులు, ప్రజాప్రతినిధులకు ఆదేశాలు జారీచేశారు. అయితే.. పనులు చేపట్టిన నాటి నుంచి అన్నీ అడ్డంకులే. మొదట రోడ్డు వైండింగ్ పనుల్లో తీవ్ర జాప్యం జరగగా, ఆ తర్వాత మంచినీటి పైపులైన్ పనులు రోడ్డు పనులను ముందుకు సాగకుండా చేశాయి. దీంతో ఆర్అండ్బీ రోడ్ల పునరుద్ధరణ నత్తకు నడకనేర్పినట్లు జరుగుతోంది. రెండేళ్లుగా తీవ్ర జాప్యం.. నగరంలోని 14.5 కిలోమీటర్ల ఆర్అండ్బీ రోడ్ల పనులు రెండేళ్లుగా కొనసాగుతూనే ఉన్నాయి. రోడ్డు విస్తరణకు మార్కింగ్, కూల్చివేత పను లు సుమారు ఆరు నెలలపాటు జరిగాయి. ఆ తర్వాత రోడ్డు పనులు ప్రారంభించారు. కోర్టు నుంచి జగిత్యాల రోడ్డు, సివిల్ ఆసుపత్రి నుం చి అపోలో రీచ్రోడ్డు, రాంనగర్ రోడ్డు పనుల ను మొదటి దశలో చేపట్టగా, అప్పటికే ఆ రో డ్లలో ఉన్న పాత కాలంనాటి మంచినీటి పైపులైన్లు పగిలిపోవడం, నెలల తరబడి ప్రజలకు తాగునీటి సరఫరా లేకపోవడంతో వ్యతిరేకత వచ్చింది. మరమ్మతులతో పని జరగకపోవడంతో ఆ తర్వాత కొత్తపైపులైన్లు వేసేందుకు కార్పొరేషన్ టెండర్లు నిర్వహించింది. హెచ్డీపీఈ పైపులైన్లు వేసి శాశ్వత పరిష్కారం చేపట్టాలని భావించారు. కానీ.. అది కూడా బెడిసికొట్టింది. పైపులైన్లు పూర్తయ్యాయని ఆర్అండ్బీ రోడ్ల కాంట్రాక్టర్ రోడ్డు పనులు మొద లు పెట్టారు. అయితే.. కొత్తగా వేసిన హెచ్డీపీఈ పైపులైన్లు కూడా నాసిరకం పనులతో లీకేజీలు బయటపడుతుండడంతో మళ్లీ మొదటికొచ్చింది. రోడ్లపై ఎక్కడపడితే అక్కడ లీకేజీలు అవుతుండడంతో పనులు పడకేశాయి. సర్వసాధారణం.. ఆర్అండ్బీ రోడ్ల పనులు పూర్తిచేసేందుకు మున్సిపల్, ఆర్అండ్బీ అధికారులతో నెలకోసారి మంత్రి ఈటల రాజేందర్, ఎమ్మెల్యే గంగుల కమలాకర్, మేయర్ రవీందర్‌సింగ్ సమీక్షలు, సమావేశాలు నిర్వహిస్తూనే ఉన్నారు. కానీ.. పనులు ముందుకు కదలడం లేదు. మున్సిపల్, ఆర్అండ్బీ శాఖల మధ్య సమన్వయం లేకపోవడమే ఇందుకు కారణంగా కనిపిస్తోంది. ఎక్కడో ఒక చోట తాగునీటి పైపులైన్ లీకేజీ జరగడం సర్వసాధారణంగా మారింది. అయితే.. పైపులైన్ పనులు ఎప్పటికప్పుడు మరమ్మతులు చేపడుతున్నామని, ఫిబ్రవరి మొదటి వారంలోనే పైపులైన్ పనులు పూర్తిచేసి అప్పగిస్తామని కార్పొరేషన్ అధికారులు వెల్లడించారు. పాత లీకేజీలను అరికడుతుంటే కొత్త లీకేజీలు కొంప ముంచుతున్నాయి. దీనంతటికీ నాసిరకం పనులే కారణంగా తెలుస్తోంది. లీకేజీలు ఏర్పడుతుంటే పనులు చేయడం సాధ్యం కాదని ఆర్అండ్బీ అధికారులు చెబుతున్నారు. ఈ నెల 4న మంత్రి కేటీఆర్, 5న మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు కూడా కోర్టు రోడ్డును పరిశీలించి పనులపై పర్యవేక్షించారు. అయినప్పటికీ ముందుకు కదలడంలేదు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు దృష్టిసారించి రెండు శాఖల మధ్య సమన్వయంతో పనులు వేగంగా జరిగేలా చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. -
ఆంధ్రా ఆర్గానిక్స్ పైప్‌లైన్ లీకు
రణస్థలం: ఆంధ్రా ఆర్గానిక్స్ రసాయన పరిశ్రమకు సంబంధించి వ్యర్థ జలాలు తరలించేందుకు మండలంలోని దోనిపేట సముద్రం వరకు పైపులైను వేశా రు. ఈ పైపులైను అక్కయ్యపాలెం వద్ద సోమవారం లీకైంది.దీంతో వ్యర్థ జలాలు సమీపంలోని గెడ్డలోనికి, పొలాల్లోనికి ప్రవేశించడంతో రైతులు, స్థాని కులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పైప్‌లైన్ లీక్ కావడంతో ఈ కంపెనీకి సాధారణంగా మారిపోయిం దని, ఎన్నిసార్లు చెప్పినా వారు పట్టించుకోవడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. పైప్‌లైన్ లీకేజీ వల్ల దుర్వాసన వస్తోందని, చుట్టు పక్కల పొలం పనులు కూడా చేయలేకపోతున్నామని చెబుతున్నారు. ఉద యం 5 గంటలకు పైప్‌లైన్ లీకైనట్లు సమాచారం అందిస్తే యాజమాన్యం 11 గంటలకు గానీ రాలేదని వారు తెలిపారు. ఆంధ్రా ఆర్గానిక్స్ పైపులైను సమీపంలోనే అరబిందో ఫార్మా, ల్యాన్ టెక్, సరకా వంటి కంపెనీల వ్యర్థ జలాలు తరలించే పైపులైన్లు ఉన్నా వాటి వల్ల ఎలాంటి నష్టం లేదని, ఇవి మాత్రమే చాలా పైకి ఉండి ఎప్పటికప్పుడు లీకవుతున్నాయని ఆరోపించారు. దీనివల్ల రైతులకు చాలా ఇబ్బందిగా ఉందని, యాజమాన్య ప్రతి నిధులు స్పందించి దీనిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఇబ్బందిగా ఉంది పైప్‌లైన్ లీకుల వల్ల రైతులు చాలా ఇబ్బం దులు పడుతున్నారు. నా పొలం గెడ్డ అవతల ఉం ది. ఈ పైపులైను భూమి పైకి ఉండటం వల్ల నాటుబళ్లు వెళ్లటం కష్టంగా ఉంది. – లంకలపల్లి రామరావు, మాజీ వైస్ సర్పంచ్ పట్టించుకోవడం లేదు పైప్‌లైన్ భూమి లోపలకు ఏర్పాటు చేయాలని చాలాసార్లు యాజమాన్యానికి చెప్పాం. అయినా పట్టించుకోవడం లేదు. రైతులం దరం కలిసి అడిగితే పోలీస్ కేసులు పెడుతున్నారు. – నాగవరపు బాబూరావు, రైతు -
నీటియాతన
కృష్ణమ్మ చెంత.. తాగునీటికి చింత మున్సిపాలిటీల్లో దాహం కేకలు కొన్నిచోట్ల వారానికి ఒక రోజే మంచినీరు అన్ని చోట్లా ట్యాంకర్లే దిక్కు బందరు, పెడన, తిరువూరుల్లో నీటికోసం ఎదురుచూపులు పాలకుల ప్రణాళికాలోపమే కారణం కృష్ణమ్మ చెంతనే ఉన్నా జిల్లాప్రజల దప్పిక తీరడం లేదు. వేసవి ఇంకా రాకముందే చుక్కనీటి కోసం పాలకులు చుక్కలు చూపిస్తున్నారు. ముందస్తు ప్రణాళికలు లేక పోవడంతో కృష్ణానది సహా అనేక వాగులు, వంకలు పూర్తిగా ఎండిపోయాయి. నిత్యం ట్యాంకర్లు నడవనిదే చుక్క నీరు అందదు. వారంలో రెండుసార్లు.. అదీ రెండు గంటలు వస్తే గొప్ప. తాగునీటి సరఫరా ఫర్వా లేదనుకుంటే ఆ ప్రాంతాల్లో పైప్ లైన్ లీకేజీలు. ఇవీ జిల్లాలోని మున్సిపాలిటీల్లో ‘సాక్షి’ నెట్ వర్క్ బృందం గమనించిన అంశాలు. విజయవాడ : విజయవాడ నగరం సహా జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల్లో జల యుద్ధాలు మొదలయ్యాయి. ప్రధాన నీటి వనరులుగా ఉన్న కృష్ణానది, మునేరు, కృష్ణా కుడి కాలువ ఎండిపోవడంతో నీటి కొరత వెంటాడుతోంది. విజయవాడ నగరపాలక సంస్థ సహా ఎనిమిది మున్సిపాలిటీల్లో నెలకు సగటున అదనంగా కోటి రూపాయల వరకు ఖర్చు పెట్టే పరిస్థితి వేసవి రాకముందే ఉత్పన్నమైంది. ఇక ఎండాకాలంలో దానికి రెట్టింపు మొత్తం ఖర్చు పెట్టినా మంచినీరు దొరకని దుర్భర పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉంది. బందరులో మూడు రోజులకోసారి... జిల్లా కేంద్రమైన మచిలీపట్నం మున్సిపాలిటీలో 2.25 లక్షల మంది జనాభా నివసిస్తున్నారు. వీరికి రోజుకు 18 మిలియన్ లీటర్ల నీరు కావాల్సి ఉండగా.. దానిలో 20 శాతం కూడా సరఫరా కావడం లేదు. బందరుకు నీరందించే తరకటూరు సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ పూర్తిగా ఎండిపోయింది. కనీసం ఆరు మీటర్ల లెవల్ వరకు ఉండాల్సిన నీరు ప్రస్తుతం అర మీటరు కూడా లేకపోవడంతో 12 ట్యాంకర్లు ఏర్పాటు చేసి మూడు రోజులకు ఒకసారి తాగునీరు అందిస్తున్నారు. పెడన మున్సిపాలిటీలోనూ ఇదే పరిస్థితి. ఇక్కడ ఉన్న 30 వేల మంది జనాభా అవసరాలకు రోజుకు 30 లక్షల లీటర్ల నీరు కావాల్సి ఉండగా దానిలో 50 శాతం కూడా విడుదల కాని పరిస్థితి నెలకొంది. ఈ మున్సిపాలిటీకి తరకటూరు సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ నుంచి పైప్‌లైన్ ద్వారా నీరు వస్తుంది. అక్కడ నీరు లేకపోవడంతో రామరాజుపాలెం పంటకాల్వ ద్వారా కృష్ణా నీటిని తాగునీటి అవసరాల కోసం వినియోగిస్తున్నారు. కృష్ణా నీరు కూడా లేకపోవడంతో బోర్లపై ఆధారపడి ట్యాంకర్ల ద్వారా వారానికి ఒకరోజు సరఫరా చేస్తున్నారు. ఉయ్యూరు మున్సిపాలిటీలో 40 వేల జనాభా అవసరాలకు అనుగుణంగా నీటి విడుదల లేదు. నీరు మురుగు వాసన వస్తుండడంతో పరిస్థితి ఇబ్బందికరంగా మారింది. సుందరంపేట, దళితవాడ, ఉర్దూ పాఠశాల సెంటర్, డొంకరోడ్డు సెంటర్ ప్రాంతాల్లో కాలువల్లోనే మంచినీటి పైప్లైన్లు ఉండడంతో ఈ పరిస్థితి దాపురించింది. జగ్గయ్యపేట మున్సిపాలిటీలో 53 వేల జనాభాకు 70 ఎంఎల్డీ నీరు అవసరం కాగా 30 ఎంఎల్డీకి మించి విడుదల కావడం లేదు. జగ్గయ్యపేటకు పాలేరు రిజర్వాయర్ నుంచి నీరు విడుదలవుతోంది. అది ఎండిపోవడంతో ట్యాంకర్ల ద్వారా బోర్ల నుంచి నీటిని తెచ్చి సరఫరా చేస్తున్నారు. దీంతో రెండు రోజులకు ఒకసారి మాత్రమే గంటసేపు నీరు విడుదలవుతోంది. నందిగామ మున్సిపాలిటీలో 50 వేల జనాభా అవసరాలకు అనుగుణంగా మునేరు, కృష్ణానదితోపాటు మూడు పథకాల ద్వారా నీరందుతోంది. 80 శాతం కుళాయిలకు హెడ్స్ లేకపోవడం, లీకేజీల వల్ల నీరు ఎక్కువ వృథాగా పోతోంది. ఫలితంగా వారంలో ఒక్కసారే నీరు అందుతోంది.తిరువూరుకు శాశ్వత మంచినీటి వ్యవస్థ లేకపోవడంతో మూడు రోజులకు ఒకసారే మంచి నీరు అందుతోంది.నూజివీడు, గుడివాడ పట్టణాల్లో తాగునీటి ఇబ్బంది కొంత ఉన్నా మున్సిపాలిటీలు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడం వల్ల సమస్య పెద్దగా లేదు. విజయవాడలో నీరు వృథా విజయవాడ నగరంలో నిత్యం సరఫరా అయ్యే మంచినీరులో 30 శాతం పైప్‌లైన్ లీకుల వల్ల మురుగుకాల్వల పాలవుతోంది. ఎన్నో ఏళ్లుగా ఇలా జరుగుతున్నా పాలకులకు మాత్రం కనువిప్పు కలగడం లేదు. నగర జనాభా 11.48 లక్షల మంది. వారి అవసరాలకు అనుగుణంగా రోజుకు 1.50 మిలియన్ గ్యాలన్ల నీరు కావాల్సి ఉండగా నగరపాలక సంస్థ 1.65 మిలియన్ గ్యాలన్ల నీటిని సరఫరా చేస్తోంది. వృథా అయ్యే 30 శాతం నీరు వల్ల 1.10 మిలియన్ గ్యాలన్ల కంటే ఎక్కువ నీరు ఇళ్లకు చేరకపోవడంతో సమస్య ఉత్పన్నమవుతోంది. ముఖ్యంగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో పైప్‌లైన్ పాతది కావడం వల్ల నీటి లీకేజీలు అధికంగా ఉన్నాయి. తూర్పు నియోజకవర్గంలోని పటమట, కరెన్సీనగర్, ఎన్టీఆర్ కాలనీ తదితర ప్రాంతాల్లో మురుగునీరు అధికంగా కలుస్తోంది. నగరానికి వచ్చే నీటిలో 22 శాతం బోర్ల ద్వారా, మిగిలిన నీరు కృష్ణానది ద్వారా సరఫరా అవుతోంది. సెంట్రల్ నియోజకవర్గంలో ఉన్న వాటర్ రిజర్వాయర్లకు నీరు సరిగా ఎక్కకపోవటంతో హైస్పీడ్ మోటార్లు ఏర్పాటు చేయడానికి నిధులు మంజూరు చేశారు. అవి వచ్చేసరికి వేసవి పూర్తయ్యే అవకాశం ఉంది. రామలింగేశ్వరనగర్లో ఉన్న ప్లాంట్ ద్వారా మురుగునీరు అధికంగా వస్తోంది. నగర మేయర్ మంచినీటి సమస్య రాకుండా నిధులు మంజూరు చేస్తామని ప్రకటిస్తున్నారే కాని ఆచరణలో పూర్తిస్థాయిలో కనిపించకపోవడంతో నగరంలోనూ రానున్న రోజుల్లో నీటిఎద్దడి పెరిగే అవకాశం ఉంది. -
‘సిద్ధాపూర్’ పూర్తయ్యేనా?
ఆర్మూర్‌రూరల్ : మూడేళ్లలో పూర్తి కావాల్సిన సిద్ధాపూర్ ఎత్తిపోతల పథకం నిర్మాణ పనులు ఐదేళ్లు దాటి నా సాగుతూనే ఉన్నాయి. అయినా అధికారులు పట్టించుకోవడం లేదు. గడువులోగా పూర్తి చేయ ని కాంట్రాక్టర్‌పై ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. ఆర్మూర్ మండలంలోని దేగాం శివారులో శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ఎగువ భాగంలో సిద్ధాపూర్ ఎత్తిపోతల పథకం నిర్మించాలని దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో నిర్ణయించారు. ఈ పథకం ద్వారా ఆర్మూర్ మం డలంలోని దేగాం, మచ్చర్ల, నందిపేట్ మండలంలోని సిద్ధాపూర్ గ్రామాలలోని 2,200 ఎకరాలకు సాగునీరందించాలన్నది లక్ష్యం. పథక నిర్మాణానికి రూ. 20 కోట్లు మంజూరు చేశారు. 2008 నవంబర్ 28న అప్పటి విద్యాశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, స్పీకర్ సురేశ్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ పనులను హైదరాబాద్‌లోని విశ్వ కంపెనీ దక్కించుకుంది. ప్రాజెక్టు ఎగువ భాగంలో సంప్‌హౌస్, సబ్ స్టేషన్‌ను నిర్మించారు. మూడు మోటార్లు అమర్చారు. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు లోపలి భాగంలో మూడున్నర కిలోమీటర్ల వరకు ఇన్‌టెక్ నిర్మిస్తే పథకం పూర్తి స్థాయిలో ఉపయోగంలోకి వస్తుంది. ఇన్‌టెక్‌లో భాగంగా ప్రాజెక్టు లోపల 20 ఫీట్ల లోతు కాలువ తవ్వి, పైప్‌లైన్ వేయాలి. ప్రాజెక్టులో నీరు అడుగంటినా.. మోటార్ల సహాయంతో పైప్‌లైన్ ద్వారా నీటిని ఎత్తిపోసే అవకాశాలుంటాయి. ఇప్పటివరకు రెండుకిలోమీటర్ల ఇన్‌టెక్ పనులే పూర్తి చేయగలిగారు. వేసవిలో ప్రాజెక్టులో నీరు అడుగంటిన సమయంలో పనులు ప్రారంభించి ఉంటే ఇప్పటికి ఇన్‌టెక్ పనులు పూర్తయ్యేవి. కానీ కాంట్రాక్టర్ పట్టించుకోకపోవడంతో ఎక్కడి పనులు అక్కడే ఉండిపోయాయి. భారీ వర్షాలు కురిస్తే ఈ సీజన్లో పనులు ప్రారంభించడం కష్టం. అయితే కాంట్రాక్టర్ ఎందుకు పనులు పూర్తి చేయడం లేదో అర్థం కావడం లేదని ఆయకట్టు రైతులు పేర్కొంటున్నారు. అధికారులు పట్టించుకొని పనులు పూర్తి చేయించాలని కోరుతున్నారు. మరమ్మతుల్లోనూ జాప్యం రెండు నెలల క్రితం సిద్ధాపూర్ ఎత్తిపోతల పథకం ద్వారా మూడు గ్రామాలలోని చెరువులను నింపడానికి నీటిని విడుదల చేశారు. 15 నుంచి 20 చోట్ల పైపులైన్‌కు లీకేజీలు ఏర్పడి నీరు వృథా అయ్యింది. పది చోట్ల మాత్రమే మరమ్మతులు పూర్తిచేశారు. మిగిలిన చోట్ల ఇప్పటికీ మరమ్మతులు చేయలేదు.