కృష్ణమ్మ చెంత.. తాగునీటికి చింత
మున్సిపాలిటీల్లో దాహం కేకలు
కొన్నిచోట్ల వారానికి ఒక రోజే మంచినీరు
అన్ని చోట్లా ట్యాంకర్లే దిక్కు
బందరు, పెడన, తిరువూరుల్లో
నీటికోసం ఎదురుచూపులు
పాలకుల ప్రణాళికాలోపమే కారణం
కృష్ణమ్మ చెంతనే ఉన్నా జిల్లాప్రజల దప్పిక తీరడం లేదు. వేసవి ఇంకా రాకముందే చుక్కనీటి కోసం పాలకులు చుక్కలు చూపిస్తున్నారు. ముందస్తు ప్రణాళికలు లేక పోవడంతో కృష్ణానది సహా అనేక వాగులు, వంకలు పూర్తిగా ఎండిపోయాయి. నిత్యం ట్యాంకర్లు నడవనిదే చుక్క నీరు అందదు. వారంలో రెండుసార్లు.. అదీ రెండు గంటలు వస్తే గొప్ప. తాగునీటి సరఫరా ఫర్వా లేదనుకుంటే ఆ ప్రాంతాల్లో పైప్ లైన్ లీకేజీలు. ఇవీ జిల్లాలోని మున్సిపాలిటీల్లో ‘సాక్షి’ నెట్ వర్క్ బృందం గమనించిన అంశాలు.
విజయవాడ : విజయవాడ నగరం సహా జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల్లో జల యుద్ధాలు మొదలయ్యాయి. ప్రధాన నీటి వనరులుగా ఉన్న కృష్ణానది, మునేరు, కృష్ణా కుడి కాలువ ఎండిపోవడంతో నీటి కొరత వెంటాడుతోంది. విజయవాడ నగరపాలక సంస్థ సహా ఎనిమిది మున్సిపాలిటీల్లో నెలకు సగటున అదనంగా కోటి రూపాయల వరకు ఖర్చు పెట్టే పరిస్థితి వేసవి రాకముందే ఉత్పన్నమైంది. ఇక ఎండాకాలంలో దానికి రెట్టింపు మొత్తం ఖర్చు పెట్టినా మంచినీరు దొరకని దుర్భర పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉంది.
బందరులో మూడు రోజులకోసారి...
జిల్లా కేంద్రమైన మచిలీపట్నం మున్సిపాలిటీలో 2.25 లక్షల మంది జనాభా నివసిస్తున్నారు. వీరికి రోజుకు 18 మిలియన్ లీటర్ల నీరు కావాల్సి ఉండగా.. దానిలో 20 శాతం కూడా సరఫరా కావడం లేదు. బందరుకు నీరందించే తరకటూరు సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ పూర్తిగా ఎండిపోయింది. కనీసం ఆరు మీటర్ల లెవల్ వరకు ఉండాల్సిన నీరు ప్రస్తుతం అర మీటరు కూడా లేకపోవడంతో 12 ట్యాంకర్లు ఏర్పాటు చేసి మూడు రోజులకు ఒకసారి తాగునీరు అందిస్తున్నారు.
పెడన మున్సిపాలిటీలోనూ ఇదే పరిస్థితి. ఇక్కడ ఉన్న 30 వేల మంది జనాభా అవసరాలకు రోజుకు 30 లక్షల లీటర్ల నీరు కావాల్సి ఉండగా దానిలో 50 శాతం కూడా విడుదల కాని పరిస్థితి నెలకొంది. ఈ మున్సిపాలిటీకి తరకటూరు సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ నుంచి పైప్‌లైన్ ద్వారా నీరు వస్తుంది. అక్కడ నీరు లేకపోవడంతో రామరాజుపాలెం పంటకాల్వ ద్వారా కృష్ణా నీటిని తాగునీటి అవసరాల కోసం వినియోగిస్తున్నారు. కృష్ణా నీరు కూడా లేకపోవడంతో బోర్లపై ఆధారపడి ట్యాంకర్ల ద్వారా వారానికి ఒకరోజు సరఫరా చేస్తున్నారు.
ఉయ్యూరు మున్సిపాలిటీలో 40 వేల జనాభా అవసరాలకు అనుగుణంగా నీటి విడుదల లేదు. నీరు మురుగు వాసన వస్తుండడంతో పరిస్థితి ఇబ్బందికరంగా మారింది. సుందరంపేట, దళితవాడ, ఉర్దూ పాఠశాల సెంటర్, డొంకరోడ్డు సెంటర్ ప్రాంతాల్లో కాలువల్లోనే మంచినీటి పైప్‌లైన్లు ఉండడంతో ఈ పరిస్థితి దాపురించింది.
జగ్గయ్యపేట మున్సిపాలిటీలో 53 వేల జనాభాకు 70 ఎంఎల్‌డీ నీరు అవసరం కాగా 30 ఎంఎల్‌డీకి మించి విడుదల కావడం లేదు. జగ్గయ్యపేటకు పాలేరు రిజర్వాయర్ నుంచి నీరు విడుదలవుతోంది. అది ఎండిపోవడంతో ట్యాంకర్ల ద్వారా బోర్ల నుంచి నీటిని తెచ్చి సరఫరా చేస్తున్నారు. దీంతో రెండు రోజులకు ఒకసారి మాత్రమే గంటసేపు నీరు విడుదలవుతోంది. నందిగామ మున్సిపాలిటీలో 50 వేల జనాభా అవసరాలకు అనుగుణంగా మునేరు, కృష్ణానదితోపాటు మూడు పథకాల ద్వారా నీరందుతోంది. 80 శాతం కుళాయిలకు హెడ్స్ లేకపోవడం, లీకేజీల వల్ల నీరు ఎక్కువ వృథాగా పోతోంది. ఫలితంగా వారంలో ఒక్కసారే నీరు అందుతోంది.తిరువూరుకు శాశ్వత మంచినీటి వ్యవస్థ లేకపోవడంతో మూడు రోజులకు ఒకసారే మంచి నీరు అందుతోంది.నూజివీడు, గుడివాడ పట్టణాల్లో తాగునీటి ఇబ్బంది కొంత ఉన్నా మున్సిపాలిటీలు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడం వల్ల సమస్య పెద్దగా లేదు.
విజయవాడలో నీరు వృథా
విజయవాడ నగరంలో నిత్యం సరఫరా అయ్యే మంచినీరులో 30 శాతం పైప్‌లైన్ లీకుల వల్ల మురుగుకాల్వల పాలవుతోంది. ఎన్నో ఏళ్లుగా ఇలా జరుగుతున్నా పాలకులకు మాత్రం కనువిప్పు కలగడం లేదు. నగర జనాభా 11.48 లక్షల మంది. వారి అవసరాలకు అనుగుణంగా రోజుకు 1.50 మిలియన్ గ్యాలన్ల నీరు కావాల్సి ఉండగా నగరపాలక సంస్థ 1.65 మిలియన్ గ్యాలన్ల నీటిని సరఫరా చేస్తోంది. వృథా అయ్యే 30 శాతం నీరు వల్ల 1.10 మిలియన్ గ్యాలన్ల కంటే ఎక్కువ నీరు ఇళ్లకు చేరకపోవడంతో సమస్య ఉత్పన్నమవుతోంది. ముఖ్యంగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో పైప్‌లైన్ పాతది కావడం వల్ల నీటి లీకేజీలు అధికంగా ఉన్నాయి. తూర్పు నియోజకవర్గంలోని పటమట, కరెన్సీనగర్, ఎన్టీఆర్ కాలనీ తదితర ప్రాంతాల్లో మురుగునీరు అధికంగా కలుస్తోంది. నగరానికి వచ్చే నీటిలో 22 శాతం బోర్ల ద్వారా, మిగిలిన నీరు కృష్ణానది ద్వారా సరఫరా అవుతోంది. సెంట్రల్ నియోజకవర్గంలో ఉన్న వాటర్ రిజర్వాయర్లకు నీరు సరిగా ఎక్కకపోవటంతో హైస్పీడ్ మోటార్లు ఏర్పాటు చేయడానికి నిధులు మంజూరు చేశారు. అవి వచ్చేసరికి వేసవి పూర్తయ్యే అవకాశం ఉంది. రామలింగేశ్వరనగర్‌లో ఉన్న ప్లాంట్ ద్వారా మురుగునీరు అధికంగా వస్తోంది. నగర మేయర్ మంచినీటి సమస్య రాకుండా నిధులు మంజూరు చేస్తామని ప్రకటిస్తున్నారే కాని ఆచరణలో పూర్తిస్థాయిలో కనిపించకపోవడంతో నగరంలోనూ రానున్న రోజుల్లో నీటిఎద్దడి పెరిగే అవకాశం ఉంది.
నీటియాతన
Published Fri, Feb 12 2016 1:31 AM | Last Updated on Sat, Sep 29 2018 5:21 PM
Advertisement