‘సిద్ధాపూర్’ పూర్తయ్యేనా?
ఆర్మూర్‌రూరల్ : మూడేళ్లలో పూర్తి కావాల్సిన సిద్ధాపూర్ ఎత్తిపోతల పథకం నిర్మాణ పనులు ఐదేళ్లు దాటి నా సాగుతూనే ఉన్నాయి. అయినా అధికారులు పట్టించుకోవడం లేదు. గడువులోగా పూర్తి చేయ ని కాంట్రాక్టర్‌పై ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. ఆర్మూర్ మండలంలోని దేగాం శివారులో శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ఎగువ భాగంలో సిద్ధాపూర్ ఎత్తిపోతల పథకం నిర్మించాలని దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో నిర్ణయించారు. ఈ పథకం ద్వారా ఆర్మూర్ మం డలంలోని దేగాం, మచ్చర్ల, నందిపేట్ మండలంలోని సిద్ధాపూర్ గ్రామాలలోని 2,200 ఎకరాలకు సాగునీరందించాలన్నది లక్ష్యం.
పథక నిర్మాణానికి రూ. 20 కోట్లు మంజూరు చేశారు. 2008 నవంబర్ 28న అప్పటి విద్యాశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, స్పీకర్ సురేశ్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ పనులను హైదరాబాద్‌లోని విశ్వ కంపెనీ దక్కించుకుంది. ప్రాజెక్టు ఎగువ భాగంలో సంప్‌హౌస్, సబ్ స్టేషన్‌ను నిర్మించారు. మూడు మోటార్లు అమర్చారు. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు లోపలి భాగంలో మూడున్నర కిలోమీటర్ల వరకు ఇన్‌టెక్ నిర్మిస్తే పథకం పూర్తి స్థాయిలో ఉపయోగంలోకి వస్తుంది. ఇన్‌టెక్‌లో భాగంగా ప్రాజెక్టు లోపల 20 ఫీట్ల లోతు కాలువ తవ్వి, పైప్‌లైన్ వేయాలి. ప్రాజెక్టులో నీరు అడుగంటినా.. మోటార్ల సహాయంతో పైప్‌లైన్ ద్వారా నీటిని ఎత్తిపోసే అవకాశాలుంటాయి.
ఇప్పటివరకు రెండుకిలోమీటర్ల ఇన్‌టెక్ పనులే పూర్తి చేయగలిగారు. వేసవిలో ప్రాజెక్టులో నీరు అడుగంటిన సమయంలో పనులు ప్రారంభించి ఉంటే ఇప్పటికి ఇన్‌టెక్ పనులు పూర్తయ్యేవి. కానీ కాంట్రాక్టర్ పట్టించుకోకపోవడంతో ఎక్కడి పనులు అక్కడే ఉండిపోయాయి. భారీ వర్షాలు కురిస్తే ఈ సీజన్‌లో పనులు ప్రారంభించడం కష్టం. అయితే కాంట్రాక్టర్ ఎందుకు పనులు పూర్తి చేయడం లేదో అర్థం కావడం లేదని ఆయకట్టు రైతులు పేర్కొంటున్నారు. అధికారులు పట్టించుకొని పనులు పూర్తి చేయించాలని కోరుతున్నారు.
మరమ్మతుల్లోనూ జాప్యం
రెండు నెలల క్రితం సిద్ధాపూర్ ఎత్తిపోతల పథకం ద్వారా మూడు గ్రామాలలోని చెరువులను నింపడానికి నీటిని విడుదల చేశారు. 15 నుంచి 20 చోట్ల పైపులైన్‌కు లీకేజీలు ఏర్పడి నీరు వృథా అయ్యింది. పది చోట్ల మాత్రమే మరమ్మతులు పూర్తిచేశారు. మిగిలిన చోట్ల ఇప్పటికీ మరమ్మతులు చేయలేదు.