- షబ్బీర్ అలీ డిమాండ్
సాక్షి, హైదరాబాద్: వాటర్‌గ్రిడ్ సమగ్ర ప్రాజెక్టు రిపోర్డు(డీపీఆర్)ను ప్రజల ముందు పెట్టాలని శాసనమండలిలో ప్రతిపక్షనేత షబ్బీర్ అలీ డిమాండ్ చేశారు. సీఎల్పీ ఉపనాయకులు టి.జీవన్‌రెడ్డితో కలసి అసెంబ్లీ ఆవరణలో సోమవారం విలేకరులతో ఆయన మాట్లాడుతూ వాటర్‌గ్రిడ్ పథకంలో ప్రాథమికస్థాయిలోనే అనేక అవకతవకలకు అవకాశం కలిగేవిధంగా ఉల్లంఘనలు ఉన్నాయని, అతిక్రమణలకు కారణాలు చెప్పకుండా కాంగ్రెస్‌పార్టీపై ఎదురుదాడికి దిగడం సరికాదన్నారు.
వాటర్‌గ్రిడ్ పథకాన్ని ప్రకటించేనాటికి రూ.25 వేల కోట్లు ఖర్చు అవుతుందని సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ఇదివరకు చెప్పారని షబ్బీర్ అలీ గుర్తుచేశారు. రూ.25 వేల కోట్లు మాత్రమే ఖర్చు అవుతాయని చెప్పి 40 వేల కోట్లకు ఏ సర్వే ఆధారంగా అంచనాలను పెంచారని షబ్బీర్ అలీ ప్రశ్నించారు. ఈ అంశంపై అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని షబ్బీర్ డిమాండ్ చేశారు.
కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ నివేదిక ప్రకారం రూ.10,156 కోట్లు ఖర్చు అవుతాయని పేర్కొందని వివరించారు. న్యాయశాఖలో వివిధ పోస్టుల నియామకంలో ముస్లిం న్యాయవాదులపై వివక్షను ప్రదర్శించారని, దీనిని అరికట్టాలని కోరుతూ కేసీఆర్‌కు షబ్బీర్ అలీ లేఖను రాశారు.