పల్నాడులో తీరనున్న దాహార్తి | Water Samples Collect From Water Grid Project | Sakshi
Sakshi News home page

పల్నాడులో తీరనున్న దాహార్తి

Published Tue, Jan 28 2020 12:54 PM | Last Updated on Tue, Jan 28 2020 12:54 PM

Water Samples Collect From Water Grid Project - Sakshi

విజయపురిసౌత్‌ ప్రాంతంలోని మేకల గొంది వద్ద వాటర్‌ గ్రిడ్‌ ప్రాజెక్టుకు సంబంధించి నీటిని శాంపిల్‌ సేకరిస్తున్న దృశ్యం

మాచర్ల: ఎన్నో ఏళ్లుగా తాగునీటి సమస్యతో అల్లాడుతున్న పల్నాటి గ్రామాల దాహార్తి తీరనుంది. తొమ్మిది నియోజకవర్గాల పరిధిలోని 34 మండలాలు, 902 గ్రామాలకు మంచినీటిని అందించే వాటర్‌ గ్రిడ్‌ పథకం నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. రూ.2,665 కోట్లతో అంచనాలు రూపొందించింది. ఈ గ్రిడ్‌ అందుబాటులోకి వస్తే మాచర్ల, గురజాల, వినుకొండ, నరసరావుపేట తదితర నియోజకవర్గాల్లోని గ్రామాల్లో తాగునీటి ఎద్దడి అన్న మాటే వినిపించదు. నాగార్జున సాగర్‌ రిజర్వాయర్‌ ప్రాంతమైన విజయపురిసౌత్‌లోని మేకల గొంది వద్ద వాటర్‌ గ్రిడ్‌ నిర్మించనున్నారు. త్వరలోనే వాటర్‌ గ్రిడ్‌ పథకం నిర్మాణం ప్రారంభించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. 34 మండలాలకు లబ్ధిచేకూరే ఈ పథకాన్ని చేపట్టాలని మాచర్ల ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి (పీఆర్కే) కోరడంతో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సానుకూలంగా స్పందించారు.

నాగార్జున సాగర్‌ ప్రాజెక్టులో నీటి నిలువ తగ్గిపోయినప్పుడూ ఎండాకాలం సైతం నీటి నిల్వలు రిజర్వాయర్‌లో ఉన్నప్పుడు ఈ వాటర్‌ గ్రిడ్‌లోని పథకాలు చేపట్టేందుకు సర్వేచేయించి పల్నాటి ప్రాంతంలోని ప్రజలకు మేలు చేకూర్చే విధంగా సీఎం జగన్‌మోహన్‌రెడ్డి, ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కోరిక మేరకు జి.ఓ.నెం. ఈ నెల 16న జారీ చేసి సంబంధిత వాటర్‌ గ్రిడ్‌ పధకానికి సంబం«ధించి చేపట్టబోయే పనుల వివరాలను పేర్కొన్నారు. మాచర్ల నియోజక వర్గంలోని 5 మండలాలు, గురజాల నియోజక వర్గంలోని 4 మండలాలు, వినుకొండలో 4, నర్సరావుపేటలో 2, చిలకలూరి పేటలో 3, సత్తెనపల్లిలో 4, పెదకూరపాడులో 4, గుంటూరు రూరల్‌ లో 3, ప్రకాశం జిల్లాలో 5 మండలాలు ఈ వాటర్‌ గ్రిడ్‌ పధకం ద్వారా మంచినీటిని ప్రజలకు అందించటం జరుగుతుందన్నారు.   నర్సరావుపేట, చిలకలూరిపేట, సత్తెనపల్లి పురపాలక సంఘ కార్యాలయాలకు వాటర్‌ స్కీంను అనుసంధానం చేస్తారు. విజయపురిసౌత్‌లోని మేకల గొంది వద్ద మొదటిగా సాగర్‌ రిజర్వాయర్‌లో హెడ్‌ వర్క్స్‌ నిర్మిస్తారు. అంచనాలను ప్రభుత్వం ఆమోదించి టెండర్లు పిలిచేందుకు రంగం సిద్ధం చేసింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement