
రూ.1,400 కోట్లతో న్యాచురల్ గ్యాస్ పైప్‌లైన్
► కృష్ణపట్నంపోర్టులో ప్రత్యేక బెర్తు ఏర్పాటు
► 2017లో పైపులైను ద్వారా గ్యాస్ సరఫరా
ముత్తుకూరు/చిల్లకూరు: కృష్ణపట్నం పోర్టు కేంద్రంగా భారీ సహజ వాయువుల పైపులైను ప్రాజెక్టు ఏర్పాటు కానుంది. రాజమండ్రికి చెందిన కేఈఐ-ఆర్‌ఎస్‌ఓఎస్ పెట్రోలియం ఎనర్జీ సంస్థ రూ. 1,400 కోట్ల అంచనాలతో శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలంలోని తమ్మినపట్నంలో ఈ ప్రాజెక్టు ఏర్పాటు చేయనుంది. ఇందుకోసం కృష్ణపట్నం పోర్టులో ఎల్‌ఎన్‌జీ(లిక్విడ్ నాచురల్ గ్యాస్) బెర్తు నిర్మిస్తారు.
ఇక్కడ నుంచి రాయలసీమ ప్రాంతాల్లో ఏర్పాటయ్యే పరిశ్రమలకే కాకుండా ఇఫ్‌కో, శ్రీసిటీ, మేనకూరు సెజ్‌లు, తొట్టంబేడు, ఏర్పేడు, మాంబట్టు, గుమ్మడిపూడి, మనాలి పారిశ్రామికవాడలకు గ్యాస్ సరఫరా చేస్తారు. 2017లో పూర్తయ్యే ఈ ప్రాజెక్టు ద్వారా ఎన్నూరు, నెల్లూరు, కృష్ణపట్నం, సుళ్లూరుపేట, రేణిగుంట వరకు పైపులైను ద్వారా గ్యాస్ సరఫరా చేస్తారు.
తెలంగాణ, పాండిచ్చేరి, కర్ణాటక రాష్ట్రాలకు ట్రక్కుల ద్వారా గ్యాస్ రవాణా జరుగుతుంది. కృష్ణపట్నం పోర్టు, అపోలో ఆసుపత్రుల యాజమాన్యాల సహకారంతో, జపాన్, చైనా పెట్టుబడులతో ఈ ప్రాజెక్టు నిర్మాణం జరుగుతుంది. రివర్‌బే గ్రూపు, కేఈఐ గ్రూపులు ఈ ఎల్‌ఎన్‌జీ భారత్ టెర్మినల్‌లో ప్రధాన పాత్ర పోషించనున్నాయి.
గ్యాస్ కొరతను తీరుస్తాం: మూర్తి
కృష్ణపట్నం పోర్టులో తమ్మినపట్నం పంచాయతీ పరిధిలో 5 ఎమ్‌ఎమ్‌టీపీఏ సామర్థ్యం ఉన్న ఎల్‌ఎన్‌జీ ఫ్లోటింగ్ స్టోరేజి యూనిట్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు రాజమండ్రికి చెందిన కేఈఐ-ఆర్‌ఎస్‌ఓఎస్ పెట్రోలియం ఎనర్జీ ఎండీ మూర్తి మంగళవారం తెలిపారు. ఈ యూనిట్ ద్వారా విద్యుత్, ఎరువుల పరిశ్రమలకు గ్యాస్‌ను అందించే వీలుంటుందన్నారు.
భారతదేశ గ్యాస్ మార్కెట్‌లో సుమారు 45 ఎంఎంఎస్‌సీ ఎండీ కొరత ఉందని, డిమాండ్‌కు తగ్గట్టుగా అందించడానికి కృష్ణపట్నం పోర్టు ప్రాంతంలో ఎన్‌ఎన్‌జీ స్టోరేజీ పాయింట్‌ను ఏర్పాటు చేస్తున్నామన్నారు. సుమారుగా 1.30 లక్షల ఎల్‌త్రీ ఎల్‌ఎన్‌జీని నిల్వచేసే ఒక ఎఫ్‌ఎస్‌యూ(నిల్వలతో తేలియాడే యూనిట్ షిప్)ను కృష్ణపట్నంలోని ప్రత్యేక జట్టీతో కలిపి ఉంచుతామన్నారు. దీనివలన చుట్టుపక్కల గ్రామాల్లోని ప్రజలకు కాలుష్యం ఉండదని తెలిపారు.