- కాలం చెల్లిన చెక్కులిచ్చిన కాంట్రాక్టర్
- టెండర్ ఖరారు చేసిన అధికారులు
- నిలదీసిన వైఎస్సార్ సీపీ కౌన్సిలర్లు
మచిలీపట్నం టౌన్, న్యూస్‌లైన్ : స్థానిక బైపాస్‌రోడ్‌లో పైప్‌లైన్ నిర్మాణ పనుల బండారం బట్టబయలయ్యింది. పైప్‌లైన్ నిర్మాణ పనులు నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్నాయంటూ ఈ నెల ఆరో తేదీ శుక్రవారం సాక్షిలో ‘నిబంధనలకు విరుద్ధంగా పైప్‌లైన్ నిర్మాణం’ అనే శీర్షికతో వార్త ప్రచురితమైంది. ఈ పనులకు సంబంధించిన వివరాల ఫైల్‌ను తమకు చూపాలని వైఎస్సార్ సీపీ కౌన్సిలర్లు రెండు రోజులుగా కమిషనర్‌ను కలసి డిమాండ్ చేశారు.
రెండు రోజులుగా సంబధిత గుమస్తా నవప్రకాష్ సెలవులో ఉన్నాడంటూ ఇంజినీరింగ్ అధికారులు దాటవేస్తూ వచ్చారు. శనివారం ఈ పైప్‌లైన్ పనులకు సంబంధించిన టెండర్‌ఫైల్‌ను చూపుతామని కౌన్సిలర్లకు హామీ ఇచ్చారు. దీంతో కౌన్సిలర్లు శనివారం కమిషనర్ ఛాంబర్‌కు వెళ్లి ఫైల్ తెప్పించి చూపాలని కోరారు. దీంతో ఆయన ఫైల్‌ను తెప్పించారు.
ఈ ఫైల్‌ను కౌన్సిలర్లు పరిశీలించగా పలు లోపాలు బహిర్గతమయ్యాయి. స్థానిక శ్రీనివాసనగర్‌లోని సంపు నుంచి బైపాస్ రోడ్‌లోని సర్కిల్ వరకూ 250 మీటర్ల మేర రూ.3.60 లక్షలతో నూతన హెచ్‌డీపీఈ పైప్‌లైన్‌ను ఏర్పాటు చేసేందుకు అర్జెంట్ షార్ట్‌టెండర్‌ను 2014 మార్చి 10వ తేదీన పిలిచారు. ఈ పనులు చేసేందుకు కాంట్రాక్టర్లు డొక్కు వీర్రాజు, డొక్కు రమేష్‌కుమార్ మాత్రమే టెండర్లు దాఖలు చేశారు. వీరిద్దరిలో వీర్రాజు రెండు శాతం తక్కువకు పనులు చేసేందుకు టెండర్ వేసి పనులను దక్కించుకున్నాడు.
కాగా ఈ పనులను దక్కించుకున్న వీర్రాజు టెండర్ ధరావతును డీడీ రూపంలో టెండర్ పిలిచిన తేదీ తర్వాత తేదీతో ఇవ్వాల్సి ఉంది. అయితే వీర్రాజు 2013 డిసెంబర్ 5వ తేదీన తీసిన బ్యాంక్ ఆఫ్ బరోడా చెక్కులను టెండర్‌కు జతచేశాడు. అయితే ఈ టెండర్ షెడ్యూల్‌కు ధరావతు డీడీలను జత చేయాల్సి ఉండగా చెల్లని చెక్కులు ఇచ్చాడు. ఈ అంశంపై వైఎస్సార్ సీపీ కౌన్సిలర్లు మేకల సుబ్బన్న, లంకా సూరిబాబు, షేక్ అచ్చేబాలు కమిషనర్, ఏఈ రాంపరసాద్, గుమస్తా నవప్రకాష్‌ను నిలదీశారు. ఇన్ని లోపాలు ఉండగా ఈ టెండర్‌ను ఎలా పరిగఱణలోకి తీసుకున్నారని ప్రశ్నించారు.
కాంట్రాక్టర్ సర్టిఫికెట్ ఫోర్స్‌లో లేని రమేష్‌కుమార్ వేసిన టెండర్‌ను ఎలా పరిగణనలోకి తీసుకున్నారని నిలదీశారు. ఈ పనులకు సంబంధించిన టెండర్ ప్రకటనలను ఏ పత్రికలోనూ, ఆన్‌లైన్‌లో ఈ- ప్రొక్యూర్‌మెంట్ ద్వారాను పిలువకుండానే టెండర్లు ఎలా ఆమోదించారని, అలాగే మినిట్స్ పుస్తకంలో ఈ పని వివరాలు నమోదే చేయకుండా ఎలా పని చేయిస్తున్నారని వారు ప్రశ్నించారు.
అసలు ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సమయంలో ఈ టెండర్‌ను ఎందుకు పెట్టారని, బైపాస్ రోడ్‌లో ఎన్నో యేళ్లుగా పైప్‌లైన్ లీకవుతుంటే ఈ పనులు ఇప్పుడే ఇంత అడ్డగోలుగా ఎందుకు చేయిస్తున్నారని ప్రశ్నించారు. ఒక వేళ అంత అవసరం అనుకుంటే చిన్న పనే కాబట్టి ఈ పనిని శాఖా పరంగానే ఎందుకు చేయలేకపోయారని అడిగారు.
మెదటి సారి తప్పు తమ దృష్టికి వచ్చింది కాబట్టి సిబ్బంది తప్పైపోయింది అని ఒప్పుకుంటే ఇక్కడి నుంచి వెళ్లిపోతామని లేకుంటే తప్పులు రుజువైనందున సంబంధిత అధికారులు, సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని వారు కమిషనర్‌ను డిమాండ్ చేశారు. రెండు రోజులుగా టెండర్ ఫైల్ చూపుతామని హామీ ఇచ్చిన ఎంఈ గద్దె ప్రదీప్‌కుమార్ శనివారం లేకపోవడాన్ని కౌన్సిలర్లు ప్రశ్నించారు.
ఈ అంశంపై స్పందించిన కమిషనర్ మారుతీదివాకర్ మాట్లాడుతూ ఈ పనులకు సంబంధించిన టెండర్‌ఫైల్‌ల్లో లోపాలు ఉన్న మాట వాస్తవమేనని, అయితే మున్సిపాలిటీకి చెందిన ధనం మాత్రం వృథాకాలేదన్నారు.సోమవారం సమగ్రంగా విచారించి బాధ్యులపై చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. కమిషనర్‌ను కలసిన కౌన్సిలర్లలో మీర్ అస్గర్‌అలీ, గూడవల్లి నాగరాజు, కాగిత జవహర్‌లాల్, శీలం బాబ్జీ, ధనికొండ నాగమల్లేశ్వరి, బందెల కవిత, మట్టా తులసి, కే లీలాకుమారి తదితరులు ఉన్నారు.