సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కృషితో పల్నాడు ప్రాంత ప్రజల దశాబ్దాల స్వప్నం వరికపుడిశెల ఎత్తిపోతలకు అడ్డంకులు తొలగిపోయాయి. కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ అనుమతులు లభించక దశాబ్దాలుగా పనులు ప్రారంభం కాని ఈ ప్రాజెక్టును సీఎం జగన్ సాధించారు. శ్రీశైలం – నాగార్జునసాగర్ టైగర్ రిజర్వు ఫారెస్ట్‌లో వరికపుడిశెల ఎత్తిపోతల పనులు చేపట్టేందుకు కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ అనుమతి ఇచ్చింది. దాంతో వరికపుడిశెల వాగు కుడి గట్టుపై పంప్‌హౌస్, టైగర్ రిజర్వ్ ఫారెస్ట్‌లో 4 కిలోమీటర్ల పైపులైన్ నిర్మాణానికి మార్గం సుగమమైంది.
దేశంలో అత్యల్ప వర్షపాతం నమోదయ్యే ప్రాంతాల్లో పల్నాడు ఒకటి. పక్కనే వరికపుడిశెల వాగు, కృష్ణా నదులు ప్రవహిస్తున్నా పల్నాడులో సాగు, తాగు నీటికి తీవ్ర ఇబ్బందులే. నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు 40 కిలోమీటర్ల ఎగువన కృష్ణా నదిలో వరికపుడిశెలవాగు కలిసే ప్రాంతానికి ముందే ఆ వాగు నీటిని ఎత్తిపోసి పల్నాడును సుభిక్షం చేయాలనే ప్రతిపాదన దశాబ్దాలుగా ఉంది. ఇందుకోసం టైగర్ రిజర్వ్ ఫారెస్ట్‌లో పనులు చేయాల్సి ఉంటుంది. ఈ పనులకు కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ అనుమతి ఇవ్వకపోవడంతో ఆ ఎత్తిపోతల కాగితాలకే పరిమితమైంది.
పల్నాడును సుభిక్షం చేసే దిశగా..
పల్నాడు ప్రాంతానికి సాగు, తాగు నీటిని అందించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గట్టి సంకల్పం తలపెట్టారు. వరికపుడిశెలవాగు, కృష్ణా, గోదావరి జలాలను తరలించి పల్నాడుకు అందించాలని జలవనరుల శాఖ అధికారులను ఆదేశించారు. దాంతో వరికపుడిశెల వాగు కుడి గట్టున ఎత్తిపోతలను నిర్మించి, తొలి దశలో రోజుకు 281 క్యూసెక్కుల చొప్పున 1.57 టీఎంసీలను తరలించాలని ప్రణాళిక రూపొందించారు. రూ. 340.26 కోట్లు ఖర్చయ్యే ఈ ప్రాజెక్టు ద్వారా వెల్దుర్తి మండలంలో 24,900 ఎకరాలకు నీళ్లందించవచ్చు.
టైగర్ రిజర్వు ఫారెస్ట్‌లో వరికపుడిశెల వాగుపై ఎత్తిపోతల నిర్మాణం, దాని ద్వారా నీటిని తరలించడానికి 4 కిలోమీటర్ల పైపు లైన్ నిర్మాణానికి 19.13 హెక్టార్ల అటవీ భూమిని కేటాయించాలని కేంద్ర అటవీ, పర్యావరణ శాఖకు అధికారులు ప్రతిపాదనలు పంపారు. ఇందుకు ప్రతిగా దుర్గి మండలంలో 21 హెక్టార్ల భూమిని అటవీ శాఖకు బదలాయించి, పరిహారాన్ని కూడా ప్రభుత్వం చెల్లించింది. సీఎం వైఎస్ జగన్ ఆదేశాల మేరకు కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ అధికారులతో పల్నాడు ప్రాంత ప్రజాప్రతినిధులు, జలవనరుల శాఖ అధికారులు పలు మార్లు చర్చలు జరపడంతో కేంద్రం కదిలింది.
వరికపుడిశెల ఎత్తిపోతలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో టైగర్ రిజర్వు ఫారెస్ట్‌లో పంప్‌హౌస్, పైపు లైన్ నిర్మాణం చేపట్టేందుకు అధికారులు సిద్ధమయ్యారు. ఎత్తిపోతల ద్వారా తరలించే నీటిని వెల్దుర్తి, ఉప్పలపాడు, గొట్టిపాళ్ల, సిరిగిరిపాడు, బొదిలవీడు, గంగులకుంట, లోయపల్లి గ్రామాల పరిధిలో 24,900 ఎకరాలకు సరఫరా చేయడానికి పైపు లైన్ల నిర్మాణం ఇప్పటికే ప్రారంభించారు. ఇప్పుడు అటవీ ప్రాంతంలో పైపులైన్ నిర్మిస్తారు.
పైపు లైన్ల ద్వారా నీటిని తరలిస్తే సరఫరా నష్టాలు ఉండవని, ఆయకట్టుకు సమర్థవంతంగా నీటిని అందింవచ్చని అధికారవర్గాలు చెబుతున్నాయి. రాష్ట్రంలో పైపు లైన్ ద్వారా ఆయకట్టుకు నీళ్లందించే తొలి ఎత్తిపోతల పథకం ఇదే. వరికపుడిశెల ఎత్తిపోతల తొలి దశకు అడ్డంకులు తొలగడంతో పల్నాడులో భారీ ఎత్తున ఆయకట్టుకు నీళ్లందించేలా రెండో దశకు సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) తయారీకి అధికారులు కసరత్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment