tiger reserve forest
-
నల్లమల టైగర్ జోన్ లో ఓరోజు.. ఆమ్రాబాద్ నుంచి సాక్షి గ్రౌండ్ రిపోర్ట్
-
కజిరంగా నేషనల్ పార్కులో మోదీ విహారం
జోర్హాట్: అస్సాంలోని ప్రఖ్యాత కజిరంగా నేషనల్ పార్కు, టైగర్ రిజర్వ్‌ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సందర్శించారు. శుక్రవారం సాయంత్రం అస్సాం చేరుకున్న మోదీ శనివారం ఉదయం ఈ పార్కులో అడుగుపెట్టారు. ఈ సందర్భంగా ప్యాంట్, షర్టు, జాకెట్, హ్యాట్ ధరించారు. ‘ప్రద్యుమ్న’ అనే ఏనుగుపై స్వయంగా విహరించారు. ఇక్కడి ప్రకృతి అందాలను, వన్యప్రాణులను ప్రత్యక్షంగా తిలకించి పరవశించిపోయారు. వాటిని తన కెమెరాలో బంధించారు. దాదాపు రెండు గంటలపాటు పార్కులో గడిపారు. ఎలిఫెంట్ సఫారీ, జీపు సఫారీని ఆనందించారు. ‘యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్’ అయిన కజిరంగా జాతీయ ఉద్యానవనాన్ని మోదీ సందర్శించడం ఇదే మొదటిసారి. ఏమాత్రం అలసట లేకుండా వనంలో ఉత్సాహంగా కలియదిరిగారు. జీపుపై విహారిస్తూ అధికారులను ఇక్కడి విశేషాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా చాలా జంతువులు ఆయన కంటబడ్డాయి. మూడు ఏనుగులకు మోదీ తన చేతులతో చెరుకు గడలు తినిపించారు. ఫారెస్టు గార్డులు ‘వనదుర్గల’తో, ఏనుగు మావటీలతో, అటవీ శాఖ అధికారులతో మాట్లాడారు. ఖడ్గ మృగాలకు ప్రసిద్ధి చెందిన కజిరంగా నేషనల్ పార్కులో పెద్దసంఖ్యలో గజరాజులు, ఇతర అరుదైన వన్య ప్రాణులు ఉన్నాయని మోదీ ‘ఎక్స్’లో పోస్టు చేశారు. సంబంధిత చిత్రాలను కూడా పంచుకున్నారు. వనదుర్గలు అందిస్తున్న సేవలను ప్రశంసించారు. -
అమ్మ ఒడి ‘హాయిగా’... గున్న ఏనుగు సాక్షిగా..!
చెన్నై: తమిళనాడులోని అన్నామలై టైగర్ రిజర్వ్‌లో తప్పిపోయిన గున్న ఏనుగును తల్లి చెంతకు చేర్చారు. తల్లిని కలిసిన అనంతరం చిన్న ఏనుగు అమ్మ ఒడిలో హాయిగా నిద్రపోయింది. ఈ దృశ్యాలను అటవీ సిబ్బంది కెమెరాలో బంధించారు. ఈ చిత్రాన్ని ఐఏఎస్ అధికారి సుప్రీయా సాహు సోషల్ మీడియాలో పంచుకోగా.. విశేష స్పందనలు వచ్చాయి. గున్న ఏనుగును తల్లి వద్దకు చేర్చినందుకు అటవీ అధికారులకు ప్రముఖ వ్యాపార వేత్త ఆనంద్ మహీంద్రా అభినందనలు తెలిపారు. అటవీ సిబ్బందికి నెటిజన్లు ధన్యవాదాలు తెలిపారు. జంతువుల్లోనైనా అమ్మ ప్రేమ ఒక్కటేనని కొనియాడారు. When a picture is worth a million words ❤️ the rescued baby elephant after uniting with the mother takes an afternoon nap in her mother's comforting arms before moving again with the big herd. Picture taken by Forest field staff somewhere in Anamalai Tiger reserve who are keeping… https://t.co/EedfkKjLHj pic.twitter.com/ttqafSudyM — Supriya Sahu IAS (@supriyasahuias) January 2, 2024 ఇదీ చదవండి: Ram Mandir: రామాలయ ప్రాంగణంలో ప్రత్యేక ఆలయాలివే.. -
వరికపుడిశెల వాగు ఎత్తిపోతలకు తొలగిన అడ్డంకి
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కృషితో పల్నాడు ప్రాంత ప్రజల దశాబ్దాల స్వప్నం వరికపుడిశెల ఎత్తిపోతలకు అడ్డంకులు తొలగిపోయాయి. కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ అనుమతులు లభించక దశాబ్దాలుగా పనులు ప్రారంభం కాని ఈ ప్రాజెక్టును సీఎం జగన్ సాధించారు. శ్రీశైలం – నాగార్జునసాగర్ టైగర్ రిజర్వు ఫారెస్ట్‌లో వరికపుడిశెల ఎత్తిపోతల పనులు చేపట్టేందుకు కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ అనుమతి ఇచ్చింది. దాంతో వరికపుడిశెల వాగు కుడి గట్టుపై పంప్‌హౌస్, టైగర్ రిజర్వ్ ఫారెస్ట్‌లో 4 కిలోమీటర్ల పైపులైన్ నిర్మాణానికి మార్గం సుగమమైంది. దేశంలో అత్యల్ప వర్షపాతం నమోదయ్యే ప్రాంతాల్లో పల్నాడు ఒకటి. పక్కనే వరికపుడిశెల వాగు, కృష్ణా నదులు ప్రవహిస్తున్నా పల్నాడులో సాగు, తాగు నీటికి తీవ్ర ఇబ్బందులే. నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు 40 కిలోమీటర్ల ఎగువన కృష్ణా నదిలో వరికపుడిశెలవాగు కలిసే ప్రాంతానికి ముందే ఆ వాగు నీటిని ఎత్తిపోసి పల్నాడును సుభిక్షం చేయాలనే ప్రతిపాదన దశాబ్దాలుగా ఉంది. ఇందుకోసం టైగర్ రిజర్వ్ ఫారెస్ట్‌లో పనులు చేయాల్సి ఉంటుంది. ఈ పనులకు కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ అనుమతి ఇవ్వకపోవడంతో ఆ ఎత్తిపోతల కాగితాలకే పరిమితమైంది. పల్నాడును సుభిక్షం చేసే దిశగా.. పల్నాడు ప్రాంతానికి సాగు, తాగు నీటిని అందించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గట్టి సంకల్పం తలపెట్టారు. వరికపుడిశెలవాగు, కృష్ణా, గోదావరి జలాలను తరలించి పల్నాడుకు అందించాలని జలవనరుల శాఖ అధికారులను ఆదేశించారు. దాంతో వరికపుడిశెల వాగు కుడి గట్టున ఎత్తిపోతలను నిర్మించి, తొలి దశలో రోజుకు 281 క్యూసెక్కుల చొప్పున 1.57 టీఎంసీలను తరలించాలని ప్రణాళిక రూపొందించారు. రూ. 340.26 కోట్లు ఖర్చయ్యే ఈ ప్రాజెక్టు ద్వారా వెల్దుర్తి మండలంలో 24,900 ఎకరాలకు నీళ్లందించవచ్చు. టైగర్ రిజర్వు ఫారెస్ట్‌లో వరికపుడిశెల వాగుపై ఎత్తిపోతల నిర్మాణం, దాని ద్వారా నీటిని తరలించడానికి 4 కిలోమీటర్ల పైపు లైన్ నిర్మాణానికి 19.13 హెక్టార్ల అటవీ భూమిని కేటాయించాలని కేంద్ర అటవీ, పర్యావరణ శాఖకు అధికారులు ప్రతిపాదనలు పంపారు. ఇందుకు ప్రతిగా దుర్గి మండలంలో 21 హెక్టార్ల భూమిని అటవీ శాఖకు బదలాయించి, పరిహారాన్ని కూడా ప్రభుత్వం చెల్లించింది. సీఎం వైఎస్ జగన్ ఆదేశాల మేరకు కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ అధికారులతో పల్నాడు ప్రాంత ప్రజాప్రతినిధులు, జలవనరుల శాఖ అధికారులు పలు మార్లు చర్చలు జరపడంతో కేంద్రం కదిలింది. వరికపుడిశెల ఎత్తిపోతలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో టైగర్ రిజర్వు ఫారెస్ట్‌లో పంప్‌హౌస్, పైపు లైన్ నిర్మాణం చేపట్టేందుకు అధికారులు సిద్ధమయ్యారు. ఎత్తిపోతల ద్వారా తరలించే నీటిని వెల్దుర్తి, ఉప్పలపాడు, గొట్టిపాళ్ల, సిరిగిరిపాడు, బొదిలవీడు, గంగులకుంట, లోయపల్లి గ్రామాల పరిధిలో 24,900 ఎకరాలకు సరఫరా చేయడానికి పైపు లైన్ల నిర్మాణం ఇప్పటికే ప్రారంభించారు. ఇప్పుడు అటవీ ప్రాంతంలో పైపులైన్ నిర్మిస్తారు. పైపు లైన్ల ద్వారా నీటిని తరలిస్తే సరఫరా నష్టాలు ఉండవని, ఆయకట్టుకు సమర్థవంతంగా నీటిని అందింవచ్చని అధికారవర్గాలు చెబుతున్నాయి. రాష్ట్రంలో పైపు లైన్ ద్వారా ఆయకట్టుకు నీళ్లందించే తొలి ఎత్తిపోతల పథకం ఇదే. వరికపుడిశెల ఎత్తిపోతల తొలి దశకు అడ్డంకులు తొలగడంతో పల్నాడులో భారీ ఎత్తున ఆయకట్టుకు నీళ్లందించేలా రెండో దశకు సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) తయారీకి అధికారులు కసరత్తు చేస్తున్నారు. -
టైగర్ రిజర్వును సందర్శించిన ప్రధాని నరేంద్ర మోదీ (ఫొటోలు)
-
ఎదురుగా పులులు కనిపిస్తున్నా.. అందరి కళ్లు ద్రవిడ్‌పైనే!
న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ రాస్ టేలర్ తన ఆత్మకథ ''బ్లాక్ అండ్ వైట్'' ద్వారా ఆసక్తికర విషయాలు బయటపెడుతున్నాడు. రెండురోజుల క్రితం సొంత జట్టు క్రికెటర్లే వివక్ష చూపారంటూ సంచలన వార్త బయటపెట్టిన టేలర్.. శనివారం.. ఐపీఎల్ సందర్భంగా ఒక మ్యాచ్‌లో డకౌట్ అయినందుకు రాజస్తాన్ రాయల్స్ యాజమాని ఒకరు తన చెంప పగులగొట్టారంటూ మరొక సంచలన విషయం బయటపెట్టాడు. తాజాగా టీమిండియా మాజీ క్రికెట్.. ప్రస్తుత భారత హెడ్‌కోచ్ ద్రవిడ్‌తో జరిగిన అనుభవాన్ని తన ఆత్మకథలో రాసుకొచ్చాడు. 2011 ఐపీఎల్ సందర్భంగా రాస్ టేలర్ రాజస్తాన్ రాయల్స్‌కు ప్రాతినిధ్యం వహించిన సంగతి తెలిసిందే. అదే జట్టులో షేన్ వార్న్ సహా రాహుల్ ద్రవిడ్ కూడా ఉన్నారు. వారితో డ్రెస్సింగ్ రూమ్ పంచుకున్న టేలర్.. అప్పట్లో బయట టీమిండియా ఆటగాళ్లకు పాపులారిటీ ఎంతనేది కళ్లారా చూశానంటూ పేర్కొన్నాడు. ''2011 ఐపీఎల్ సందర్భంగా ఒకసారి ద్రవిడ్‌తో కలిసి రాజస్థాన్‌లోని రణతంబోర్ జాతీయ పార్కును సందర్శించా. ఈ సందర్భంగా ద్రవిడ్‌ను.. మీరెన్ని సార్లు పులులను సందర్శించారు. అని అడిగాను. దానికి ద్రవిడ్.. లేదు ఇంతవరకు ఒక్క పులిని కూడా దగ్గరి నుంచి చూడలేదు. ఇది 21వ సపారీ అనుకుంటా.. కానీ ఒక్క పులిని కూడా చూడలేకపోయా అని చెప్పాడు. దీంతో ఏంటి 21 సార్లు సఫారీకి వచ్చినా ఒక్కసారి కూడా పులిని చూడకపోవడం ఏంటి. అని ఆశ్చర్యపోయా. ఆ తర్వాత అందరం కలిసి ఎస్యూవీ మోడల్ ఓపెన్ టాప్ కారులో సఫారీకి వెళ్లాం. దాదాపు 100 మీటర్ల దూరంలో ఒక aపులిని చూశాం. ద్రవిడ్.. నావల్ల ఈరోజు నువ్వు పులిని దగ్గర్నుంచి చూశావు.. దానికి థ్యాంక్స్ చెప్పాలి అని పేర్కొన్నాను. ఇక మా మధ్య ఏవో మాటలు సందర్బంలో వచ్చాయి. ఈ సమయంలోనే నేనొక అద్భుత విషయాన్ని గమనించా. అది చూశాకా భారత్‌లో క్రికెటర్లను ఇంతలా ఎందుకు అభిమానిస్తారా అని ఆశ్చర్యమేసింది. అదేంటంటే.. మేము వెళ్తున్న వాహనం వెనకాల వస్తున్న మరో సఫారీ వాహనంలో కొంతమంది వస్తున్నారు. అప్పటిదాకా కనిపిస్తున్న పులులను తమ కెమెరాల్లో బందిస్తున్న వాళ్లు.. అది ఆపేసి ఒక్కసారిగా కెమెరాలన్నింటిని ద్రవిడ్‌వైపు తిప్పారు. అంటే ఒక జాతీయ పార్క్‌కు వచ్చి.. ఎదురుగా అరుదైన పులి జాతి సంపద కనిపిస్తున్నా సరే.. అందరు ద్రవిడ్‌నే చూడడం నాకు ఆసక్తి కలిగించింది. ఈ సందర్భంగా ఒక విషయం కోట్ చేయలానుకున్నా.. 'ప్రపంచంలో సుమారు 4వేల పులులు ఉండుంటాయి.. కానీ వాటికి మించిన ప్రత్యేకం రాహుల్ ద్రవిడ్' అన్న విషయం కచ్చితంగా చెప్పగలను'' అంటూ చెప్పుకొచ్చాడు. ఇక 2006లో న్యూజిలాండ్ తరఫున అంతర్జాతీయ క్రికెట్ లో అరంగేట్రం చేసిన రాస్ టేలర్... అనతి కాలంలోనే జట్టుకు నమ్మదగిన ప్లేయర్ గా మారిపోయాడు. బౌలర్ ఎవరైనా సరే బుల్లెట్ లాంటి షాట్లతో బౌండరీలకు పంపడం రాస్ టేలర్ ప్రత్యేకత.బంగ్లాదేశ్‌తో ఈ ఏడాది ఆరంభంలో జరిగిన టెస్టు సిరీస్ అనంతరం తన 16 ఏళ్ల క్రికెట్ కెరీర్‌కు గుడ్‌బై చెప్పాడు. 38 ఏళ్ళ రాస్ టేలర్ తన కెరీర్ లో 112 టెస్టు మ్యాచ్ లు, 236 వన్డేలు, 102 టి20లు ఆడాడు. టెస్టుల్లో 19 సెంచరీలు, 35 అర్ధ సెంచరీలతో 7,683 పరుగులు చేశాడు. ఇక వన్డేల్లో 21 సెంచరీలు 51 అర్ధ సెంచరీలతో 8,607 పరుగులు సాధించాడు. టి20ల్లోనూ అదరగొట్టిన టేలర్ 7 అర్థ సెంచరీలతో 1,909 పరుగులు చేశాడు. అంతర్జాతీయ క్రికెట్ లోని మూడు ఫార్మాట్లలోనూ 100 మ్యాచ్ లు ఆడిన తొలి ప్లేయర్‌గా రాస్ టేలర్ నిలిచాడు. చదవండి: Ross Taylor About Racism: రాస్ టేలర్ సంచలన ఆరోపణలు.. కివీస్‌కున్న ట్యాగ్‌లైన్ ఉత్తదేనా! Asia Cup 2022: ఆసియా కప్ ముంగిట.. భారత అభిమానుల్లో 'జెర్సీ' భయం -
నల్లమలలో 73 పెద్ద పులులు
మార్కాపురం: దేశంలోనే అతిపెద్ద అభయారణ్యమైన నల్లమల టైగర్ రిజర్వు ఫారెస్టులో 73 పెద్దపులులు ఉన్నట్లు పులుల గణనలో తేలింది. 2020లో 63 ఉండగా రెండేళ్లలో పెద్దపులుల సంఖ్య మరో పది పెరిగింది. ఇక్కడ 2018లో 47 పులులే ఉన్నాయి. పులుల గణన ఈ ఏడాది జనవరి నుంచి ఏప్రిల్ వరకు కొనసాగింది. రాష్ట్రవ్యాప్తంగా వీటిసంఖ్య 75 ఉన్నట్లు అటవీ అధికారులు తెలిపారు. అదనంగా చేరిన రెండు పులులు ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం నుంచి పాపికొండల్లో సంచరిస్తున్నట్లు గుర్తించారు. నాలుగేళ్లలో పులుల పెరుగుదల 60 శాతం ఉండటం గొప్ప విషయమని అటవీ అధికారులు తెలిపారు. నాగార్జునసాగర్ ఫారెస్టు నుంచి కూడా పులుల సంచారం జరుగుతోంది. పులుల సంరక్షణకు ప్రత్యేక చర్యలు నాలుగేళ్లలో పులుల సంఖ్య 47 నుంచి 73 వరకు పెరగటానికి నల్లమల అటవీ ప్రాంతంలో అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. అటవీ ప్రాంతంలోకి స్మగ్లర్లు, వేటగాళ్లు రాకుండా 13 చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. గతంలో నాలుగు చెక్‌పోస్టులు మాత్రమే ఉండేవి. దీంతోపాటు ఎక్కడికక్కడ గడ్డిని పెంచటంతో పొదలు ఏర్పడి దుప్పులు, జింకలు పెరిగాయి. దీంతో పులులకు ఆహారం సమృద్ధిగా లభిస్తోంది. దీంతో పులుల సంఖ్య పెరిగిందని మార్కాపురం వైల్డ్ లైఫ్ డిప్యూటీ డైరెక్టర్ విఘ్నేష్ అప్పావ్ చెప్పారు. అటవీ సమీప గ్రామాలు, కొన్ని చెంచుగూడేలపై నిరంతర నిఘా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రస్తుతం నల్లమల అటవీప్రాంతంలో 300 చిరుతలు, 300 ఎలుగుబంట్లు సంచరిస్తున్నాయని, వీటి సంరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు. దోర్నాల మండలంలోని బొమ్మలాపురం ప్రాంతంలో టీ64 పెద్దపులి పిల్లలతో కలిసి తిరుగుతోందని చెప్పారు. అటవీ ప్రాంతంలోకి వెళ్తే దాడులు చేసే ప్రమాదం ఉన్నందున ఆరునెలల పాటు ఎవరూ లోతట్టు అటవీ ప్రాంతానికి వెళ్లవద్దని కోరారు. -
Tiger Mating Season: ఏకాంతమైతేనే 'సై'ఆట
ఆత్మకూరు రూరల్: జూన్ 1 నుంచి ఆగస్టు 31 వరకు శ్రీశైలం అటవీ రేంజ్ పరిధిలోని ఇష్టకామేశ్వరి పుణ్యక్షేత్రానికి భక్తుల రాకపోకలను తాత్కాలికంగా అటవీ శాఖ నిలిపేసింది. ఇష్టకామేశ్వరి క్షేత్రం ఒక్కటే కాదు.. అన్ని పర్యావరణ పర్యాటక కేంద్రాలనూ ఈ మూడు నెలలు మూసివేశారు. ఇది పెద్ద పులుల సంతానోత్పత్తి సమయం(బ్రీడింగ్ పీరియడ్) అయినందున వాటికి ఏకాంతం కల్పించడమే ఈ ఆంక్షలకు కారణమని అటవీ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. పెద్దపులి ఎంతో సిగ్గరి మనస్థత్వం కలిగినది. ఎంతో ఠీవీగా రాజసంతో నడిచే పెద్దపులి తన సంగమ సమయంలో మాత్రం పూర్తిగా ఏకాంతాన్ని కోరుకుంటుంది. అడవిలో ఏ చిన్న అలజడి రేగినా పులులు సంగమంలో పాల్గొనవు. అయితే తరుచూ అడవుల్లో మానవ సంచారం కారణంగా పెద్ద పులుల్లో సంగమించడం తగ్గిపోయి గర్భధారణ అవకాశాలు పడిపోతున్నాయి. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకున్న ఎన్టీసీఏ(నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ) 2015లో పులుల అభయారణ్యాలున్న రాష్ట్రాలకు ఆదేశాలిచ్చింది. ఆ మేరకు రుతుపవనాల సమయమైన జూన్ 1 నుంచి ఆగస్టు 31 వరకు అభయారణ్యాల్లో మానవ సంచారాన్ని అదుపు చేసే చర్యలు తీసుకోవాలని సూచించింది. ఈ మేరకు ఈ ఏడాది జూన్ 1 నుంచి ఈ నిషేధాజ్ఞలను ఎన్ఎస్టీఆర్(నాగార్జునసాగర్–శ్రీశైలం టైగర్ రిజర్వ్), జీబీఎం(గుండ్ల బ్రహ్మేశ్వరం) అభయారణ్యాల పరిధిలో అటవీ శాఖ అమలు చేస్తోంది. దీంతో అభయారణ్యాల పరిధిలోని అన్ని ఎకో టూరిజం రిసార్ట్లు, జంగల్ సఫారీలు, పుణ్యక్షేత్రాలను మూసివేశారు. అవసరం అనుకుంటే ఈ నిషేధాజ్ఞలను మరో రెండు నెలలు కూడా పొడిగించే అవకాశాలున్నాయి. తల్లి తలపైకెక్కిన పులి కూనలు ఆ సమయంలో మనుషుల పైనా దాడి చేసే అవకాశం పులులు సంతానోత్పత్తి సమయాల్లో చాలా ఆవేశపూరితంగా ఉంటాయి. సంగమం సమయంలో ఆవేశంతో మనుషులపై దాడులకు పాల్పడతాయి. అందుకే పులుల సంతానోత్పత్తి కాలంలో నల్లమలలోని అన్ని పర్యాటక, పుణ్యక్షేత్రాలను తాత్కాలికంగా మూసివేయించాం. – అలెన్ చోంగ్ టెరాన్, డీఎఫ్‌వో, ఆత్మకూరు డివిజన్, నంద్యాల జిల్లా -
కవ్వాల్.. పులి కమాల్!
సాక్షి, మంచిర్యాల: కవ్వాల్ టైగర్ రిజర్వులో పులుల జీవన చిత్రానికి చక్కటి ఉదాహరణ ఈ ఫొటో. మహారాష్ట్రలోని తడోబా, తిప్పేశ్వర్ పులుల అభయారణ్యాల నుంచి వలస పులుల రాకతో కవ్వాల్‌లో పులుల సంతతి పెరుగుతోంది. 2015లో పాల్గుణ అనే పులి అడుగు పెట్టి.. రెండు దశల్లో నాలుగు చొప్పున ఎనిమిదింటికి జన్మనివ్వడంతో ఒక్కసారిగా వాటి జనాభా పెరిగింది. వీటితోపాటు మరికొన్ని కొత్త పులులు అడవుల్లో సందడి చేస్తున్నాయి. ఈ ఫొటోలో కనిపిస్తున్నది (కే8) అనే నాలుగేళ్ల ఆడ పులి. ఇది రెండు పిల్లల తల్లి. ఇటీవల అడవిలో నీటి ప్రవాహంపై దూకుతుండగా కెమెరాకు చిక్కింది. అటవీ అధికారుల సంరక్షణ చర్యలతో భవిష్యత్‌లో మరిన్ని పులులకు కవ్వాల్ ఆవాసంగా మారబోతోంది. -
Suraj Bhai Meena: అడవిలో ఆడపులి.. పల్లె కట్టుబాటును దాటి...
Suraj Bhai Meena- దాదాపు 1300 చదరపు కిలోమీటర్లు ఉండే రణథమ్‌బోర్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్‌లో చాలా ఆడపులులు ఉన్నాయి. వాటిని చూపి ఉపాధి పొందే మగ టూరిస్ట్లూ ఉన్నారు. కాని వారందరి మధ్య ఇంకో ఆడపులి కూడా ఉంది. సూరజ్‌బాయి మీనా. ఆ అడవి దాపున పల్లెలో పుట్టి పెరిగిన మీనా మొదటిసారి ఆ ప్రాంతంలో మహిళా టూరిస్ట్‌గైడ్‌గా మారింది. మగవాళ్లు వద్దన్నారు. ఊరు వద్దంది. కాని ఇప్పుడు ఆమెకు వస్తున్న పేరు చూసి ఊరే మారింది. ఆడపిల్లలను ఆమెలా మారమని చెబుతోంది. రాజస్థాన్‌లోని సవాయి మధోపూర్ టౌన్ చుట్టుపక్కల బనస్ నదిని చుట్టుముడుతూ ఉండే అతి పెద్ద టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ రణథమ్‌బోర్ 1980 ల నుంచి టూరిజంలో చురుగ్గా ఉంది. అప్పటి నుంచి ఎందరో గైడ్లు ప్రపంచ వ్యాప్తంగా వచ్చే టూరిస్ట్‌లను అడవిలో గైడ్ చేస్తూ ఉంటారు. వారికి పులిని చూపుతూ ఉంటారు. ధైర్యంగా తిరుగుతూ ఉంటారు. అదంతా పురుషుల పనే 2007 వరకూ. కాని ఆ సంవత్సరం మొదటిసారి ఒక మహిళా గైడ్ అడవిలోకి వచ్చింది. సూరజ్‌బాయి మీనా. ఆ అమ్మాయిని చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ఒకరోజు రెండురోజులు ఉండి పారిపోతుంది అనుకున్నారు. కాని ఇవాళ్టి వరకూ సూరజ్‌బాయి మీనా అక్కడ పని చేస్తూనే ఉంది. తనలాంటి మరో నలుగురు మహిళా గైడ్లను తయారు చేసి వారికీ ఉపాధి చూపింది. పల్లె కట్టుబాటును దాటి... సూరజ్‌బాయి మీనాది రణథమ్‌బోర్ రిజర్వ్‌కు ఆనుకుని ఉన్న భురి పహడి అనే కుగ్రామం. ఏడుగురు అన్నదమ్ముల్లో మీనా ఒక్కతే ఆడపిల్ల. ఆ ఊళ్లో ఎవరికీ చదువు లేదు. ఆడపిల్లలకు అసలే లేదు. ఇంకా చెప్పాలంటే ఆడపిల్ల చదువుకుంటే ఎక్కువ కట్నం ఇవ్వాలి. ఆ చుట్టుపక్కల చెప్పే చదువులో 8వ తరగతి తర్వాతే ఏబిసిడిలు నేర్పిస్తారు. అలాంటి చోటు నుంచి బయలుదేరింది మీనా. ‘మా అన్నయ్య హేమరాజ్ మొదట రిజర్వ్ ఫారెస్ట్‌లో చేరాడు. నేను అప్పుడప్పుడు వాడితో కలిసి అడవిలోకి వచ్చేదాన్ని. అడవి నాకు చాలా నచ్చేది. నేను కూడా అన్నయ్యలాగే గైడ్ అవ్వాలనుకున్నాను. కాని అది అంత సులభం కాదని నాకు తెలుసు’ అంది మీనా. తల్లిదండ్రులను ఒప్పించి టెన్త్ చదివిన మీనా ఒకటి రెండేళ్ల తర్వాత గైడ్‌గా మారడానికి నిశ్చయించుకుంది. కాని ఈ విషయం ఊళ్లో ఎవరికీ నచ్చలేదు. వచ్చి అందరూ ఆమె తల్లిదండ్రులను తిట్టారు. ‘ఆ ఫారిన్ వాళ్లు వచ్చి నిన్నేమైనా చేస్తే? వాళ్ల మధ్యన పడి నువ్వు మా పరువు తీస్తే’ అని తల్లి ఆందోళన చెందింది. మీనా అన్నయ్యల్లో హేమరాజ్ తప్ప మిగిలిన వారు కూడా మద్దతు ఇవ్వలేదు. కాని హేమరాజ్ ఆమెకు అండగా నిలిచాడు. చెల్లెలు ఉద్యోగస్తురాలవ్వాలని ఒప్పించాడు. సవాయి మధోపూర్‌కు తీసుకెళ్లి ఫారెస్ట్ వాళ్ల ట్రైనింగ్‌కు అప్లికేషన్ పెట్టించాడు. చెల్లెలు అక్కడ ట్రైనింగ్ తీసుకునేందుకు ఏర్పాటు చేశాడు. అక్టోబర్ 2007లో మీనా తొలి మహిళా గైడ్‌గా అడవిలో ప్రవేశించింది. పులినీ... విమర్శనూ ఇప్పుడు మీనాకు రెండు సవాళ్లు ఎదురయ్యాయి. ఒకటి ఫారెస్ట్‌లో పని చేస్తున్న పురుష గైడ్ల సమ్మతి పొందడం. రెండు టూరిస్ట్‌లతో ఇంగ్లిష్ మాట్లాడటం. మీనా పనికి వచ్చిన కొత్తల్లో పురుష గైడ్లు ‘నీకిక్కడ ఏం పని?’ అన్నట్టుగా చూసేవారు. ఆమె కూడా యూనిఫామ్ వేసుకుని సఫారీలో టూరిస్ట్‌లను ఎక్కించుకుని అడవి చూపించడానికి బయలుదేరితే కోపంగా చూసేవారు. ఇంకోవైపు ఫారిన్ టూరిస్ట్‌లకు అడవిలో చెట్ల పేర్లు, పక్షుల పేర్లు, జంతువుల పేర్లు ఇంగ్లిష్‌లో చెప్పాల్సి వచ్చేది. అన్న సాయంతో మీనా ఆ పేర్లన్నీ హిందీ లిపీలో రాసుకుని ఇంగ్లిష్‌ని సాధన చేసి నేర్చుకుంది. చిన్న పెద్ద వాక్యాలు పలకడం తెలుసుకుంది. ఖాళీగా ఉన్నప్పుడు అడవంతా తిరుగుతూ పక్షుల్ని గుర్తించేది. ఆమెకు సరదాగా మాట్లాడటం వచ్చు. టూరిస్ట్‌లను నవ్వించేది. క్రమంగా ఆమె అందరికీ నచ్చింది. పులితో భేటి రణథమ్‌బోర్ రిజర్వ్ ఫారెస్ట్‌లో ఇప్పుడు 80 పులులు ఉన్నాయి. అన్నింటికీ పేర్లు ఉన్నాయి. అన్ని పులులనూ మీనా గుర్తించగలదు. ‘పులి కనిపిస్తే టూరిస్ట్‌లకు దాని పేరు చెప్తాను. అన్ని పులులు ఒక్కలాగే ఉంటాయి. దాని పేరే అదేనని నీకెలా తెలుసు అని చాలామంది టూరిస్ట్‌లు అడుగుతారు. ఏం చెప్పమంటారు’ అంటుంది. ఫారెస్ట్‌కు వైల్డ్‌లైఫ్ ఫొటోగ్రాఫర్లు, బర్డ్ వాచర్స్, ప్రకృతి ప్రేమికులు చాలామంది వస్తుంటారు. మీనా అడవి చూపిస్తుంటుంది. ‘ఒక ఫోటోగ్రాఫర్ పులిని ఫోటో తీస్తూ జిప్సీ నుంచి కింద పడ్డాడు. నేను వెంటనే జిప్సీ దిగి అతనికి, పులికీ మధ్య నిలబడ్డాను. లక్కీగా అది ఏమీ చేయకుండా వెళ్లిపోయింది’ అంది మీనా. కొన్నిసార్లు పులి జిప్సీ బానెట్ మీదకు లంఘిస్తూ ఉంటుంది. కాని ఎప్పుడూ ఎలాంటి అపాయం జరగలేదు. ‘పులి కనిపించకపోతే టూరిస్ట్‌లు విసుక్కుంటారు. పులిని చూపించు అంటారు. అది నేను రమ్మంటే రాదు కదా. అంతగా కచ్చితంగా చూడాలంటే జూకు వెళ్లండి అని చెప్తుంటాను’ అని నవ్వుతుంది మీనా. జీవితం పులిలా వెంటబడితే మనిషికి పులి కంటే ఎక్కువ ధైర్యం వస్తుంది. తన జీవితాన్ని మలుచుకోవడానికి మీనా సివంగిలా మారింది. ఇద్దరు పిల్లలు, భర్తతో ఆమె సంతోషంగా ఉంది. అన్నట్టు బి.ఇడి వరకూ చదివేసింది కూడా. కలవాలంటే ఈ వేసవిలో రణథమ్‌బోర్ ట్రిప్ వేయండి. -
సింహం మృతితో అలర్ట్: ఏనుగులకు కోవిడ్ టెస్ట్
చెన్నె: ఇన్నాళ్లు మనుషులకు మహమ్మారి కరోనా వైరస్ సోకుతుండగా తాజాగా జంతువులకు కూడా ఆ వైరస్ వ్యాపిస్తోంది. జంతువులకు మొట్టమొదటి కేసు తెలంగాణలోని నెహ్రూ జూలాజికల్ పార్కులో వెలుగు చూడగా అనంతరం తమిళనాడులోని వండలూరు జూలో కూడా జంతువులకు కరోనా సోకింది. అయితే ఇక్కడ వైరస్‌తో ఓ సింహ మృతి చెందడం కలకలం రేపింది. ఆ సింహం ద్వారా 9 సింహాలకు వైరస్ పాకింది. ఈ నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ సందర్భంగా ఏనుగులకు కూడా వైరస్ పరీక్షలు చేయాలని నిర్ణయించింది. ఈ సందర్భంగా ముదుమలై టైగర్ రిజర్వ్‌లోని తెప్పకాడు ఏనుగుల శిబిరంలో మంగళవారం 28 ఏనుగులకు కరోనా పరీక్షలు చేశారు. వాటి నుంచి నమూనాలను (శాంపిల్స్) సేకరించారు. ఉత్తరప్రదేశ్‌లోని ఇన్‌జత్‌నగర్‌లో ఉన్న భారత పశుసంవర్ధక పరిశోధనా సంస్థ (ఇండియన్ వెటర్నరీ రీసెర్చ్ సెంటర్)కు నమూనాలు పంపించాలని ఆ రాష్ట్ర అటవీ శాఖ మంత్రి రామచంద్రన్ ఆదేశించారు. ఏనుగుల నుంచి ట్రంప్ వాష్ శాంపిల్, రెక్టల్ స్వాబ్‌ను సేకరించినట్లు వెటర్నరీ సర్జన్ రాజేశ్ కుమార్ తెలిపారు. అయితే ఏనుగులన్నీ ఆరోగ్యంగా ఉన్నాయని, వాటికి వైరస్ లక్షణాలు లేవని మరో అధికారి కేకే కౌశల్ వివరించారు. అయితే ముందు జాగ్రత్త చర్యగా వాటి బాగోగులు చూసుకునే మావటిలు, సహాయ సిబ్బంది మొత్తం 52 మందికి కరోనా వ్యాక్సిన్ వేయించారు. ఏనుగులకు కరోనా సోకే అవకాశం చాలా తక్కువ అని, ఎందుకైనా మంచిదని ముందు జాగ్రత్తగా వాటికి కరోనా పరీక్షలు చేయించినట్లు అధికారులు తెలిపారు. కరోనాతో సింహం మృతి చెందడంతో అప్రమత్తమైన ముఖ్యమంత్రి స్టాలిన్ జూన్ 6వ తేదీన జూపార్క్‌ను సందర్శించి వివరాలు తెలుసుకున్నారు. -
పిలిభిత్ టైగర్ రిజర్వ్‌కు అవార్డు
లక్నో :ఉత్తరప్రదేశ్‌లోని పిలిభిత్ టైగర్ రిజర్వ్(పీటీఆర్)కు మొట్టమొదటి టీఎక్స్2 అవార్డు లభించింది. తక్కువ సమయంలోనే పులుల సంఖ్య రెండింతలు చేసినందుకుగానూ ఈ అవార్డు లభించింది. వివరాల్లోకెళ్తే.. 2010లో పులులను రక్షించేందుకు, వాటి సంఖ్యను పెంచేందుకు రష్యాలోని సెయింట్ పీటర్స్బర్గ్ వేదికగా టీఎక్స్2 గ్లోబల్ అవార్డును ఏర్పాటు చేశారు. ఇందులో టైగర్ రిజర్వ్‌లు ఉన్న 13 దేశాలు పోటీ పడ్డాయి. 2010లో ఉన్న పులుల సంఖ్యను 2022 నాటికి రెండింతలు చేయాలన్నది ఈ అవార్డు అసలు లక్ష్యం. యూపీలోని పీటీఆర్ 2018 నాటికే ఈ ఘనతను సాధించింది. 2014 లెక్కల ప్రకారం పిలిభిత్‌లో 25 పులులున్నాయి. అవి 2018 నాటికి 65కు చేరుకున్నాయి. దీంతో మొదటి గ్లోబల్ అవార్డు భారత్‌ను వరించింది. పులులను జాగ్రత్తగా పర్యవేక్షించడం, దాడులను తగ్గించడం ద్వారా పులుల సంఖ్యను పెంచినట్లు పీటీఆర్ అధికారులు చెప్పారు. -
పులి మనుగడ కోసం గ్రామాల తరలింపు
సాక్షి, కడెం(ఖానాపూర్): పులి మనుగడ కోసం కవ్వాల్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ కోర్ ఏరియాలోని పలు గ్రామాలను తరలించాలని అటవీశాఖ నిర్ణయించింది. మొదటి విడతలో నిర్మల్ జిల్లా కడెం మండలం ఉడుంపూర్ పంచాయతీ పరిధిలోని మైసంపేట్, రాంపూర్ గ్రామాలను పునరావాసం కింద తరలించనున్నారు. అటవీ సంరక్షణకు గ్రామస్తులు సైతం స్వచ్ఛందంగా ముందుకొచ్చారు. కాని సంబంధిత శాఖ అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేసి ఏళ్లు గడుస్తున్నా.. ఇప్పటికీ పునరావాసం ఏర్పాటు పనులు పారంభించలేదు. ప్రస్తుతం ఉన్న చోట కనీస సౌకర్యాల్లేవని.. తమను పునరావాసానికి ఎప్పుడూ తరలిస్తారని రాంపూర్, మైసంపేట్ గ్రామాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రారంభం కాని పనులు.. రాంపూర్, మైసంపేట్ గ్రామాల ప్రజలకు ఇదే మండలంలోని కొత్త మద్దిపడగ సమీపంలో విద్య, వైద్యం, విద్యుత్, తదితర సౌకర్యాలతో డబుల్బెడ్రూం ఇళ్లను కట్టించనున్నారు. మరోవైపు మండలంలోని నచ్చన్ఎల్లాపూర్ పంచాయతీ పరిధిలోని పెత్తర్పు సమీపంలో లబ్ధిదారులకు వ్యవసాయ భూమిని కేటాయించనున్నారు. గతేడాది జులై 12న ఆయా శాఖల అధికారులు ఈ ప్రాంతాన్ని సందర్శించి పునరావాసానికి అనువైనదిగా తేల్చారు. ఉన్నచోట మౌలిక సౌకర్యాల్లేవు.. పునరావాసం కోసం ఎదురు చూస్తున్నామని.. మరోవైపు ప్రస్తుతం ఉన్న చోట కనీస సౌకర్యాల్లేక ఇబ్బందులు పడుతున్నామని ఆయా గ్రామాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ గోడును నాయకులు, అధికారులు పట్టించుకోవడం లేదని వాపోతున్నారు.రాంపూర్ గ్రామంలో సొలార్ సిస్టం పని చేయక గ్రామస్తులు అంధకారంలో ఉంటున్నారు. ప్రస్తుతం వీరు ఉంటున్న గ్రామాల్లో ఉపాధి అవకాశాల్లేవు. కొందరు ఇతర ప్రాంతాలకు వలస వెళ్లగా.. మరికొందరు గ్రామంలోనే కుటుంబపోషణకు తడకలు అల్లుతారు. వ్యవసాయ భూములున్నా.. సాగునీటికి ఇబ్బందులు. దట్టమైన అటవీ ప్రాంతంలో ఉన్న గ్రామానికి కనీసం రోడ్డు సౌకర్యం లేనందున ఏళ్లుగా ఇబ్బందులు తప్పడం లేదు. దీంతో పునరావాసం కింద వెళ్లేందుకు గ్రామస్తులు స్వచ్ఛందంగా ముందుకొచ్చారు. ఇబ్బంది పడుతున్నం మా గ్రామాలను పునరావాసం కింద మరోచోటకు తరలిస్తామని అధికారులు తెలిపారు. అధికారులు సమావేశాలు నిర్వహిస్తూ వెళ్తున్నారు తప్ప పునరావాసం కల్పించడం లేదు. ప్రస్తుతం ఉన్న చోటును పట్టించుకోకపోవడంతో తీవ్ర ఇబ్బంది పడుతున్నం. ప్రభుత్వం పునరావాసం కల్పిస్తే మా ఇబ్బందులు తొలగిపోతాయి. – పెంద్రం లచ్చుపటేల్, మైసంపేట్ ఇంకెప్పుడు తరలిస్తారు? మా గ్రామాలను పునరావాసం కింద ఇంకెప్పుడు తరలిస్తారో అధికారులు స్పష్టతనివ్వాలి. జాప్యం చేస్తే అడవులను నరికి పొడు వ్యవసాయం చేసుకుంటాం. మా కష్టాలు ఎవరికి కనిపించడం లేదు. త్వరగా పనులు పూర్తి చేసి.. పునరావాసం కల్పించాలి. – దేవ్‌రావు, మైసంపేట్ రాష్ట్రం నుంచి నిధులు రాకనే.. టైగర్‌జోన్ పరిధిలోని రాంపూర్, మైసంపేట్ గ్రామాలను తరలించేందుకు గతంలోనే ప్రతిపాదనలు సిద్దం చేశాం. కేంద్రం నిధులు విడుదలైనా.. రాష్ట్రానికి సంబంధించిన నిధులు విడుదలలో జాప్యం నెలకొంది. పునరవాసానికి రాష్ట్రం నిధులు విడుదలవగానే పనులు ప్రారంభిస్తాం. – సుతన్, డీఎఫ్‌వో నిర్మల్ -
పులులు సంరక్షణ ఇలాగేనా!
మనుషుల ప్రాణాలకే విలువ లేకుండా పోతున్న వర్తమానంలో మహారాష్ట్రలోని యావత్మాల్ జిల్లా బోరాతి గ్రామంలో శుక్రవారం రాత్రి పులిని కాల్చిచంపిన ఉదంతం చుట్టూ అల్లుకుంటున్న వివాదం కొందరికి ఆశ్చర్యంగానే అనిపిస్తుంది. దీనిపై కేంద్ర శిశు, సంక్షేమ శాఖల మంత్రి మేన కాగాంధీ తీవ్రంగా స్పందించారు. మహారాష్ట్ర పర్యావరణ, అటవీ శాఖల మంత్రి సుధీర్ ముంగం టివార్ను లక్ష్యంగా చేసుకుని ఆమె వరస ట్వీట్లు హోరెత్తించారు. ‘అవని’ పేరుతో ఉన్న ఆ ఆడ పులిని ‘ఘోరంగా హత్య చేసిన తీరు’పై తాను చట్టపరంగా, రాజకీయపరంగా చర్యలు తీసుకుంటా నన్నారు. పులిని సంహరించిన నవాబ్ అస్ఘర్ అలీ ఖాన్ హైదరాబాద్‌కు చెందినవారు. తమ తొలి ప్రాధాన్యం సమస్యాత్మకంగా మారిన వన్య మృగాలను మత్తుమందు ప్రయోగించి పట్టుకోవడ మేనని అస్ఘర్ చెబుతుండగా...‘అవని’ని చంపమని మంత్రి నేరుగా ఆదేశాలిచ్చారన్నది మేనక అభి యోగం. పులిని మట్టుబెట్టడంలోని ఉచితానుచితాల సంగతలా ఉంచి ఈ ఉదంతంపై స్పందిం చాల్సిన కేంద్ర అటవీ, పర్యావరణ శాఖల మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ ఇంతవరకూ మౌనంగా ఉండి పోయారు. కేంద్ర శిశు, సంక్షేమ శాఖల మంత్రి మేనకాగాంధీ మూగజీవాలు, వన్యప్రాణుల సంర క్షణ రంగంలో దశాబ్దాలుగా పనిచేస్తున్నందువల్ల కావొచ్చు... గట్టిగానే స్పందించారు. పైగా మహారాష్ట్రలో ఉన్నది తమ పార్టీ ప్రభుత్వమేనన్న సంగతి కూడా ఆమె మరచినట్టున్నారు. అక్కడ వేరే పార్టీ ప్రభుత్వం ఉంటే ఈపాటికే దీనిపై ఎంతో రచ్చ అయ్యేది. ముంగంటివార్ చాలా జాగ్ర త్తగా జవాబిచ్చారు.‘మేనక హృదయంలో జంతువులపట్ల ఉన్న చాలా ప్రేమ ఉన్నదని అందరికీ తెలుసు. కానీ దాంతోపాటు ఆమెకు మనుషులపట్ల కూడా అంతే ప్రేమ ఉందని నేను భావి స్తున్నాను’ అంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. రెండునెలలక్రితం సుప్రీంకోర్టు ముందుకు ‘అవని’ గురించి వ్యాజ్యం వచ్చినప్పుడు దాన్ని మత్తుమందిచ్చి పట్టుకోవాలని, తప్పనిసరి పరి స్థితుల్లో కాల్చి చంపవచ్చునని ధర్మాసనం తెలిపింది. యావత్మాల్ ఉదంతం జరిగిన రెండు రోజులకు ఉత్తరప్రదేశ్‌లోని ఫిలిబిత్ జిల్లాలో ఉన్న దూధ్వా టైగర్ రిజర్వ్‌లో మరో పులిని గ్రామ స్తులు చంపేశారు. ఒక గ్రామస్తుణ్ణి అది హతమార్చాక వారి ఆగ్రహం కట్టలు తెంచుకుందని అంటు న్నారు. గుజరాత్‌లోని సెక్రటేరియట్‌లోకి ప్రవేశించిన మరో పులిని సోమవారం అటవీ సిబ్బంది మత్తుమందిచ్చి అదుపులోకి తీసుకోగలిగారు. పర్యావరణ సమతుల్యతను కాపాడటంలో జీవ వైవిధ్యత పరిరక్షణ కీలకమని, అందుకోసం పులుల్ని సంరక్షించడం అవసరమని కేంద్రం గుర్తించాక 18 రాష్ట్రాల్లో 50 టైగర్ రిజర్వ్ల్ని ఏర్పాటు చేశారు. ఇవి మొత్తం 89,164 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో వ్యాపించి ఉన్నాయి. అందుకోసం జనావాసాలను తరలించడానికి ప్రయత్నించినప్పుడు ఆదివాసీల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదు రైంది. తెలంగాణలో ఆమ్రాబాద్, కవ్వాల్ ప్రాంతాల్లోనూ, ఆంధ్రప్రదేశ్‌లో శ్రీశైలం అడవుల్లోనూ ఈ టైగర్ రిజర్వ్‌లున్నాయి. వన్యప్రాణులు ఈ రిజర్వ్‌ల పరిధిలోనే ఉంటాయని చెప్పలేం. 30 శాతం పులులు ఆ పరిధి దాటి సంచరిస్తుంటాయని ఒక అంచనా. టైగర్ రిజర్వ్‌లు ఏర్పాటుచేసి నప్పుడు అక్కడుండే పులుల సంఖ్య పెరిగేకొద్దీ వాటన్నిటికీ అవసరమైన స్థాయిలో ఆహారం లభ్య మవుతున్నదా అన్నది తరచు సమీక్షించి లోటుపాట్లు పూడ్చాలి. లేనట్టయితే అందుకోసం సహజం గానే అవి బయటకొస్తాయి. మన దేశంలో పులుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. కనుక మున్ముందు పరిస్థితి మరింత వికటిస్తుంది. నాలుగేళ్లకోసారి జరిగే పులుల గణన ప్రక్రియ ఈ ఏడాది మొదట్లో ప్రారంభమైంది. 2014 గణాంకాల ప్రకారం దేశంలో వాటి సంఖ్య 2,226. ప్రస్తుత లెక్కింపు ప్రక్రియ ఫలితాలను వచ్చే ఏడాది మార్చికల్లా ప్రకటిస్తారు. టైగర్ రిజర్వ్‌ల సమీప ప్రాంతాల్లో ఆదివాసీల బతుకులు అత్యంత దుర్భరం. సాగుచేసుకునేం దుకు వారి సెంటు భూమి కూడా ఉండదు. ఆదివాసీ కుటుంబాల సగటు వార్షిక ఆదాయం రూ. 15,000 కూడా మించదని ఒక అంచనా. జీవిక కోసం వారు తప్పనిసరిగా అటవీ ఉత్పత్తుల సేకరణపై ఆధారపడాలి. ఈ పరిస్థితుల్లో మనిషి–మృగం ఘర్షణ తప్పడం లేదు. పులుల్ని సజీ వంగా బంధించడం ఆషామాషీ కాదు. వాటిని పట్టుకోవడానికి చేసే ప్రయత్నాలు విఫలమైనకొద్దీ అవి అనుభవం గడించి మరింత అప్రమత్తంగా మారతాయని, పర్యవసానంగా సమయం గడి చేకొద్దీ వాటిని బంధించడం అసాధ్యమవుతుందని వన్యప్రాణి సంరక్షకులు చెబుతారు. ఇప్పుడు యావత్మాల్ జిల్లాలో మట్టుబెట్టిన పులిని గత రెండేళ్లుగా బంధించడానికి ప్రయత్నిస్తున్నారు. అయినా విజయం సాధించలేకపోయారు. కనుకనే చివరికిలా పరిణమించిందని అంటున్నారు. పులులు, సింహాలు, జింకలు, ఏనుగులు తదితరాలను వన్యప్రాణులంటున్నామంటేనే అవి అర ణ్యాల్లోని జంతువులని అర్ధమవుతుంది. టైగర్ రిజర్వ్‌ల పేరుచెప్పి జనావాసాలను ఖాళీ చేయిస్తున్న ప్రభుత్వాలు ఆ రిజర్వ్‌ల సమీపంలోనే అభివృద్ధి పేరిట పలు ప్రాజెక్టులకు గ్రీన్‌సిగ్నల్ ఇస్తున్నాయి. మధ్యప్రదేశ్‌లోని కన్హా, పెంచ్ రిజర్వ్‌ల కారిడార్‌లో జాతీయ రహదార్లు, రైల్వే లైన్ల నిర్మాణానికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. అలాగే మహారాష్ట్రలోని మేల్ఘాట్ టైగర్ రిజర్వ్ ప్రాంతం నుంచే రైల్వే లైన్ల నిర్మాణానికి సన్నాహాలు చేస్తున్నారు. మధ్యప్రదేశ్‌లో కెన్–బెత్వా నదుల్ని అనుసంధా నించే వివాదాస్పద ప్రాజెక్టు పూర్తయితే పన్నా టైగర్ రిజర్వ్ ప్రాంతంలోని 100 చదరపు కిలోమీటర్ల ప్రాంతం మునిగిపోతుందని, అక్కడి వన్యప్రాణులకు మంచినీరు కూడా దొరకదని అంచనా. అటవీ సంపద చట్టవిరుద్ధంగా తరలిపోతున్నా పట్టించుకోకపోవడం దీనికి అదనం. కనుకనే ఆ జంతువులు జనావాసాల్లోకొచ్చి మనుషుల ప్రాణాలకు ముప్పుగా పరిణమిస్తున్నాయి. తాజా ఉదంతాల నేపథ్యంలోనైనా ప్రభుత్వాలు పులులు సంరక్షణ విధానాన్ని సమీక్షించుకుని సవరించు కోవాలి. తమ చర్యల పర్యవసానాలులెలా ఉంటున్నాయో గుర్తించాలి. -
పులిని ట్రాక్టర్‌తో తొక్కించి చంపేశారు
లఖిమ్‌పూర్‌ఖేరీ: ఓ వ్యక్తిపై ఆడపులి దాడిచేయడంతో రెచ్చిపోయిన గ్రామస్తులు ఆ క్రూర జంతువును ట్రాక్టర్‌తో తొక్కించి హతమార్చారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని దుధ్వా టైగర్ రిజర్వు ప్రాంతంలో ఆదివారం చోటుచేసుకుంది. లఖిమ్‌పూర్‌ఖేరీ జిల్లాలోని చైతువా గ్రామానికి చెందిన దేవానంద్(50) ఆడపులి దాడిలో తీవ్రంగా గాయపడ్డాడు. గ్రామస్తులు అతడిని జిల్లా ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. ఇది జంతువు దాడేనని ధ్రువీకరించుకున్న గ్రామస్తులు ఆగ్రహంతో ఊగిపోయారు. అటవీప్రాంతంలో ఆడపులిని చుట్టుముట్టి కిరాతకంగా ట్రాక్టర్‌తో తొక్కించి చంపారు. మరోవైపు ఈ ఘటనపై స్పందించిన అటవీశాఖ అధికారులు.. పులి మృత కళేబరాన్ని స్వాధీనం చేసుకున్నామనీ, నిందితులపై ఎఫ్ఐఆర్ దాఖలు చేశామని తెలిపారు. దోషులను కఠినంగా శిక్షిస్తామని చెప్పారు. -
రిజర్వ్ ఫారెస్ట్‌లో ప్లాస్టిక్ నిషేధం
సాక్షి, మన్ననూర్ (అచ్చంపేట) : అమ్రాబాద్ పులుల రక్షిత ప్రాంతం (కోర్ ఏరియా)లో ప్లాస్టిక్‌ను పూర్తిగా నిషేధిస్తున్నామని వాటి స్థానంలో పేపర్, బట్ట సంచులను అందుబాటులో ఉంచుతున్నట్లు ఫీల్డ్ డైరెక్టర్ వినోద్ కుమార్ తెలిపారు. మంగళవారం అటవీశాఖ ఈసీ సెంటర్ వద్ద డబ్లూడబ్ల్యూఎఫ్ ఆధ్వర్యంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఆయన మాట్లాడారు. మానవ మనుగడతో పాటు జీవరాశులకు ముప్పు కలిగించే ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. వన్యప్రాణులకు అమ్రాబాద్ అభయారణ్యం దేశంలోనే అత్యంత ప్రాధాన్యత కలిగి ఉండటం గర్వకారణమని అన్నారు. ఈ క్రమంలో పర్యాటకులు, అటవీ సమీప గ్రామాల ప్రజలు ప్లాస్టిక్‌ను ఉపయోగించడం, పారబోయడంతో వాటిని తింటున్న వన్యప్రాణులు మృత్యవాతపడుతున్నాయని అన్నారు. డబ్ల్యూడబ్ల్యూఎఫ్ డైరెక్టర్ ఫరీదా టంపల్ మాట్లాడుతూ శ్రీశైలం – హైదరాబాద్ ప్రధాన రహదారి వెంట అటవీ ప్రాంతంలో ప్లాస్టిక్‌ను పూర్తిగా నిషేధించి వన్యప్రాణులను కాపాడాలన్నారు. ఈ ప్రాంతంలో పేవర్ కవర్ల తయారీ కోసం కుటీర పరిశ్రమను మరో నెల రోజుల్లో ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. పేపర్ కవర్ల తయారీ కోసం చెంచు మహిళలకు శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పిస్తామన్నారు. అడవులను, జంతుజాలాన్ని రక్షించుకోవాలని కళాకారుల ఇచ్చిన ప్రదర్శన, ఆట పాటలు ఆకట్టుకున్నాయి. యాత్రికులకు పేపర్ కవర్లు అందజేత అటవీశాఖ చెక్‌పోస్టు వద్ద డబ్ల్యూడబ్ల్యూఎఫ్, శ్రీనివాస ఛారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో శ్రీశైలం వెళ్లే యాత్రికులకు పేపర్ కవర్లు అందజేశారు. టోల్గేట్ రూ.20లకు అదనంగా రూ.5 వసూలు చేసి కవర్ అందిస్తున్నారు. దీంతోపాటు మరో రూ.25 అదనంగా వసూలు చేస్తున్నారు. మన్ననూర్ నుంచి దోమలపెంట వరకు ఎలాంటి చెత్త, వ్యర్థాలు ఉన్నా రోడ్డు పక్కన వేయకూడదు. కవర్లో వేసి దోమలపెంట చెక్‌పోస్టు వద్ద అటవీశాఖ సిబ్బందికి కవర్ అందించాలి. వారు రూ.25 తిరిగి ఇస్తారని అధికారులు తెలిపారు. విద్యార్థులకు వ్యాసరచన పోటీలు పర్యావరణ రోజు సందర్భంగా అమ్రాబాద్, మన్ననూర్ రేంజ్ పరిధిలోని ఆయా పాఠశాలల విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించారు. ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో శ్రీనివాస ఛారిటబుల్ ట్రస్టు డైరెక్టర్ శ్రీనివాస్, డీఎఫ్ఓ జోజీ,ఎఫ్ఆర్ఓలు ప్రభాకర్, శ్రీదేవి ఎఫ్ఎస్ఓ రామాంజనేయులు సిబ్బంది బాబలి, వెంకటేశ్వర్లు, కనకయ్య, కళాకారులు మాడ్గుల నర్సింహ, లింగస్వామి, బీముడు, ఆయా చెంచుపెంటల మహిళలు పాల్గొన్నారు. -
వన్యప్రాణి సంరక్షణకు కృషి
- డబ్ల్యుడబ్ల్యుఎఫ్ చైర్మన్ అనిల్‌కుమార్ శ్రీశైలంప్రాజెక్టు: నాగార్జునసాగర్– శ్రీశైలం టైగర్ రిజర్వు పరిధిలో వన్యప్రాణుల సంరక్షణకు డబ్ల్యుడబ్ల్యుఎఫ్( వరల్డ్ వైడ్ ఫండ్) కృషి చేస్తోందని ఆసంస్థ చైర్మన్ అనిల్‌కుమార్ తెలిపారు. శనివారం ప్రకాశం జిల్లా తుంగుడు బావి ప్రాంతంలో సోలార్ పంప్‌సెట్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..నూతన సాంకేతిక పరిజ్ఞానంతో డెన్మార్క్ దేశం నుంచి దిగుమతి చేసుకున్న ప్రత్యేక సోలార్ పంప్ సెట్లను నాగార్జునసాగర్ – శ్రీశైలం టైగర్ రిజర్వులోని(ఎన్ఎస్జిఆర్) దట్టమైన అటవీ ప్రాంతాలలో ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఇప్పటికే ఎన్ఎస్జిఆర్లో 20 సోలార్ పంప్సెట్లను ఏర్పాటు చేశామన్నారు. గిరిజన గూడాల్లో నివసిస్తున్న చెంచులకు కూడా మంచినీటిని అందిస్తున్నామని పేర్కొన్నారు. వ్యక్తులతో ప్రమేయం లేకుండా పనిచేసే యంత్రాలను బిగిస్తూ ఆయా ప్రాంతాలలో నీటిని సమృద్ధిగా అందజేసేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు. అటవీశాఖ అధికారుల సమన్వయంతో డబ్ల్యుడబ్ల్యుఎఫ్ పనిచేస్తోందన్నారు. శుక్రవారం గుంటూరు జిల్లా సిరిగిరిపాడులో సోలార్ పంప్‌సెట్ ఏర్పాటు చేశామని, ఆదివారం కర్నూలు జిల్లా రేగిమానుకుంటలో కూడా ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. ఒక్కొక్క యూనిట్ ఏర్పాటుకు సుమారు రూ. 7.5లక్షల ఖర్చు అవుతుండగా, డబ్ల్యుడబ్ల్యుఎఫ్ 50శాతం, అటవీశాఖ 50 శాతం భరిస్తోందన్నారు . గిరిజనుల విద్య, వైద్యానికి కూడా సహకారం అందిస్తున్నట్లు తెలిపారు. అటవీ పరిధిలోని 65 బేస్ క్యాంప్‌ల్లో స్వచ్ఛమైన నీటిని అందించడం కోసం ఆధునిక వాటర్ ఫిల్టర్లను ఏర్పాటు చేసినట్లు వివరించారు. వైల్డ్ లైఫ్ పీసీసీ ఎఫ్ కె ఎస్ రెడ్డి, ఎన్ఎస్టిఆర్ ఏపీ ఫీల్డ్ డైరెక్టర్ ఎస్ శరవణన్, , శ్రీనివాస హ్యాచరిస్ సురేష్ రాయుడు చిత్తూరి, డాక్టర్ రెడ్డిస్ ల్యాబ్ జివి ప్రసాద్, ఫార్గింగ్స్ ఆర్ ఎస్ రెడ్డి రాచమల్లు, గాటి ట్రాన్స్‌పోర్టు లిమిటెడ్ మహేంద్ర అగర్వాల్, మీరా అండ్ సీకో పంప్స్ మహేష్దేశాయ్, ఫస్ట్ అమెరికన్ ప్రైవేట్ లిమిటెడ్ భారత దేశ ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్ పి రాఘవచార్యులు తదితరులు పాల్గొన్నారు.