పల్నాడు,సాక్షి: మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చి.. రాష్ట్రంలో అన్నీ దారుణాలకు తెగబడుతున్నారని వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. వినుకొండలో టీడీపీ గుండా చేతిలో రెండ్రోజుల కిందట అతికిరాతకంగా హత్యకు గురైన వైఎస్సార్‌సీపీ యువ కార్యకర్త రషీద్ కుటుంబాన్ని ఆయన పరామర్శించారు.
జగన్‌ను చూడగానే రషీద్ తల్లిదండ్రులు, బంధువులు భావోద్వేగానికిలోనూ కంటతడి పెట్టారు. వారిని ఓదార్చిన ఆయన.. ఘటన జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. చంపేసేంత కక్షలు లేవు.. ఎందుకిలా జరిగింది? అని ఆరా తీశారాయన. అయితే అవి పాత కక్షలు కావని, రాజకీయ కక్షలే అని రషీద్ తల్లి జగన్‌కు వివరించారు.
వైఎస్సార్‌సీపీ కోసమే రషీద్ తాపత్రయపడ్డాడు. రాజకీయ కక్షతోనే మా కొడుకును బలి తీసుకున్నారు. ఇప్పుడు మమ్మల్ని బెదిరిస్తున్నారు. నిందితుడు జిలానీకి టీడీపీతో సంబంధాలు ఉన్నాయి. ఎఫ్‌ఐఆర్‌లో ప్రధాన నిందితుల పేర్లు చేర్చలేదు. ఆయుధం సరఫరా చేసిన వ్యక్తి పేరు చెప్పినా పోలీసులు పట్టించుకోవడం లేదు. నిందితుడు జిలానీ వెనుక టీడీపీ వాళ్లు ఉన్నారు. జిలానీ కాల్ డేటా తీస్తే హత్య వెనుక ఎవరున్నది తెలిసిపోతుంది. నా కొడుకును చంపిన వాళ్లను రోడ్డుపైనే ఉరి తీయాలి అని రషీద్ తల్లిదండ్రులు కోరారు.
ఆ సమయంలో టీడీపీ నేతలతో జిలానీ ఉన్న ఫొటోలను జగన్‌కు రషీద్ కుటుంబ సభ్యులు చూపించారు. ‘‘హత్య వెనుక ఎవరున్నా వదలం. మీ కుటుంబానికి అండగా ఉంటాం’’ అని రషీద్ కుటుంబ సభ్యులకు జగన్ ధైర్యం చెప్పారు. ‘కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అన్నీ దారుణాలే. కాపాడాల్సిన పోలీసులే నిందితులకు వత్తాసు పలుకుతున్నారు. మోసపు మాటలతో అధికారంలోకి వచ్చారు. ఇచ్చిన ఏ హామీని నెరవేర్చడం లేదు’ అని అన్నారాయన. అలాగే.. రషీద్ కుటుంబానికి అండగా ఉంటామని జగన్ హామీ ఇచ్చారు.
ఆ టైంలోనూ ఆ కుటుంబ సభ్యుల్ని ఆయన ఓదార్చారు. అంతకు ముందు రషీద్ చిత్రపటానికి ఆయన నివాళులర్పించారు. ఈ పరామర్శలో జగన్ వెంట పలువురు కీలక నేతలు కూడా ఉన్నారు.
అడుగడుగునా ఆంక్షలు.. ఆటంకాలు
పోలీసుల ఆంక్షలు.. అడుగడుగునా వాళ్లు కల్పించిన ఆంటకాలతో వైఎస్ జగన్ వినుకొండ పర్యటన కొనసాగింది. దారి మధ్యలో ఆయన వెంట పార్టీ నేతలు రాకూడదంటూ పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. 15 చోట్ల ఆయన వాహనాన్ని అడ్డుకున్నారు. దీంతో ఆయన పర్యటన ఆలస్యంగా కొనసాగింది. అయినప్పటికీ ఆయన ఓపికగా ముందుకు సాగారు.
దారివెంట అభిమాన గణం
జగన్ పర్యటనకు పోలీసులు ఆంక్షలు విధించినా.. అభిమానులు మాత్రం పోటెత్తారు. దారి పొడవునా జై జగన్ అంటూ నీరాజనాలు పట్టారు. వినుకొండలో ఆయన కాన్వాయ్ నెమ్మదిగా ముందుకు వెళ్లింది. అయితే పరామర్శ కార్యక్రమానికి వెళ్తున్నప్పటికీ.. అంత పెద్ద ఎత్తున వచ్చిన పార్టీ కేడర్‌ను నిరుత్సాహపర్చడం ఇష్టం లేని వైఎస్ జగన్.. బయటికి వచ్చి అభివాదం చేశారు.
జగన్ భద్రతపై నిర్లక్ష్యం
మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి భద్రతపై చంద్రబాబు సర్కార్ తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరించింది. వినుకొండ పర్యటన నేపథ్యంలో అర్ధరాత్రి నుంచే వైఎస్ జగన్‌కు భద్రతను తగ్గించిన ప్రభుత్వం.. ఆయనకు పాత బుల్లెట్ ఫ్రూఫ్ వాహనాన్ని కేటాయించింది. రిపేర్‌లో ఉన్న బుల్లెట్ ఫ్రూఫ్ వాహనం ఇవ్వడంతో మార్గంలో పలుమార్లు వాహనం మొరాయించింది. దీంతో మధ్యలోనే బుల్లెట్ ఫ్రూప్ వాహనం నుంచి దిగిన వైఎస్ జగన్.. మరో వాహనంలో వినుకొండ చేరుకున్నారు. అయితే చంద్రబాబు ప్రభుత్వం మాత్రం ఆ వాహనం కండిషన్‌లో ఉందని చెప్పడం కొసమెరుపు.
Comments
Please login to add a commentAdd a comment