ఔటర్ చుట్టూ జలహారం
⇒ఘన్‌పూర్ నుంచి ముత్తంగి వరకు భారీ రింగ్‌మెయిన్ పైప్‌లైన్
⇒హైటెక్‌సిటీ సహా 4 మున్సిపల్ సర్కిళ్లకు తీరనున్న దాహార్తి
⇒60 గ్రామాలకు లబ్ది
⇒వ్యయం రూ.398 కోట్లు.. మార్గం 48 కి.మీ
సిటీబ్యూరో: గ్రేటర్‌కు మణిహారంలా ఉన్న ఔటర్‌రింగ్ రోడ్డు(ఓఆర్‌ఆర్) చుట్టూ జలహారం ఏర్పాటు చేసేందుకు రంగం సిద్ధమైంది. నగరానికి సింగూరు, మంజీరా జలాశయాల నుంచి సరఫరా నిలిచిపోవడంతో ఈ భారీ రింగ్‌మెయిన్ పైప్‌లైన్ పనులకు జలమండలి త్వరలో శ్రీకారం చుట్టనుంది. ఈ భారీ పైప్‌లైన్ ఏర్పాటుతో పటాన్‌చెరు, ఆర్‌సీ పురం, శేరిలింగంపల్లి, కుత్బుల్లాపూర్ మున్సిపల్ సర్కిళ్లతో పాటు ఔటర్‌కు ఆనుకొని ఉన్న 60 గ్రామాల దాహార్తి సమూలంగా తీరనుంది.సుమారు రూ.398 కోట్ల అంచనా వ్యయంతో 48 కి.మీ మార్గంలో 1800 డయా వ్యాసార్థం గల భారీ మైల్డ్ స్టీల్ పైప్‌లైన్ ఏర్పాటు చేసి గోదావరి జలాలను నగరానికి సరఫరా చేయనున్నారు.
జలహారం ఏర్పాటు ఇలా..
మంచిర్యాల జిల్లా ఎల్లంపల్లి నుంచి 186 కి.మీ దూరంలో ఉన్న నగరానికి జలమండలి నిత్యం 108 మిలియన్ గ్యాలన్ల గోదావరి జలాలను తరలిస్తున్న విషయం విదితమే. నగర శివార్లలోని ఘన్‌పూర్ రిజర్వాయర్‌కు ఈ నీటిని తరలించి, అక్కడి నుంచి రింగ్‌మెయిన్ పైప్‌లైన్ల ద్వారా నగరం నలుమూలలకు సరఫరా చేస్తున్నారు. ఇదే క్రమంలో తాజాగా ఘన్‌పూర్ నుంచి మంజీరా, సింగూరు సరఫరా వ్యవస్థలున్న ముత్తంగి (ఓఆర్‌ఆర్ జంక్షన్) వరకు భారీ రింగ్‌మెయిన్ పైప్‌లైన్‌ను ఓఆర్‌ఆర్‌కు ఆనుకొని సుమారు 48 కి.మీ మార్గంలో ఏర్పాటు చేయనున్నారు. కాగా ఇప్పటికే ఘన్‌పూర్ రిజర్వాయర్ నుంచి రెండు రింగ్‌మెయిన్ పైప్‌లైన్లు అందుబాటులో ఉన్న విషయం తెలిసిందే. ఇందులో ఒక రింగ్‌మెయిన్ కాప్రా, అల్వాల్, సైనిక్‌పురి ప్రాంతాలకు గోదావరి జలాలను సరఫరా చేస్తోంది. మరొకటి లింగంపల్లి, కుత్బుల్లాపూర్, కూకట్‌పల్లి, శేరిలింగంపల్లి ప్రాంతాల దాహార్తి తీరుస్తోంది. తాజాగా ఏర్పాటు చేయనున్న దానితో రింగ్‌మెయిన్ పైప్‌లైన్ల సంఖ్య మూడుకు చేరుకుంటుంది. దీంతో గ్రేటర్ చుట్టూ వాటర్‌గ్రిడ్ ఏర్పాటు చేసినట్లైందని నిపుణులు పేర్కొంటున్నారు. ఈ పైప్‌లైన్ల ఏర్పాటుతో కొరత ఉన్న ప్రాంతాలకు ఎక్కడి నుంచి అయినా నీటిని సరఫరా చేసే అవకాశం ఉండడం విశేషం.
గంగా.. దాహార్తి తీర్చంగా
ఈ భారీ రింగ్‌మెయిన్ పైప్‌లైన్ ద్వారా పటాన్‌చెరు, రామచంద్రాపురం, శేరిలింగంపల్లి, కుత్బుల్లాపూర్ మున్సిపల్ సర్కిళ్లు, జీహెచ్‌ఎంసీకి ఆవల, ఔటర్‌కు వెలుపలున్న సుమారు 60 గ్రామాల దాహార్తి సమూలంగా తీరనుంది. సమీప భవిష్యత్‌లో ఈ పైప్‌లైన్‌కు అనుసంధానంగా రేడియల్ మెయిన్ పైప్‌లైన్ల ఏర్పాటు చేసి ఓఆర్‌ఆర్ లోపలున్న సుమారు 200 గ్రామాల దాహార్తిని దశల వారీగా తీర్చే అవకాశం ఉందని జలమండలి వర్గాలు ‘సాక్షి’కి తెలిపాయి.
త్వరలో టెండర్లు...
ఈ పైప్‌లైన్ పనులకు ప్రభుత్వం ఇటీవలే పరిపాలన పరమైన అనుమతులు జారీ చేసింది. సుమారు రూ.398 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న ఈ పనులకు ప్రభుత్వం తాజా వార్షిక బడ్జెట్‌లో రూ.198 కోట్లు కేటాయించింది. మరో రూ.200 కోట్ల నిధులను హడ్కో రుణం నుంచి కేటాయించనున్నారు. ఈ నెలాఖరులోగా టెండర్లు ఖరారు చేసి నాలుగు నెలల్లో పనులు పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు బోర్డు వర్గాలు పేర్కొన్నాయి.