సాక్షి, సిటీబ్యూరో :
కంచే చేను మేయడమంటే ఏంటో జలమండలి ఎయిర్ వాల్వ్‌ల విషయంలో మరోసారి రుజువైంది. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా ఐదేళ్లుగా కృష్ణా మొదటి, రెండవ దశ పైప్‌లైన్లపై నాసిరకం వాల్వ్‌లు ఏర్పాటు చేయడం వల్ల రూ.50 కోట్లు నీళ్ల పాలయ్యాయి. ఈ నిర్వాకంలో కొందరు బోర్డు అధికారులే సూత్రధారులవడం సంచలనం సృష్టిస్తోంది. ఐదేళ్లపాటు నిర్విరామంగా పనిచేయాల్సిన వాల్వ్‌లు మూడేళ్లకే చిల్లులు పడి ముక్కలవుతున్నాయి. దీంతో వాటి స్థానే నాణ్యతగల వాల్వ్‌లు ఏర్పాటు చేయడం జలమండలికి అదనపు భారంగా పరిణమిస్తోంది. అయినప్పటికీ ఈ నాసిరకం సరుకు సరఫరా చేసిన ఓ బడా కంపెనీపై కొందరు జలమండలి అధికారులకు ప్రేమ తగ్గడం లేదు. తాజాగా కృష్ణా మూడోదశ పైప్‌లైన్‌లపై వాల్వ్‌లు ఏర్పాటు చేసేందుకు అదే సంస్థకు రూ.28 కోట్ల మేర ఆర్డరు ఇచ్చినట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఇప్పటికే రూకల్లోతు కష్టాల్లో ఉన్న జలమండలికి నాసిరకం వాల్వులతో పలు ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
నల్లగొండ జిల్లా కోదండాపూర్ నుంచి నగర శివార్లలోని సాహెబ్‌నగర్ వరకు 110 కిలోమీటర్ల మేర కృష్ణా మొదటి, రెండవ దశల పైప్‌లైన్ ఉంది. మరోవైపు నగరం నలుమూలలా మంచినీటి సరఫరాకు మరో వంద కిలోమీటర్ల మేర పైప్‌లైన్లున్నాయి. వీటిపై 2010లో సుమారు 600 ఎం.ఎం. సామర్థ్యం గల బటర్‌ఫ్లై, నాన్ రిటర్న్ వాల్వ్‌లు 300, 2000 ఎం.ఎం. సామర్థ్యం గల వాల్వ్‌లు 35 వరకు ఏర్పాటు చేశారు. వీటి ధర సామర్థ్యాన్ని బట్టి ఒక్కొక్కటి రూ.7 నుంచి రూ.20 లక్షల వరకు ఉంటుంది. ఇవన్నీ పుణేకు చెందిన ఓ బడా కంపెనీ సరఫరా చేసినవి కావడం గమనార్హం. వీటి ఏర్పాటుకు జలమండలి ఇప్పటివరకు రూ.50 కోట్లు వ్యయం చేసింది. ఇవి ఐదేళ్లపాటు నిర్విరామంగా పనిచేయాల్సి ఉంది. విద్యుత్ సరఫరాలో అంతరాయం తలెత్తినపుడు పైప్‌లైన్లలో ఏర్పడే అత్యధిక పీడనం, గాలి ఒత్తిడిని బయటికి పంపి పైప్‌లైన్‌ను రక్షించి నీటిసరఫరాకు ఆటంకం లేకుండా చేయడం వీటి విధి. అయితే ఇపుడు వీటి పనితీరే ప్రశ్నార్థకంగా మారింది. వీటిలో సింహభాగం ఏర్పాటుచేసిన మూడేళ్లకే మొరాయిస్తున్నాయి. మరికొన్ని అలంకార ప్రాయంగా మారాయి.
సాంకేతిక లోపాలు, నాసిరకం విడిభాగాలు వాడడం, తయారీ లోపాలతో అత్యధిక నీటి ఒత్తిడికి తట్టుకోలేక తరచూ వీటికి చిల్లులు పడుతున్నాయి. దీంతో కృష్ణా మొదటి, రెండో దశల ద్వారా సిటీకి సరఫరా అవుతున్న 180 మిలియన్ గ్యాలన్ల నీటిలో నిత్యం 40 శాతం నీరు వృథా అవుతున్నట్లు సమాచారం. మరోవైపు రూ.50 కోట్ల వ్యయంతో ఏర్పాటుచేసిన వాల్వ్‌ల స్థానే ప్రస్తుతం కొత్తవి ఏర్పాటు చేయాల్సిన దుస్థితి తలెత్తింది.
విజిలెన్స్ విచారణ జరపాలి
ఈ నాసిరకం వాల్వ్‌లు సరఫరా చేసిన కంపెనీపై కొం దరు జలమండలి అధికారులకు ప్రేమ తగ్గడం లేదు. గతంలో ఏర్పాటు చేసినవాటి పనితీరే ఇలా ఉంటే.. ప్రస్తుతం జరుగుతున్న కృష్ణా మూడోదశ పైప్‌లైన్లపై ఏర్పాటు చేసేందుకు రూ.28 కోట్ల మేర వాల్వ్‌లు సరఫరా చేయాలని సదరు కంపెనీకి ఆర్డరు ఇచ్చినట్లు విశ్వసనీయంగా తెలిసింది. నగర బహిరంగ మార్కెట్‌లో నాణ్యత, మన్నిక కలిగిన వాల్వ్‌లు సరసమైన ధరలకు లభిస్తున్నప్పటికీ సదరు కంపెనీపై అధికారులు వల్లమాలిన ప్రేమ చూపుతుండటం విస్మయం కలిగిస్తోంది. సదరు కంపెనీ తాయిలాలకు కక్కుర్తి పడి ఇంటి దొంగలే దానికి అనుకూలంగా పనిచేస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బోర్డు ఉన్నతాధికారులు ఈ అంశంపై దృష్టి సారించి గతంలో జరిగిన అక్రమాలపై విజిలెన్స్ విచారణ జరపాలని బోర్డు కార్మికసంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
నీళ్ల పాలు ఇలా
వాల్వ్‌ల కోసం ఐదేళ్లుగా
జలమండలి చేసిన వ్యయం : రూ.50 కోట్లు
600 ఎం.ఎం. సామర్థ్యం గల వాల్వ్‌లు : 300
2000 ఎం.ఎం. సామర్థ్యం గలవి : 35
ఒక్కో వాల్వ్ ధర : రూ.7 లక్షలు -రూ.20 లక్షలు
వాల్వ్‌లు ఏర్పాటు చేసింది..: కృష్ణా మొదటి,
రెండవ దశ పైప్‌లైన్లపై
మూడోదశ పైప్‌లైన్‌పై
వాల్వ్‌ల కోసం ఆర్డర్ ఇచ్చింది : గత కంపెనీకే
తాజా ఆర్డర్ విలువ: రూ.28 కోట్లు
రూ.50 కోట్లు నీళ్లపాలు!
Published Sat, Dec 14 2013 3:37 AM | Last Updated on Wed, Aug 29 2018 4:16 PM
Advertisement
Advertisement