ఇంటింటికీ గ్యాస్
- పైపులైన్ గ్యాస్‌తో నిరంతర సరఫరా
- మీటర్ల ఏర్పాటు
- వాడకం తర్వాతే బిల్లుల చెల్లింపు
- 200 కనెక్షన్లకు ఇప్పటికే సరఫరా
విజయవాడ : పైప్‌లైన్ ద్వారా ఇంటింటికీ గ్యాస్ సరఫరా కార్యక్రమంలో మళ్లీ కదలిక వచ్చింది. 2010లో ప్రారంభమైన భాగ్యనగర్ గ్యాస్ లైన్లను నగరంలో ఇప్పటికే 40 కిలోమీటర్ల మేర విస్తరించారు. మరో 200 కిలోమీటర్ల మేర పైపులైన్లు వేయటానికి కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతి లభించింది. దీనిద్వారా నగరంలో లక్ష కనెక్షన్లు ఇవ్వటానికి దోహదపడుతుందని కంపెనీ అధికారులు చెబుతున్నారు. ఆయా ప్రాంతాల్లో పైపులైన్ ద్వారా ఇంటింటికి గ్యాస్ సరఫరాకు సిద్ధంగా ఉన్నట్లు భాగ్యనగర్ గ్యాస్ సీనియర్ మేనేజర్ వెంకటేష్ తెలిపారు.
కనెక్టివిటీ ఇలా...
నగరంలో ఇంటింటికి పైపుల ద్వారా పైపుడ్ నేచురల్ గ్యాస్ (పీఎన్‌జీ) సరఫరా చేసేందుకు భాగ్యనగర్ గ్యాస్ కంపెనీ ప్రణాళిక సిద్ధం చేసింది. నగరంలో పాముల కాలువ నుంచి ప్రారంభమైన గ్యాస్ పైపు మెయిన్ లైన్‌ను సత్యనారాయణపురం బస్టాండ్, ఐదో నంబర్ రోడ్డు మీదుగా ఆటోనగర్ వరకు ఏర్పాటు చేసింది. సింగ్‌నగర్‌లో 10 కిలోమీటర్లు, సత్యనారాయణపురంలో 30 కిలోమీటర్ల మేర వీటిని తాజాగా విస్తరించింది. నగరంలో సింగ్‌నగర్, ముత్యాలంపాడు, సత్యనారాయణపురం, బావాజీపేట, లక్ష్మీనగర్, హనుమాన్‌పేట, పాత ప్రభుత్వాస్పత్రి ప్రాంతం, దేవీనగర్, రామకృష్ణానగర్ తదితర ప్రాంతాల్లో పైపులైన్ కనెక్టివిటీ ఏర్పాటు చేసింది. సింగ్‌నగర్‌లో ఇప్పటికే పైపులైన్ ద్వారా 200 గ్యాస్ కనెక్షన్లు సరఫరా చేశారు.
ఎల్‌పీజీ కంటే ధర తక్కువ...
పీఎన్ జీ గ్యాస్ ధర కిలో రూ.24.90. ఇంట్లో వాడుకునే గ్యాస్ సిలెండర్ బరువు 14.2 కిలోలు. దానికి సరిపోయే పీఎన్‌జీ గ్యాస్ ధర సుమారు రూ.350 అవుతుంది. ఎల్‌పీజీ సిలెండర్‌కు సబ్సిడీతో కలిపి చెల్లిస్తున్నది రూ.450. సబ్సిడీ లేకుంటే చెల్లించాల్సింది రూ.668. ఈ క్రమంలో పీఎన్‌జీ గ్యాస్ వాడితే మనం రూ.100 ఆదా చేసుకోవచ్చు. సిలెండర్ బుక్ చేయాల్సిన అవసరం లేదు. కుళాయి నుంచి నీరు వచ్చినట్లు పైపులైన్ నుంచి నిరంతరం గ్యాస్ సరఫరా అవుతుంది.
మీటరు ద్వారా లెక్కింపు...
విద్యుత్ మీటర్ల మాదిరిగానే గ్యాస్ వాడకానికి సంబంధించి కూడా మీటర్లు ఏర్పాటు చేస్తారు. దాని ప్రకారం బిల్లులు ఇస్తారు. వినియోగదారుడు ప్రతి రోజూ తాము వాడిన గ్యాస్ వివరాలు మీటరులో తెలుసుకోవచ్చు. పీఎన్‌జీ గ్యాస్ వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం లేదు. ఎల్‌పీజీ గ్యాస్ బరువు అధికంగా ఉండటంతో లీక్ అయిన వెంటనే అది భూమి మీద పేరుకు పోయి ఉంటుంది. సీజీఎన్‌జీ గాలి కంటే తేలిక కావటంతో లీకైన వెంటనే అది బయటకు, పైకి వ్యాపించి వాతావరణంలో కలిసిపోతుంది. అందువల్ల ప్రమాదాలు జరిగే అవకాశం లేదని కంపెనీ అధికారులు చెపుతున్నారు. పీఎన్‌జీ గ్యాస్‌ను 24 గంటలు సరఫరా చేస్తారు. గ్యాస్ కనెక్షన్ అవసరమైన వారు 7036518964, 0866 -6515986, 0866-2572522 నంబర్లలో సంప్రదించాలని కంపెనీ అధికారులు సూచిస్తున్నారు.
కనెక్షన్ ఇలా పొందాలి...
- కనెక్షన్ కావలసినవారు రూ.5 వేలు డిపాజిట్ చెల్లించాలి.
- కనెక్షన్ రద్దు చేసుకున్నప్పుడు ఈ సొమ్ము తిరిగి ఇచ్చేస్తారు.
- డీడీ అందిన వెంటనే కంపెనీ నిపుణులు దరఖాస్తుదారుని ఇంటిని పరిశీలిస్తారు.
- కనెక్షన్‌కు అవసరమైన పైపులైన్ ఏర్పాటు చేస్తారు.
స్మార్ట్ గ్యాస్ నగరంగా తీర్చిదిద్దాలి : కలెక్టర్
పీఎన్‌జీ గ్యాస్ విధానం అమలుకు అందరూ సహకరించాలని, స్మార్ట్ గ్యాస్ నగరంగా తీర్చిదిద్దేందుకు స్వచ్ఛందంగా తరలిరావాలని జిల్లా కలెక్టర్ బాబు.ఏ కోరారు. ఇటీవల ఆయన సత్యనారాయణపురంలో అల్లూరు సీతారామరాజు వీధిలో ఓ ఇంటి వద్ద పైపులైన్ ద్వారా గ్యాస్ సరఫరా కార్యక్రమాన్ని ప్రారంభించారు.పైపులైన్ ద్వారా గ్యాస్ కనెక్షన్ తీసుకున్న సిహెచ్.శివ, మహాలక్ష్మి దంపతులను కలెక్టర్ అభినందించారు. పైపులైన్ గ్యాస్ ఎంతో సురక్షితమని, పర్యావరణ పరిరక్షణకు కూడా తోడ్పడుతుందని ఆయన చెప్పారు.
మూడు నెలలకు రూ.840 బిల్లు వచ్చింది
మాకు కనెక్షన్ ఇచ్చి మూడు నెలలైంది. మొత్తంగా రూ.840 బిల్లు వచ్చింది. అంటే నెలకు రూ.300 కూడా కాలేదు. అంతేగాక ఇది సురక్షితమైనది. గ్యాస్ అయిపోయిన వెంటనే సిలెండర్ వచ్చేవరకు పడిగాపులు కాయాల్సిన పనిలేదు. లీకేజీ సమస్య లేకపోవటంతో ధైర్యంగా ఉండొచ్చు. 24 గంటలూ నిరంతరాయంగా సరఫరా అవుతోంది.
- డి.వెంకటేశ్వరరావు, జీఆర్‌పీ సూపరింటెండెంట్, రైల్వేస్టేషన్