Gas supply program
-
వంటింట్లోకి గ్యాస్
వంటింట్లో గ్యాస్ కష్టాలు నగరంలోని ప్రతి ఒక్కరికీ అనుభవమే. పండగ సీజన్లో ఇవి మరింత ఎక్కువగా ఉంటాయి. ఇకపై ఈ కష్టాలకు ఫుల్స్టాప్ పడనుంది. ఇప్పటికే నగర శివారులోని గేటెడ్ కమ్యూనిటీలకు పైప్‌ల ద్వారా వంటింటికే గ్యాస్‌ను సరఫరా చేస్తున్న భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ సంస్థ.. కోర్ సిటీలోని మరికొన్ని ప్రాంతాలకు సరఫరా చేయనుంది. ఇందుకోసం సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూటర్ ప్రాజెక్టు పనులను వేగవంతం చేసింది. తాజాగా చింతల్, బాలాగర్, కుత్బుల్లాపూర్, కూకట్పల్లి, బల్కంపేట్, వరకు పనులు పూర్తయ్యాయి. మరికొన్ని రోజుల్లో 30 కి.మీ పొడవునా పనులు పూర్తి చేసి గృహ, వాణిజ్య అవసరాలకు గ్యాస్‌ను అందించాలని యోచిస్తోంది. సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్ మహా నగరంలో ఇంటింటీకి పైపులైన్ వంట గ్యాస్ వచ్చేస్తోంది. ఇప్పటికే శివారు ప్రాంతాలకు సరఫరా చేస్తున్న భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ (బీజీఎల్) సంస్థ.. సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ ప్రాజెక్టులో భాగంగా పైపులైన్ల విస్తరణ పనులను వేగిరం చేస్తోంది. నగర శివారులోని శామీర్‌పేట మదర్ స్టేషన్ సమీపంలోని నల్సార్ విశ్వవిద్యాలయ క్యాంపస్, మేడ్చల్‌కు పరిమితమైన వంటగ్యాస్ సరఫరాను కుత్బుల్లాపూర్ పరిసర ప్రాంతాలకు విస్తరింపజేసింది. తాజాగా చింతల్, బాలనగర్, బల్కంపేట కూకట్పల్లి వరకు పైపులైన్ పనులు పూర్తి చేసి వంట గ్యాస్ కనెక్షన్లు అందించేందుకు సిద్ధమైంది. మరో ఏడాదిలో సుమారు 30 కిలో మీటర్ పొడవునా అల్వాల్, బొల్లారం, ఫతేనగర్, హైటెక్‌సిటీ, గచ్చిబౌలి, టోలిచౌకి, మెహిదీపట్నం, మాసాబ్‌ట్యాంక్, బంజారాహిల్, ప్యాట్ని. షేక్‌పేట, మదీనాగూడ, బల్కంపేట, నిజాంపేట, ప్రగతి నగర్ వరకు పైపులైన్ నిర్మాణ పనులు చేపట్టి గృహ, వాణిజ్య, పరిశ్రమలకు గ్యాస్ అందించాలని లక్ష్యంగా నిర్ణయించింది. ఆరేళ్ల క్రితం శ్రీకారం.. హైదరాబాద్ మహానగరంలో ఇంటింటీకి పైపులైన్ ద్వారా వంట గ్యాస్ (పీఎన్జీ) అందించేందుకు ‘భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ (బీజీఎల్) సంస్థ ఆరేళ్ల క్రితం సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ ప్రాజెక్టును ప్రారంభించింది. నగర శివారులోని రంగారెడ్డి జిల్లా శామీర్‌పేటలో మదర్‌స్టేషన్‌ను ఏర్పాటు చేసి ప్రాజెక్టు అమలుకు శ్రీకారం చుట్టింది. ఐదేళ్ల ప్రాజెక్టులో సుమారు 2.66 లక్షల కుటుంబాలకు పైపులైన్ ద్వారా వంటగ్యాస్ కనెక్షన్లు అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది. మొదటి విడతగా 2014 ఎప్రిల్ నాటికి లక్ష కుటుంబాలకు గ్యాస్ సరఫరా చేయాలని భావించినప్పటికీ.. ఈ డిసెంబర్ నాటికి 2,706 గ్యాస్ కనెక్షన్లు మాత్రమే అందించగలిగింది. రెండేళ్ల క్రితం కుత్బుల్లాపూర్ పరిధిలోని గోదావరి హోమ్స్ సమీపంలోని గాయత్రినగర్, కొంపల్లి, సుచిత్రలలో కనెక్షన్లు అందించింది. రూ.733 కోట్లతో.. భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ ఐదేళ్లలో సుమారు రూ.733 కోట్లు ఖర్చుతో పైపులైన్ పనులు విస్తరించాలని భావించినట్లు బీజేఎల్ తన వార్షిక నివేదికలో స్పష్టం చేసింది. వచ్చే 20 ఏళ్లలో రూ.3,166 కోట్లతో సిటీగ్యాస్ డిస్ట్రిబ్యూషన్‌ను కూడా విస్తరించాలని ప్రణాళిక రూపొందించి ఇప్పటి వరకు 34 కిలో మీటర్ల పనులు మాత్రమే పూర్తి చేయగలిగింది. వాస్తవంగా గ్రిడ్ నుంచి సరైన గ్యాస్సరఫరా లేక, ఆ తర్వాత పైపులైన్ వేసే మార్గంలో క్లియరెన్స్ లేకపోవడం పనులకు అడ్డంకిగా మారాయి. తాజాగా స్టీల్ పైపులైన్ పనులకు శ్రీకారం చుట్టింది. గ్రేటర్ కమ్యూనిటీలకు.. నగరంలోని గ్రేటర్ కమ్యూనిటీలకు పైప్‌లైన్ వంట గ్యాస్ సరఫరా అవుతోంది. ఇప్పటికే నగరం శివారులోని కొంపల్లి, సినీ ప్లానెట్, ప్రజెయ్ అపార్టుమెంట్, జయభేరి, వెన్సాయి, ఎన్సిఎల్, పేట్ బషీరాబాద్, జీడిమెట్ల, గోదావరి హోమ్స్, గాయత్రీనగర్, బ్యాంక్ కాలనీ, సుచిత్ర, వెన్నెలగడ్డ, బౌద్దనగర్, వెంకటేశ్వర కాలనీ, కౌండిన్య క్లబ్, ఎన్సిఎల్ నార్త్, మీనాక్షి ఎన్క్లేవ్, స్ప్రింగ్ ఫీల్డ్, ఓం బుక్స్, రామరాజునగర్, శ్రీకష్ణనగర్, భాగ్యలక్ష్మికాలనీ, జయరాంనగర్, విమానపురి కాలనీ, కుత్బుల్లాపూర్, అయోధ్యనగర్, కష్ణకుంజ్ గార్డెన్, వీరస్వామినగర్, బీరప్పనగర్, మంజీర అపార్టుమెంట్స్ ప్రాంతాలకు పైప్‌లైన్‌ద్వారా వంటగ్యాస్ సరఫరా చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. వినియోగదారులు ఎంత గ్యాస్ వాడుకుంటే అన్ని డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. సామాన్య, మధ్య తరగతి కుటుంబీకులు ప్రతిరోజు 0.5 ఎంసిహెచ్ గ్యాస్ వాడే అవకాశముందని బీజేఎల్ సిబ్బంది పేర్కొంటున్నారు. -
ఇంటింటికీ గ్యాస్
- పైపులైన్ గ్యాస్‌తో నిరంతర సరఫరా - మీటర్ల ఏర్పాటు - వాడకం తర్వాతే బిల్లుల చెల్లింపు - 200 కనెక్షన్లకు ఇప్పటికే సరఫరా విజయవాడ : పైప్‌లైన్ ద్వారా ఇంటింటికీ గ్యాస్ సరఫరా కార్యక్రమంలో మళ్లీ కదలిక వచ్చింది. 2010లో ప్రారంభమైన భాగ్యనగర్ గ్యాస్ లైన్లను నగరంలో ఇప్పటికే 40 కిలోమీటర్ల మేర విస్తరించారు. మరో 200 కిలోమీటర్ల మేర పైపులైన్లు వేయటానికి కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతి లభించింది. దీనిద్వారా నగరంలో లక్ష కనెక్షన్లు ఇవ్వటానికి దోహదపడుతుందని కంపెనీ అధికారులు చెబుతున్నారు. ఆయా ప్రాంతాల్లో పైపులైన్ ద్వారా ఇంటింటికి గ్యాస్ సరఫరాకు సిద్ధంగా ఉన్నట్లు భాగ్యనగర్ గ్యాస్ సీనియర్ మేనేజర్ వెంకటేష్ తెలిపారు. కనెక్టివిటీ ఇలా... నగరంలో ఇంటింటికి పైపుల ద్వారా పైపుడ్ నేచురల్ గ్యాస్ (పీఎన్జీ) సరఫరా చేసేందుకు భాగ్యనగర్ గ్యాస్ కంపెనీ ప్రణాళిక సిద్ధం చేసింది. నగరంలో పాముల కాలువ నుంచి ప్రారంభమైన గ్యాస్ పైపు మెయిన్ లైన్‌ను సత్యనారాయణపురం బస్టాండ్, ఐదో నంబర్ రోడ్డు మీదుగా ఆటోనగర్ వరకు ఏర్పాటు చేసింది. సింగ్‌నగర్‌లో 10 కిలోమీటర్లు, సత్యనారాయణపురంలో 30 కిలోమీటర్ల మేర వీటిని తాజాగా విస్తరించింది. నగరంలో సింగ్‌నగర్, ముత్యాలంపాడు, సత్యనారాయణపురం, బావాజీపేట, లక్ష్మీనగర్, హనుమాన్‌పేట, పాత ప్రభుత్వాస్పత్రి ప్రాంతం, దేవీనగర్, రామకృష్ణానగర్ తదితర ప్రాంతాల్లో పైపులైన్ కనెక్టివిటీ ఏర్పాటు చేసింది. సింగ్‌నగర్‌లో ఇప్పటికే పైపులైన్ ద్వారా 200 గ్యాస్ కనెక్షన్లు సరఫరా చేశారు. ఎల్పీజీ కంటే ధర తక్కువ... పీఎన్ జీ గ్యాస్ ధర కిలో రూ.24.90. ఇంట్లో వాడుకునే గ్యాస్ సిలెండర్ బరువు 14.2 కిలోలు. దానికి సరిపోయే పీఎన్జీ గ్యాస్ ధర సుమారు రూ.350 అవుతుంది. ఎల్పీజీ సిలెండర్‌కు సబ్సిడీతో కలిపి చెల్లిస్తున్నది రూ.450. సబ్సిడీ లేకుంటే చెల్లించాల్సింది రూ.668. ఈ క్రమంలో పీఎన్జీ గ్యాస్ వాడితే మనం రూ.100 ఆదా చేసుకోవచ్చు. సిలెండర్ బుక్ చేయాల్సిన అవసరం లేదు. కుళాయి నుంచి నీరు వచ్చినట్లు పైపులైన్ నుంచి నిరంతరం గ్యాస్ సరఫరా అవుతుంది. మీటరు ద్వారా లెక్కింపు... విద్యుత్ మీటర్ల మాదిరిగానే గ్యాస్ వాడకానికి సంబంధించి కూడా మీటర్లు ఏర్పాటు చేస్తారు. దాని ప్రకారం బిల్లులు ఇస్తారు. వినియోగదారుడు ప్రతి రోజూ తాము వాడిన గ్యాస్ వివరాలు మీటరులో తెలుసుకోవచ్చు. పీఎన్జీ గ్యాస్ వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం లేదు. ఎల్పీజీ గ్యాస్ బరువు అధికంగా ఉండటంతో లీక్ అయిన వెంటనే అది భూమి మీద పేరుకు పోయి ఉంటుంది. సీజీఎన్జీ గాలి కంటే తేలిక కావటంతో లీకైన వెంటనే అది బయటకు, పైకి వ్యాపించి వాతావరణంలో కలిసిపోతుంది. అందువల్ల ప్రమాదాలు జరిగే అవకాశం లేదని కంపెనీ అధికారులు చెపుతున్నారు. పీఎన్జీ గ్యాస్‌ను 24 గంటలు సరఫరా చేస్తారు. గ్యాస్ కనెక్షన్ అవసరమైన వారు 7036518964, 0866 -6515986, 0866-2572522 నంబర్లలో సంప్రదించాలని కంపెనీ అధికారులు సూచిస్తున్నారు. కనెక్షన్ ఇలా పొందాలి... - కనెక్షన్ కావలసినవారు రూ.5 వేలు డిపాజిట్ చెల్లించాలి. - కనెక్షన్ రద్దు చేసుకున్నప్పుడు ఈ సొమ్ము తిరిగి ఇచ్చేస్తారు. - డీడీ అందిన వెంటనే కంపెనీ నిపుణులు దరఖాస్తుదారుని ఇంటిని పరిశీలిస్తారు. - కనెక్షన్‌కు అవసరమైన పైపులైన్ ఏర్పాటు చేస్తారు. స్మార్ట్ గ్యాస్ నగరంగా తీర్చిదిద్దాలి : కలెక్టర్ పీఎన్జీ గ్యాస్ విధానం అమలుకు అందరూ సహకరించాలని, స్మార్ట్ గ్యాస్ నగరంగా తీర్చిదిద్దేందుకు స్వచ్ఛందంగా తరలిరావాలని జిల్లా కలెక్టర్ బాబు.ఏ కోరారు. ఇటీవల ఆయన సత్యనారాయణపురంలో అల్లూరు సీతారామరాజు వీధిలో ఓ ఇంటి వద్ద పైపులైన్ ద్వారా గ్యాస్ సరఫరా కార్యక్రమాన్ని ప్రారంభించారు.పైపులైన్ ద్వారా గ్యాస్ కనెక్షన్ తీసుకున్న సిహెచ్.శివ, మహాలక్ష్మి దంపతులను కలెక్టర్ అభినందించారు. పైపులైన్ గ్యాస్ ఎంతో సురక్షితమని, పర్యావరణ పరిరక్షణకు కూడా తోడ్పడుతుందని ఆయన చెప్పారు. మూడు నెలలకు రూ.840 బిల్లు వచ్చింది మాకు కనెక్షన్ ఇచ్చి మూడు నెలలైంది. మొత్తంగా రూ.840 బిల్లు వచ్చింది. అంటే నెలకు రూ.300 కూడా కాలేదు. అంతేగాక ఇది సురక్షితమైనది. గ్యాస్ అయిపోయిన వెంటనే సిలెండర్ వచ్చేవరకు పడిగాపులు కాయాల్సిన పనిలేదు. లీకేజీ సమస్య లేకపోవటంతో ధైర్యంగా ఉండొచ్చు. 24 గంటలూ నిరంతరాయంగా సరఫరా అవుతోంది. - డి.వెంకటేశ్వరరావు, జీఆర్పీ సూపరింటెండెంట్, రైల్వేస్టేషన్