వంటింట్లోకి గ్యాస్‌ | bgl gas supply to every house in hyderabad soon | Sakshi
Sakshi News home page

వంటింట్లోకి గ్యాస్‌

Published Mon, Dec 18 2017 8:33 AM | Last Updated on Mon, Dec 18 2017 8:33 AM

bgl gas supply to every house in hyderabad soon - Sakshi

వంటింట్లో గ్యాస్‌ కష్టాలు నగరంలోని ప్రతి ఒక్కరికీ అనుభవమే. పండగ సీజన్‌లో ఇవి మరింత ఎక్కువగా ఉంటాయి. ఇకపై ఈ కష్టాలకు ఫుల్‌స్టాప్‌ పడనుంది. ఇప్పటికే నగర శివారులోని గేటెడ్‌ కమ్యూనిటీలకు పైప్‌ల ద్వారా వంటింటికే గ్యాస్‌ను సరఫరా చేస్తున్న భాగ్యనగర్‌ గ్యాస్‌ లిమిటెడ్‌ సంస్థ.. కోర్‌ సిటీలోని మరికొన్ని ప్రాంతాలకు సరఫరా చేయనుంది. ఇందుకోసం సిటీ గ్యాస్‌ డిస్ట్రిబ్యూటర్‌ ప్రాజెక్టు పనులను వేగవంతం చేసింది. తాజాగా చింతల్, బాలాగర్, కుత్బుల్లాపూర్, కూకట్‌పల్లి, బల్కంపేట్, వరకు పనులు పూర్తయ్యాయి. మరికొన్ని రోజుల్లో 30 కి.మీ పొడవునా పనులు పూర్తి చేసి గృహ, వాణిజ్య అవసరాలకు గ్యాస్‌ను అందించాలని యోచిస్తోంది. 

సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్‌ మహా నగరంలో ఇంటింటీకి పైపులైన్‌ వంట గ్యాస్‌ వచ్చేస్తోంది. ఇప్పటికే శివారు ప్రాంతాలకు సరఫరా చేస్తున్న భాగ్యనగర్‌ గ్యాస్‌ లిమిటెడ్‌ (బీజీఎల్‌) సంస్థ.. సిటీ గ్యాస్‌ డిస్ట్రిబ్యూషన్‌ ప్రాజెక్టులో భాగంగా పైపులైన్ల విస్తరణ పనులను వేగిరం చేస్తోంది. నగర శివారులోని శామీర్‌పేట మదర్‌ స్టేషన్‌ సమీపంలోని నల్సార్‌ విశ్వవిద్యాలయ క్యాంపస్, మేడ్చల్‌కు పరిమితమైన వంటగ్యాస్‌ సరఫరాను కుత్బుల్లాపూర్‌ పరిసర ప్రాంతాలకు విస్తరింపజేసింది. తాజాగా చింతల్, బాలనగర్, బల్కంపేట కూకట్‌పల్లి వరకు పైపులైన్‌ పనులు పూర్తి చేసి వంట గ్యాస్‌ కనెక్షన్లు అందించేందుకు  సిద్ధమైంది. మరో ఏడాదిలో సుమారు 30 కిలో మీటర్‌ పొడవునా అల్వాల్, బొల్లారం, ఫతేనగర్, హైటెక్‌సిటీ, గచ్చిబౌలి, టోలిచౌకి, మెహిదీపట్నం, మాసాబ్‌ట్యాంక్, బంజారాహిల్, ప్యాట్ని. షేక్‌పేట, మదీనాగూడ, బల్కంపేట, నిజాంపేట, ప్రగతి నగర్‌ వరకు పైపులైన్‌ నిర్మాణ పనులు చేపట్టి గృహ, వాణిజ్య, పరిశ్రమలకు గ్యాస్‌ అందించాలని లక్ష్యంగా నిర్ణయించింది.

ఆరేళ్ల క్రితం  శ్రీకారం..
హైదరాబాద్‌ మహానగరంలో ఇంటింటీకి పైపులైన్‌ ద్వారా వంట గ్యాస్‌ (పీఎన్జీ) అందించేందుకు ‘భాగ్యనగర్‌ గ్యాస్‌ లిమిటెడ్‌ (బీజీఎల్‌) సంస్థ ఆరేళ్ల క్రితం సిటీ గ్యాస్‌ డిస్ట్రిబ్యూషన్‌ ప్రాజెక్టును ప్రారంభించింది. నగర శివారులోని రంగారెడ్డి జిల్లా శామీర్‌పేటలో మదర్‌స్టేషన్‌ను ఏర్పాటు చేసి ప్రాజెక్టు అమలుకు శ్రీకారం చుట్టింది. ఐదేళ్ల ప్రాజెక్టులో సుమారు 2.66 లక్షల కుటుంబాలకు పైపులైన్‌ ద్వారా వంటగ్యాస్‌ కనెక్షన్లు అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది. మొదటి విడతగా 2014 ఎప్రిల్‌ నాటికి లక్ష కుటుంబాలకు గ్యాస్‌ సరఫరా చేయాలని భావించినప్పటికీ.. ఈ డిసెంబర్‌ నాటికి 2,706 గ్యాస్‌ కనెక్షన్లు మాత్రమే అందించగలిగింది. రెండేళ్ల క్రితం కుత్బుల్లాపూర్‌  పరిధిలోని గోదావరి హోమ్స్‌ సమీపంలోని గాయత్రినగర్, కొంపల్లి, సుచిత్రలలో కనెక్షన్‌లు అందించింది. 

రూ.733 కోట్లతో..
భాగ్యనగర్‌ గ్యాస్‌ లిమిటెడ్‌ ఐదేళ్లలో సుమారు రూ.733 కోట్లు ఖర్చుతో పైపులైన్‌ పనులు విస్తరించాలని భావించినట్లు బీజేఎల్‌ తన వార్షిక నివేదికలో స్పష్టం చేసింది. వచ్చే  20 ఏళ్లలో  రూ.3,166 కోట్లతో  సిటీగ్యాస్‌ డిస్ట్రిబ్యూషన్‌ను కూడా విస్తరించాలని ప్రణాళిక రూపొందించి  ఇప్పటి వరకు 34 కిలో మీటర్ల పనులు మాత్రమే పూర్తి చేయగలిగింది. వాస్తవంగా గ్రిడ్‌ నుంచి సరైన గ్యాస్‌సరఫరా లేక, ఆ తర్వాత పైపులైన్‌ వేసే మార్గంలో క్లియరెన్స్‌ లేకపోవడం పనులకు అడ్డంకిగా మారాయి. తాజాగా స్టీల్‌ పైపులైన్‌ పనులకు శ్రీకారం చుట్టింది.

గ్రేటర్‌ కమ్యూనిటీలకు..
నగరంలోని గ్రేటర్‌ కమ్యూనిటీలకు పైప్‌లైన్‌ వంట గ్యాస్‌ సరఫరా అవుతోంది. ఇప్పటికే నగరం శివారులోని కొంపల్లి, సినీ ప్లానెట్, ప్రజెయ్‌ అపార్టుమెంట్, జయభేరి, వెన్‌సాయి, ఎన్‌సిఎల్, పేట్‌ బషీరాబాద్, జీడిమెట్ల, గోదావరి హోమ్స్, గాయత్రీనగర్, బ్యాంక్‌ కాలనీ, సుచిత్ర, వెన్నెలగడ్డ, బౌద్దనగర్, వెంకటేశ్వర కాలనీ, కౌండిన్య క్లబ్, ఎన్‌సిఎల్‌ నార్త్, మీనాక్షి ఎన్‌క్లేవ్, స్ప్రింగ్‌ ఫీల్డ్, ఓం బుక్స్, రామరాజునగర్, శ్రీకష్ణనగర్, భాగ్యలక్ష్మికాలనీ, జయరాంనగర్, విమానపురి కాలనీ, కుత్బుల్లాపూర్, అయోధ్యనగర్, కష్ణకుంజ్‌ గార్డెన్, వీరస్వామినగర్, బీరప్పనగర్, మంజీర అపార్టుమెంట్స్‌ ప్రాంతాలకు  పైప్‌లైన్‌ద్వారా వంటగ్యాస్‌ సరఫరా చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. వినియోగదారులు ఎంత గ్యాస్‌ వాడుకుంటే అన్ని డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. సామాన్య, మధ్య తరగతి కుటుంబీకులు ప్రతిరోజు 0.5 ఎంసిహెచ్‌ గ్యాస్‌ వాడే అవకాశముందని బీజేఎల్‌ సిబ్బంది పేర్కొంటున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement