
అమరావతికి దారేది?
గుంటూరు: ప్రభుత్వం ఎంతో గొప్పగా ప్రకటించిన నూతన రాజధాని అమరావతికి రాత్రికి రాత్రి రోడ్డు మార్గం లేకుండా పోయింది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. వివరాలు..గుంటూరు కార్పొరేషన్ అధికారులు నగరానికి నీరందించేందుకు పైప్‌లైన్‌ను శుక్రవారం తెల్లవారుజామున ఎలాంటి సమాచారం లేకుండా తవ్వారు.అయితే, ఈ పైప్‌లైన్ ఉండవల్లి గ్రామం గుంటూరు కెనాల్ సమీపంలో విజయవాడ నుంచి అమరావతికి వెళ్లే మార్గాన్ని రెండుగా చీల్చింది.
దీంతో ఈ విషయం తెలియని ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాగా, ఈ విషయంపై ఆర్‌ఆండ్‌బీ అధికారి మధుబాబును వివరణ కోరగా ఎలాంటి అనుమతులు లేకుండా పైప్‌లైన్ తవ్వకాలు జరిపినట్లు ఆయన చెప్పారు. తవ్వకాలకు పాల్పడిన వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా పైప్‌లైన్ పనులు చేపట్టడంతో విజయవాడ నుంచి అమరావతికి వెళ్లే ప్రయాణికులకు ప్రత్యామ్నాయం లేక ఇబ్బందులకు గురవుతున్నారు.
(తాడేపల్లి)