నగర భూగర్భంలోని నీటిపైప్‌లైన్లపై మరోసారి అధ్యయనం చేపట్టాలని నగర పాలక సంస్థ (బీఎంసీ) నిర్ణయించింది.
సాక్షి, ముంబై: నగర భూగర్భంలోని నీటిపైప్‌లైన్లపై మరోసారి అధ్యయనం చేపట్టాలని నగర పాలక సంస్థ (బీఎంసీ) నిర్ణయించింది. వలసలు పెరగడంతో నగరం నానాటికీ విస్తరిస్తోంది. ముంబైతోపాటు తూర్పు, పశ్చిమ శివారు ప్రాంతాల్లో అనేక కట్టడాలు, వంతెనలు, మెట్రో, మోనో రైలు ప్రాజెక్టు పనులు జరుగుతున్నాయి. తవ్వకాల కారణంగా భూగరంలోని పైపులు తరచూ పగిలిపోతుండడంతో బీఎంసీకి తీవ్రనష్టం వాటిల్లుతోంది. గడ చిన దశాబ్దకాలంలో నగరంలో అనేక మార్పులు జరిగాయి. మూతపడిన మిల్లుస్థలాల్లో అనేక కట్టడాలు వెలుస్తున్నాయి. రహదారులపై ఫ్లైఓవర్లు, సబ్‌వేలను నిర్మిస్తున్నారు.
అయితే ఇందుకు సంబంధించి ఓ మ్యాపును రూపొందించకపోవడంతో భూగర్భంలో నీటి పైపుల జాడ తెలియడం లేదు. దీంతో మరోసారి అధ్యయనం చేయాలని బీఎంసీ యోచిస్తోంది. ప్రస్తుతం బీఎంసీ వద్ద ఉన్న భూగర్భ మ్యాపు నాలుగు దశాబ్దాల క్రితం నాటిది. ఆ తరువాత నగరం అనేక విధాలుగా అభివృద్ధి చెందింది. వాస్తవానికి ఈపాటికే మరోసారి అధ్యయనం జరిపి ఉండాల్సింది. అయితే అలా జరగలేదు. దీనికితోడు బీఎంసీలో అనుభవం కలిగిన సిబ్బంది సంఖ్య కూడా అంతంత మాత్రమే. లీకేజీల గుర్తింపు విభాగంలో కేవలం 27 మంది మాత్రమే పనిచేస్తున్నారు. గతంలో 300 నీటి కనెక్షన్లను ఓ జోన్‌గా పరిగణించేవారు. వలసలు పెరగడం, నగరంతోపాటు శివారు ప్రాంతాలు విస్తరించడంతో రెండు వేల కనెక్షన్లను ఒక జోన్‌గా నిర్ణయించారు. దీంతో సిబ్బందిపై పనిభారం కూడా పెరిగింది.