ప్రొద్దుటూరు, న్యూస్‌లైన్: ఆ పథకం పూర్తయితే తమ భూములు బంగారు భూములుగా మారతాయని ఆ గ్రామంలోని ఎస్సీ కుటుంబాలకు చెందిన వారు ఎన్నో కలలుకన్నారు. అయితే ఇటు రాజకీయ అండతో కొంతమంది గ్రామ నాయకులు, అటు అధికారులు కలిసి ఆ పొలాలకు పైపులైన్ వేయకుండానే పనులు పూర్తిచేశారు. గ్రామంలో తమకు అనుకూలమైన వారి పొలాలకు మాత్రమే పైపులైన్ వేసి వీరికి మాత్రంమినహాయించారు. ఇందుకు సంబంధించి పనులు కూడా పూర్తయినట్లు బిల్లులు కూడా తీసుకున్నారు.
మాజీ ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి కోరిక మేరకు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ప్రొద్దుటూరు మండలంలోని నాగాయపల్లె గ్రామానికి ఎత్తిపోతల పథకాన్ని మంజూరు చేశారు. గ్రామానికి సంబంధించి చెరువు ఉండగా అందరి పొలాలకు చెరువు ద్వారా నీరు అందుతోంది. మరికొందరు కుందూనది నుంచి మోటార్ల ద్వారా నీటిని సరఫరా చేసుకుంటున్నారు. ఇదిలా ఉండగా గ్రామంలోని 64 మంది ఎస్సీ కుటుంబాలకు ప్రభుత్వం గ్రామంలోని 32 ఎకరాల భూములను కొనుగోలు చేసి ఒక్కొక్కరికి అర ఎకరా చొప్పున ఇచ్చింది. ప్రధానంగా ఎత్తిపోతల పథకం మంజూరుకు ఎస్సీల భూములే కారణం.
ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ తో మొత్తం అన్ని వర్గాలవారికి చెందిన 250 ఎకరాల ఆయకట్టును ఇందులో చూపించారు. మరో ఆసక్తికర విషయమేమంటే రెండెకరాల పొలానికి నీరందించేందుకు వందల అడుగులు ప్రత్యేకంగా పైపులైన్ వేసిన అధికారులు దగ్గరలో ఉన్న ఎస్సీ భూములకు మాత్రం పైపులైన్ వేయలేదు. గ్రామానికి చెందిన వరదరాజలరెడ్డి వర్గీయుడైన రమణారెడ్డి ఈ పనులు చేయడంతోపాటు ఆయనే ప్రస్తుతం చైర్మన్‌గా కొనసాగుతున్నారు. దీంతో గ్రామానికి చెందిన ఎస్సీ రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అగ్రవర్ణాలవారు కలిసి తమ కడుపుకొట్టారని అంటున్నారు. ప్రభుత్వమేమో తమ కోసం పథకాన్ని మంజూరు చేసినా అగ్రవర్ణాలవారు తమకు రానీయడం లేదన్నారు. దీంతో ఎస్సీల భూమలు నీటి వసతి , మోటార్లు ఏర్పాటు చేసుకునే ఆర్థికస్తోమతలేని కారణంగా ఆరుతడిపంటలు సాగుచేసుకుంటున్నారు.
తమ అరెకరానికి సాగునీరు అందితే కష్టపడి పండించి తమ కుటుంబాలను పోషించుకుంటామని తెలిపారు. మరోవైపు పథకం సక్రమంగా పనిచేయకున్నా అన్నీ సవ్యంగా ఉన్నట్లు చూపి అధికారులు బిల్లులు చేసుకుంటున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఎస్సీల సంక్షేమం కోసం ప్రభుత్వం ఇందిరమ్మ కలలు పథకాన్ని ప్రవేశపెట్టింది. అయితే అధికారుల దృష్టికి మాత్రం ఈ సమస్య రాకపోవడం గమనార్హం. పథకం పూర్తయి ఇన్నేళ్లు అయినా పరిస్థితి ఇలాగే ఉంది. ఈ విషయంపై కమిటీ చైర్మన్ రమణారెడ్డిని న్యూస్‌లైన్ వివరణ కోరగా ఎస్సీల భూములకు పైపులైన్ వేయించాలని పలుమార్లు ప్రయత్నించామన్నారు. భూములు ఎత్తులో ఉండడంతో పైపులైన్ వేయడం సాధ్యం కాలేదన్నారు. నీటిపారుదల శాఖ డీఈ వేణుగోపాల్‌రెడ్డిని వివరణ కోరగా ప్రస్తుతం నేనే బదిలీ అయ్యానన్నారు.
గ్రామ నాయకులే అడ్డుకున్నారు
మా పొలాలకు పైపులైన్‌వేయకుండా గ్రామ నాయకులే అడ్డుకున్నారు. పొలాలకు నీరు అంది ఉంటే ఆర్థికంగా అభివృద్ధి చెంది మా జీవితాలు మెరుగు పడేవి.
- వంగలి పెద్ద ఓబన్న
ప్రభుత్వం ఏమో నిధులిస్తోంది
ఎస్సీల సంక్షేమం కోసం ప్రభుత్వం మాత్ర నిధులు కేటాయిస్తోంది. అయితే కింది స్థాయికి వచ్చే సరికి అవి అమలుకు నోచుకోలేదు. దీంతో మేము నలిగిపోతున్నాం. ఎన్నిమార్లు విన్నవించినా ఫలితం లేదు.
- కొట్టం దస్తగిరి
ఏదో ఒకటి చెప్పి మభ్యపెడతారు
మా పొలాలకు పైపులైన్ వేయలేదని పలు మార్లు అధికారులు విచారణకు వచ్చారు. అయితే మా ఇళ్లల్లో ఎవరినో ఒకరిని తీసుకెళ్లి మాయో మంత్రమో చేసి వారికి అనుకూలంగా రాయించుకుంటున్నారు. మద్యం సీసాలు కూడా ఇస్తున్నారు. అందువల్లే సమస్య పరిష్కారం కాలేదు.
16పిడిటిఆర్03
- లక్షుమయ్య
పచ్చగా పంటలు సాగు చేసేవారం
ఎత్తిపోతల పథకం ద్వారా సాగు నీరు అందివుంటే పచ్చగా పంట పొలాలు సాగు చేసి ఉండేవారం. నీరు లేని కారణంగానే శనగ, ఇతర ఆరుతడి పంటలను సాగు చేస్తున్నాం. నాయకులు, అధికారులు కలిసి ఇలా చేస్తున్నారు.
- మడూరు ఓబన్న
దగాపడ్డ దళితులు
Published Sun, Nov 17 2013 3:02 AM | Last Updated on Sat, Sep 2 2017 12:40 AM
Advertisement
Advertisement