పైపులైన్‌ల ద్వారా వంటగ్యాస్
Published Sat, Oct 15 2016 6:32 PM | Last Updated on Mon, Sep 4 2017 5:19 PM
ఏలూరు (మెట్రో)
జిల్లాలో పైపుల ద్వారా ఇంటింటా వంటగ్యాస్ అందించే కార్యక్రమాన్ని ప్రభుత్వం అమలు చేస్తుందని 2017లో ప్రతి ఇంటికీ పైపు ద్వారా వంటగ్యాస్ అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ కాటంనేని బాస్కర్ చెప్పారు. ఆంధ్రప్రదేశ్ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్, గోదావరి గ్యాస్ ప్రయివేటు లిమిటెడ్ కార్పొరేషన్‌ల సంయుక్త ఆధ్వర్యంలో ఇంటింటా పైపు ద్వారా వంటగ్యాస్, వాహనాలకు సిఎన్‌జి గ్యాస్ ఫిల్లింగ్ స్టేషన్లు ఏర్పాటుపై శనివారం రాష్ట్ర గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ డిప్యూటీ జనరల్ మేనేజర్ వి.రమేష్, ఇంజనీర్ ఆదిత్యతో కలెక్టర్ చర్చించారు. జిల్లాలో 30 కోట్ల రూపాయల వ్యయంతో సిఎన్‌జి మదర్ స్టేషన్‌ను ఏర్పాటుతోపాటు పెద్ద ఎత్తున జిల్లా అంతటా ప్రత్యేక పైపులైన్లు ఏర్పాటు చేసి 2018 సంవత్సరం నాటికల్లా పూర్తిస్థాయిలో అందరికీ ఇంటి వద్దే తాగునీరులా వంటగ్యాస్ పైపులైన్ ద్వారా వినియోగించుకునే సౌకర్యాన్ని కల్పించనున్నట్లు కలెక్టర్ భాస్కర్ చెప్పారు. ఏలూరు సమీపంలోని కొప్పాకలో ఉన్న గెయిల్ గ్యాస్ స్టేషన్ నుండి ఏలూరులో సిటీ గేట్ స్టేషన్ ఏర్పాటు చేసి అక్కడి నుండి ఏలూరు నగర వాసులకు ప్రథమంగా ప్రత్యేక పైపులైను ద్వారా వంటగ్యాస్ సరఫరా చేస్తామన్నారు. రానున్న సంవత్సరంలో ఏలూరు అంతటా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయనున్నట్లు కలెక్టర్ చెప్పారు. బీమడోలు సమీపంలోని ఎం గాగులపలి, తణుకు సమీపంలోని పెరవలి, భీమవరంలలో ప్రస్తుతం గెయిల్ గ్యాస్ స్టేషన్లు ఉన్నాయనీ అక్కడి నుండి సమీప ప్రధాన కేంద్రాలను కలిపేందుకు గేట్ స్టేషన్లు రహదార్ల పక్కనే ఏర్పాటు చేసేందుకు అవసరమైన ప్రబుత్వ స్థలాన్ని కేటాయిస్తామని ఈ మేరకు ఏలూరు, కొవ్వూరు ఆర్‌డిఒలతో త్వరలో ప్రభుత్వ స్థలాలను సిద్ధం చేయాలని కలెక్టర్ ఆదేశించారు. గ్యాస్ కంపెనీ కార్యాలయాన్ని తాత్కాలికంగా ఏలూరులో ఏర్పాటు చేసేందుకు కలెక్టరేట్ సమీపంలోని కేంద్రీయ విద్యాలయ భవనాన్ని కేటాయిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ పులిపాటి కోటేశ్వరరావు, అదనపు జాయింట్ కలెక్టర్ షరీఫ్, ఆర్‌డిఒలు నంబూరి తేజ్‌భరత్, బి.శ్రీనివాసరావు పాల్గొన్నారు.
Advertisement
Advertisement