వచ్చే సెప్టెంబరు నెల నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తరూ జిల్లా సమీప ప్రాంతాల్లో ఇంటింటికీ పైప్‌లైన్ గ్యాస్ సరఫరా ప్రారంభించడానికి కృషి చేస్తున్నామని ప్రముఖ ఇంథన సరఫరా సంస్థ ఏజీ అండ్ పీ ప్రథాన్ రీజనల్ హెడ్ చిరాగ్ ‘సాక్షి’కి తెలిపారు.
సింగపూర్ కు చెందిన ఈ కంపెనీ ఇటీవలే కేంద్ర పెట్రోలియం బోర్డ్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి అవసరమైన అనుమతులు పొంది ఇంధన సరఫరా ప్రారంభించనుంది. భవిష్యత్తులో పోర్టబుల్ జనరేటర్స్, ఎయిర్ కంటిషనర్స్ కూడా గ్యాస్‌తో వినియోగించుకునే పరిస్థితి రానుందంటున్న ఆయన సాక్షితో పంచుకున్న విశేషాలు ఆయన మాటల్లోనే...
‘ఆదా’కు ఆదా... భధ్రతకు భరోసా
ఈ పైప్‌లైన్ గ్యాస్ ద్వారా బహుళ ప్రయోజనాలు ఉన్నాయి. ప్రస్తుత సిలిండర్‌కి సరిపడా గ్యాస్ దీని ద్వారా రూ.750 నుంచి రూ 800 వరకూ ధరలోనే వస్తుంది. అంటే ప్రస్తుతం అవుతున్న ఖర్చులో 10 నుంచి 15శాతం ఆదా అవుతుంది. ఈ పైప్డ్ నేచురల్ గ్యాస్ సంప్రదాయ సిలిండర్ గ్యాస్‌తో పోలిస్తే చవక మాత్రమే కాదు అత్యంత సురక్షితం కూడా. సరఫరా మొత్తం పైప్‌లైన్ సిస్టమ్‌లోనే సాగుతుంది. కాబట్టి ప్రత్యేకించి స్టోరేజ్ అవసరం లేదు.
పైప్‌లైన్ ద్వారా ఒక కిచెన్ పాయింట్ అందిస్తాం. అవసరాన్ని బట్టి ఓ అడిషనల్ పాయింట్ కూడా అదే కిచెన్‌లో తీసుకోవచ్చు. బాత్ రూమ్ కోసం కావాలంటే మరో అదనపు పాయింట్ ఇస్తాం. మునిసిపల్ వాటర్ నీటి పంపు తిప్పితే నీళ్లొచ్చినట్టే ఈ గ్యాస్ కూడా వస్తుంది. వినియోగించిన ఇంధనాన్ని లెక్కించేందుకు మీటర్ ఏర్పాటు ఉంటుంది. మీటర్‌ను బట్టి వాడుకున్న ఇంధనానికి బిల్ చెల్లించాల్సి ఉంటుంది. కరెంట్ బిల్లుల్లానే కాకపోతే అందులోలా ఇందులో స్లాబ్స్ ఉండవు. ఇక గ్యాస్ వినియోగదారులకు నిరంతర సేవలు అందించేందుకు ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి 24/7 ఇన్‌స్టాలేషన్ తర్వాత సర్వీస్ అందిస్తున్నాం. దీని కోసం ఒక పూర్తిస్థాయి టీమ్ పనిచేస్తుంది.
రెస్టారెంట్స్‌కు మరింత మేలు...
నివాస గృహాలతో పోలిస్తే రెస్టారెంట్స్ లాంటి వ్యాపార సంస్థలకు పైప్‌లైన్ గ్యాస్ ద్వారా ఆదా అయ్యే 10శాతం అంటే చాలా పెద్ద మొత్తం అనే చెప్పాలి. ఇది వారి లాభాలను బాగా పెంచుతుంది. వారాంతాల్లో హోటల్స్ దాబాలు వంటి చోట్ల డిమాండ్ కారణంగా అధిక ఇంధనం కోసం అదనపు సిలిండర్లు మీద ఆధారపడతారు. అయితే ఇక్కడ ఆ కొరత ఉండదు. ఎంత కావాలంటే అంత గ్యాస్ సిద్ధంగా ఉంటుంది. ఈ ఆకర్షణీయమైన ప్రయోజనం కారణంగా భవిష్యత్తులో తిరుపతిలో అన్ని రెస్టారెంట్స్ పైప్డ్ గ్యాస్‌కి కనెక్ట్ అవుతాయి. రాబోయే రోజుల్లో తిరుమలకు కూడా అందించడానికి తితిదేతో చర్చలు నడుస్తున్నాయి. అయితే దీని కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయాల్సి ఉంటుంది.
స్పందన బాగుంది...
ఇంటింటికీ పైప్‌లైన్ ద్వారా గ్యాస్ సరఫరా కోరుతూ ప్రజల నుంచి ఇప్పటికే వేల సంఖ్యలో దరఖాస్తులు అందుకున్నాం. కేవలం 4 నెలల్లోనే 2వేల 500 కంటే పైగా అప్లికేషన్స్ వచ్చాయి. స్థానిక సంస్థలు మాకు అవసరమైన విధంగా సహకరించాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే జీవో జారి చేసింది గూడూరు మునిసిపల్ కార్పొరేషన్, తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్, నాయుడు పేట మునిసిపల్ కార్పొరేషన్.. ల నుంచి పైప్‌లైన్ నిర్మాణాల అనుమతుల కోసం దరఖాస్తు చేశాం.
ఇన్‌స్టలేషన్ ప్రారంభించాం...
తిరుపతి టౌన్‌లో కూడా శ్రీనివాసపురం, రోడ్‌నెం 15, 16లలో డొమెస్టిక్ సర్వీసెస్ స్టార్ట్ చేశాం. 300 నివాస గృహాల్లో ఇన్‌స్టలేషన్ పూర్తయింది. నెల్లూరులో కూడా 450 ఇళ్లకి డొమెస్టిక్ ఇన్‌స్టలేషన్ పూర్తయింది. పైప్‌లైన్ ప్రోగ్రెస్‌లో ఉంది. వచ్చే 2నెలల్లో పూర్తి అవుతుంది. స్థానిక సరఫరా పైప్‌లైన్ నెట్‌వర్క్‌ని నాయుడపేట టౌన్, ఇండస్ట్రియల్ ఏరియాలో కూడా ప్రారంభించాం. ప్రభుత్వం చెప్పినట్టుగా రిఫండబుల్ డిపాజిట్ రూ.6వేలు తీసుకోవచ్చు కానీ మేం అది తీసుకోకుండానే ప్రస్తుతం కనెక్షన్ వర్క్ పూర్తి చేస్తున్నాం.
వాహనాల కోసం సీఎన్‌జీ
పెట్రోల్, డీజిల్ వాహనాలను పిఎన్‌జి వాహనాలుగా మార్చే రెట్రో ఫిట్‌మెంట్ సెంటర్స్ ద్వారా సేవలు కూడా అందిస్తున్నాం. చిత్తూరు, నెల్లూరు, అనంతపురం కడప లాంటి చోట్ల డీజిల్ ఆటోలు బాగా ఎక్కువ వాటిని సీఎన్‌జీ ఆటోలుగా మార్చవచ్చు. దీని వల్ల పర్యావరణానికి ఎంతో ఉపయక్తం. అంతేకాక ఈ మార్పిడి కోసం అయ్యే ఖర్చు వాహన యజమానులకు కేవలం 6 నెలల్లో రికవరీ చేసుకోవచ్చు.
డీజిల్‌తో పోలిస్తే సిఎన్‌జి వల్ల 30 నుంచి 50శాతం ఇంధన ఖర్చు అంటే కనీసం నెలకు రూ.5వేలు ఆదా అవుతుంది. ఇక భారీ వాహనాలు, ఎక్కువ దూరాలు నడిపేవారికి ఒక్క రోజులోనే భారీ మొత్తంలో ప్రయోజనం కలుగుతుంది. ఇంధనాన్ని నింపుకోవడంలో ఇబ్బందులు రాకుండా ప్రతీ 60 నుంచి 100 కి.మీ లోపు సిఎన్‌జి స్టేషన్స్ ఉండేలా చూస్తున్నాం.
Comments
Please login to add a commentAdd a comment