ఆస్తుల నగదీకరణ తప్పదు! | Amitabh Tiwari Article Benefits Of National Monetisation Pipeline Plan | Sakshi
Sakshi News home page

ఆస్తుల నగదీకరణ తప్పదు!

Published Sun, Aug 29 2021 12:43 AM | Last Updated on Sun, Aug 29 2021 1:11 AM

Amitabh Tiwari Article Benefits Of National Monetisation Pipeline Plan - Sakshi

‘జాతీయ ఆస్తుల నగదీకరణ’ మంచిదే. ప్రైవేట్‌ పరిశ్రమకు కట్టబెడుతున్న ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సంస్థల ఆస్తులు అంతిమంగా ప్రభుత్వ యాజమాన్యం కిందే ఉంటాయి. నాలుగేళ్లలో రూ. 6 లక్షల కోట్ల సమీకరణ ద్వారా మౌలిక వసతులను మెరుగుపర్చడమే నగదీకరణ లక్ష్యం. ఇది ఆర్థిక వ్యవస్థను పునర్జీవింపజేసి, మహమ్మారి వల్ల దెబ్బతిన్న అభివృద్ధి పనులను వేగవంతం చేస్తుందని అంచనా. నిరర్ధక ఆస్తులను వాణిజ్యానికి అప్పగించడం లాభసాటి అని కేంద్రం భావన.

ఆగస్టు నెల చివరివారంలో కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ జాతీయ ఆస్తుల నగదీకరణ విధానాన్ని (నేషనల్‌ మోనిటైజేషన్‌ పైప్‌లైన్‌) ప్రారంభించారు. కేంద్ర ప్రభుత్వ, ప్రభుత్వ రంగ ఆస్తుల నిర్వహణను ప్రైవేట్‌ యాజమాన్యా లకు అప్పగించడం ద్వారా 2021–22 నుంచి 2024–25 ఆర్థిక సంవత్సరాల మధ్య కాలంలో ఆరు లక్షల కోట్ల రూపాయల నగదు సమీకరించడమే దీని లక్ష్యం. 12 ప్రభుత్వ శాఖలకు చెందిన 20కి పైగా ఆస్తులు ఈ నగదీకరణలో భాగంగా ఉంటాయి. వీటిలో ప్రధానంగా రహదారులు, రైల్వేలు, విద్యు త్తు వ్యవస్థ ఉన్నాయి. 2022 నుంచి 2025 వరకు ఈ కార్యక్రమం అమలవుతుంది. ఈ విధానం కింద భారతీయ రైల్వేకి చెందిన 400 స్టేషన్లు, 90 ప్రయాణికుల రైళ్లు, 265 గూడ్స్‌ షెడ్లు, 15 రైల్వే స్టేడియంలు ప్రైవేట్‌ సంస్థలకు అప్పగిస్తారు. ఎయిర్‌పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా ఆధ్వర్యంలోని 25 విమానాశ్రయాలను ప్రైవేటీకరిస్తారు. ఢిల్లీ, హైదరాబాద్, బెంగళూరు తదితర విమానాశ్రయాల్లో ప్రభుత్వ వాటాలను పూర్తిగా విక్రయిస్తారు. 9 మేజర్‌ పోర్టుల్లో ఉన్న 31 ప్రాజెక్టులను పీపీపీ విధానంలో అప్పగిస్తారు. బీబీఎన్‌ఎల్, బీఎస్‌ఎన్‌ఎల్, డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ టెలీ కమ్యూనికేషన్స్‌లో ఉన్న ఆస్తులన్నింటినీ ప్రైవేటు వారికి ఇచ్చేస్తారు. జాతీయ స్టేడియంలు, ప్రాంతీయ కేంద్రాలు, పట్టణ ప్రాంతాల్లోని కాలనీలు, అతిథిగృహాలు, హోటళ్లు వంటి వాటిని ప్రైవేటుకు అప్పగిస్తారు.

అయితే జాతీయ నగదీకరణ విధానం కింద అప్పగిస్తున్న ఆస్తులు ఆ తర్వాత కూడా ప్రభుత్వ యాజమాన్యం కిందే ఉంటాయని ఆర్థికమంత్రి స్పష్టంచేశారు. కొంతకాలం ప్రైవేట్‌ నిర్వహణ కింద ఉన్న తర్వాత వీటిని తిరిగి ప్రభుత్వానికి ఇచ్చివేయవలసి ఉంటుంది. ఈ కొత్త విధానం కింద ప్రభుత్వం మౌలిక వసతుల రంగంలో పెడుతున్న వ్యయాన్ని పెంచేలా నగదు లభ్యతను మెరుగుపరుస్తుందని మంత్రి వ్యాఖ్య. 

మౌలిక వసతుల రంగంలో కేంద్ర ప్రభుత్వం  పెడుతున్న వ్యయాన్ని ఇంకా పెంచాల్సిన అవసరముందని, ప్రభుత్వ రంగ మౌలిక వసతుల ఆస్తులను ప్రైవేట్‌ యాజమాన్యాలకు అప్పగించడం అతి ముఖ్యమైన ఆర్థిక ఎంపిక అని, నూతన మౌలిక వసతుల నిర్మాణానికి ఇది చాలా ముఖ్యమైనదని మంత్రి సెలవిచ్చారు. ఈ కొత్త విధానంలో భాగంగా విమానయాన రంగం నుంచే దాదాపు రూ. 20,800 కోట్ల ఆస్తులను ప్రైవేట్‌కి అప్పగించనున్నారు. టెలికం రంగం నుంచి రూ. 35,100 కోట్ల ఆస్తులను నగదీకరణ కింద అప్పగించనున్నారు. ఇకపోతే రైల్వే రంగం నుంచి రూ. లక్షా 50 వేల కోట్లు, రహదారుల రంగం నుంచి రూ. లక్షా 60 వేల కోట్లు, విద్యుత్‌ పంపిణీ రంగం నుంచి రూ. 45,200 కోట్ల విలువైన ఆస్తులను ప్రైవేట్‌ నిర్వహణకు అప్పగిస్తారు. ఆస్తుల నగదీకరణ విధానం ఆర్థిక వ్యవస్థను పునర్జీవింపజేసి, మహమ్మారి వల్ల దెబ్బతిన్న అభివృద్ధి పనులను వేగవంతం చేస్తుందని కేంద్రం అంచనా. దీనికి గాను ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సంస్థల ఆదాయాన్ని గణనీయంగా పెంచుకోవాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. నగదీకరణలో నాలుగు ప్రయోజనాలున్నాయి.

1. ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సంస్థల రాబడులను పెంచడం
కోవిడ్‌ మహమ్మారి ప్రభావం కారణంగా కేంద్ర ప్రభుత్వ ఆర్థిక స్థితి, ప్రభుత్వ రంగ యాజమాన్యంలోని సంస్థల ఆర్థిక స్థితి విధ్వంసానికి గురైంది. 2020–21 ఆర్థిక సంవత్సరంలో స్థూల దేశీయోత్పత్తి 7.3 శాతానికి పడిపోయింది. ద్రవ్యలోటు జీడీపీలో 9.3 శాతానికి పెరిగింది. లాక్‌ డౌన్ల వల్ల ప్రభుత్వ రాబడులు క్షీణించిపోవడమే కాకుండా, పేదలకు ఉపశమనం కలిగించడానికి ప్రభుత్వం తన వ్యయాన్ని బాగా పెంచాల్సి వచ్చింది. దానికి తోడుగా ప్రభుత్వ, కేంద్రప్రభుత్వ రంగ సంస్థల విభాగాలు ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటూండటం కూడా తెలిసిన విషయమే. ఇవి భారీ స్థాయిలో రుణాలు, నష్టాల బారినపడి కునారిల్లుతున్నాయి. అందుకే ప్రభుత్వ రంగ సంస్థల అభివృద్ధి కోసం పెట్టుబడుల ఉపసంహరణ చర్యలు తప్పనిసరయ్యాయి. భారతదేశంలో నష్టాల బారిన పడుతున్న పీఎస్‌యూల సంఖ్య 2015–16లో 79 నుంచి 2019–20 సంవత్సరానికి 84కు చేరుకుంది. ఇదే కాలానికి లాభాలు ఆర్జిస్తున్న ప్రభుత్వ రంగ సంస్థల సంఖ్య 175 నుంచి 171కి పడిపోయిందని  ఆర్థిక శాఖ సహాయ మంత్రి పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాల్లో వివరించారు. వీటిలో 30 ప్రభుత్వ రంగ సంస్థల నష్టం ఇప్పటికే రూ. 1,06,879 కోట్లకు చేరుకుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఆస్తుల నగదీకరణ విధానం ప్రభుత్వానికి అదనపు రాబడులను తీసుకువస్తుంది.

2. పీఎస్‌యూలకు బడ్జెటరీ మద్దతును తగ్గించడం
ప్రభుత్వ రంగ సంస్థలు తమ మూలధన వ్యయ అవసరాలను నెరవేర్చుకోవడానికి, అంతర్జాతీయ సంస్థలకు రుణాలు తిరిగి చెల్లించడానికి,  కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏటా కొంత నగదును వాటికి అప్పగిస్తోంది. రుణ సేవలు, వీఆర్‌ఎస్‌ పథకాలు, ఉపశమన చర్యలు, రాయితీలు, ప్రత్యేక ప్యాకేజీలు వంటివి వీటికి అదనం.  ఉదాహరణకు, ఆర్థిక స్థితి దిగజారిపోయిన ఎంటీఎన్‌ఎల్, బీఎస్‌ఎన్‌ఎల్‌ సంస్థల పునరుద్ధరణ కోసం కేంద్రప్రభుత్వం రూ. 70 వేల కోట్ల ప్యాకేజీనీ ప్రకటించింది. ఆస్తుల నగదీకరణ వల్ల దేశ ఆర్థిక ఆరోగ్యం మెరుగుపడుతుంది. దీని వల్ల కేంద్ర ప్రభుత్వం పీఎస్‌యూలకు బడ్జెటరీ కేటాయింపులు కొన్ని సంవత్సరాల కాలంలో గణనీయంగా తగ్గుముఖం పడతాయని అంచనా. దీంతో కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏటా ఆర్థిక భారం నుంచి తప్పించుకోవచ్చు కూడా. పైగా కేంద్ర ప్రభుత్వ ఆర్థిక, ద్రవ్యస్థితి గణనీయంగా మెరుగుపడుతుంది. ప్రభుత్వం పీఎస్‌యూలకు తప్పనిసరిగా పెడుతున్న వ్యయాన్ని సామాజిక సంక్షేమ ప్రాజెక్టులు వంటివాటికి ఉపయోగించవచ్చు. 

3. కొత్త మౌలిక వసతుల కల్పనకు నిధులు లభ్యం
ప్రభుత్వం నగదీకరణ ద్వారా తన వద్ద నగదు నిల్వలను పెంచుకుంటే కొత్త ఆస్తులను సృష్టించవచ్చు. ఇది దానికదేగా ఉద్యోగాల కల్పనకు వీలు కల్పిస్తుంది. దీనివల్ల పెట్టుబడులను మరింతగా ఆకర్షించి, అభివృద్ధిని ముందుకు తీసుకుపోయే అవకాశం ఉంది. జీడీపీలో పెట్టుబడుల శాతం తగ్గుతూ వస్తోంది. అదే సమయంలో మహమ్మారి అనంతరం డిమాండు పునరుద్ధరణ చర్యలకు ప్రైవేట్‌ రంగం వేచి చూస్తోంది. ప్రభుత్వం రంగ సంస్థల వద్ద వనరులు తగ్గిపోయాయి.ఈ నేపథ్యంలో జాతీయ ఆస్తుల నగదీకరణ విధానం ఆర్థిక వ్యవస్థలోకి పెట్టుబడులను పునరుద్ధరిస్తుంది. కోవిడ్‌ –19 వల్ల ఏర్పడిన ఆర్థిక మందగమనం నుంచి భారత్‌ కోలుకునేలా చేయవచ్చు. పీఎస్‌యూలు నిర్మాణ రంగ నష్టాలను ఎదుర్కొంటున్నందున వాటి ఆస్తుల నగదీకరణను నిరంతరంగా చేపట్టాల్సి వస్తోంది. అదే సమయంలో ప్రైవేట్‌ రంగం నష్టభయం లేని ఆస్తుల అండతో ముందుకెళుతోంది. పైగా పర్యావరణ అనుమతులు, ప్రాజెక్టుల జాప్యం ద్వారా నష్టం, వ్యాజ్యాలు వంటివి ప్రైవేట్‌ రంగానికి ఉండవు.

4. ఉద్యోగాలు, పెట్టుబడులకు కొత్త అవకాశాలు
ప్రభుత్వ ఆస్తుల నగదీకరణ ద్వారా ఆశిస్తున్న నగదు పరిమాణంతో ప్రభుత్వరంగ పరిశ్రమల విలువ అమాంతం పెరుగుతుంది. దీనివల్ల ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న గతి శక్తి ప్రణాళికకు గొప్ప చేయూత లభిస్తుంది. ఈ పథకం కింద కేంద్రప్రభుత్వం రూ. 100 లక్షల కోట్ల విలువైన మౌలిక వసతుల కల్పనను ప్రకటించింది. ప్రభుత్వ, ప్రైవేట్‌ భాగస్వామ్యంలో సాగే ఆ సృజనాత్మక పద్ధతి వల్ల కార్పొరేట్‌ రంగం ఆకాంక్షలకు ఊతం లభిస్తుంది. ప్రైవేట్‌ రంగానికి ప్రభుత్వ ఆస్తులను కట్టబెట్టడం వల్ల ఆర్థిక వ్యవస్థ బహువిధాలుగా లాభపడుతుంది. ఇంతవరకు ఉపయోగంలో లేకుండా వృథాగా పడివున్న ఆస్తులను ప్రైవేట్‌ రంగం సమర్థంగా ఉపయోగించుకుని కొత్త ఉద్యోగావకాశాలను ఇతోధికంగా పెంచగలుగుతుంది. ప్రభుత్వ రంగ ఆస్తులను వీలైనంతవరకు విడుదల చేసి ఆర్థిక వ్యవస్థను ముందుకు తీసుకెళ్లేందుకు తగిన సమయం ఆసన్నమైందని, ప్రభుత్వం దృఢ నిర్ణయాలు తీసుకొనక తప్పటం లేదని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ పేర్కొనడం గమనార్హం.

– అమితాబ్‌ తివారీ, ఆర్థిక రంగ విశ్లేషకులు
(యాహూ సౌజన్యంతో) 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement