వంటింటికి మహాభాగ్యం!
* లక్ష ఇళ్లకు గ్యాస్ పైప్‌లైన్
* బీజీఎల్ విస్తరణకు కేంద్రం చర్యలు
* కేంద్రమంత్రి ప్రకటనతో చిగురించిన ఆశలు
సాక్షి, సిటీబ్యూరో: మహానగరానికి పైప్‌లైన్ ద్వారా వంటగ్యాస్ అందించే ప్రాజెక్టులో కదలిక వచ్చింది. ఐదేళ్లుగా సా...గుతున్న పనులు.. కేంద్ర పెట్రోలియం మంత్రి ప్రకటనతో ఆశలు చిగురించాయి. వచ్చే రెండేళ్లలో లక్ష ఇళ్లకు, ఐదేళ్లలో రెండున్నర లక్షల ఇళ్లకు పైప్‌లైన్ ద్వారా పైప్‌డ్ నేచురల్ గ్యాస్ (పీఎన్‌జీ)ని అందించేందుకు ప్రభుత్వం ప్రత్యేక కార్యచరణ రూపొందించింది.
ఇందుకోసం నగరానికి పైప్‌లైన్ ద్వారా గ్యాస్ సరఫరా చేస్తున్న భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ (బీజీఎల్) సంస్థను బలోపేతం చేయనుంది. సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ ప్రాజెక్టును సైతం విస్తరించేందుకు చర్యలు చేపట్టింది. ఇప్పటికే అదనంగా పైప్‌లైన్ల నిర్మాణానికి టెండర్ల ప్రక్రియ కూడా పూర్తయింది. వంట గ్యాస్‌తో పాటు సీఎన్జీ స్టేషన్లను కూడా పెంచేందుకు చర్యలు చేపట్టింది. కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ హైదరాబాద్ పర్యటన సందర్భంగా పైప్‌లైన్ పనులపై బీజీఎల్ ప్రతినిధులతో చర్చించారు. మరోమారు క్షేత్ర స్థాయి పరిశీలన కోసం కేంద్ర మంత్రి నగరానికి రానున్నారు.
ఐదేళ్లుగా నత్తనడకనే..
హైదరాబాద్‌లో ఇంటింటికి పైప్‌లైన్ ద్వారా వంట గ్యాస్ (పీఎన్‌జీ), వాహనాలకు కంప్రెస్డ్ నాచురల్ గ్యాస్ (సీఎన్‌జీ) అందించాలన్న లక్ష్యంతో ప్రారంభమైన ‘భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్’ (బీజీఎల్) సంస్థ సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ ప్రాజెక్టు పనులు ఐదేళ్లుగా ఒక అడుగు ముందుకు మూడడుగులు వెనక్కి అన్న చందంగా సాగుతున్నాయి. శామీర్‌పేటలో మదర్ స్టేషన్‌ను ఏర్పాటు చేసి 2011 నవంబర్ 21న సిటీ ప్రాజెక్టుకు బీజీఎల్ శ్రీకారం చుట్టింది.
ఐదేళ్లలో 2.66 లక్షల కుటుంబాలకు పైప్‌లైన్ ద్వారా వంటగ్యాస్, 50 స్టేషన్ల ద్వారా సీఎన్‌జీ గ్యాస్ అందించాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది. మొదటి విడతగా 2014 ఏప్రిల్ నాటికి లక్ష కుటుంబాలకు పైప్‌లైన్ ద్వారా గ్యాస్ సరఫరా చేయాలని లక్ష్యంగా నిర్ణయించింది. అయితే, ఇప్పటికి కేవలం 1140 ఇళ్లకు మాత్రమే సరఫరా చేసింది. భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ సంస్థ పీఎన్‌జీ, సీఎన్‌జీ విస్తరణ కోసం రూపొందించిన ప్రణాళిక కూడా కాగితాలకే పరిమితమైంది. ఐదేళ్లలో శామీర్‌పేట నుంచి కుత్బుల్లాపూర్ వరకు 33 కిలో మీటర్ల పనులు మాత్రమే జరిగాయి. బంజారాహిల్స్, మాదాపూర్, జూబ్లిహిల్స్ ప్రాంతాలకు సైతం పైప్‌లైన్ నిర్మాణ పనులు పడకేశాయి. తాజాగా కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించడంతో పనుల్లో కదలికలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.
సీఎన్‌జీ అంతంతే..
భాగ్యనగరాన్ని పూర్తి స్థాయిలో సీఎన్‌జీ అందుబాటులోకి తెచ్చే ప్రక్రియ సైతం ఆచరణకు నోచుకోలేదు. శామీర్‌పేటలో మదర్ స్టేషన్‌ను నిర్మించి సీఎన్‌జీని అందుబాటులో తెచ్చినా.. డిమాండ్‌కు తగ్గట్టు గ్రిడ్ నుంచి గ్యాస్ సరఫరా లేదు. వాస్తవంగా నగరంలో ప్రజా రవాణకు వినియోగించే 85 వేల ఆటోలు, 7,500 బస్సులు, 20 వేలకు పైగా టాక్సీలు ఉన్నాయి. వీటికి రోజుకు సగటున 7,62,500 కిలోల (1.067 ఎస్‌సీఎండీ) సీఎన్‌జీ అవసరం ఉంటుందని బీజీఎల్ అంచనా వేసింది. అందుకు అనుగుణంగా సరఫరా చేయాలని సంస్థ సిద్ధమైంది.
ప్రాజెక్టు ప్రారంభించిన తొలిదశలో మేడ్చల్, హకీంపేట, కంటోన్మెంట్ తదితర డి పోలకు చెందిన 350 ఆర్టీసీ బస్సులకు సీఎన్‌జీ సరఫరా చేస్తామని ప్రకటించింది. అయితే, కొద్ది రోజులు 164 బస్సులకు సరఫరా చేసి, ప్రస్తుతం 110 బస్సులకే పరిమితమైంది. నగరంలో మొత్తం 20 సీఎన్‌జీ స్టేషన్లు ఉండగా, అందులో ఆర్టీసీకి 3, ప్రయివేటు వాహనాల కోసం 17 ఉన్నాయి. వీటిలో రెండింటిని బీజీఎల్ సంస్థ నిర్వహిస్తోంది. ప్రస్తుతం నగరంలో సీఎన్‌జీ వాహనాలు 23 వేలకు మించి లేవు. ఢిల్లీలో మాత్రం 10 లక్షల వాహనాలు ఉన్నాయి. నగరంలో సైతం అదే స్థాయిలో విస్తరించేందుకు మరిన్ని సీఎన్‌జీ బంకులను ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది.