వ్యర్థాలన్నీ మా నెత్తిపైనా?
⇒ రూ.70 వేలకు మా బతుకులను పణంగా పెట్టమంటారా?
⇒ 45 కంపెనీల పైపులైన్‌కు ప్యాకేజీ ఇదేనా?
⇒ పైపులైన్‌తో మాకు భవిష్యత్తే ఉండదు
⇒ డిమాండ్లు నెరవేర్చే వరకు అనుమతిచ్చే ప్రసక్తే లేదు
⇒ కలెక్టర్ ఎదుట కుండబద్దలు కొట్టిన పూడిమడక గ్రామస్తులు
విశాఖపట్నం: ‘45 కంపెనీల వ్యర్థాలను మా గ్రామం వద్ద సముద్రంలో కలిపేందుకు పైపులైన్ వేస్తా మంటున్నారు. రసాయన వ్యర్థాలు సముద్రంలో కలిస్తే ఇక మాకు జీవనోపాధి ఎక్కడ ఉంటుంది. ఈ ప్రాంతంలో ఎక్కడైనా మత్స్యసంపద కాదు కదా.. కనీసం చేప పిల్లకూడా దొరకదు. మేం ఎలాబతకాలి. మా పిల్లల్ని ఎలా పోషించుకోవాలో మీరే చెప్పండి. మీరిచ్చే రూ.70 వేలకు మా వందేళ్ల జీవితాన్ని పణంగా పెట్టమంటారా?’ అంటూ అచ్యుతాపురం మండలం పూడిమడక గ్రామస్తులు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ప్రతిసారి ఇలా కలెక్టరేట్‌లో సమావేశాలు పెట్టడం.. ప్యాకేజీ ఇస్తాం.. పైపులైన్ నిర్మాణానికి అడ్డుపడొద్దంటూ ఒత్తిడితేవడంసరి కాదు. మాప్రాంతంలో కాలుష్యం వెదజల్లే పరిశ్రమల ఏర్పాటుకు, కలుషిత వ్యర్థాలను మా గ్రామం వద్ద సముద్రంలో కలిపేందుకు అత్యుత్సాహం చూపే మీరు.. మా భవిష్యత్ కోసం ఆలోచించరా? అంటూ ప్రశ్నించారు.
కలెక్టరేట్ కార్యాలయంలో మంగళవారం పూడిమడక పైపులైన్ నిర్మాణ విషయమై మత్స్యకార సంఘాల నాయకులతో కలెక్టర్ డాక్టర్ ఎన్.యువరాజ్ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. సమావేశంలో పూడిమడక గ్రామస్తుల తరపున మత్స్యకార సంఘాల నాయకులు మాట్లాడుతూ పైపులైన్ ఏర్పాటుకు తాము వ్యతి రేకం కాదని.. మా బతుకులకు భరోసా ఇవ్వమని మాత్రమే కోరుతున్నామని చెప్పారు. రూ.70 వేల ప్యాకేజీకి మేమంతా ఒప్పంకుంటున్నట్టు ప్రకటనలు ఇవ్వడం ఎంతవరకు సమంజసమని, 45 కంపెనీలకు చెందిన పైపులైన్‌కు ఇచ్చే ప్యాకేజీ ఇదేనా అని వారు ప్రశ్నించారు. తక్షణమే మా గ్రామాన్ని పూర్తిగా దత్తత తీసుకొని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలని డిమాండ్ చేశారు. పదవతరగతి విద్యార్హత ఉన్న ప్రతీ ఒక్కరికి రూ.6 వేల కనీస వేతనంతో ఆయా కంపెనీల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించాలని, ట్రైనింగ్ పూర్తిచేసుకున్న 600 మందికి ఉపాధి కల్పించాలన్నారు. విద్యార్హత లేని 40ఏళ్ల నిండిన వారికి రిహేబిటేషన్ కార్డు ఇప్పించాలని కోరారు. ఏపీఎస్‌ఈజెడ్ పరిధిలో కనీసం 4వేల స్టయిఫండ్‌తో అన్నిరకాల ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్ ఏర్పాటుచేయాలని, ఇక్కడ ట్రైనింగ్ పూర్తి చేసిన ప్రతీ ఒక్కరికి స్థానిక పరిశ్రమల్లో ఉద్యోగాలు కల్పించాలని డిమాండ్ చేశారు. కులవృత్తుల వారికి పర్మినెంట్ వర్క్ కార్డు ఇప్పించాలని, అగ్రిమెంట్ ప్రకారమే కాకుండా ఏటా 150 నుంచి 200 మంది స్థాని క యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్నారు.
పైపులైన్ ద్వారా వచ్చే వ్యర్థాల వలన ఎన్టీపీసీ కంపెనీ ద్వారా వచ్చే కాలుష్యం బారిన పడి అనారోగ్యాల పాలవుతున్న గ్రామస్తుల కోసం ఓ ఉచిత మల్టీస్పెషాలిటీ ఆస్పత్రి నిర్మించాలన్నారు. గ్రామంలోని పిల్లలకు కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య అందించాలని, ప్రకృతి వైపరీత్యాల నుంచి కాపాడేందుకు రక్షణ గోడతో పాటు జెట్టీ నిర్మించాలని కోరారు.
ప్రతి ఒక్కరికి ఉద్యోగం: పైపులైన్ నిర్మాణ విషయంలో మత్స్యకార కుటుంబానికి ప్రత్యేక ప్యాకేజీ కింద రూ.70వేలు ఇస్తామని, ప్రతీ కుటుంబంలో అర్హులైన ఒకరికి ఉద్యోగ అవకాశం కల్పిస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు. ఇప్పటికే సర్వే పూర్తయిందని. గ్రామంలో 398 మంది డిగ్రీ చదువు కున్నట్టు గుర్తించామని, మరికొంత మంది యువతకు సాంకేతిక విద్యార్హతలను బట్టి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామన్నారు. జెట్టీ నిర్మాణానికి అవసరమైన డీపీఆర్ తయారీకి ఏజెన్సీని త్వరలో ఖరారుచేస్తామని చెప్పారు. ఇతర డిమాండ్లను ప్రభుత్వానికి నివేదిస్తామని, సీజన్ దాటిపోకుండా ఆఫ్‌షోర్ పైపులైన్ నిర్మాణానికి గ్రామస్తులు అనుమతించాలని కలెక్టర్ విజ్ఞప్తి చేసినా, మత్స్యకార సంఘ నాయకులు మాత్రం ససేమిరా అన్నారు. ప్యాకేజీ మొత్తాన్ని పెంచాల్సిందేనని, తాము సూచించిన డిమాండ్లను పరిష్కరించేంత వరకు పైపులైన్ నిర్మాణాన్ని అడ్డుకుంటామని తేల్చి చెప్పారు. ఈ సమావేశంలో కలెక్టర్ జె.నివాస్, అనకాపల్లి ఆర్డీవో పద్మావతి, ఎస్‌డీసీ సత్తిబాబు, ఏపీఐఐసీ జెడ్‌ఎం యతిరాజు, మత్స్యశాఖ జేడీ కోటేశ్వరరావు, వైఎస్సార్‌సీపీ యలమంచిలి సమన్వయకర్త ప్రగడ నాగేశ్వరరావు, స్థానిక మత్స్యకార నాయకులు చినరాజలు, చేపల శ్రీరాములు, మేరుగ బాపు నాయుడు తదితరులు పాల్గొన్నారు.