Chemical waste
-
రసాయన వ్యర్థాల తరలింపుతో ఉద్రిక్తత
మరికల్: నారాయణపేట జిల్లా మరికల్ మండలంలో ఇథనాల్ కంపెనీ నుంచి వ్యర్థాల తరలింపు వ్యవహారం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. వ్యర్థాలను తరలిస్తున్న ట్యాంకర్‌ను స్థానికులు అడ్డుకోవడంతో ఈ పరిస్థితి తలెత్తింది. శనివారం రాత్రి నుంచి ఆదివారం ఉదయం 11 గంటలవరకు హైడ్రామా నడిచింది. రాస్తారోకో చేస్తున్న గ్రామస్తులపై పోలీసులు లాఠీచార్జి చేయడంతో వారు తిరగబడి ఎదురు దాడి చేశారు. వివరాలిలా ఉన్నాయి.. శనివారం రాత్రి 8 గంటల సమయంలో జూరాల ఆగ్రో ఇథనాల్ కంపెనీ నుంచి ఓ ట్యాంకర్ రసాయన వ్యర్థాలను నింపుకొని బయటకు వచ్చింది. ఆ వ్యర్థాలను మరికల్ మండలం ఎక్లాస్పూర్, జిన్నారం గ్రామాల శివారులో పారపోస్తున్నారని స్థానికులు ట్యాంకర్‌ను అడ్డుకొని ఆందోళనకు దిగారు. శనివారం రాత్రి నుంచి ఆదివారం ఉదయం 11 గంటల వరకు గ్రామస్తులు ఆత్మకూర్ రోడ్డుపై ఆందోళన చేయడంతో మరికల్, మక్తల్, కృష్ణ, నర్వ, ధన్వాడ మాగనూర్ పోలీసులతోపాటు స్పెషల్ పార్టీ పోలీసులు రంగంలో దిగారు. ఈ నేపథ్యంలో పోలీసులకు, గ్రామస్తులకు మధ్య వాగ్వాదం, తోపులాట చోటుచేసుకుంటుంది. నారాయణపేట డీఎస్పీ సత్యనారాయణ ఆందోళనకారులను అదుపు చేయాలని చెప్పడంతో పోలీసులు వారిపై లాఠీచార్జీ చేశారు. దీంతో పలువురికి గాయాలయ్యాయి. అదే సమయంలో ట్యాంకర్‌ను పోలీసుల బందోబస్తు మధ్య తరలించడంతో కోపోద్రిక్తులైన గ్రామస్తులు రాళ్లు, ఇటుకలు, కర్రలతో పోలీసులపైకి దాడికి దిగారు. దీంతో అక్కడి నుంచి ప్రాణాలతో బయటపడేందుకు పోలీసులు పరుగులు పెట్టగా.. మక్తల్ సీఐ రాంలాల్‌ను కొందరు పొల్లాలో వెంబడించి తీవ్రంగా గాయపర్చారు. గాయపడిన మరికొంత మంది పోలీసులు పక్కనే ఉన్న ఆలయంలోకి వెళ్లి దాక్కున్నారు. ఆందోళనకారులు ఒక పోలీసు వాహనంతోపాటు రెండు బైక్‌లకు నిప్పంటించడంతో పూర్తిగా దగ్ధమయ్యాయి. డీఎస్పీ వాహనంతోపాటు మరో మూడు వాహనాల అద్దాలను ధ్వంసం చేశారు. గాయపడిన పోలీసులను ఆస్పత్రికి తరలించారు. కాగా, ఆందోళనకు కారణమైన వారి కోసం గాలిస్తున్నట్లు డీఎస్పీ సత్యనారాయణ తెలిపారు. -
రొయ్యల చెరువులపై చర్యలు చేపట్టాలి
సాక్షి, పోడూరు: పెనుమంట్ర మండలం పొలమూరు గ్రామ శివారు చెన్నాడచెరువు ఎస్సీకాలనీ సమీపంలో రొయ్యల చెరువుల నుంచి వదిలిన మురుగునీటితో కాలనీ ప్రాంతం ముంపునకు గురవుతోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చెన్నాడచెరువు ఎస్సీ కాలనీలో సుమారు 100 కుటుంబాలు నివసిస్తున్నాయి. ఆ సమీపంలో అనుమతులు లేకుండా రొయ్యల చెరువులు తవ్వి సాగు చేస్తున్నారు. ఆ చెరువుల నుంచి వదిలే మురుగు నీటితో తమ ప్రాంతం నీట మునిగి నరకయాతన పడుతున్నామని ఆ ప్రాంత ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రసాయనాలతో కూడిన మురుగునీటి వల్ల తీవ్ర అనారోగ్యం పాలవుతున్నామని, ప్రాణాంతక వ్యాధుల బారిన పడుతున్నామని వాపోతున్నారు. ఈ దుస్థితిపై తాము అనేకసార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా ఎటువంటి చర్యలు తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా స్థాయిలో అధికారులు స్పందించి రొయ్యల చెరువులపై చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ ప్రాంతంలో పూర్వం కేటాయించిన ఇళ్ల స్థలాలు కొన్ని ఖాళీగా ఉన్నాయనీ, వాటిని అర్హులైన పేదలకు పంపిణీ చేయాలని సూచిస్తున్నారు. -
సిటీ గొంతులో గరళం
►గ్రేటర్లో కలుషితమవుతోన్న భూగర్భ జలం ►ఎన్జీఆర్ఐ అధ్యయనంలో వెల్లడి ►ముప్పు తప్పదంటున్న నిపుణులు సిటీబ్యూరో: నగరం గొంతులో గరళం పడుతోంది. ఇప్పటికే తాగునీటి కోసం అల్లాడుతున్న జనం.. కాలుష్య జలాలతో గొంతు తడుపుకొనే పరిస్థితి నెలకొంది. మండు టెండలకు గ్రేటర్లో భూగర్భ జలసిరి ఆవిరయ్యే విషమ పరిస్థితుల్లో ఇది మరో విపత్తు. మహానగరానికి ఆనుకొని ఉన్న పలు పారిశ్రామిక వాడలు, వాటికి ఆనుకొని ఉన్న ప్రాంతాల్లో భూగర్భ జలాలు భయంకర మైన కాలుష్యం కోరల్లో చిక్కుకున్నాయని జాతీయ భూభౌతిక పరిశోధన సంస్థ (ఎన్జీఆర్ఐ) తాజా నివేదికలో పేర్కొంది. 160 ప్రాంతాల్లో పరీక్షలు గ్రేటర్ పరిధిలోని పారిశ్రామిక వాడల్లో భూగర్భ జలాలు హాలాహలంగా మారాయని ఎన్జీఆర్ఐ నిగ్గుతేల్చడం ఆందోళన కలిగిస్తోంది. దశాబ్దాలుగా పరిశ్రమల నుంచి వెలువడుతున్న రసాయన వ్యర్థాలను పరిశ్రమల యజమానులు స్థానిక చెరువులు, కుంటలు, ఖాళీ ప్రాంతాల్లోకి వదిలిపెడుతున్నారు. దీంతో దశాబ్దాలుగా ఈ నీరంతా క్రమంగా భూమిలోకి ఇంకడంతో ఈ దుస్థితి తలెత్తిందని అధ్యయనంలో పేర్కొంది. 13 పారిశ్రామికవాడల పరిధిలోని 160 ప్రదేశాల నుంచి భూగర్భ జలాల, చెరువుల నీటి నమూనాలను ఎన్జీఆర్ఐ సేకరించి పరీక్షలు నిర్వహించింది. నాచారం, ఉప్పల్, మల్లాపూర్, చర్లపల్లి, కాటేదాన్, ఖాజీపల్లి, బాలానగర్, సనత్‌నగర్, జీడిమెట్ల, బొంతపల్లి, పటాన్చెరువు, బొల్లారం, పాశమైలారం పారిశ్రామికవాడల పరిధిలో నీటి నమూనాలు సేకరించి పరీక్షలు చేసింది. ఈ పరీక్షలు దశాబ్ధాలు పీసీబీ నిర్లక్ష్యానికి అద్దంపట్టాయి. ఆందోళనకరంగా భారలోహాల ఉనికి.. పలు పారిశ్రామిక వాడల్లోని భూగర్భ జలాల్లో భారలోహలు ఉన్నట్టు ఎన్జీఆర్ఐ నిర్థారించింది. అనేక లోహాలు ప్రమాదస్థాయి మించకపోయినా ఏళ్లతరబడి పరిశ్రమల నుంచి విచక్షణా రహితంగా విడుదల చేసిన రసాయన వ్యర్థాలకు ఇది నిదర్శమని పేర్కొంది. ప్రధానంగా ఖాజిపల్లి, కుత్బుల్లాపూర్, జీడిమెట్ల, బాలానగర్, సనత్‌నగర్, కాటేదాన్ ప్రాంతాల్లోని భూగర్భ జలాల్లో భారలోహాలైన లెడ్, క్యాడ్మియం, మాలిబ్డనం, ఆర్సినిక్ వంటి లోహాల ఉనికి బయటపడడం ఆందోళన కలిగిస్తోంది. ఈ నీటితో అనర్థాలే.. ►భార లోహాలున్న నీటిని తాగిన చిన్నారుల్లో శారీరక, మానసిక ఎదుగుదల ఆగిపోతుంది. ►గర్భస్రావాలు జరిగే ప్రమాదం ఉంది. ► క్రోమియం వల్ల క్యాన్సర్ ముప్పు అధికం. ► శ్వాసకోశ, జీర్ణకోశ వ్యాధులతో సమస్యలు తప్పవు. ►మూత్రపిండాలు దెబ్బతినే ప్రమాదం అధికంగా ఉంది. ►కాలేయం దెబ్బతింటుంది. ►ఈ నీటితో సాగుచేసిన కూరగాయలు తిన్నవారికి తీవ్ర అనారోగ్యం తప్పదు. -
వ్యర్థాలన్నీ మా నెత్తిపైనా?
⇒ రూ.70 వేలకు మా బతుకులను పణంగా పెట్టమంటారా? ⇒ 45 కంపెనీల పైపులైన్‌కు ప్యాకేజీ ఇదేనా? ⇒ పైపులైన్‌తో మాకు భవిష్యత్తే ఉండదు ⇒ డిమాండ్లు నెరవేర్చే వరకు అనుమతిచ్చే ప్రసక్తే లేదు ⇒ కలెక్టర్ ఎదుట కుండబద్దలు కొట్టిన పూడిమడక గ్రామస్తులు విశాఖపట్నం: ‘45 కంపెనీల వ్యర్థాలను మా గ్రామం వద్ద సముద్రంలో కలిపేందుకు పైపులైన్ వేస్తా మంటున్నారు. రసాయన వ్యర్థాలు సముద్రంలో కలిస్తే ఇక మాకు జీవనోపాధి ఎక్కడ ఉంటుంది. ఈ ప్రాంతంలో ఎక్కడైనా మత్స్యసంపద కాదు కదా.. కనీసం చేప పిల్లకూడా దొరకదు. మేం ఎలాబతకాలి. మా పిల్లల్ని ఎలా పోషించుకోవాలో మీరే చెప్పండి. మీరిచ్చే రూ.70 వేలకు మా వందేళ్ల జీవితాన్ని పణంగా పెట్టమంటారా?’ అంటూ అచ్యుతాపురం మండలం పూడిమడక గ్రామస్తులు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ప్రతిసారి ఇలా కలెక్టరేట్లో సమావేశాలు పెట్టడం.. ప్యాకేజీ ఇస్తాం.. పైపులైన్ నిర్మాణానికి అడ్డుపడొద్దంటూ ఒత్తిడితేవడంసరి కాదు. మాప్రాంతంలో కాలుష్యం వెదజల్లే పరిశ్రమల ఏర్పాటుకు, కలుషిత వ్యర్థాలను మా గ్రామం వద్ద సముద్రంలో కలిపేందుకు అత్యుత్సాహం చూపే మీరు.. మా భవిష్యత్ కోసం ఆలోచించరా? అంటూ ప్రశ్నించారు. కలెక్టరేట్ కార్యాలయంలో మంగళవారం పూడిమడక పైపులైన్ నిర్మాణ విషయమై మత్స్యకార సంఘాల నాయకులతో కలెక్టర్ డాక్టర్ ఎన్.యువరాజ్ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. సమావేశంలో పూడిమడక గ్రామస్తుల తరపున మత్స్యకార సంఘాల నాయకులు మాట్లాడుతూ పైపులైన్ ఏర్పాటుకు తాము వ్యతి రేకం కాదని.. మా బతుకులకు భరోసా ఇవ్వమని మాత్రమే కోరుతున్నామని చెప్పారు. రూ.70 వేల ప్యాకేజీకి మేమంతా ఒప్పంకుంటున్నట్టు ప్రకటనలు ఇవ్వడం ఎంతవరకు సమంజసమని, 45 కంపెనీలకు చెందిన పైపులైన్‌కు ఇచ్చే ప్యాకేజీ ఇదేనా అని వారు ప్రశ్నించారు. తక్షణమే మా గ్రామాన్ని పూర్తిగా దత్తత తీసుకొని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలని డిమాండ్ చేశారు. పదవతరగతి విద్యార్హత ఉన్న ప్రతీ ఒక్కరికి రూ.6 వేల కనీస వేతనంతో ఆయా కంపెనీల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించాలని, ట్రైనింగ్ పూర్తిచేసుకున్న 600 మందికి ఉపాధి కల్పించాలన్నారు. విద్యార్హత లేని 40ఏళ్ల నిండిన వారికి రిహేబిటేషన్ కార్డు ఇప్పించాలని కోరారు. ఏపీఎస్ఈజెడ్ పరిధిలో కనీసం 4వేల స్టయిఫండ్‌తో అన్నిరకాల ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్ ఏర్పాటుచేయాలని, ఇక్కడ ట్రైనింగ్ పూర్తి చేసిన ప్రతీ ఒక్కరికి స్థానిక పరిశ్రమల్లో ఉద్యోగాలు కల్పించాలని డిమాండ్ చేశారు. కులవృత్తుల వారికి పర్మినెంట్ వర్క్ కార్డు ఇప్పించాలని, అగ్రిమెంట్ ప్రకారమే కాకుండా ఏటా 150 నుంచి 200 మంది స్థాని క యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్నారు. పైపులైన్ ద్వారా వచ్చే వ్యర్థాల వలన ఎన్టీపీసీ కంపెనీ ద్వారా వచ్చే కాలుష్యం బారిన పడి అనారోగ్యాల పాలవుతున్న గ్రామస్తుల కోసం ఓ ఉచిత మల్టీస్పెషాలిటీ ఆస్పత్రి నిర్మించాలన్నారు. గ్రామంలోని పిల్లలకు కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య అందించాలని, ప్రకృతి వైపరీత్యాల నుంచి కాపాడేందుకు రక్షణ గోడతో పాటు జెట్టీ నిర్మించాలని కోరారు. ప్రతి ఒక్కరికి ఉద్యోగం: పైపులైన్ నిర్మాణ విషయంలో మత్స్యకార కుటుంబానికి ప్రత్యేక ప్యాకేజీ కింద రూ.70వేలు ఇస్తామని, ప్రతీ కుటుంబంలో అర్హులైన ఒకరికి ఉద్యోగ అవకాశం కల్పిస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు. ఇప్పటికే సర్వే పూర్తయిందని. గ్రామంలో 398 మంది డిగ్రీ చదువు కున్నట్టు గుర్తించామని, మరికొంత మంది యువతకు సాంకేతిక విద్యార్హతలను బట్టి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామన్నారు. జెట్టీ నిర్మాణానికి అవసరమైన డీపీఆర్ తయారీకి ఏజెన్సీని త్వరలో ఖరారుచేస్తామని చెప్పారు. ఇతర డిమాండ్లను ప్రభుత్వానికి నివేదిస్తామని, సీజన్ దాటిపోకుండా ఆఫ్‌షోర్ పైపులైన్ నిర్మాణానికి గ్రామస్తులు అనుమతించాలని కలెక్టర్ విజ్ఞప్తి చేసినా, మత్స్యకార సంఘ నాయకులు మాత్రం ససేమిరా అన్నారు. ప్యాకేజీ మొత్తాన్ని పెంచాల్సిందేనని, తాము సూచించిన డిమాండ్లను పరిష్కరించేంత వరకు పైపులైన్ నిర్మాణాన్ని అడ్డుకుంటామని తేల్చి చెప్పారు. ఈ సమావేశంలో కలెక్టర్ జె.నివాస్, అనకాపల్లి ఆర్డీవో పద్మావతి, ఎస్డీసీ సత్తిబాబు, ఏపీఐఐసీ జెడ్ఎం యతిరాజు, మత్స్యశాఖ జేడీ కోటేశ్వరరావు, వైఎస్సార్సీపీ యలమంచిలి సమన్వయకర్త ప్రగడ నాగేశ్వరరావు, స్థానిక మత్స్యకార నాయకులు చినరాజలు, చేపల శ్రీరాములు, మేరుగ బాపు నాయుడు తదితరులు పాల్గొన్నారు. -
సాగర మథనానికి సై...
రసాయన వ్యర్థాలు నాలాల్లోకి చేరకుండా చర్యలు రూ.40 కోట్లతో నాలా మళ్లింపు పనులకు శ్రీకారం ఫతేనగర్, జీడిమెట్లలోని పరిశ్రమల తరలింపు 170 ఎలక్ట్రోప్లేటింగ్ పరిశ్రమలు తూప్రాన్‌కు ఫార్మా కంపెనీలు దశలవారీగా ఫార్మాసిటీకి చారిత్రక హుస్సేన్‌సాగర్ ప్రక్షాళనకు రంగం సిద్ధమవుతోంది. నిత్యం సాగర్‌లో చేరుతున్న 400 మిలియన్ లీటర్ల పారిశ్రామిక వ్యర్థ జలాలను దారిమళ్లించేందుకు అధికారులు పథకం రచించారు. రూ.40 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన నాలా మళ్లింపు పనులను నాలుగు ప్యాకేజీలుగా విభజించి టెండర్లు పిలిచారు. తాజాగా టెండర్ల మూల్యాంకన ప్రక్రియ మొదలుపెట్టారు. మరో పక్షం రోజుల్లో నాలా మళ్లింపు పనులు చేపట్టనున్నారు. దీంతో ‘క్లీన్ హుస్సేన్ సాగర్’ కోసం అడుగులు ముందుకు పడుతున్నాయి.. - సాక్షి, సిటీబ్యూరో కాలుష్య కోరల్లో చిక్కి శల్యమవుతోన్న చారిత్రక హుస్సేన్‌సాగర్‌ను పరిశుద్ధ సాగరంగా మార్చేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఈ వేసవిలో జలాశయాన్ని పూర్తిగా ఖాళీచేసి సాగరగర్భంలో పేరుకుపోయిన పారిశ్రామిక వ్యర్థాలను తొలగించేందుకు ఆయా విభాగాల అధికారులు నడుం బిగించారు. ముఖ్యంగా కూకట్పల్లి, జీడిమెట్ల, బాలానగర్ తదితర పారిశ్రామిక వాడల నుంచి నిత్యం వచ్చి చేరుతున్న 400 మిలియన్ లీటర్ల పారిశ్రామిక వ్యర్థజలాలు జలాశయంలోకి చేరకుండా ఉండేందుకు కూకట్పల్లి నాలాను నేరుగా అంబర్‌పేట్‌లోని మురుగు శుద్ధి కేంద్రానికి మళ్లించి అక్కడ వ్యర్థజలాలను శుద్ధిచేసి మూసీలో కలిపేందుకు రంగం సిద్ధంచేశారు. ఈ పనులకు సంబంధించి రూ.40 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన నాలా మళ్లింపు పనులను నాలుగు ప్యాకేజీలుగా విభజించి జలమండలి టెండర్లు పిలిచింది. తాజాగా టెండర్ల మూల్యాంకన ప్రక్రియ మొదలుపెట్టింది. మరో పక్షం రోజుల్లో నాలా మళ్లింపు పనులు చేపట్టనున్నారు. ప్రక్షాళన పర్వం ఇలా.. ఫతేనగర్, జీడిమెట్ల పరిసర ప్రాంతాల్లో ఉన్న 170 ఎలక్ట్రోప్లేటింగ్ పరిశ్రమల నుంచి వస్తున్న క్యాడ్మియం, కోబాల్ట్ వంటి హానికారక మూలకాలు, రసాయన వ్యర్థాలు కూకట్పల్లి నాలాలోకి చేరుతున్నాయి. అక్కడి నుంచి అవి హుస్సేన్‌సాగర్‌లో కలుస్తున్నాయి. రసాయనాల డ్రమ్ములను క్లీనింగ్ చేశాక వెలువడే కలుషిత జలాల్ని సైతం నాలాలోకి వదులుతున్నారు. ఈ రసాయన వ్యర్థాలు కూకట్పల్లి నాలాలోకి చేరకుండా ఉండేందుకు ఆయా పరిశ్రమలను ఔటర్‌కు ఆవల మెదక్ జిల్లాలోని తూప్రాన్ సమీపంలో ఎంపిక చేసిన ఖాళీ ప్రదేశంలోకి తరలించాలని నిర్ణయించారు. ఔటర్ రింగ్‌రోడ్డు లోపల అత్యధిక కాలుష్యం వెదజల్లే రెడ్ కేటగిరీ పరిశ్రమలనేవి లేకుండా చేస్తారు. ఆయా పరిశ్రమల వారికి కూడా ఇబ్బందిలేకుండా అవసరమైన సదుపాయాలు కల్పిస్తారు. పరిశ్రమలపై ఆధారపడిన కార్మికుల కుటుంబాల జీవనోపాధికి ఢోకా లేకుండా ఉండేలా చూస్తారు. పరిశ్రమలను అక్కడకు తరలించినా వివిధ సంస్థల నుంచి వాటికందే ప్రోత్సాహకాలు కొనసాగేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. అవసరమైతే ప్రత్యేక ప్రోత్సాహకాలు ఇవ్వనున్నారు. పరిశ్రమలను అక్కడకు తరలించేందుకు, అక్కడ తగిన మౌలిక సదుపాయాలు కల్పించాల్సిన బాధ్యత తెలంగాణా రాష్ట్ర పరిశ్రమల మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ(టీఎస్ఐఐసీ) తీసుకోనుంది. ఏప్రిల్ నెలాఖరులోగా ఈ పని పూర్తిచేయాలని ప్రాథమికంగా నిర్ణయించారు. వీలైనన్ని వ్యర్థాల శుద్ధి కేంద్రాలు(కామన్ ఎఫ్లూయెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్స్)ను ఏర్పాటు చేసి రసాయనవ్యర్థాల విషతుల్యత తగ్గించాలని ప్రతిపాదించారు. ఆయా పరిశ్రమల్లో రసాయనాలున్న డ్రమ్ములను శుభ్రపరచకుండా కఠినచర్యలు తీసుకునే బాధ్యత పీసీబీ తీసుకోనుంది. డ్రమ్ములను శుభ్రం చేసేందుకు ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టనున్నారు.నాలాల మరమ్మతులు , నిర్వహణ బాధ్యతలు, ముఖ్యంగా లీకేజీలైనప్పుడు తీసుకోవాల్సి చర్యలను జలమండలి, జీడిమెట్ల ఎఫ్లూయెంట్ ట్రీట్మెంట్ లిమిటెడ్‌లు పరస్పర సమన్వయంతో చేపట్టాల్సి ఉంది. రెండింటి మధ్య అవసరమైన సమావేశాలను జీహెచ్ఎంసీ ఈఎన్సీ ఏర్పాటు చేస్తారు. జీడిమెట్లలోని పలు ఫార్మా పరిశ్రమలు కూడా రసాయనవ్యర్థాలను కూకట్పల్లి నాలాలోకి వదులుతున్నాయి. వీటిని నిరోధించేందుకు రసాయన వ్యర్థాలు తీసుకువెళ్లే వాహనాలు వాటిని కూకట్పల్లి నాలాలో వదలకుండా వాటికి జీపీఎస్ ఏర్పాట్లు చేయాలని నిర్ణయించారు. గంగానదిలో ఏర్పాటు చేసిన మాదిరిగా కూకట్పల్లి నాలాలోని నీటి కాలుష్యాన్ని కొలిచే మీటర్లు ఏర్పాటు చేయాలనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. తాత్కాలికంగా ఈ చర్యలు తీసుకోవడంతోపాటు దీర్ఘకాలంలో సదరు ఫార్మా పరిశ్రమలన్నింటినీ ఏర్పాటుకాబోయే ఫార్మాసిటీకి తరలించాల్సి ఉంటుందని ప్రతిపాదించారు. ఇందుకుగాను తిరిగి ఈనెల 9వ తేదీన ఫార్మా కంపెనీల యాజమాన్యాలతో పీసీబీ, టీఎస్ఐఐసీలు సమావేశం నిర్వహించనున్నాయి. నాలాలు మళ్లాల.. వ్యర్థాలు తొలగాల.. పారిశ్రామిక వ్యర్థజలాల ద్వారా ఆర్సినిక్, నికెల్, కోబాల్ట్, మాలిబ్డనమ్ వంటి హానికారక మూలకాలు సాగర్‌లో చేరకుండా చూసేందుకు గ్రేటర్ యంత్రాంగం పకడ్బందీ కార్యాచరణను త్వరలో సిద్ధంచేయనుంది. జలాశయం అడుగున గుట్టగా పేరుకుపోయిన ఘన వ్యర్థాలను పర్యావరణానికి హానిలేని రీతిలో పునఃశుద్ధి చేసే విధానాలపై కాలుష్య నియంత్రణ మండలి యంత్రాగం నిపుణులు కసరత్తు మొదలుపెట్టారు. గాజులరామారంలో ఇప్పటికే ప్రభుత్వం కేటాయించిన స్థలంలో ల్యాండ్‌ఫిల్లింగ్ (భూమిలోకి ఇంకని రీతిలో)విధానంలో వ్యర్థాలను పూడ్చిపెడితే పర్యావరణానికి ఎలాంటి హాని ఉండదని ప్రాథమికంగా అంచనాకు వచ్చారు. మరోవైపు జలాశయంలో ప్రస్తుతం కాలుష్యకాసారమైన నీటిని తొలగిస్తే తలెత్తనున్న సమస్యలపై జీహెచ్ఎంసీ, పీసీబీ, ఇరిగేషన్, జలమండలి అధికారులు అధ్యయనం ప్రారంభించినట్లు తెలిసింది. ఇందుకు సంబంధించి గురువారం జీహెచ్ఎంసీలో జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో జీహెచ్ఎంసీ కమిషనర్, స్పెషలాఫీసర్ సోమేశ్‌కుమార్, తెలంగాణ పరిశ్రమల మౌలిక సదుపాయాల కల్పనసంస్థ (టీఎస్ఐఐసీ) ఎండీ జయేశ్‌రంజన్, కాలుష్యనివారణ మండలి (పీసీబీ) కార్యదర్శి అనిల్‌కుమార్, జీహెచ్ఎంసీ ఈఎన్సీ ధన్సింగ్ తదితరులు పాల్గొన్నారు. -
విష సాగరం
=కూకట్పల్లి నాలా నుంచి కాలకూట ప్రవాహం =‘ఫార్మా’ వ్యర్థాలకు పడని అడ్డుకట్ట =పీసీబీ ప్రతిపాదనలు బుట్టదాఖలు =మొద్దు నిద్ర వీడని సర్కారు =చేతులెత్తేసిన హెచ్ఎండీఏ సాక్షి, సిటీబ్యూరో : చారిత్రక హుస్సేన్‌సాగర్ విషం చిమ్ముతోంది. వేలాది జీవరాశులకు ఆవాసంగా ఉన్న ఈ చెరువు ఉనికికే ఇప్పుడు ప్రమాదం వాటిల్లింది. దశాబ్దాల నిర్లక్ష్యానికి తోడు జీడిమెట్ల-కూకట్పల్లి నాలా ద్వారా ప్రవహిస్తోన్న పారిశ్రామిక విష రసాయన వ్యర్థాలే ఇందుకు కారణాలన్నది జగమెరిగిన సత్యం. అధికార గణం ఉదాసీనత, రాజకీయ ప్రాబల్యాల కారణంగా కూకట్పల్లి నాలా మోసుకొచ్చే కాలకూటం యథేచ్ఛగా సాగర్‌లో కలుస్తోంది. ఈ కలుషిత వ్యర్థాలను దారి మళ్లించలేక హెచ్ఎండీఏ చేతులెత్తేసింది. ఫలితం.. సాగర్ ప్రక్షాళన కోసం వెచ్చిస్తోన్న కోట్లాది రూపాయలుృవథాగా మురుగు నీటిలో కలిసిపోతున్నాయే తప్ప కాలుష్యాన్ని కట్టడి చేయలేకపోతున్నాయి. ఈ వ్యర్థ రసాయనాలు సాగర్‌లోకి చేరకుండా చూసేందుకు పీసీబీ రూపొందించి, ప్రభుత్వానికి సమర్పించిన ఆచరణీయ ప్రతిపాదనలు సైతం కాగితాల్లోనే మగ్గుతున్నాయి. వీటిని అమలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం నిలువెత్తు నిర్లక్ష్యం ప్రదర్శిస్తోంది. సామర్థ్యానికి మించి .. నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి కూకట్పల్లి నాలా, పికెట్‌నాలా, బంజారా నాలా, బల్కాపూర్ నాలాల ద్వారా నిత్యం 360-410 ఎంఎల్డీ (రోజుకు మిలియన్ లీటర్లు) మురుగునీరు ప్రవహిస్తోంది. ఇందులో సగభాగం మురుగునీరు నేరుగా సాగర్‌లో కలుస్తోంది. దీంతో కూకట్పల్లి నాలా వ్యర్థాలను దారి మళ్లించేందుకు నెక్లెస్ రోడ్డు వద్ద రూ.14 కోట్ల వ్యయంతో ఐ అండ్ డి సెప్టర్తో పాటు రింగ్మెయిన్ను హెచ్ఎండీఏ నిర్మించింది. దీని సామర్థ్యానికి మించి మురుగునీరు వస్తుండటంతో రోజుకు 50-60 ఎంఎల్డీ వ్యర్థాలు సాగర్‌లో కలిసిపోతున్నాయి. ముఖ్యంగా జీడిమెట్ల ప్రాంతంలోని కొన్ని బల్క్‌డ్రగ్, ఫార్మా, ఇంటర్మీడియెట్, ఎలక్ట్రో ప్లేటింగ్ కంపెనీలు, రసాయనాల డ్రమ్ములు శుద్ధి చేస్తున్న యూనిట్ల నుంచి వెలువడుతోన్న హానికారక మూలకాలు నాలా నీటి గాఢతను అత్యల్ప స్థాయికి తగ్గిస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. నీటి గాఢత ప్రమాణాల ప్రకారం 6 నుంచి 7 యూనిట్ల మధ్య ఉండాలి. కానీ ఈ నాలాలో నీటి గాఢత యూనిట్ కంటే తక్కువగా ఉంటుంది. దీంతో నాలా నీరు యాసిడ్‌ను తలపిస్తుండటం గమనార్హం. ఈ నీటిలో హానికారక క్యాడ్మియం, లెడ్, నికెల్, అల్యూమినియం, మాంగనీస్, మెర్క్యురీ వంటి మూలకాల చేరికతో రసాయనాల గాఢత (కెమికల్ ఆక్సిజన్ డిమాండ్) భారీగా పెరిగి నాలా నీటిలో లవణీయత అత్యధికమవుతోంది. ఈ విషయం పీసీబీ పరిశీలనలో వెల్లడైంది. ఈ దుస్థితికి కారణమైన ఫార్మా పరిశ్రమల ఆగడాలను కట్టడి చేయడంలో, ఎలక్ట్రోప్లేటింగ్ పరిశ్రమల తరలింపు విషయంలోనూ రాష్ట్ర సర్కారు మీనమేషాలు లెక్కిస్తోంది. ఫలితంగా ఇప్పటికే సాగర్‌లోని జీవరాశులన్నీ దాదాపు అంతరించిపోయాయంటే ప్రమాదం తీవ్రత ఏ స్థాయిలో ఉందో ఊహించవచ్చు. సాగర్ పరిసరాలకు చేరితే ఆ విషవాయువుల ప్రభావంతో ప్రజలకు రుగ్మతలు వ్యాపించే ప్రమాదం ఉత్పన్నమవుతోంది. ప్రక్షాళన సాధ్యమయ్యేనా..? కూకట్పల్లి నాలా మోసుకొస్తున్న విష రసాయనాలకు అడ్డుకట్ట వేయకుండా సాగర్ ప్రక్షాళన ఎలా సాధ్యమో హెచ్ఎండీఏకే తెలియాలి! రూ.370 కోట్ల వ్యయంతో నాలుగేళ్ల క్రితం ప్రారంభించిన ప్రక్షాళన పనులకు ఇప్పటికే సుమారు రూ.200 కోట్లు కరిగిపోయాయి. ఇంకా అనేక చోట్ల ఐ అండ్ డీలు నిర్మించాల్సి ఉంది. రూ.40 కోట్ల వ్యయంతో కేవలం 3 నాలాల వద్ద డ్రెడ్జింగ్ పనులు సగం కూడా పూర్తవ్వలేదు. అలాగే కూకట్పల్లి నాలా డ్రెడ్జింగ్ వర్క్ చేపట్టాల్సి ఉంది. దీనికి సుమారు రూ.125-130 కోట్లు అవసరమని ప్రాథమిక అంచనాల్లో తేలింది. రూ.60కోట్ల వ్యయంతో చేపట్టిన పాటిగడ్డ ఎస్టీపీ అసలు పనిచేస్తుందా.. లేదా? అన్నది తెలియదు. ఇది పనిచేస్తుంటే సాగర్‌లో సీఓడీ, బీఓడీ శాతం ఎందుకు తగ్గలేదన్నదానికి హెచ్ఎండీఏ నుంచి సమాధానం లేదు. పీసీబీ ప్రతిపాదనలివీ.. జీడిమెట్ల నాలాకు ఆనుకొని ఉన్న 128 ఎలక్ట్రోప్లేటింగ్ యూనిట్లను ఏపీఐఐసీ ఆధ్వర్యంలో మెదక్‌జిల్లా సిద్దిపేట్ మండలం దుద్దెడ గ్రామానికి యుద్ధప్రాతిపదికన తరలించాలి. అవసరమైన స్థలాల కోసం దరఖాస్తు చేసుకునేందుకు 2013 అక్టోబరు 10 వరకు గడువిచ్చినా ఎవరూ ముందుకు రాలేదు. గంపల బస్తీలోని రసాయన డ్రమ్ములను శుద్ధి చేస్తున్న ప్రాంతంలో ఆటోమేటిక్ శుద్ధి యంత్రాలను ఏర్పాటు చేయాలి. బల్క్‌డ్రగ్, ఫార్మా, ఇంటర్మీడియెట్ కంపెనీల నుంచి వ్యర్థజలాలను జేఈటీఎల్‌కు తరలిస్తున్న ప్రైవేటు ట్యాంకర్లకు జీపీఎస్(గ్లోబల్పొజిషనింగ్ సిస్టం)వ్యవస్థను ఏర్పాటు చేయాలి. దీంతో ట్యాంకర్ల రాకపోకలపై నిఘా ఉంటుంది. నాలాలోకి రసాయనాలను పారబోసే అక్రమార్కులను కట్టడి చేయవచ్చు. పరిశ్రమలు, ట్యాంకర్లపై నిరంతరం నిఘా పెట్టేందుకు జీడిమెట్ల, సుచిత్ర జంక్షన్, మేడ్చల్ రోడ్, దూలపల్లి, గండి మైసమ్మ క్రాస్‌రోడ్, కూకట్పల్లి వై జంక్షన్, సూరారం జంక్షన్ల వద్ద పోలీస్, ఆర్టీఏ చెక్‌పోస్టులు ఏర్పాటు చేయాలి. ఐడీపీఎల్ టౌన్షిప్ వద్ద 59 మిలియన్ లీటర్ల వ్యర్థజలాలను శుద్ధిచేసే మురుగు శుద్ధి కేంద్రం, ఫతేనగర్ వద్ద 30 మిలియన్ లీటర్ల వ్యర్థ జలాలను శుద్ధి చేసే ఎస్టీపీలను యుద్ధప్రాతిపదికన ఏర్పాటు చేయాలి.