విష సాగరం | Me repeatedly in the background flow | Sakshi
Sakshi News home page

విష సాగరం

Published Sat, Jan 4 2014 3:53 AM | Last Updated on Sat, Sep 2 2017 2:15 AM

విష సాగరం

విష సాగరం

 =కూకట్‌పల్లి నాలా నుంచి కాలకూట ప్రవాహం
 =‘ఫార్మా’ వ్యర్థాలకు పడని అడ్డుకట్ట
 =పీసీబీ ప్రతిపాదనలు బుట్టదాఖలు
 =మొద్దు నిద్ర వీడని సర్కారు
 =చేతులెత్తేసిన హెచ్‌ఎండీఏ

 
సాక్షి, సిటీబ్యూరో : చారిత్రక హుస్సేన్‌సాగర్ విషం చిమ్ముతోంది. వేలాది జీవరాశులకు ఆవాసంగా ఉన్న ఈ చెరువు ఉనికికే ఇప్పుడు ప్రమాదం వాటిల్లింది. దశాబ్దాల నిర్లక్ష్యానికి తోడు జీడిమెట్ల-కూకట్‌పల్లి నాలా ద్వారా ప్రవహిస్తోన్న పారిశ్రామిక విష రసాయన వ్యర్థాలే ఇందుకు కారణాలన్నది జగమెరిగిన సత్యం. అధికార గణం ఉదాసీనత, రాజకీయ ప్రాబల్యాల కారణంగా కూకట్‌పల్లి నాలా మోసుకొచ్చే కాలకూటం యథేచ్ఛగా సాగర్‌లో కలుస్తోంది.

ఈ కలుషిత వ్యర్థాలను దారి మళ్లించలేక హెచ్‌ఎండీఏ చేతులెత్తేసింది. ఫలితం.. సాగర్ ప్రక్షాళన కోసం వెచ్చిస్తోన్న కోట్లాది రూపాయలుృవథాగా మురుగు నీటిలో కలిసిపోతున్నాయే తప్ప కాలుష్యాన్ని కట్టడి చేయలేకపోతున్నాయి. ఈ వ్యర్థ రసాయనాలు సాగర్‌లోకి చేరకుండా చూసేందుకు పీసీబీ రూపొందించి, ప్రభుత్వానికి సమర్పించిన  ఆచరణీయ ప్రతిపాదనలు సైతం కాగితాల్లోనే మగ్గుతున్నాయి. వీటిని అమలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం నిలువెత్తు నిర్లక్ష్యం ప్రదర్శిస్తోంది.
 
సామర్థ్యానికి మించి ..
 
నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి కూకట్‌పల్లి నాలా, పికెట్‌నాలా, బంజారా నాలా, బల్కాపూర్ నాలాల ద్వారా నిత్యం 360-410 ఎంఎల్‌డీ (రోజుకు మిలియన్ లీటర్లు) మురుగునీరు ప్రవహిస్తోంది. ఇందులో సగభాగం మురుగునీరు నేరుగా సాగర్‌లో కలుస్తోంది. దీంతో కూకట్‌పల్లి నాలా వ్యర్థాలను దారి మళ్లించేందుకు నెక్లెస్ రోడ్డు వద్ద రూ.14 కోట్ల వ్యయంతో ఐ అండ్ డి సెప్టర్‌తో పాటు రింగ్‌మెయిన్‌ను హెచ్‌ఎండీఏ నిర్మించింది. దీని సామర్థ్యానికి మించి మురుగునీరు వస్తుండటంతో రోజుకు 50-60 ఎంఎల్‌డీ వ్యర్థాలు సాగర్‌లో కలిసిపోతున్నాయి.

ముఖ్యంగా జీడిమెట్ల ప్రాంతంలోని కొన్ని బల్క్‌డ్రగ్, ఫార్మా, ఇంటర్మీడియెట్, ఎలక్ట్రో ప్లేటింగ్ కంపెనీలు, రసాయనాల డ్రమ్ములు శుద్ధి చేస్తున్న యూనిట్ల నుంచి వెలువడుతోన్న హానికారక మూలకాలు నాలా నీటి గాఢతను అత్యల్ప స్థాయికి తగ్గిస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. నీటి గాఢత ప్రమాణాల ప్రకారం 6 నుంచి 7 యూనిట్ల మధ్య ఉండాలి. కానీ ఈ నాలాలో నీటి గాఢత యూనిట్ కంటే తక్కువగా ఉంటుంది. దీంతో నాలా నీరు యాసిడ్‌ను తలపిస్తుండటం గమనార్హం.

ఈ నీటిలో హానికారక క్యాడ్మియం, లెడ్, నికెల్, అల్యూమినియం, మాంగనీస్, మెర్క్యురీ వంటి మూలకాల చేరికతో రసాయనాల గాఢత (కెమికల్ ఆక్సిజన్ డిమాండ్) భారీగా పెరిగి నాలా నీటిలో లవణీయత అత్యధికమవుతోంది. ఈ విషయం పీసీబీ పరిశీలనలో వెల్లడైంది. ఈ దుస్థితికి కారణమైన ఫార్మా పరిశ్రమల ఆగడాలను కట్టడి చేయడంలో, ఎలక్ట్రోప్లేటింగ్ పరిశ్రమల తరలింపు విషయంలోనూ రాష్ట్ర సర్కారు మీనమేషాలు లెక్కిస్తోంది. ఫలితంగా ఇప్పటికే సాగర్‌లోని జీవరాశులన్నీ దాదాపు అంతరించిపోయాయంటే ప్రమాదం తీవ్రత ఏ స్థాయిలో ఉందో ఊహించవచ్చు. సాగర్ పరిసరాలకు చేరితే ఆ విషవాయువుల ప్రభావంతో ప్రజలకు రుగ్మతలు వ్యాపించే ప్రమాదం ఉత్పన్నమవుతోంది.
 
ప్రక్షాళన సాధ్యమయ్యేనా..?
 
కూకట్‌పల్లి నాలా మోసుకొస్తున్న విష రసాయనాలకు అడ్డుకట్ట వేయకుండా సాగర్ ప్రక్షాళన ఎలా సాధ్యమో హెచ్‌ఎండీఏకే తెలియాలి! రూ.370 కోట్ల వ్యయంతో నాలుగేళ్ల క్రితం ప్రారంభించిన ప్రక్షాళన పనులకు ఇప్పటికే సుమారు రూ.200 కోట్లు కరిగిపోయాయి. ఇంకా అనేక చోట్ల ఐ అండ్ డీలు నిర్మించాల్సి ఉంది. రూ.40 కోట్ల వ్యయంతో కేవలం 3 నాలాల వద్ద డ్రెడ్జింగ్ పనులు సగం కూడా పూర్తవ్వలేదు. అలాగే కూకట్‌పల్లి నాలా డ్రెడ్జింగ్ వర్క్ చేపట్టాల్సి ఉంది. దీనికి సుమారు రూ.125-130 కోట్లు అవసరమని ప్రాథమిక అంచనాల్లో తేలింది. రూ.60కోట్ల వ్యయంతో చేపట్టిన పాటిగడ్డ ఎస్టీపీ అసలు పనిచేస్తుందా.. లేదా? అన్నది తెలియదు. ఇది పనిచేస్తుంటే సాగర్‌లో సీఓడీ, బీఓడీ శాతం ఎందుకు తగ్గలేదన్నదానికి హెచ్‌ఎండీఏ నుంచి సమాధానం లేదు.

 పీసీబీ ప్రతిపాదనలివీ..
     
జీడిమెట్ల నాలాకు ఆనుకొని ఉన్న 128 ఎలక్ట్రోప్లేటింగ్ యూనిట్లను ఏపీఐఐసీ ఆధ్వర్యంలో మెదక్‌జిల్లా సిద్దిపేట్ మండలం దుద్దెడ గ్రామానికి యుద్ధప్రాతిపదికన తరలించాలి. అవసరమైన స్థలాల కోసం దరఖాస్తు చేసుకునేందుకు 2013 అక్టోబరు 10 వరకు గడువిచ్చినా ఎవరూ ముందుకు రాలేదు.
     
గంపల బస్తీలోని రసాయన డ్రమ్ములను శుద్ధి చేస్తున్న ప్రాంతంలో ఆటోమేటిక్ శుద్ధి యంత్రాలను ఏర్పాటు చేయాలి.
     
బల్క్‌డ్రగ్, ఫార్మా, ఇంటర్మీడియెట్ కంపెనీల నుంచి వ్యర్థజలాలను జేఈటీఎల్‌కు తరలిస్తున్న ప్రైవేటు ట్యాంకర్లకు జీపీఎస్(గ్లోబల్‌పొజిషనింగ్ సిస్టం)వ్యవస్థను ఏర్పాటు చేయాలి. దీంతో ట్యాంకర్ల రాకపోకలపై నిఘా ఉంటుంది. నాలాలోకి రసాయనాలను పారబోసే అక్రమార్కులను కట్టడి చేయవచ్చు.  
     
పరిశ్రమలు, ట్యాంకర్లపై నిరంతరం నిఘా పెట్టేందుకు జీడిమెట్ల, సుచిత్ర జంక్షన్, మేడ్చల్ రోడ్, దూలపల్లి, గండి మైసమ్మ క్రాస్‌రోడ్, కూకట్‌పల్లి వై జంక్షన్, సూరారం జంక్షన్ల వద్ద పోలీస్, ఆర్టీఏ చెక్‌పోస్టులు ఏర్పాటు చేయాలి.
     
ఐడీపీఎల్ టౌన్‌షిప్ వద్ద 59 మిలియన్ లీటర్ల వ్యర్థజలాలను శుద్ధిచేసే మురుగు శుద్ధి కేంద్రం, ఫతేనగర్ వద్ద 30 మిలియన్ లీటర్ల వ్యర్థ జలాలను శుద్ధి చేసే ఎస్టీపీలను యుద్ధప్రాతిపదికన ఏర్పాటు చేయాలి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement