మరికల్: నారాయణపేట జిల్లా మరికల్ మండలంలో ఇథనాల్ కంపెనీ నుంచి వ్యర్థాల తరలింపు వ్యవహారం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. వ్యర్థాలను తరలిస్తున్న ట్యాంకర్‌ను స్థానికులు అడ్డుకోవడంతో ఈ పరిస్థితి తలెత్తింది. శనివారం రాత్రి నుంచి ఆదివారం ఉదయం 11 గంటలవరకు హైడ్రామా నడిచింది. రాస్తారోకో చేస్తున్న గ్రామస్తులపై పోలీసులు లాఠీచార్జి చేయడంతో వారు తిరగబడి ఎదురు దాడి చేశారు.
వివరాలిలా ఉన్నాయి.. శనివారం రాత్రి 8 గంటల సమయంలో జూరాల ఆగ్రో ఇథనాల్ కంపెనీ నుంచి ఓ ట్యాంకర్ రసాయన వ్యర్థాలను నింపుకొని బయటకు వచ్చింది. ఆ వ్యర్థాలను మరికల్ మండలం ఎక్లాస్‌పూర్, జిన్నారం గ్రామాల శివారులో పారపోస్తున్నారని స్థానికులు ట్యాంకర్‌ను అడ్డుకొని ఆందోళనకు దిగారు. శనివారం రాత్రి నుంచి ఆదివారం ఉదయం 11 గంటల వరకు గ్రామస్తులు ఆత్మకూర్ రోడ్డుపై ఆందోళన చేయడంతో మరికల్, మక్తల్, కృష్ణ, నర్వ, ధన్వాడ మాగనూర్ పోలీసులతోపాటు స్పెషల్ పార్టీ పోలీసులు రంగంలో దిగారు.
ఈ నేపథ్యంలో పోలీసులకు, గ్రామస్తులకు మధ్య వాగ్వాదం, తోపులాట చోటుచేసుకుంటుంది. నారాయణపేట డీఎస్పీ సత్యనారాయణ ఆందోళనకారులను అదుపు చేయాలని చెప్పడంతో పోలీసులు వారిపై లాఠీచార్జీ చేశారు. దీంతో పలువురికి గాయాలయ్యాయి. అదే సమయంలో ట్యాంకర్‌ను పోలీసుల బందోబస్తు మధ్య తరలించడంతో కోపోద్రిక్తులైన గ్రామస్తులు రాళ్లు, ఇటుకలు, కర్రలతో పోలీసులపైకి దాడికి దిగారు. దీంతో అక్కడి నుంచి ప్రాణాలతో బయటపడేందుకు పోలీసులు పరుగులు పెట్టగా.. మక్తల్ సీఐ రాంలాల్‌ను కొందరు పొల్లాలో వెంబడించి తీవ్రంగా గాయపర్చారు.
గాయపడిన మరికొంత మంది పోలీసులు పక్కనే ఉన్న ఆలయంలోకి వెళ్లి దాక్కున్నారు. ఆందోళనకారులు ఒక పోలీసు వాహనంతోపాటు రెండు బైక్‌లకు నిప్పంటించడంతో పూర్తిగా దగ్ధమయ్యాయి. డీఎస్పీ వాహనంతోపాటు మరో మూడు వాహనాల అద్దాలను ధ్వంసం చేశారు. గాయపడిన పోలీసులను ఆస్పత్రికి తరలించారు. కాగా, ఆందోళనకు కారణమైన వారి కోసం గాలిస్తున్నట్లు డీఎస్పీ సత్యనారాయణ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment