సాగర మథనానికి సై...
రసాయన వ్యర్థాలు నాలాల్లోకి చేరకుండా చర్యలు
రూ.40 కోట్లతో నాలా మళ్లింపు పనులకు శ్రీకారం
ఫతేనగర్, జీడిమెట్లలోని పరిశ్రమల తరలింపు
170 ఎలక్ట్రోప్లేటింగ్ పరిశ్రమలు తూప్రాన్‌కు
ఫార్మా కంపెనీలు దశలవారీగా ఫార్మాసిటీకి
చారిత్రక హుస్సేన్‌సాగర్ ప్రక్షాళనకు రంగం సిద్ధమవుతోంది. నిత్యం సాగర్‌లో చేరుతున్న 400 మిలియన్ లీటర్ల పారిశ్రామిక వ్యర్థ జలాలను దారిమళ్లించేందుకు అధికారులు పథకం రచించారు. రూ.40 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన నాలా మళ్లింపు పనులను నాలుగు ప్యాకేజీలుగా విభజించి టెండర్లు పిలిచారు. తాజాగా టెండర్ల మూల్యాంకన ప్రక్రియ మొదలుపెట్టారు. మరో పక్షం రోజుల్లో నాలా మళ్లింపు పనులు చేపట్టనున్నారు. దీంతో ‘క్లీన్ హుస్సేన్ సాగర్’ కోసం అడుగులు ముందుకు పడుతున్నాయి..
- సాక్షి, సిటీబ్యూరో
కాలుష్య కోరల్లో చిక్కి శల్యమవుతోన్న చారిత్రక హుస్సేన్‌సాగర్‌ను పరిశుద్ధ సాగరంగా మార్చేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఈ వేసవిలో జలాశయాన్ని పూర్తిగా ఖాళీచేసి సాగరగర్భంలో పేరుకుపోయిన పారిశ్రామిక వ్యర్థాలను తొలగించేందుకు ఆయా విభాగాల అధికారులు నడుం బిగించారు. ముఖ్యంగా కూకట్‌పల్లి, జీడిమెట్ల, బాలానగర్ తదితర పారిశ్రామిక వాడల నుంచి నిత్యం వచ్చి చేరుతున్న 400 మిలియన్ లీటర్ల పారిశ్రామిక వ్యర్థజలాలు జలాశయంలోకి చేరకుండా ఉండేందుకు కూకట్‌పల్లి నాలాను నేరుగా అంబర్‌పేట్‌లోని మురుగు శుద్ధి కేంద్రానికి మళ్లించి అక్కడ వ్యర్థజలాలను శుద్ధిచేసి మూసీలో కలిపేందుకు రంగం సిద్ధంచేశారు. ఈ పనులకు సంబంధించి రూ.40 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన నాలా మళ్లింపు పనులను నాలుగు ప్యాకేజీలుగా విభజించి జలమండలి టెండర్లు పిలిచింది. తాజాగా టెండర్ల మూల్యాంకన ప్రక్రియ మొదలుపెట్టింది. మరో పక్షం రోజుల్లో నాలా మళ్లింపు పనులు చేపట్టనున్నారు.
ప్రక్షాళన పర్వం ఇలా..
ఫతేనగర్, జీడిమెట్ల పరిసర ప్రాంతాల్లో ఉన్న 170 ఎలక్ట్రోప్లేటింగ్ పరిశ్రమల నుంచి వస్తున్న క్యాడ్మియం, కోబాల్ట్ వంటి హానికారక మూలకాలు, రసాయన వ్యర్థాలు కూకట్‌పల్లి నాలాలోకి చేరుతున్నాయి. అక్కడి నుంచి అవి హుస్సేన్‌సాగర్‌లో కలుస్తున్నాయి. రసాయనాల డ్రమ్ములను క్లీనింగ్ చేశాక వెలువడే కలుషిత జలాల్ని సైతం నాలాలోకి వదులుతున్నారు. ఈ రసాయన వ్యర్థాలు కూకట్‌పల్లి నాలాలోకి చేరకుండా ఉండేందుకు ఆయా పరిశ్రమలను ఔటర్‌కు ఆవల మెదక్ జిల్లాలోని తూప్రాన్ సమీపంలో ఎంపిక చేసిన ఖాళీ ప్రదేశంలోకి తరలించాలని నిర్ణయించారు.
ఔటర్ రింగ్‌రోడ్డు లోపల అత్యధిక కాలుష్యం వెదజల్లే రెడ్ కేటగిరీ పరిశ్రమలనేవి లేకుండా చేస్తారు. ఆయా పరిశ్రమల వారికి కూడా ఇబ్బందిలేకుండా అవసరమైన సదుపాయాలు కల్పిస్తారు. పరిశ్రమలపై ఆధారపడిన కార్మికుల కుటుంబాల జీవనోపాధికి ఢోకా లేకుండా ఉండేలా చూస్తారు. పరిశ్రమలను అక్కడకు తరలించినా వివిధ సంస్థల నుంచి వాటికందే ప్రోత్సాహకాలు కొనసాగేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. అవసరమైతే ప్రత్యేక ప్రోత్సాహకాలు ఇవ్వనున్నారు.
పరిశ్రమలను అక్కడకు తరలించేందుకు, అక్కడ తగిన మౌలిక సదుపాయాలు కల్పించాల్సిన బాధ్యత తెలంగాణా రాష్ట్ర పరిశ్రమల మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ(టీఎస్‌ఐఐసీ) తీసుకోనుంది. ఏప్రిల్ నెలాఖరులోగా ఈ పని పూర్తిచేయాలని ప్రాథమికంగా నిర్ణయించారు. వీలైనన్ని వ్యర్థాల శుద్ధి కేంద్రాలు(కామన్ ఎఫ్లూయెంట్ ట్రీట్‌మెంట్ ప్లాంట్స్)ను ఏర్పాటు చేసి రసాయనవ్యర్థాల విషతుల్యత తగ్గించాలని ప్రతిపాదించారు.
ఆయా పరిశ్రమల్లో రసాయనాలున్న డ్రమ్ములను శుభ్రపరచకుండా కఠినచర్యలు తీసుకునే బాధ్యత పీసీబీ తీసుకోనుంది. డ్రమ్ములను శుభ్రం చేసేందుకు ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టనున్నారు.నాలాల మరమ్మతులు , నిర్వహణ బాధ్యతలు, ముఖ్యంగా లీకేజీలైనప్పుడు తీసుకోవాల్సి చర్యలను జలమండలి, జీడిమెట్ల ఎఫ్లూయెంట్ ట్రీట్‌మెంట్ లిమిటెడ్‌లు పరస్పర సమన్వయంతో చేపట్టాల్సి ఉంది. రెండింటి మధ్య అవసరమైన సమావేశాలను జీహెచ్‌ఎంసీ ఈఎన్‌సీ ఏర్పాటు చేస్తారు.
జీడిమెట్లలోని పలు ఫార్మా పరిశ్రమలు కూడా రసాయనవ్యర్థాలను కూకట్‌పల్లి నాలాలోకి వదులుతున్నాయి. వీటిని నిరోధించేందుకు రసాయన వ్యర్థాలు తీసుకువెళ్లే వాహనాలు వాటిని కూకట్‌పల్లి నాలాలో వదలకుండా వాటికి జీపీఎస్ ఏర్పాట్లు చేయాలని నిర్ణయించారు. గంగానదిలో ఏర్పాటు చేసిన మాదిరిగా కూకట్‌పల్లి నాలాలోని నీటి కాలుష్యాన్ని కొలిచే మీటర్లు ఏర్పాటు చేయాలనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.
తాత్కాలికంగా ఈ చర్యలు తీసుకోవడంతోపాటు దీర్ఘకాలంలో సదరు ఫార్మా పరిశ్రమలన్నింటినీ ఏర్పాటుకాబోయే ఫార్మాసిటీకి తరలించాల్సి ఉంటుందని ప్రతిపాదించారు. ఇందుకుగాను తిరిగి ఈనెల 9వ తేదీన ఫార్మా కంపెనీల యాజమాన్యాలతో పీసీబీ, టీఎస్‌ఐఐసీలు సమావేశం నిర్వహించనున్నాయి.
నాలాలు మళ్లాల.. వ్యర్థాలు తొలగాల..
పారిశ్రామిక వ్యర్థజలాల ద్వారా ఆర్సినిక్, నికెల్, కోబాల్ట్, మాలిబ్డనమ్ వంటి హానికారక మూలకాలు సాగర్‌లో చేరకుండా చూసేందుకు గ్రేటర్ యంత్రాంగం పకడ్బందీ కార్యాచరణను త్వరలో సిద్ధంచేయనుంది. జలాశయం అడుగున గుట్టగా పేరుకుపోయిన ఘన వ్యర్థాలను పర్యావరణానికి హానిలేని రీతిలో పునఃశుద్ధి చేసే విధానాలపై కాలుష్య నియంత్రణ మండలి యంత్రాగం నిపుణులు కసరత్తు మొదలుపెట్టారు. గాజులరామారంలో ఇప్పటికే ప్రభుత్వం కేటాయించిన స్థలంలో ల్యాండ్‌ఫిల్లింగ్ (భూమిలోకి ఇంకని రీతిలో)విధానంలో వ్యర్థాలను పూడ్చిపెడితే పర్యావరణానికి ఎలాంటి హాని ఉండదని ప్రాథమికంగా అంచనాకు వచ్చారు.
మరోవైపు జలాశయంలో ప్రస్తుతం కాలుష్యకాసారమైన నీటిని తొలగిస్తే తలెత్తనున్న సమస్యలపై జీహెచ్‌ఎంసీ, పీసీబీ, ఇరిగేషన్, జలమండలి అధికారులు అధ్యయనం ప్రారంభించినట్లు తెలిసింది. ఇందుకు సంబంధించి గురువారం జీహెచ్‌ఎంసీలో జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో జీహెచ్‌ఎంసీ కమిషనర్, స్పెషలాఫీసర్ సోమేశ్‌కుమార్, తెలంగాణ పరిశ్రమల మౌలిక సదుపాయాల కల్పనసంస్థ (టీఎస్‌ఐఐసీ) ఎండీ జయేశ్‌రంజన్, కాలుష్యనివారణ మండలి (పీసీబీ) కార్యదర్శి అనిల్‌కుమార్, జీహెచ్‌ఎంసీ ఈఎన్‌సీ ధన్‌సింగ్ తదితరులు పాల్గొన్నారు.