Persecution
-
రిజిస్ట్రేషన్ మర్నాడే మ్యుటేషన్!
సాక్షి, హైదరాబాద్: రెవెన్యూ వ్యవస్థను ప్రక్షాళన చేయడంలో భాగంగా భూపరిపాలన ప్రధాన కమిషనర్(సీసీఎల్ఏ) రేమండ్ పీటర్ మరొక కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్ పూర్తయిన భూములకు, ఆ మర్నాడే మండల కార్యాలయంలో తహశీల్దారు మ్యుటేషన్ ప్రక్రియను (రికార్డుల్లో పేర్ల మార్పిడి) పూర్తి చేసే విధంగా చర్యలు చేపట్టారు. మే నెల నుంచి ఈ విధానాన్ని అమలు చేసేందుకు భూపరిపాలన విభాగం అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో.. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా అన్ని మండల కార్యాలయాల్లో పెండింగ్‌లో ఉన్న 8 లక్షల మ్యుటేషన్ దరఖాస్తులను నెలాఖరులోగా క్లియర్ చేయాలని అన్ని జిల్లాల జాయింట్ కలెక్టర్లను సీసీఎల్ఏ ఆదేశించారు. అలాగే, మ్యుటేషన్ ప్రక్రియతో పాటు సెక్షన్ 22ఎ ప్రకారం నిషేధిత భూముల వివరాలను నిర్దేశిత నమూనాల్లో (ఫారం 1ఎ నుంచి 1ఇ వరకు) పదిరోజుల్లోగా సమర్పించాలని కోరారు. ఫారం 1ఎ లో.. విక్రయించేందుకు గానీ, రిజిస్ట్రేషన్లు చేసేందుకు కానీ వీల్లేని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ భూములు, 1బిలో ప్రభుత్వ అసైన్డ్ భూములు, ప్రభుత్వ పోరంబోకు భూములు, 1సిలో సెక్షన్ 43 కింద రిజిస్టర్ అయిన దేవాదాయశాఖ భూములు, సెక్షన్ 37 ప్రకారం రిజిస్టర్ అయిన వక్ఫ్ భూములు, 1డిలో పట్టణ భూ గరిష్ట పరిమితి(యూఎల్సీ) చట్టం ప్రకారం ప్రభుత్వ అదీనంలో ఉన్న భూములు, 1ఇలో రెవెన్యూ రికవరీ యాక్ట్ ప్రకారం స్వాధీనం చేసుకున్న భూములు, అవినీతి నిరోధక శాఖ అటాచ్ చేసిన భూములు, పన్నులు చెల్లించని ఆస్తుల వివరాలు, గ్రీన్‌పార్కుల కోసం రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఇచ్చిన ఖాళీస్థలాల వివరాలను నింపాలని సూచించారు. భూముల క్రయ విక్రయాలకు సంబంధించిన రిజిస్ట్రేషన్ సమాచారం సబ్ రిజిస్ట్రార్ నుంచి ఆన్లైన్ ద్వారా నేరుగా తహసీల్దారుకు అందేలా సాఫ్ట్‌వేర్‌ను రూపొందించాలని నేషనల్ ఇన్ఫర్మేషన్ సెంటర్(ఎన్ఐసీ) అధికారులను సీసీఎల్ఏ ఆదేశించారు. -
మూసీ పనులు ప్రైవేటుకే..!
♦ ప్రక్షాళన, సుందరీకరణ పనుల అప్పగింతకు రంగం సిద్ధం ♦ పలు సంస్థలతో పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ సమావేశం సాక్షి, హైదరాబాద్: మురుగుకూపంగా మారిన చారిత్రక మూసీ నది ప్రక్షాళన, సుందరీకరణ ప్రక్రియను వేగవంతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు ముమ్మరం చేసింది. మూసీ ప్రక్షాళన, సుందరీకరణ పనులను పబ్లిక్-ప్రైవేటు భాగస్వామ్యం(పీపీపీ) విధానంలో ప్రైవేటు సంస్థలకు అప్పజెప్పేందుకు రంగం సిద్ధం చేస్తోంది. ఈ మేరకు పురపాలక శాఖ మంత్రి కె.తారకరామారావు శుక్రవారం జలమండలిలో ఐదు గంటలపాటు ఆయా సంస్థలతో సుదీర్ఘంగా సమావేశమయ్యారు. టాటా గ్రూపు, స్టూప్, ఆర్వీ అసోసియేట్స్, ఎన్విరో కంట్రోల్ అసోసియేషన్ సంస్థలు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా తాము చేపట్టబోయే సుందరీకరణ, ప్రక్షాళన, మూసీ నదిపై నిర్మించాల్సిన ఆకాశమార్గం పనులపై తాము సిద్ధం చేసిన డిజైన్లను మంత్రికి వివరించారు. నిధుల కొరత కారణంగా పీపీపీ విధానంలో సాధ్యమైనంత తక్కువ ఖర్చుతో ఈ పనులను చేపట్టేందుకు అవసరమైన సమగ్ర ప్రాజెక్టు ప్రతిపాదనలు సిద్ధంచేసి ప్రభుత్వానికి నివేదించాలని మంత్రి ఆయా సంస్థలకు సూచించారు. మూసీలోకి చేరుతున్న గృహ, వాణిజ్య, పారిశ్రామిక వ్యర్థ జలాల శుద్ధి, నగరంలో సుమారు 40 కిలోమీటర్ల మేర ప్రవహిస్తున్న మూసీ నదికి ఇరువైపులా పర్యాటకులకు కనువిందు చేసేలా రిక్రియేషన్ వ్యవస్థలు, వాటర్ గేమ్స్, ఫుడ్ కోర్టులు, పిల్లల ఆట స్థలాల వంటివి ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని కోరారు. ఇక నదికి ఆనుకుని ఉన్న ప్రభుత్వ స్థలాల లెక్క తక్షణం తేల్చాలని, ఇందుకు సమగ్ర సర్వే చేపట్టాలని రెవెన్యూ, హెచ్ఎండీఏ అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో నగర మేయర్ బొంతు రామ్మోహన్, మున్సిపల్ శాఖ ముఖ్యకార్యదర్శి ఎంజీ గోపాల్, నగర కమిషనర్, జలమండలి ఎండీ జనార్దన్‌రెడ్డి, జలమండలి ప్రాజెక్టు విభాగం డెరైక్టర్ కొండారెడ్డి, సత్యసూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. మూసీ వెతలివే.. నగరంలో గృహ, వాణిజ్య, పారిశ్రామిక సంస్థల నుంచి నిత్యం 1,400 మిలియన్ లీటర్ల మురుగునీరు మూసీలో కలుస్తోంది. రెండేళ్లక్రితం జేఎన్ఎన్యూఆర్ఎం నిధులతో మొదటిదశ ప్రక్షాళన పథకానికి శ్రీకారం చుట్టారు. నదీ పరీవాహక ప్రాంతంలో మురుగు శుద్ధికి ఐదు ఎస్టీపీలను నిర్మించారు. తద్వారా వివిధ నాలాల నుంచి రోజువారీగా వెలువడుతున్న 592 మిలియన్ లీటర్ల మురుగును శుద్ధిచేసి నదిలోకి వదిలే ఏర్పాట్లు చేశారు. కానీ మరో 610 మిలియన్ లీటర్ల మురుగునీటిని శుద్ధి చేయకుండానే మూసీలోకి వదులుతున్నారు. దీంతో నది మరింత మురుగుకూపంగా మారింది. ప్రక్షాళనకు గతంలో జాతీయ నదీ పరిరక్షణ పథకం కింద 70 శాతం నిధుల మంజూరుకు కేంద్రం ముందుకొచ్చినా అడుగు ముందుకు పడలేదు. కాగా, సుమారు రూ.2,965.52 కోట్ల అంచనా వ్యయంతో మూడు కారిడార్ల పరిధిలో మూసీ ప్రక్షాళన, సుందరీకరణకు రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర విజన్ డాక్యుమెంట్ రూపొందించింది. సమూల ప్రక్షాళనకు సుమారు రూ.1,000 కోట్లు అంచనా వ్యయంగా నిర్ణయించింది. -
సాగర మథనానికి సై...
రసాయన వ్యర్థాలు నాలాల్లోకి చేరకుండా చర్యలు రూ.40 కోట్లతో నాలా మళ్లింపు పనులకు శ్రీకారం ఫతేనగర్, జీడిమెట్లలోని పరిశ్రమల తరలింపు 170 ఎలక్ట్రోప్లేటింగ్ పరిశ్రమలు తూప్రాన్‌కు ఫార్మా కంపెనీలు దశలవారీగా ఫార్మాసిటీకి చారిత్రక హుస్సేన్‌సాగర్ ప్రక్షాళనకు రంగం సిద్ధమవుతోంది. నిత్యం సాగర్‌లో చేరుతున్న 400 మిలియన్ లీటర్ల పారిశ్రామిక వ్యర్థ జలాలను దారిమళ్లించేందుకు అధికారులు పథకం రచించారు. రూ.40 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన నాలా మళ్లింపు పనులను నాలుగు ప్యాకేజీలుగా విభజించి టెండర్లు పిలిచారు. తాజాగా టెండర్ల మూల్యాంకన ప్రక్రియ మొదలుపెట్టారు. మరో పక్షం రోజుల్లో నాలా మళ్లింపు పనులు చేపట్టనున్నారు. దీంతో ‘క్లీన్ హుస్సేన్ సాగర్’ కోసం అడుగులు ముందుకు పడుతున్నాయి.. - సాక్షి, సిటీబ్యూరో కాలుష్య కోరల్లో చిక్కి శల్యమవుతోన్న చారిత్రక హుస్సేన్‌సాగర్‌ను పరిశుద్ధ సాగరంగా మార్చేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఈ వేసవిలో జలాశయాన్ని పూర్తిగా ఖాళీచేసి సాగరగర్భంలో పేరుకుపోయిన పారిశ్రామిక వ్యర్థాలను తొలగించేందుకు ఆయా విభాగాల అధికారులు నడుం బిగించారు. ముఖ్యంగా కూకట్పల్లి, జీడిమెట్ల, బాలానగర్ తదితర పారిశ్రామిక వాడల నుంచి నిత్యం వచ్చి చేరుతున్న 400 మిలియన్ లీటర్ల పారిశ్రామిక వ్యర్థజలాలు జలాశయంలోకి చేరకుండా ఉండేందుకు కూకట్పల్లి నాలాను నేరుగా అంబర్‌పేట్‌లోని మురుగు శుద్ధి కేంద్రానికి మళ్లించి అక్కడ వ్యర్థజలాలను శుద్ధిచేసి మూసీలో కలిపేందుకు రంగం సిద్ధంచేశారు. ఈ పనులకు సంబంధించి రూ.40 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన నాలా మళ్లింపు పనులను నాలుగు ప్యాకేజీలుగా విభజించి జలమండలి టెండర్లు పిలిచింది. తాజాగా టెండర్ల మూల్యాంకన ప్రక్రియ మొదలుపెట్టింది. మరో పక్షం రోజుల్లో నాలా మళ్లింపు పనులు చేపట్టనున్నారు. ప్రక్షాళన పర్వం ఇలా.. ఫతేనగర్, జీడిమెట్ల పరిసర ప్రాంతాల్లో ఉన్న 170 ఎలక్ట్రోప్లేటింగ్ పరిశ్రమల నుంచి వస్తున్న క్యాడ్మియం, కోబాల్ట్ వంటి హానికారక మూలకాలు, రసాయన వ్యర్థాలు కూకట్పల్లి నాలాలోకి చేరుతున్నాయి. అక్కడి నుంచి అవి హుస్సేన్‌సాగర్‌లో కలుస్తున్నాయి. రసాయనాల డ్రమ్ములను క్లీనింగ్ చేశాక వెలువడే కలుషిత జలాల్ని సైతం నాలాలోకి వదులుతున్నారు. ఈ రసాయన వ్యర్థాలు కూకట్పల్లి నాలాలోకి చేరకుండా ఉండేందుకు ఆయా పరిశ్రమలను ఔటర్‌కు ఆవల మెదక్ జిల్లాలోని తూప్రాన్ సమీపంలో ఎంపిక చేసిన ఖాళీ ప్రదేశంలోకి తరలించాలని నిర్ణయించారు. ఔటర్ రింగ్‌రోడ్డు లోపల అత్యధిక కాలుష్యం వెదజల్లే రెడ్ కేటగిరీ పరిశ్రమలనేవి లేకుండా చేస్తారు. ఆయా పరిశ్రమల వారికి కూడా ఇబ్బందిలేకుండా అవసరమైన సదుపాయాలు కల్పిస్తారు. పరిశ్రమలపై ఆధారపడిన కార్మికుల కుటుంబాల జీవనోపాధికి ఢోకా లేకుండా ఉండేలా చూస్తారు. పరిశ్రమలను అక్కడకు తరలించినా వివిధ సంస్థల నుంచి వాటికందే ప్రోత్సాహకాలు కొనసాగేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. అవసరమైతే ప్రత్యేక ప్రోత్సాహకాలు ఇవ్వనున్నారు. పరిశ్రమలను అక్కడకు తరలించేందుకు, అక్కడ తగిన మౌలిక సదుపాయాలు కల్పించాల్సిన బాధ్యత తెలంగాణా రాష్ట్ర పరిశ్రమల మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ(టీఎస్ఐఐసీ) తీసుకోనుంది. ఏప్రిల్ నెలాఖరులోగా ఈ పని పూర్తిచేయాలని ప్రాథమికంగా నిర్ణయించారు. వీలైనన్ని వ్యర్థాల శుద్ధి కేంద్రాలు(కామన్ ఎఫ్లూయెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్స్)ను ఏర్పాటు చేసి రసాయనవ్యర్థాల విషతుల్యత తగ్గించాలని ప్రతిపాదించారు. ఆయా పరిశ్రమల్లో రసాయనాలున్న డ్రమ్ములను శుభ్రపరచకుండా కఠినచర్యలు తీసుకునే బాధ్యత పీసీబీ తీసుకోనుంది. డ్రమ్ములను శుభ్రం చేసేందుకు ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టనున్నారు.నాలాల మరమ్మతులు , నిర్వహణ బాధ్యతలు, ముఖ్యంగా లీకేజీలైనప్పుడు తీసుకోవాల్సి చర్యలను జలమండలి, జీడిమెట్ల ఎఫ్లూయెంట్ ట్రీట్మెంట్ లిమిటెడ్‌లు పరస్పర సమన్వయంతో చేపట్టాల్సి ఉంది. రెండింటి మధ్య అవసరమైన సమావేశాలను జీహెచ్ఎంసీ ఈఎన్సీ ఏర్పాటు చేస్తారు. జీడిమెట్లలోని పలు ఫార్మా పరిశ్రమలు కూడా రసాయనవ్యర్థాలను కూకట్పల్లి నాలాలోకి వదులుతున్నాయి. వీటిని నిరోధించేందుకు రసాయన వ్యర్థాలు తీసుకువెళ్లే వాహనాలు వాటిని కూకట్పల్లి నాలాలో వదలకుండా వాటికి జీపీఎస్ ఏర్పాట్లు చేయాలని నిర్ణయించారు. గంగానదిలో ఏర్పాటు చేసిన మాదిరిగా కూకట్పల్లి నాలాలోని నీటి కాలుష్యాన్ని కొలిచే మీటర్లు ఏర్పాటు చేయాలనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. తాత్కాలికంగా ఈ చర్యలు తీసుకోవడంతోపాటు దీర్ఘకాలంలో సదరు ఫార్మా పరిశ్రమలన్నింటినీ ఏర్పాటుకాబోయే ఫార్మాసిటీకి తరలించాల్సి ఉంటుందని ప్రతిపాదించారు. ఇందుకుగాను తిరిగి ఈనెల 9వ తేదీన ఫార్మా కంపెనీల యాజమాన్యాలతో పీసీబీ, టీఎస్ఐఐసీలు సమావేశం నిర్వహించనున్నాయి. నాలాలు మళ్లాల.. వ్యర్థాలు తొలగాల.. పారిశ్రామిక వ్యర్థజలాల ద్వారా ఆర్సినిక్, నికెల్, కోబాల్ట్, మాలిబ్డనమ్ వంటి హానికారక మూలకాలు సాగర్‌లో చేరకుండా చూసేందుకు గ్రేటర్ యంత్రాంగం పకడ్బందీ కార్యాచరణను త్వరలో సిద్ధంచేయనుంది. జలాశయం అడుగున గుట్టగా పేరుకుపోయిన ఘన వ్యర్థాలను పర్యావరణానికి హానిలేని రీతిలో పునఃశుద్ధి చేసే విధానాలపై కాలుష్య నియంత్రణ మండలి యంత్రాగం నిపుణులు కసరత్తు మొదలుపెట్టారు. గాజులరామారంలో ఇప్పటికే ప్రభుత్వం కేటాయించిన స్థలంలో ల్యాండ్‌ఫిల్లింగ్ (భూమిలోకి ఇంకని రీతిలో)విధానంలో వ్యర్థాలను పూడ్చిపెడితే పర్యావరణానికి ఎలాంటి హాని ఉండదని ప్రాథమికంగా అంచనాకు వచ్చారు. మరోవైపు జలాశయంలో ప్రస్తుతం కాలుష్యకాసారమైన నీటిని తొలగిస్తే తలెత్తనున్న సమస్యలపై జీహెచ్ఎంసీ, పీసీబీ, ఇరిగేషన్, జలమండలి అధికారులు అధ్యయనం ప్రారంభించినట్లు తెలిసింది. ఇందుకు సంబంధించి గురువారం జీహెచ్ఎంసీలో జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో జీహెచ్ఎంసీ కమిషనర్, స్పెషలాఫీసర్ సోమేశ్‌కుమార్, తెలంగాణ పరిశ్రమల మౌలిక సదుపాయాల కల్పనసంస్థ (టీఎస్ఐఐసీ) ఎండీ జయేశ్‌రంజన్, కాలుష్యనివారణ మండలి (పీసీబీ) కార్యదర్శి అనిల్‌కుమార్, జీహెచ్ఎంసీ ఈఎన్సీ ధన్సింగ్ తదితరులు పాల్గొన్నారు. -
'ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరిస్తోంది'
హైదరాబాద్: ఇందిరాపార్క్ ను వినాయక సాగర్ గా మారిస్తే అంగీకరించమని బీజేపీ శాసనసభాపక్ష నేత లక్ష్మణ్ స్పష్టం చేశారు. ఆయన గురువారమిక్కడ మాట్లాడుతూ సాగర్ ప్రక్షాళన అంశంలో ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరిస్తోందని ఆయన విమర్శించారు. ప్రభుత్వం ఈ వ్యవహారంలో అఖిలపక్షం ఏర్పాటు చేయాలని లక్ష్మణ్ డిమాండ్ చేశారు. -
సాగర యాగం
*హుస్సేన్ సాగర్ ప్రక్షాళనకు రంగం సిద్ధం *విభిన్న శాఖల భాగస్వామ్యం *ప్రణాళికల రూపకల్పనలో నిమగ్నం *వేసవిలో ముహూర్తం ఒక మహా యజ్ఞానికి భాగ్యనగరం వేదికవుతోంది.ఒక మహా ప్రయత్నానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. మహా నగరి మెడలో మణిహారంలా భాసిల్లుతున్న హుస్సేన్ సాగర్‌ను శుద్ధ జలంతో నింపే క్రతువుకు రంగం సిద్ధమవుతోంది. కాలుష్య కాసారంలా మారిన సాగర్‌ను ఖాళీ చేసి... భవిష్యత్తులో శుద్ధి చేసిన నీటిని నింపే దిశగా వడివడిగా అడుగులు పడుతున్నాయి. వేసవిలో ఈ మహా యజ్ఞం నిర్వహణకు ప్రణాళికలు రూపొందుతున్నాయి. ముందుగా సాగర్‌ను ఖాళీ చేసి... పూడికను తొలగించేందుకు వివిధ విభాగాలు యత్నాలు మొదలుపెట్టాయి. నీరు తోడడం... పూడిక తొలగించడం వంటి పనులకు ఎంత సమయం పడుతుంది...ఎంత వ్యయమవుతుందనే విషయమై లెక్కలు వేస్తున్నాయి. సాగర్ ప్రక్షాళనతో పాటు పరిసరాలను పచ్చదనంతో నింపి... సందర్శకులకు ఆహ్లాదాన్ని అందించేందుకు అవసరమైన కార్యాచరణపై కసరత్తు ప్రారంభించాయి. విభిన్న శాఖల సమన్వయంతో ఈ బృహత్తర కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టబోతోంది.