మూసీ పనులు ప్రైవేటుకే..!
♦ ప్రక్షాళన, సుందరీకరణ పనుల అప్పగింతకు రంగం సిద్ధం
♦ పలు సంస్థలతో పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ సమావేశం
సాక్షి, హైదరాబాద్: మురుగుకూపంగా మారిన చారిత్రక మూసీ నది ప్రక్షాళన, సుందరీకరణ ప్రక్రియను వేగవంతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు ముమ్మరం చేసింది. మూసీ ప్రక్షాళన, సుందరీకరణ పనులను పబ్లిక్-ప్రైవేటు భాగస్వామ్యం(పీపీపీ) విధానంలో ప్రైవేటు సంస్థలకు అప్పజెప్పేందుకు రంగం సిద్ధం చేస్తోంది. ఈ మేరకు పురపాలక శాఖ మంత్రి కె.తారకరామారావు శుక్రవారం జలమండలిలో ఐదు గంటలపాటు ఆయా సంస్థలతో సుదీర్ఘంగా సమావేశమయ్యారు. టాటా గ్రూపు, స్టూప్, ఆర్‌వీ అసోసియేట్స్, ఎన్విరో కంట్రోల్ అసోసియేషన్ సంస్థలు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా తాము చేపట్టబోయే సుందరీకరణ, ప్రక్షాళన, మూసీ నదిపై నిర్మించాల్సిన ఆకాశమార్గం పనులపై తాము సిద్ధం చేసిన డిజైన్లను మంత్రికి వివరించారు.
నిధుల కొరత కారణంగా పీపీపీ విధానంలో సాధ్యమైనంత తక్కువ ఖర్చుతో ఈ పనులను చేపట్టేందుకు అవసరమైన సమగ్ర ప్రాజెక్టు ప్రతిపాదనలు సిద్ధంచేసి ప్రభుత్వానికి నివేదించాలని మంత్రి ఆయా సంస్థలకు సూచించారు. మూసీలోకి చేరుతున్న గృహ, వాణిజ్య, పారిశ్రామిక వ్యర్థ జలాల శుద్ధి, నగరంలో సుమారు 40 కిలోమీటర్ల మేర ప్రవహిస్తున్న మూసీ నదికి ఇరువైపులా పర్యాటకులకు కనువిందు చేసేలా రిక్రియేషన్ వ్యవస్థలు, వాటర్ గేమ్స్, ఫుడ్ కోర్టులు, పిల్లల ఆట స్థలాల వంటివి ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని కోరారు. ఇక నదికి ఆనుకుని ఉన్న ప్రభుత్వ స్థలాల లెక్క తక్షణం తేల్చాలని, ఇందుకు సమగ్ర సర్వే చేపట్టాలని రెవెన్యూ, హెచ్‌ఎండీఏ అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో నగర మేయర్ బొంతు రామ్మోహన్, మున్సిపల్ శాఖ ముఖ్యకార్యదర్శి ఎంజీ గోపాల్, నగర కమిషనర్, జలమండలి ఎండీ జనార్దన్‌రెడ్డి, జలమండలి ప్రాజెక్టు విభాగం డెరైక్టర్ కొండారెడ్డి, సత్యసూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
మూసీ వెతలివే..
నగరంలో గృహ, వాణిజ్య, పారిశ్రామిక సంస్థల నుంచి నిత్యం 1,400 మిలియన్ లీటర్ల మురుగునీరు మూసీలో కలుస్తోంది. రెండేళ్లక్రితం జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం నిధులతో మొదటిదశ ప్రక్షాళన పథకానికి శ్రీకారం చుట్టారు. నదీ పరీవాహక ప్రాంతంలో మురుగు శుద్ధికి ఐదు ఎస్టీపీలను నిర్మించారు. తద్వారా వివిధ నాలాల నుంచి రోజువారీగా వెలువడుతున్న 592 మిలియన్ లీటర్ల మురుగును శుద్ధిచేసి నదిలోకి వదిలే ఏర్పాట్లు చేశారు. కానీ మరో 610 మిలియన్ లీటర్ల మురుగునీటిని శుద్ధి చేయకుండానే మూసీలోకి వదులుతున్నారు. దీంతో నది మరింత మురుగుకూపంగా మారింది. ప్రక్షాళనకు గతంలో జాతీయ నదీ పరిరక్షణ పథకం కింద 70 శాతం నిధుల మంజూరుకు కేంద్రం ముందుకొచ్చినా అడుగు ముందుకు పడలేదు. కాగా, సుమారు రూ.2,965.52 కోట్ల అంచనా వ్యయంతో మూడు కారిడార్ల పరిధిలో మూసీ ప్రక్షాళన, సుందరీకరణకు రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర విజన్ డాక్యుమెంట్ రూపొందించింది. సమూల ప్రక్షాళనకు సుమారు రూ.1,000 కోట్లు అంచనా వ్యయంగా నిర్ణయించింది.