అండర్ గ్రౌండ్ పైప్‌లైన్ వేయనున్న 10 డివిజన్‌లోని నాలా
ఖమ్మంఅర్బన్: జిల్లా కేంద్రంలో ఏళ్లుగా మురికికూపంలా ఉన్న గోళ్లపాడు చానల్‌ను ఆ జాడలు లేకుండా పార్క్‌లు, ఓపెన్ జిమ్‌లతో తీర్చిదిద్దిన విషయం విదితమే. అచ్చం అదే మాదిరి నగరంలో మరో ప్రాజెక్టు నిర్మాణానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇరవై డివిజన్ల నుంచి వెలువడే మురుగు నీరు నాలాల ద్వారా వెళ్లే క్రమంలో బయటకు కనిపించకుండా, చెరువుల్లోకి చేరుతుండడంతో అక్కడి నీరు కలుషితం కాకుండా నేరుగా మున్నేరులోకి తరలించేందుకు ఈ ప్రాజెక్టు నిర్మిస్తారు.
తద్వారా వర్షాకాలంలో దుర్వాసన, దోమల బెడదతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజల సమస్యకు పరిష్కారం లభించనుంది. పైపులైన్ ఏర్పాటు, ఇతర పనులను సుమారు రూ.180కోట్లతో చేపట్టే ఈ ప్రాజెక్టుకు ప్రతిపాదనలు సిద్ధం కాగా.. త్వరలో ఖమ్మం రానున్న రాష్ట్ర మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా శంకుస్థాపన చేయించాలని భావనతో ఉన్నట్లు సమాచారం.
ఏం చేస్తారు?
నగరంలోని సుమారు 20 డివిజన్ల పరిధిలో నివాసాల్లో వాడుకునే మురుగు నీరు చెరువుల్లోకి చేరుతోంది. ఈ సమయంలో దుర్వాసన వెదజల్లడమే కాక వర్షాకాలంలో నీరు సాఫీగా సాగక జనావాసాలను ముంచెత్తుతోంది. దీనిని అధిగమించేందుకు ఇళ్ల నుంచి వెలువడే నీరు చెరువుల్లో చేరకుండా, డ్రెయిన్లకు లింక్‌గా ప్రత్యేక పైపులైన్ ఏర్పాటుచేసి మున్నేరుకు నీటిని తరలిస్తారు. ఇందుకోసం సుమారు 20 కిలోమీటర్ల మేర అండర్ గ్రౌండ్ పైపులైన్ వేయనున్నట్లు తెలిసింది. ఈ మొత్తం 20 కిలోమీటర్ల నిడివిలో రెండు మురుగునీరు శుద్ధీకరణ ప్లాంట్లు కూడా ఏర్పాటుచేయనున్నట్లు సమాచారం.
అంతేకాక పైపులైన్ పైభాగంలో పార్క్‌లు, ఓపెన్ జిమ్‌లు నిర్మించిన శుద్ధీకరణ ప్లాంట్లలో శుభ్రం చేసే నీటిని మొక్కల పెంపకానికి విని యోగించాలనే ప్రతిపాదనను అంచనాల్లో పొందు పర్చినట్లు తెలిసింది. ఇందుకోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులతోపాటు కార్పొరేషన్ నిధులు కూడా వెచ్చించనున్నారు. ఇప్పటికే పనులకు ఆమోదం లభించినప్పటికీ మంత్రి కేటీఆర్ పర్యటన సందర్భంగా ప్రకటన చేసి శంకుస్థాపన చేయించాలనే యోచనలో మంత్రి పువ్వాడ అజయ్ ఉన్నట్లు సమాచారం.
త్వరలోనే టెండర్లు
రాష్ట్ర మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ ఇటీవల ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు ‘వాడవాడకు పువ్వాడ’ పేరిట ప్రత్యేక కార్యక్రమం చేపట్టారు. ఇందులో భాగంగా మురుగుబాధ తొలగించాలని పలు డివిజన్ల ప్రజల నుండి వెల్లువెత్తుతున్న వినతులతో మంత్రి గోళ్లపాడు చానల్ తరహాలోనే మరో అండర్ డ్రెయిన్ నిర్మాణం చేపట్టాలని నిర్ణయించారు. సుమారు రూ.180కోట్ల వ్యయమయ్యే ఈ ప్రాజెక్టు ప్రతిపాదనలు సిద్ధం కాగా.. పది రోజుల్లో టెండర్ల ప్రక్రియ చేపట్టాలని భావిస్తున్నట్లు తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment