Under drainage
-
గోళ్లపాడు తరహాలో మరో ప్రాజెక్టు!
ఖమ్మంఅర్బన్: జిల్లా కేంద్రంలో ఏళ్లుగా మురికికూపంలా ఉన్న గోళ్లపాడు చానల్‌ను ఆ జాడలు లేకుండా పార్క్‌లు, ఓపెన్ జిమ్‌లతో తీర్చిదిద్దిన విషయం విదితమే. అచ్చం అదే మాదిరి నగరంలో మరో ప్రాజెక్టు నిర్మాణానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇరవై డివిజన్ల నుంచి వెలువడే మురుగు నీరు నాలాల ద్వారా వెళ్లే క్రమంలో బయటకు కనిపించకుండా, చెరువుల్లోకి చేరుతుండడంతో అక్కడి నీరు కలుషితం కాకుండా నేరుగా మున్నేరులోకి తరలించేందుకు ఈ ప్రాజెక్టు నిర్మిస్తారు. తద్వారా వర్షాకాలంలో దుర్వాసన, దోమల బెడదతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజల సమస్యకు పరిష్కారం లభించనుంది. పైపులైన్ ఏర్పాటు, ఇతర పనులను సుమారు రూ.180కోట్లతో చేపట్టే ఈ ప్రాజెక్టుకు ప్రతిపాదనలు సిద్ధం కాగా.. త్వరలో ఖమ్మం రానున్న రాష్ట్ర మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా శంకుస్థాపన చేయించాలని భావనతో ఉన్నట్లు సమాచారం. ఏం చేస్తారు? నగరంలోని సుమారు 20 డివిజన్ల పరిధిలో నివాసాల్లో వాడుకునే మురుగు నీరు చెరువుల్లోకి చేరుతోంది. ఈ సమయంలో దుర్వాసన వెదజల్లడమే కాక వర్షాకాలంలో నీరు సాఫీగా సాగక జనావాసాలను ముంచెత్తుతోంది. దీనిని అధిగమించేందుకు ఇళ్ల నుంచి వెలువడే నీరు చెరువుల్లో చేరకుండా, డ్రెయిన్లకు లింక్‌గా ప్రత్యేక పైపులైన్ ఏర్పాటుచేసి మున్నేరుకు నీటిని తరలిస్తారు. ఇందుకోసం సుమారు 20 కిలోమీటర్ల మేర అండర్ గ్రౌండ్ పైపులైన్ వేయనున్నట్లు తెలిసింది. ఈ మొత్తం 20 కిలోమీటర్ల నిడివిలో రెండు మురుగునీరు శుద్ధీకరణ ప్లాంట్లు కూడా ఏర్పాటుచేయనున్నట్లు సమాచారం. అంతేకాక పైపులైన్ పైభాగంలో పార్క్‌లు, ఓపెన్ జిమ్‌లు నిర్మించిన శుద్ధీకరణ ప్లాంట్లలో శుభ్రం చేసే నీటిని మొక్కల పెంపకానికి విని యోగించాలనే ప్రతిపాదనను అంచనాల్లో పొందు పర్చినట్లు తెలిసింది. ఇందుకోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులతోపాటు కార్పొరేషన్ నిధులు కూడా వెచ్చించనున్నారు. ఇప్పటికే పనులకు ఆమోదం లభించినప్పటికీ మంత్రి కేటీఆర్ పర్యటన సందర్భంగా ప్రకటన చేసి శంకుస్థాపన చేయించాలనే యోచనలో మంత్రి పువ్వాడ అజయ్ ఉన్నట్లు సమాచారం. త్వరలోనే టెండర్లు రాష్ట్ర మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ ఇటీవల ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు ‘వాడవాడకు పువ్వాడ’ పేరిట ప్రత్యేక కార్యక్రమం చేపట్టారు. ఇందులో భాగంగా మురుగుబాధ తొలగించాలని పలు డివిజన్ల ప్రజల నుండి వెల్లువెత్తుతున్న వినతులతో మంత్రి గోళ్లపాడు చానల్ తరహాలోనే మరో అండర్ డ్రెయిన్ నిర్మాణం చేపట్టాలని నిర్ణయించారు. సుమారు రూ.180కోట్ల వ్యయమయ్యే ఈ ప్రాజెక్టు ప్రతిపాదనలు సిద్ధం కాగా.. పది రోజుల్లో టెండర్ల ప్రక్రియ చేపట్టాలని భావిస్తున్నట్లు తెలిసింది. -
బైక్ దొంగ చేసిన పనికి డ్రైనేజీలోకి పోలీసులు
పాట్నా: వాహనాలు దొంగతనం చేస్తున్న దొంగ పోలీసులను ముప్పుతిప్పలు పెట్టాడు. పోలీసులకు చిక్కకుండా డ్రైనేజీలోకి దూరాడు. ఈ విషయం తెలియని పోలీసులు తీవ్రంగా గాలించి డ్రైనేజీ వద్ద నిలబడ్డారు. అకస్మాత్తుగా డ్రైనేజీపై అనుమానం కలిగింది. డ్రైనేజీని పరిశీలించి చూడగా దొంగ కనిపించాడు. ఈ ఘటనతో షాక్‌కు గురయిన పోలీసులు దొంగను పైకి రమ్మన్నారు. అతడు ఎంతకూ పైకి రాకపోవడంతో పోలీసులు డ్రైనేజీని తవ్వేసి అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ విచిత్ర సంఘటన బిహార్‌లో చోటుచేసుకుంది. అరారియా జిల్లా నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ దొంగపై వాహనాల దొంగతనం కేసు నమోదైంది. దీనిపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బుధవారం అతడు పోలీసులకు చిక్కాడు. స్టేషన్‌కు తీసుకెళ్లి అనంతరం కోర్టుకు తరలిస్తుండగా సంకెళ్లు విడిపించుకుని పరారయ్యాడు. దొంగ పరారవడంతో సీడీపీఓ పుష్కర్ కుమార్ తన పోలీస్ బృందంతో గాలించారు. డ్రైనేజీలో దూరాడని గుర్తించారు. అతడిని పైకి రావాలని చెప్పగా రాలేదు. పైగా చెత్తాచెదారంతో పాటు మురుగు నీరు అధికంగా ఉండడంతో దొంగ బయటకు రావడం కష్టంగా మారింది. దీంతో పోలీసులు మున్సిపల్ అధికారులకు సమాచారం ఇచ్చారు. వారు జేసీబీని తీసుకచ్చి తవ్వేశారు. పక్కన ఉన్న బండలు తొలగించి అతడిని పైకి తీసుకొచ్చారు. చివరకు అతడిని అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఈ సంఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నగరంలో ప్రధాన డ్రైనేజీ కావడంతో ఇబ్బందులు ఎదురవుతుందనే ఉద్దేశంతో పోలీసులు స్పందించి డ్రైనేజీని తవ్వించేశారు. చదవండి: జనం చస్తుంటే.. జాతర చేస్తారా.. చదవండి: Siddartha Murder: సిద్ధార్థది పరువు హత్య? -
డీఎస్ సమాధానం చెప్పాలి
కలెక్టరేట్,న్యూస్‌లైన్ : నిజామాబాద్ నగరంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, ఔటర్ రింగ్ రోడ్డు, బైపాస్‌రోడ్ల పనుల్లో భారీ అక్రమాలు జరిగాయని తెలంగాణ రాజకీయ జేఏసీ నాయకులు ఆరోపించారు. వీటి వెనుక మాజీ పీసీసీ అధ్యక్షులు, ఎమ్యెల్సీ డి.శ్రీనివాస్ హస్తం ఉందన్నారు. జేఏసీ నాయకులు గోపాల్ శర్మ, గైని గంగారాం, వి ప్రభాకర్,భాస్కర్, దాదన్నగారి విఠల్‌రావు తదితరులు ఆదివారం ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు అండర్‌డ్రైనేజీ, రింగురోడ్ల పనులను పరిశీలించారు. అనంతరం వారు విలేకరులతో మాట్లాడుతూ పనులు జరగక ముందే అప్పటి సీమాంధ్ర కలెక్టర్లతో డీఎస్ కుమ్మక్కై కాంట్రాక్టర్లకు బిల్లులు ఇప్పించారన్నారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు అసంపూర్తిగా నిలిచిపోయినందున నగరంలో రోడ్లు నరకాన్ని తలపిస్తున్నాయన్నారు. డ్రైనేజీకి సంబంధించి ప్రతి వార్డులో మ్యాన్‌హోల్‌లు అసంపూర్తిగా ఉన్నాయన్నారు. ఇళ్ల నుంచి కనీసం మ్యాన్‌హోల్‌కు పైప్‌లైన్ కనెక్షన్ ఇవ్వలేక పోయారని తెలిపారు. బైపాస్ రోడ్డు నిర్మాణానికి రూ. 50 కోట్లు మంజూరైనా ఇంత వరకు 50 శాతం కూడా పనులు ప్రారంభించలేదన్నారు. బైపాస్ రోడ్డులో భూములు కోల్పోయిన రైతులకు రూ. 29 కోట్లు నష్టపరిహారం అందించాల్సి ఉండగా రూ. 4 కోట్లు మాత్రమే ఇచ్చారన్నారు. డీఎస్ కాబోయే ముఖ్యమంత్రి అని ప్రచారం చేస్తూ అతని అనుచరులైన కొందరు అధికార పార్టీ నేతలు కాంట్రాక్టర్లు, అధికారుల నుంచి కమీషన్లు తీసుకుంటున్నారని విమర్శించారు. ఔటర్ రింగ్‌రోడ్డు, అండర్‌డ్రైనేజి, బైపాస్‌రోడ్డులలో అక్రమాలపై న్యాయవిచారణకు జేఏసీ పోరాటం చేస్తుందన్నారు. 2010 ఉపఎన్నిక ల సందర్భంగా డీఎస్ కేంద్రమంత్రి జైపాల్‌రెడ్డితో సుమారు రూ. 95 కోట్ల వ్యయంతో అండర్ డ్రేనేజి పనులను ప్రారంభింపచేయించారని, నిజామాబాద్ నగరాన్ని స్వర్గం చేస్తానని చెప్పి ఇప్పుడు ప్రజలకు నరాకాన్ని చూపిస్తున్నారన్నారు. అండర్ డ్రైనేజీ పనులను ఎల్అండ్టీ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకుని సీమాంధ్రకు చెందిన సబ్‌కాంట్రక్టర్‌కు పనులు అప్పగించారని ఆరోపించారు. రాబోయే ఎన్నికల్లో 100 తప్పులతో చార్జిషీట్ తయారు చేసీ ప్రజలముందు డీఎస్‌ను దోషిగా నిలబెడతామన్నారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్, టీడీపీలు ప్రత్యర్థి పార్టీలుగా ప్రచారం చేసుకుని, తర్వాత కలిసి పని చేస్తున్నాయన్నారు. ఈ రెండు పార్టీలు కలిసి జిల్లా అభివృద్ధిని 30 సంవత్సరాలు వెనక్కి నెట్టాయన్నారు.