డీఎస్ సమాధానం చెప్పాలి | We want to answer from DS | Sakshi
Sakshi News home page

డీఎస్ సమాధానం చెప్పాలి

Published Mon, Nov 11 2013 3:49 AM | Last Updated on Sat, Sep 2 2017 12:30 AM

We want to answer from  DS

కలెక్టరేట్,న్యూస్‌లైన్ :  నిజామాబాద్ నగరంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, ఔటర్ రింగ్ రోడ్డు, బైపాస్‌రోడ్ల పనుల్లో భారీ అక్రమాలు జరిగాయని తెలంగాణ రాజకీయ జేఏసీ నాయకులు ఆరోపించారు. వీటి వెనుక మాజీ పీసీసీ అధ్యక్షులు, ఎమ్యెల్సీ డి.శ్రీనివాస్ హస్తం ఉందన్నారు. జేఏసీ నాయకులు గోపాల్ శర్మ, గైని గంగారాం, వి ప్రభాకర్,భాస్కర్, దాదన్నగారి విఠల్‌రావు తదితరులు ఆదివారం ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు అండర్‌డ్రైనేజీ, రింగురోడ్ల పనులను పరిశీలించారు. అనంతరం వారు విలేకరులతో మాట్లాడుతూ పనులు జరగక ముందే అప్పటి సీమాంధ్ర కలెక్టర్లతో డీఎస్ కుమ్మక్కై కాంట్రాక్టర్లకు బిల్లులు ఇప్పించారన్నారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు అసంపూర్తిగా నిలిచిపోయినందున నగరంలో రోడ్లు నరకాన్ని తలపిస్తున్నాయన్నారు. డ్రైనేజీకి సంబంధించి ప్రతి వార్డులో మ్యాన్‌హోల్‌లు అసంపూర్తిగా ఉన్నాయన్నారు. ఇళ్ల నుంచి కనీసం మ్యాన్‌హోల్‌కు పైప్‌లైన్ కనెక్షన్ ఇవ్వలేక పోయారని తెలిపారు.

 బైపాస్ రోడ్డు నిర్మాణానికి రూ. 50 కోట్లు మంజూరైనా ఇంత వరకు 50 శాతం కూడా పనులు ప్రారంభించలేదన్నారు. బైపాస్ రోడ్డులో భూములు కోల్పోయిన రైతులకు రూ. 29 కోట్లు నష్టపరిహారం అందించాల్సి ఉండగా రూ. 4 కోట్లు మాత్రమే ఇచ్చారన్నారు. డీఎస్ కాబోయే ముఖ్యమంత్రి అని ప్రచారం చేస్తూ అతని అనుచరులైన కొందరు  అధికార పార్టీ నేతలు  కాంట్రాక్టర్లు, అధికారుల నుంచి కమీషన్లు తీసుకుంటున్నారని విమర్శించారు. ఔటర్ రింగ్‌రోడ్డు, అండర్‌డ్రైనేజి, బైపాస్‌రోడ్డులలో అక్రమాలపై న్యాయవిచారణకు జేఏసీ పోరాటం చేస్తుందన్నారు. 2010 ఉపఎన్నిక ల సందర్భంగా డీఎస్ కేంద్రమంత్రి జైపాల్‌రెడ్డితో సుమారు రూ. 95 కోట్ల వ్యయంతో అండర్ డ్రేనేజి పనులను ప్రారంభింపచేయించారని, నిజామాబాద్ నగరాన్ని స్వర్గం చేస్తానని చెప్పి ఇప్పుడు ప్రజలకు నరాకాన్ని చూపిస్తున్నారన్నారు.

అండర్ డ్రైనేజీ పనులను ఎల్‌అండ్‌టీ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకుని సీమాంధ్రకు చెందిన సబ్‌కాంట్రక్టర్‌కు పనులు అప్పగించారని ఆరోపించారు. రాబోయే ఎన్నికల్లో 100 తప్పులతో చార్జిషీట్ తయారు చేసీ ప్రజలముందు డీఎస్‌ను దోషిగా నిలబెడతామన్నారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్, టీడీపీలు ప్రత్యర్థి పార్టీలుగా ప్రచారం చేసుకుని, తర్వాత కలిసి పని చేస్తున్నాయన్నారు. ఈ రెండు పార్టీలు కలిసి జిల్లా అభివృద్ధిని 30 సంవత్సరాలు వెనక్కి నెట్టాయన్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement