gopal sharma
-
‘అమరుల కుటుంబాలను ఆదుకోవాలి’
కలెక్టరేట్, న్యూస్‌లైన్ : తెలంగాణ రాష్ట్ర సాధనోద్యమంలో అసువులు బాసినవారి కుటుంబ సభ్యులను ఆదుకోవాలని పొలిటికల్ జేఏసీ జిల్లా చైర్మన్ గోపాల్‌శర్మ నూతన ప్రభుత్వాన్ని కోరారు. ఆదివారం టీఎన్జీవోస్ జిల్లా కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ ఉద్యమంలో అమరులైనవారిని గుర్తించడంలో జిల్లా రెవెన్యూ అధికారులు విఫలమయ్యారన్నారు. ఎఫ్ఐఆర్ లేనందున ఆత్మత్యాగాలుగా గుర్తించలేమని వారు పేర్కొంటున్నారన్నారు. తెలంగాణ కోసం జిల్లాకు చెందిన అరవై మంది ఆత్మత్యాగాలకు పాల్పడ్డారని, వారి వివరాలను జేఏసీ సేకరించిందని తెలిపారు. అమరుల కుటుంబ సభ్యులను ఆదుకుంటామని టీఆర్ఎస్ మేనిఫెస్టోలో పేర్కొందని, దానిని కేసీఆర్ అమలు చేస్తారన్న విశ్వాసం తమకుందని పేర్కొన్నారు. ఉద్యమకారులపై పెట్టిన కేసులను ఎత్తివేయాలని కోరారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో అందరి పాత్ర ఉందన్నారు. బంగారు తెలంగాణ కోసం అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో టీజీవో జిల్లా అధ్యక్షుడు బాబూరావు, టీఎన్జీవోస్ జిల్లా కార్యదర్శి కిషన్, జేఏసీ నాయకులు భాస్కర్, దాదన్నగారి విఠల్‌రావు, మోహన్ తదితరులు పాల్గొన్నారు. -
జేఏసీని విస్మరించడం తగదు
కలెక్టరేట్,న్యూస్‌లైన్ : తెలంగాణ ఉద్యమంలో ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొని, ప్రాణాలను సైతం పణంగాపెట్టి ఉద్యమించిన జేఏసీని విస్మరించడం ఉద్యమపార్టీకి తగదని జేఏసీ జిల్లా చైర్మన్ గోపాల్‌శర్మ అన్నారు. సీమాంధ్ర పెట్టుబడిదారులను,రియల్ ఎస్టేట్ వ్యాపారులను తెలంగాణ పునర్నిర్మాణంలో ఇప్పటి నుంచే భాగస్వాములను చేయడానికి కొన్ని ఉద్యమ పార్టీ నేతలు కుట్రలు పన్నుతున్నారని పరోక్షంగా టీఆర్ఎస్పై విరుచుకు పడ్డారు. గురువారం స్థానిక టీఎన్జీవోస్ భవన్లో జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించిన విలేకరుల సమావేశం లో ఆయన మాట్లాడారు. ఆసియాలో అతిపెద్దదైన బోధన్ షుగర్స్ ఫ్యాక్టరీని ప్రభుత్వం తిరిగి స్వాధీనం చేసుకుంటుందని, మంత్రివర్గ ఉపసంఘంతో జిల్లామంత్రి సుదర్శన్‌రెడ్డి దగ్గరుండి ప్రకటన చేయించారన్నారు. ఫ్యాక్టరీని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని జేఏసీ మొదటి నుంచి కోరినప్పటికీ పట్టించుకోలేదని, ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని బోధన్ నియోజకవర్గాన్ని తన ఖాతాలో వేసుకోవడానికి మంత్రి ఆడిన కపట నాటకమే స్వాధీన ప్రకటన అని ఆరోపించారు. నవ తెలంగాణ నిర్మాణంలో రాష్ట్ర అభివృద్ధే ధ్యేయంగా జిల్లా జేఏసీ పనిచేస్తుందన్నారు. తెలంగాణ అమరవీరుల, ఉద్యమకారుల త్యాగాలను కొన్ని రాజకీయ పార్టీలు గుర్తించడంలేదన్నారు. అమరవీరుల కుటుంబాలను,ఉద్యోగులను,తెలంగాణవాదులను అవమానపరిచే విధంగా ప్రవర్తిస్తున్నాయని మండిపడ్డారు.తెలంగాణ ఉద్యమానికి వెన్నుముకగా నిలిచిన జేఏసీని ఏ మాత్రం గుర్తించకుండా, వారి త్యాగాలకు సముచిత స్థానం కల్పించకుండా తెలంగాణ ఉద్యమ పార్టీ ప్రవర్తిస్తోందని, ఇలాగైతే ఆ పార్టీ భవిష్యత్తు దెబ్బతింటుందని హెచ్చరిం చారు. నవ తెలంగాణ నిర్మాణంపై అన్ని పార్టీల అభిప్రాయాలు సేకరిస్తామన్నారు. శుక్రవారం రాష్ట్ర జేఏసీ ఆధ్వర్యంలో తెలంగాణలోని అన్ని జిల్లాల జేఏసీలు సమావేశం కానున్నాయని తెలిపారు. ఉద్యోగులకు అన్యాయం జరిగితే సహించేదిలేదు.. ఉద్యోగ జేఏసీ జిల్లా చైర్మన్ గైని గంగారాం, కార్యదర్శి కిషన్‌లు మాట్లాడుతూ తెలంగాణ కోసం 42రోజుల పాటు సకలజనులసమ్మె చేపట్టిన ఉద్యోగుల త్యాగాలను ఉద్యమ పార్టీ గుర్తించడంలేదన్నారు. నవతెలంగాణ నిర్మాణంలో రాజకీయ పార్టీలతో పాటు ఉద్యోగులకు సమాన ప్రతిపాదికన సముచిత న్యాయం జరగాలన్నారు.లేనిపక్షంలో తెలంగాణ ఉద్యోగులంతా ఏకమై ఉద్యమ పార్టీ పని పడతామని వారు హెచ్చరించారు. ఉద్యమ పార్టీ అధినేత తీరు తెలంగాణ ఉద్యోగులను అవమాన పరిచే విధంగా ఉందన్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారులకు,బడా కాంట్రాక్టర్లకు ఉద్యమ పార్టీ కండువాలు కప్పుతోందని తెలంగాణ జర్నలిస్టు ఫోరం జిల్లా అధ్యక్షుడు జమాల్పూర్గణేష్ ఆరోపించారు. ఇలాగైతే ఆ పార్టీ నేతలను నేలకేసి కొట్టేరోజులు వస్తాయన్నారు. సమావేశంలో జేఏసీ నాయకులు వి.ప్రభాకర్, భాస్కర్, సుదర్శన్,దయానంద్, జీజీ రామ్, తెలంగాణ నాల్గో తరగతి ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు శంకర్ తదితరులు పాల్గొన్నారు. -
డీఎస్ సమాధానం చెప్పాలి
కలెక్టరేట్,న్యూస్‌లైన్ : నిజామాబాద్ నగరంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, ఔటర్ రింగ్ రోడ్డు, బైపాస్‌రోడ్ల పనుల్లో భారీ అక్రమాలు జరిగాయని తెలంగాణ రాజకీయ జేఏసీ నాయకులు ఆరోపించారు. వీటి వెనుక మాజీ పీసీసీ అధ్యక్షులు, ఎమ్యెల్సీ డి.శ్రీనివాస్ హస్తం ఉందన్నారు. జేఏసీ నాయకులు గోపాల్ శర్మ, గైని గంగారాం, వి ప్రభాకర్,భాస్కర్, దాదన్నగారి విఠల్‌రావు తదితరులు ఆదివారం ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు అండర్‌డ్రైనేజీ, రింగురోడ్ల పనులను పరిశీలించారు. అనంతరం వారు విలేకరులతో మాట్లాడుతూ పనులు జరగక ముందే అప్పటి సీమాంధ్ర కలెక్టర్లతో డీఎస్ కుమ్మక్కై కాంట్రాక్టర్లకు బిల్లులు ఇప్పించారన్నారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు అసంపూర్తిగా నిలిచిపోయినందున నగరంలో రోడ్లు నరకాన్ని తలపిస్తున్నాయన్నారు. డ్రైనేజీకి సంబంధించి ప్రతి వార్డులో మ్యాన్‌హోల్‌లు అసంపూర్తిగా ఉన్నాయన్నారు. ఇళ్ల నుంచి కనీసం మ్యాన్‌హోల్‌కు పైప్‌లైన్ కనెక్షన్ ఇవ్వలేక పోయారని తెలిపారు. బైపాస్ రోడ్డు నిర్మాణానికి రూ. 50 కోట్లు మంజూరైనా ఇంత వరకు 50 శాతం కూడా పనులు ప్రారంభించలేదన్నారు. బైపాస్ రోడ్డులో భూములు కోల్పోయిన రైతులకు రూ. 29 కోట్లు నష్టపరిహారం అందించాల్సి ఉండగా రూ. 4 కోట్లు మాత్రమే ఇచ్చారన్నారు. డీఎస్ కాబోయే ముఖ్యమంత్రి అని ప్రచారం చేస్తూ అతని అనుచరులైన కొందరు అధికార పార్టీ నేతలు కాంట్రాక్టర్లు, అధికారుల నుంచి కమీషన్లు తీసుకుంటున్నారని విమర్శించారు. ఔటర్ రింగ్‌రోడ్డు, అండర్‌డ్రైనేజి, బైపాస్‌రోడ్డులలో అక్రమాలపై న్యాయవిచారణకు జేఏసీ పోరాటం చేస్తుందన్నారు. 2010 ఉపఎన్నిక ల సందర్భంగా డీఎస్ కేంద్రమంత్రి జైపాల్‌రెడ్డితో సుమారు రూ. 95 కోట్ల వ్యయంతో అండర్ డ్రేనేజి పనులను ప్రారంభింపచేయించారని, నిజామాబాద్ నగరాన్ని స్వర్గం చేస్తానని చెప్పి ఇప్పుడు ప్రజలకు నరాకాన్ని చూపిస్తున్నారన్నారు. అండర్ డ్రైనేజీ పనులను ఎల్అండ్టీ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకుని సీమాంధ్రకు చెందిన సబ్‌కాంట్రక్టర్‌కు పనులు అప్పగించారని ఆరోపించారు. రాబోయే ఎన్నికల్లో 100 తప్పులతో చార్జిషీట్ తయారు చేసీ ప్రజలముందు డీఎస్‌ను దోషిగా నిలబెడతామన్నారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్, టీడీపీలు ప్రత్యర్థి పార్టీలుగా ప్రచారం చేసుకుని, తర్వాత కలిసి పని చేస్తున్నాయన్నారు. ఈ రెండు పార్టీలు కలిసి జిల్లా అభివృద్ధిని 30 సంవత్సరాలు వెనక్కి నెట్టాయన్నారు. -
శ్వేత పత్రం విడుదల చేయాలి
ఆర్మూర్, న్యూస్‌లైన్ : కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో ఆరు విడతల్లో చేపట్టిన భూపంపిణీపై శ్వేతపత్రం విడుదల చేయాలని జేఏసీ జిల్లా చైర్మన్ గోపాల్ శ ర్మ డిమాండ్ చేశారు. భూపంపిణీ చేసిన వివరా లు, కబ్జాలు, వ్యవసాయం చేస్తున్న వారి వివరాలు ఆ శ్వేత పత్రంలో పొందుపర్చాలన్నారు. బుధవారం పట్టణంలోని సీపీఐ(ఎంఎల్) న్యూ డెమోక్రసీ కార్యాలయంలో గల కుమార్ నారాయణ సమావేశపు గదిలో భూ పంపిణీపై ఆ ర్మూర్ డివిజన్ కార్యదర్శి వి.ప్రభాకర్ అధ్యక్షత న రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. గతంలో ప్రభుత్వం పట్టాలు ఇచ్చిన భూముల కు కబ్జా చూపించాలని, కబ్జాలో ఉన్న అర్హులకు పట్టాలు ఇవ్వాలని, పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలనే డిమాండ్లపై నిర్వహించిన ఈ సమావేశంలో రాజకీయ పక్షాలు, ప్రజా సంఘాల నా యకులు మాట్లాడారు. భూ పోరాటాల్లో అమరులైన వారికి జోహార్లు అర్పిస్తూ రెండు నిముషాలు మౌనం పాటించి సమావేశాన్ని ప్రారంభించారు. ముఖ్య అతిథిగా గోపాల్ శర్మ మా ట్లాడుతూ.. తెలంగాణ పల్లె ప్రజలు విద్య లేని కారణంగా కష్టనష్టాలను ఎదుర్కొంటున్నారన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం టీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్‌లో విలీనం చేయవద్దని కోరారు. విలీనమే జరిగితే కాంగ్రెస్ ప్రభుత్వం మరో 40 ఏళ్లపాటు తెలంగాణ ప్రజలను దోచుకుంటుందన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్‌రెడ్డి అసెంబ్లీలో తెలంగాణకు ఒక్క పైసా ఇవ్వను ఏం చేసుకుంటారో చేసుకోండి అనే సమయంలో స్పందించని తెలంగాణ ప్రాంత మంత్రులను ఆయన విమర్శించారు. తెలంగాణ మంత్రుల అలసత్వం, బానిసత్వం కారణంగా సీమాంధ్ర నాయకుల తొత్తులుగా మా రుతూ ప్రజలకు అన్యాయం చేస్తున్నారని విమర్శించారు. అన్ని పార్టీలతో త్వరలో సమావేశం నిర్వహించి జిల్లాలోని సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు. శాస్త్రీయ వైఖరి లేని కారణంగానే.. దేశాన్ని, రాష్ట్రాన్ని పాలించే పార్టీలకు శాస్త్రీయ వైఖరి లేని కారణంగానే భూ సమస్యలు తలెత్తుతున్నాయి. ప్రజాస్వామిక దేశంలో సాగు, ఇళ్ల స్థలాల కేటాయింపు సమస్యలను వెంటనే పరిష్కరించకపోతే ప్రజలు క్షమించరు. అధికారుల నిర్లక్ష్యం, అశ్రద్ధ కారణంగా భూ సమస్యలు రావణకాష్టంలా మారుతున్నాయి. సెజ్‌ల పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారులకు భూములు కట్టబెట్టడం మంచిదికాదు. అర్హులైన వారికి భూములు కేటాయించి సమష్టి వ్యవసాయం చేసేటట్లు ఏర్పాటు చేయాలి. - ఏఎస్ పోశెట్టి, టీఆర్ఎస్ పోలిట్‌బ్యూరో సభ్యుడు చట్టాలు కాగితాలకే పరిమితమవుతున్నాయి.. ప్రభుత్వాలు భూ సంస్కరణలు చేస్తున్నామంటూ గొప్పలకు పోయినా అనేక చట్టాలు కాగితాలకు మాత్రమే పరిమితమవుతున్నాయి. అర్హులైన పేదలకు సాగుభూమిని ఇవ్వాలన్న కోనేరు రంగారావు సిఫార్సులను అమలు చేయాలి. ఆర్మూర్ మండలం పెర్కిట్-కొటార్మూర్‌లో పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించి, రియల్ ఎస్టేట్ వ్యాపారుల ఆగడాలను అరికట్టాలి. -కర్నాటి యాదగిరి, న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి -
సీఎం కుట్రవల్లే తెలంగాణకు విద్యుత్ కోత
ఖలీల్‌వాడి, న్యూస్‌లైన్ : సీమాంధ్ర ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి తెలంగాణలో పది గంటల విద్యుత్ కోతలు విధించడానికి కుట్ర పన్నుతున్నాడని జేఏసీ జిల్లా చైర్మన్ గోపాల్‌శర్మ ఆరోపించారు. విద్యుత్ కోతలకు, సీఎం కుట్రలకు నిరసనగా 48 గంటలపాటు తెలంగాణ విద్యుత్ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ రఘు దీక్ష చేపడితే పోలీసులు అక్రమంగా అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తూ మంగళవారం ధర్నాచౌక్ వద్ద రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా గోపాల్‌శర్మ మాట్లాడుతూ.. శాంతి యుతంగా దీక్ష చేపట్టిన రఘును పోలీసులు అక్రమంగా అరెస్ట చేయడం సమంజసం కాదన్నారు. కిరణ్‌కుమార్‌రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉంటూ సీమాంధ్ర ఉద్యమానికి మద్దతు పలకడం సరికాదన్నారు. ఒక్క క్షణం కూడా ఆయనకు ముఖ్యమంత్రి పదవిలో కొనసాగే అర్హత లేదన్నారు. వెంటనే కేంద్ర ప్రభుత్వం ఆయనను పదవి నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ఆయన హెచ్చరించారు. కార్యక్రమంలో జేఏసీ నాయకులు గైని గంగారాం, ప్రభాకర్, భాస్కర్, విద్యుత్ జేఏసీ కోకన్వీనర్ రాజారాం తదితరులు పాల్గొన్నారు. విద్యుత్ ఉద్యోగుల ఆందోళన నాందేవ్‌వాడ : తెలంగాణ విద్యుత్ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ రఘును హైదరాబాద్‌లో అక్రమంగా అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ జిల్లా కేంద్రంలోని ఎన్పీడీసీఎల్ ఉద్యోగులు విధులు బహిష్కరించి నగరంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. స్థానిక ధర్నాచౌక్ వద్ద ధర్నా నిర్వహించారు. సీఎంకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సీఎం కిరణ్ ఆంధ్రప్రాంతం వారికి మద్దతు ఇస్తూ, తెలంగాణకు అన్యా యం చేస్తున్నారని, తెలంగాణ రాష్ట్రాన్ని అడ్డుకునేందుకు కుట్నలు పన్నుతున్నారని ఉద్యోగులు ఆరోపించారు. అక్రమగా అరెస్టు చేసిన రఘును వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కేంద్రం సీఎంను వెంటనే బర్తరఫ్ చేయాలన్నారు. కార్యక్రమంలో విద్యుత్ ఉద్యోగుల జేఏసీ కన్వీనర్ లక్ష్మారెడ్డి, జేఏసీ నాయకులు తోట రాజశేఖర, ప్రసాద్, కాశీనాథ్, నాంపల్లి, చెన్నయ్య, సత్తయ్య, గంగారాం, కామేశ్వర్రావు, వెంకటరమణ, సత్యం తదితరులు పాల్గొన్నారు.