‘అమరుల కుటుంబాలను ఆదుకోవాలి’
కలెక్టరేట్, న్యూస్‌లైన్ : తెలంగాణ రాష్ట్ర సాధనోద్యమంలో అసువులు బాసినవారి కుటుంబ సభ్యులను ఆదుకోవాలని పొలిటికల్ జేఏసీ జిల్లా చైర్మన్ గోపాల్‌శర్మ నూతన ప్రభుత్వాన్ని కోరారు. ఆదివారం టీఎన్జీవోస్ జిల్లా కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ ఉద్యమంలో అమరులైనవారిని గుర్తించడంలో జిల్లా రెవెన్యూ అధికారులు విఫలమయ్యారన్నారు. ఎఫ్‌ఐఆర్ లేనందున ఆత్మత్యాగాలుగా గుర్తించలేమని వారు పేర్కొంటున్నారన్నారు.
తెలంగాణ కోసం జిల్లాకు చెందిన అరవై మంది ఆత్మత్యాగాలకు పాల్పడ్డారని, వారి వివరాలను జేఏసీ సేకరించిందని తెలిపారు. అమరుల కుటుంబ సభ్యులను ఆదుకుంటామని టీఆర్‌ఎస్ మేనిఫెస్టోలో పేర్కొందని, దానిని కేసీఆర్ అమలు చేస్తారన్న విశ్వాసం తమకుందని పేర్కొన్నారు. ఉద్యమకారులపై పెట్టిన కేసులను ఎత్తివేయాలని కోరారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో అందరి పాత్ర ఉందన్నారు. బంగారు తెలంగాణ కోసం అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో టీజీవో జిల్లా అధ్యక్షుడు బాబూరావు, టీఎన్‌జీవోస్ జిల్లా కార్యదర్శి కిషన్, జేఏసీ నాయకులు భాస్కర్, దాదన్నగారి విఠల్‌రావు, మోహన్ తదితరులు పాల్గొన్నారు.