కలెక్టరేట్,న్యూస్‌లైన్ : తెలంగాణ ఉద్యమంలో ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొని, ప్రాణాలను సైతం పణంగాపెట్టి ఉద్యమించిన జేఏసీని విస్మరించడం ఉద్యమపార్టీకి తగదని జేఏసీ జిల్లా చైర్మన్ గోపాల్‌శర్మ అన్నారు. సీమాంధ్ర పెట్టుబడిదారులను,రియల్ ఎస్టేట్ వ్యాపారులను తెలంగాణ పునర్నిర్మాణంలో ఇప్పటి నుంచే భాగస్వాములను చేయడానికి కొన్ని ఉద్యమ పార్టీ నేతలు కుట్రలు పన్నుతున్నారని పరోక్షంగా టీఆర్‌ఎస్‌పై విరుచుకు పడ్డారు.
గురువారం స్థానిక టీఎన్జీవోస్ భవన్‌లో జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించిన విలేకరుల సమావేశం లో ఆయన మాట్లాడారు. ఆసియాలో అతిపెద్దదైన బోధన్ షుగర్స్ ఫ్యాక్టరీని ప్రభుత్వం తిరిగి స్వాధీనం చేసుకుంటుందని, మంత్రివర్గ ఉపసంఘంతో జిల్లామంత్రి సుదర్శన్‌రెడ్డి దగ్గరుండి ప్రకటన చేయించారన్నారు. ఫ్యాక్టరీని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని జేఏసీ మొదటి నుంచి కోరినప్పటికీ పట్టించుకోలేదని, ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని బోధన్ నియోజకవర్గాన్ని తన ఖాతాలో వేసుకోవడానికి మంత్రి ఆడిన కపట నాటకమే స్వాధీన ప్రకటన అని ఆరోపించారు. నవ తెలంగాణ నిర్మాణంలో రాష్ట్ర అభివృద్ధే ధ్యేయంగా జిల్లా జేఏసీ పనిచేస్తుందన్నారు.
తెలంగాణ అమరవీరుల, ఉద్యమకారుల త్యాగాలను కొన్ని రాజకీయ పార్టీలు గుర్తించడంలేదన్నారు. అమరవీరుల కుటుంబాలను,ఉద్యోగులను,తెలంగాణవాదులను అవమానపరిచే విధంగా ప్రవర్తిస్తున్నాయని మండిపడ్డారు.తెలంగాణ ఉద్యమానికి వెన్నుముకగా నిలిచిన జేఏసీని ఏ మాత్రం గుర్తించకుండా, వారి త్యాగాలకు సముచిత స్థానం కల్పించకుండా తెలంగాణ ఉద్యమ పార్టీ ప్రవర్తిస్తోందని, ఇలాగైతే ఆ పార్టీ భవిష్యత్తు దెబ్బతింటుందని హెచ్చరిం చారు. నవ తెలంగాణ నిర్మాణంపై అన్ని పార్టీల అభిప్రాయాలు సేకరిస్తామన్నారు. శుక్రవారం రాష్ట్ర జేఏసీ ఆధ్వర్యంలో తెలంగాణలోని అన్ని జిల్లాల జేఏసీలు సమావేశం కానున్నాయని తెలిపారు.
ఉద్యోగులకు అన్యాయం జరిగితే సహించేదిలేదు..
ఉద్యోగ జేఏసీ జిల్లా చైర్మన్ గైని గంగారాం, కార్యదర్శి కిషన్‌లు మాట్లాడుతూ తెలంగాణ కోసం 42రోజుల పాటు సకలజనులసమ్మె చేపట్టిన ఉద్యోగుల త్యాగాలను ఉద్యమ పార్టీ గుర్తించడంలేదన్నారు. నవతెలంగాణ నిర్మాణంలో రాజకీయ పార్టీలతో పాటు ఉద్యోగులకు సమాన ప్రతిపాదికన సముచిత న్యాయం జరగాలన్నారు.లేనిపక్షంలో తెలంగాణ ఉద్యోగులంతా ఏకమై ఉద్యమ పార్టీ పని పడతామని వారు హెచ్చరించారు.
ఉద్యమ పార్టీ అధినేత తీరు తెలంగాణ ఉద్యోగులను అవమాన పరిచే విధంగా ఉందన్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారులకు,బడా కాంట్రాక్టర్లకు ఉద్యమ పార్టీ కండువాలు కప్పుతోందని తెలంగాణ జర్నలిస్టు ఫోరం జిల్లా అధ్యక్షుడు జమాల్‌పూర్‌గణేష్ ఆరోపించారు. ఇలాగైతే ఆ పార్టీ నేతలను నేలకేసి కొట్టేరోజులు వస్తాయన్నారు. సమావేశంలో జేఏసీ నాయకులు వి.ప్రభాకర్, భాస్కర్, సుదర్శన్,దయానంద్, జీజీ రామ్, తెలంగాణ నాల్గో తరగతి ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు శంకర్ తదితరులు పాల్గొన్నారు.
జేఏసీని విస్మరించడం తగదు
Published Fri, Mar 28 2014 2:53 AM | Last Updated on Sat, Sep 2 2017 5:15 AM
Advertisement