సాక్షి, హైదరాబాద్: రీజినల్ రింగురోడ్డు ఉత్తర భాగం సర్వే చేశారు.. అలైన్‌మెంట్ ఖరారు అయింది. భూమి వివరాల ఆధారంగా మూడు గెజిట్ నోటిఫికేషన్లు జారీ అయ్యాయి. వాటిపై అభ్యంతరాల స్వీకరణ, పరిష్కారం తంతూ పూర్తయింది.. ఇక పరిహారం పంపిణీకి రంగం సిద్ధమైంది.
కానీ తాజాగా హెక్టార్ల కొద్దీ భూమి వివరాలు రికార్డుల్లోకి రాలేదని గుర్తించారు. ఇప్పటివరకు జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్లలో వాటి వివరాలు లేకపోవడంతో హడావుడిగా ఆ భూములకు సంబంధించి గెజిట్ నోటిఫికేషన్లు జారీ ప్రక్రియ ప్రారంభించారు. వీటికి తొలుత 3ఏ (క్యాపిటల్), ఆ తర్వాత 3డీ నోటిఫికేషన్లు ఇస్తూ, వాటిపై అభ్యంతరాలు స్వీకరించి గ్రామ సభల్లో సమాధానాలు చెప్పాలి. ఆ తర్వాతే పరిహారం ప్రక్రియ మొదలుపెట్టాల్సి ఉంది.
ఏడాదిన్నర తర్వాత గుర్తింపు!
రీజినల్ రింగురోడ్డులో సంగారెడ్డి నుంచి చౌటుప్పల్ వరకు నిర్మించే ఉత్తర భాగానికి సంబంధించిన ప్రక్రియ 2021లోనే మొదలైన విషయం తెలిసిందే. సర్వే ప్రక్రియ పూర్తి చేసి అలైన్‌మెంటు ఖరారయ్యాక గతేడాది మార్చిలో తొలి గెజిట్ నోటిఫికేషన్ 3ఏ (స్మాల్ ఏ) జారీ అయింది. అందులో ఎక్కడ ఎన్ని కి.మీ. రోడ్డు నిర్మాణం కానుందో వెల్లడించారు. ప్రభావితమయ్యే భూముల వివరాలు కూడా సేకరించారు. అనంతరం ఏప్రిల్‌లో 3ఏ (క్యాపిటల్ ఏ) నోటిఫికేషన్ జారీ చేశారు. ఇందులో సేకరించే భూమి వివరాలను సర్వే నంబర్లు, విస్తీర్ణం వారీగా ప్రచురించారు. ఆ తర్వాత పట్టాదారు పేర్లతో 3డీ నోటిఫికేషన్ కూడా జారీ చేశారు.
అయితే మధ్యలో చాలా భూముల వివరాలు గల్లంతైన విషయాన్ని మాత్రం గుర్తించలేదు. ఇప్పుడు పరిహారం పంపిణీకి వివరాలు సిద్ధం చేస్తున్న క్రమంలో లెక్కల్లో తేడాలొచ్చాయి. 162 కి.మీ. ఉత్తర భాగం రింగురోడ్డుకు సంబంధించి 2 వేల హెక్టార్ల భూమిని సేకరించాల్సి ఉంది. కానీ పరిహారం లెక్కించే తరుణంలో భూమి తక్కువగా ఉన్నట్టు తేలింది. దీంతో మొదటి నుంచి చూస్తూ రాగా, దాదాపు 450 ఎకరాల భూమి వివరాలు గల్లంతైనట్టు గుర్తించారు. సర్వే నెంబర్ల వారీగా వాటి వివరాలు తీసి ఇప్పుడు నోటిఫికేషన్లు జారీ చేయటం ప్రారంభించారు.
ఇందులో భాగంగా తాజాగా యాదాద్రి, ఆందోల్–జోగిపేట భూసేకరణ అథారిటీ (కాలా)ల పరిధిలోని భూములకు సంబంధించి 3ఏ (క్యాపిటల్ ఏ) నోటిఫికేషన్‌ను ఎన్‌హెచ్‌ఏఐ జారీ చేసింది. యాదాద్రి కాలాకు సంబంధించి గతేడాది ఏప్రిల్‌లో 185 హెక్టార్ల భూసేకరణకు సంబంధించి నోటిఫికేషన్ ఇవ్వగా, ఇప్పుడు గల్లంతైన మరో 19.20 హెక్టార్ల భూమికి సంబంధించి గెజిట్ నోటిఫికేషన్ జారీ చేశారు. అందోల్–జోగిపేట కాలా పరిధికి సంబంధించి గతేడాది 94.38 హెక్టార్ల భూమికి సంబంధించి నోటిఫికేషన్ ఇవ్వగా, గల్లంతైన 15.05 హెక్టార్లకు సంబంధించి తాజాగా జారీ చేశారు. వీటిపై అభ్యంతరాలు వెల్లడించేందుకు సంబం«దీకులకు గడువు ఇచ్చారు.
పొరపాటు కాదు..
ఇది పొరపాటుగా జరిగింది కాదని అధికారులు చెబుతున్నారు. ‘రీజినల్ రింగురోడ్డు అలైన్‌మెంటును ప్రాథమికంగా గూగుల్ మ్యాపు ఆధారంగా చేశారు. ఈ ప్రక్రియలో కొన్ని వివరాలు గల్లంతయ్యే పరిస్థితి ఉంటుంది. నిజాం కాలం నాటి లెక్కల్లో కొన్ని వివరాలు సరిగా లేకపోవటం కూడా దీనికి కారణం..’అని ఉన్నతాధికారులు పేర్కొంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment