రింగ్ పడుతోంది..
రింగ్ పడుతోంది..
Published Tue, Oct 18 2016 1:03 AM | Last Updated on Fri, Jun 1 2018 8:31 PM
అనంతపురం సిటీ: జాతీయ రహదారులను అనుసంధానం చేస్తూ అనంతపురం నగర శివారులో రింగ్ రోడ్డు నిర్మాణానికి ఎట్టకేలకు అనుమతులు లభించాయి. ఇందుకు గాను రూ. 600 కోట్ల అంచనా వ్యయంతో అధికారులు పంపిన నివేదికకు ప్రభుత్వం ఆమోద ముద్ర వేసింది. ఇందులో భాగంగా తొలి విడతలో రూ. 129 కోట్ల విడుదలకు ఉత్తర్వులు కూడా జారీ అయ్యాయి. మొత్తం నిధులను నాలుగు విడతలుగా అందజేసేందుకు ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.
పీపీపీ విధానంలో పనులు
అనంతపురం నగర శివారు ప్రాంతం నుంచి జాతీయ రహదారులను అనుసంధానం చేస్తూ ఏర్పాటు చేయనున్న రింగ్ రోడ్డు నిర్మాణానికి సంబంధించి పబ్లిక్, ప్రైవేట్ పార్టనర్‌షిప్ (పీపీపీ) విధానంలో టెండర్ల ద్వారా పనులు అప్పగించేందుకు రంగం సిద్ధమైంది. నగరానికి ఐదు నుంచి 11 కిలోమీటర్ల చుట్టూ కొలతల్లో 27 కి.మీ వలయాకారంలో రోడ్డును నిర్మించదలిచినట్లు సమాచారం. ఇప్పటికే ఈ పనులకు సంబంధించి సర్వే బాధ్యతలను ఎల్‌అండ్‌టీ సంస్థకు అప్పగించినట్లు తెలుస్తోంది.
గత సర్వేపై సందిగ్ధత
రింగ్ రోడ్డు ఏర్పాటుకు సంబంధించి గతంలో చేసిన సర్వే లోపభూయిష్టంగా ఉన్నట్లు సమాచారం. దీనిలోని లోపాలను సరిదిద్దుకోవడమా? లేక అదే ప్రణాళికతో ముందుకు సాగడమా అనే విషయంపై సందిగ్ధత నెలకొంది. అయితే లోపాలను సరిదిద్దుకునేందుకే ఎల్‌అండ్‌టీకి సర్వే పనులు అప్పగించినట్లు సమాచారం. సర్వే పూర్తి అయిన తర్వాత ఏ గ్రామాల మీదుగా రింగ్ రోడ్డు నిర్మాణం పూర్తి అవుతుందో స్పష్టంగా తెలియనుంది. కాగా, అధికారుల సూచన మేరకు నగరానికి చుట్టూ సరిసమానంగా కిలోమీటర్ల దూరాన్ని గుర్తించే చర్యలు చేపట్టినట్లు సమాచారం.
రియల్ వ్యాపారుల హల్‌చల్
జిల్లా కేంద్రం శివారులో ఏర్పాటు కానున్న రింగ్ రోడ్డు రియల్ వ్యాపారుల పాలిట వరంగా మారుతోంది. నిర్ధిష్టమైన రూట్ మ్యాప్ సిద్ధం కాకనే అనంతపురం శివారు గ్రామాల్లో రియల్టర్లు హల్‌చల్ చేస్తున్నారు. అయా గ్రామాల మీదుగా రింగ్ రోడ్డు ఏర్పాటు కానుందంటూ చాలా మందిని నమ్మిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. వీరి మాటల మాయాజాలంలో పడ్డ చాలా మంది అమాయకులు ఏ మాత్రం ధర లేని భూములను రూ. లక్షలు పోసి కొనుగోలు చేస్తున్నట్లు సమాచారం.
Advertisement
Advertisement