పైప్‌లైన్ ద్వారా వంట గ్యాస్ సరఫరా
విజయవంతంగా 225 ఇళ్లకు సరఫరా
త్వరలో నగరమంతటా విస్తరణకు గెయిల్ గ్యాస్ లిమిటెడ్ సన్నాహాలు
బెంగళూరు: నగర మహిళలకు శుభవార్త. గ్యాస్ అయిపోయింది. ఎప్పుడు సిలెండర్ వస్తుందో అని చింతించనక్కరలేదు. 24 గంటల పాటు 365 రోజులూ కొళాయి తరహాలో పైప్‌లైన్ ద్వారా గ్యాస్ సరఫరా కానుంది. పెలైట్ ప్రతిపాదికన ఇప్పటికే 225 ఇళ్లకు పైప్‌లైన్ ద్వారా గ్యాస్‌ను విజయవంతంగా సరఫరా చేసి సంతృప్తికర ఫలితాలు పొందిన అధికారులు ఈ ప్రాజెక్టును నగరమంతటా విస్తరింపజేయడానికి ప్రణాళికలు రచిస్తున్నారు. ప్రస్తుతం వంటింట్లో గ్యాస్ అయిపోయిన తర్వాత గ్యాస్ బుక్ చేస్తే గరిష్టంగా పది రోజుల తర్వాత సిలెండర్ అందుతోంది. దీంతో గృహిణులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరోవైపు ఒక సారి సిలెండర్ బుక్ అయిన తర్వాత కనీసం 20 రోజుల పాటు మరో సిలెండర్ బుక్ చేయడానికి వీలు ఉండదు. (ఈ నిబంధనలు ఒక కంపెనీ నుంచి మరో కంపెనీకు మారుతుంటాయి).
ఇటు వంటి సమస్యను పరిష్కరించడంలో భాగంగా గెయిల్ గ్యాస్ లిమిటెడ్ పైప్‌లైన్ ద్వారా గ్యాస్‌ను (పీఎన్‌జీ) సరఫరా చేయడానికి ముందుకు వచ్చింది. మహారాష్ట్రలోని దబోల్ నుంచి బెంగళూరు వరకూ 1,386 కిలోమీటర పొడవున పైప్‌లైన్ ఏర్పాటైంది. ఈ పైప్ లైన్ ద్వారా ప్రస్తుతం హెచ్.ఎస్.ఆర్ లేఅవుట్, బెల్లందూర్, సింగసంద్ర, డాలర్స్‌కాలనీ, మంగమ్మనపాళ్యలో సరఫరా చేయడానికి బృహత్ బెంగళూరు మహానగర పాలికే నుంచి అనుమతి కూడా పొందింది. పెలైట్ ప్రతిపాదికన ఇప్పటికే హెచ్‌ఎస్‌ఆర్ లే అవుట్ (సెక్టార్-2)లోని 225 ఇళ్లకు ఇప్పటికే పైప్ లైన్ ద్వారా గ్యాస్‌ను సరఫరా చేస్తేంది.
మరో 7,000 మంది పైప్ లైన్ ద్వారా గ్యాస్‌ను పొందడానికి వీలుగా ఇప్పటికే దరఖాస్తు చేసుకున్నారు. పీఎన్‌జీ కనెక్షన్ కోసం రూ.5,800 సెక్యూరిటీ డిపాజిట్‌గా కట్టాల్సి ఉంటుంది. ఇక గ్యాస్ బిల్లును రెండు నెలలకు ఒకసారి చెల్లించాల్సి ఉంటుంది. ఈ విషయమై సంస్థ ప్రతినిధి ఒకరు మాట్లాడుతూ... ‘ప్రస్తుతం గృహ అవసరాలకు మాత్రమే పైప్ లైన్ ద్వారా గ్యాస్‌ను సరఫరా చేస్తున్నాం, ప్రభుత్వం నుంచి అనుమతి లభిస్తే వాణిజ్య అవసరాలకు సంబంధించి కూడా గ్యాస్‌ను సరఫరా చేస్తాం. 2017 ఫిబ్రవరిలోపు నగరంలోని 25 వేల మందికి పైప్ ద్వారా గ్యాస్‌ను అందజేయాలన్నది లక్ష్యంగా నిర్ణయించుకున్నాం.’ అని పేర్కొన్నారు.