GAIL Gas Limited
-
మూడేళ్లలో రూ. 30 వేల కోట్లు...
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ గ్యాస్ దిగ్గజం గెయిల్ (ఇండియా) భారీ స్థాయిలో కార్యకలాపాలు విస్తరించనుంది. వచ్చే మూడేళ్లలో రూ. 30,000 కోట్లు ఇన్వెస్ట్ చేయనుంది. గెయిల్ (ఇండియా) వార్షిక సర్వ సభ్య సమావేశంలో పాల్గొన్న సందర్భంగా చైర్మన్ సందీప్ కుమార్ గుప్తా ఈ విషయాలు వెల్లడించారు. 2022–23 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ రూ. 10,000 కోట్ల మేర పెట్టుబడి వ్యయాలు చేసినట్లు వివరించారు. (ఉబెర్ 'గ్రూప్ రైడ్స్' ఫీచర్: ఎగిరి గంతేస్తున్న రైడర్లు) రాబోయే మూడేళ్లలో పైప్లైన్ల ఏర్పాటు, ప్రస్తుతం కొనసాగుతున్న పెట్రోకెమికల్ ప్రాజెక్టులు, నిర్వహణపరమైన పెట్టుబడులు, గ్రూప్ కంపెనీల్లో పెట్టుబడులు మొదలైన వాటి కోసం రూ. 30,000 కోట్లు ఇన్వెస్ట్ చేయనున్నట్లు గుప్తా చెప్పారు. ఇటీవలే కొనుగోలు చేసిన ప్రైవేట్ రంగ జేబీఎఫ్ పెట్రోకెమికల్స్‌తో తమ పోర్ట్‌ఫోలియోలో మరో కొత్త రసాయన ఉత్పత్తి (ప్యూరిఫైడ్ టెరిఫ్తాలిక్ యాసిడ్ – పీటీఏ) చేరినట్లు ఆయన తెలిపారు. మహారాష్ట్రలోని ఉసార్‌లో తాము తొలిసారిగా 50,000 టన్నుల ఐసోప్రొపైల్ ఆల్కహాల్ (ఐపీఏ) ఉత్పత్తి సామర్థ్యంతో స్పెషాలిటీ కెమికల్ ప్లాంటును ఏర్పాటు చేస్తున్నట్లు గుప్తా చెప్పారు. ఇలాంటి వాటి తోడ్పాటుతో తమ పెట్రోకెమికల్స్ / కెమికల్స్ పోర్ట్‌ఫోలియో సామర్థ్యం వార్షికంగా 3 మిలియన్ టన్నులకు చేరగలదని వివరించారు. అంతర్జాతీయంగా ఎల్ఎన్జీ (ద్రవీకృత సహజ వాయువు) దిగ్గజాల నుంచి దీర్ఘకాలికంగా కొనుగోళ్లు జరిపే అంశంపై కసరత్తు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. అటు సహజ వాయువులో హైడ్రోజన్‌ను ఏయే స్థాయిలో కలిపితే ఫలితాలు ఎలా ఉంటాయనే దానిపై అధ్యయనం చేస్తున్నట్లు గుప్తా చెప్పారు. -
లాభాల్లో ప్రభుత్వ కంపెనీ..షేర్ హోల్డర్లకి బంపరాఫర్!
న్యూఢిల్లీ: పీఎస్‌యూ యుటిలిటీ దిగ్గజం గెయిల్ (ఇండియా) లిమిటెడ్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి(2021–22) రెండో మధ్యంతర డివిడెండును ప్రకటించింది. వాటాదారులకు షేరుకి రూ. 5(50 శాతం) చొప్పున చెల్లించేందుకు బోర్డు అనుమతించినట్లు మహారత్న కంపెనీ గెయిల్ వెల్లడించింది. ఇందుకు ఈ నెల 22 రికార్డ్ డేట్‌కాగా.. మొత్తం చెల్లింపులకు రూ. 2,220 కోట్లకుపైగా వెచ్చించనుంది. కంపెనీ ఇప్పటికే 2021 డిసెంబర్లో షేరుకి రూ. 4 చొప్పున డివిడెండును చెల్లించింది. వెరసి ఈ ఏడాదిలో ఒక్కో షేరుకీ రూ. 9 చొప్పున మొత్తం రూ. 3,996 కోట్లకుపైగా డివిడెండు కింద వెచ్చిస్తున్నట్లు కంపెనీ చైర్మన్, ఎండీ మనోజ్ జైన్ వెల్లడించారు. ఇది కంపెనీ చరిత్రలోనే అత్యధికమని తెలియజేశారు! కాగా.. ప్రస్తుతం కంపెనీలో గల 51.45% వాటా ప్రకారం ప్రభుత్వం రెండో మధ్యంతర డివిడెండుకింద రూ. 1,142 కోట్లు అందుకోనుంది. చదవండి: మే 12వరకూ ఎల్ఐసీకి గడువు -
ట్యాపు తిప్పితే గ్యాస్
పైప్‌లైన్ ద్వారా వంట గ్యాస్ సరఫరా విజయవంతంగా 225 ఇళ్లకు సరఫరా త్వరలో నగరమంతటా విస్తరణకు గెయిల్ గ్యాస్ లిమిటెడ్ సన్నాహాలు బెంగళూరు: నగర మహిళలకు శుభవార్త. గ్యాస్ అయిపోయింది. ఎప్పుడు సిలెండర్ వస్తుందో అని చింతించనక్కరలేదు. 24 గంటల పాటు 365 రోజులూ కొళాయి తరహాలో పైప్‌లైన్ ద్వారా గ్యాస్ సరఫరా కానుంది. పెలైట్ ప్రతిపాదికన ఇప్పటికే 225 ఇళ్లకు పైప్‌లైన్ ద్వారా గ్యాస్‌ను విజయవంతంగా సరఫరా చేసి సంతృప్తికర ఫలితాలు పొందిన అధికారులు ఈ ప్రాజెక్టును నగరమంతటా విస్తరింపజేయడానికి ప్రణాళికలు రచిస్తున్నారు. ప్రస్తుతం వంటింట్లో గ్యాస్ అయిపోయిన తర్వాత గ్యాస్ బుక్ చేస్తే గరిష్టంగా పది రోజుల తర్వాత సిలెండర్ అందుతోంది. దీంతో గృహిణులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరోవైపు ఒక సారి సిలెండర్ బుక్ అయిన తర్వాత కనీసం 20 రోజుల పాటు మరో సిలెండర్ బుక్ చేయడానికి వీలు ఉండదు. (ఈ నిబంధనలు ఒక కంపెనీ నుంచి మరో కంపెనీకు మారుతుంటాయి). ఇటు వంటి సమస్యను పరిష్కరించడంలో భాగంగా గెయిల్ గ్యాస్ లిమిటెడ్ పైప్‌లైన్ ద్వారా గ్యాస్‌ను (పీఎన్జీ) సరఫరా చేయడానికి ముందుకు వచ్చింది. మహారాష్ట్రలోని దబోల్ నుంచి బెంగళూరు వరకూ 1,386 కిలోమీటర పొడవున పైప్‌లైన్ ఏర్పాటైంది. ఈ పైప్ లైన్ ద్వారా ప్రస్తుతం హెచ్.ఎస్.ఆర్ లేఅవుట్, బెల్లందూర్, సింగసంద్ర, డాలర్స్కాలనీ, మంగమ్మనపాళ్యలో సరఫరా చేయడానికి బృహత్ బెంగళూరు మహానగర పాలికే నుంచి అనుమతి కూడా పొందింది. పెలైట్ ప్రతిపాదికన ఇప్పటికే హెచ్ఎస్ఆర్ లే అవుట్ (సెక్టార్-2)లోని 225 ఇళ్లకు ఇప్పటికే పైప్ లైన్ ద్వారా గ్యాస్‌ను సరఫరా చేస్తేంది. మరో 7,000 మంది పైప్ లైన్ ద్వారా గ్యాస్‌ను పొందడానికి వీలుగా ఇప్పటికే దరఖాస్తు చేసుకున్నారు. పీఎన్జీ కనెక్షన్ కోసం రూ.5,800 సెక్యూరిటీ డిపాజిట్‌గా కట్టాల్సి ఉంటుంది. ఇక గ్యాస్ బిల్లును రెండు నెలలకు ఒకసారి చెల్లించాల్సి ఉంటుంది. ఈ విషయమై సంస్థ ప్రతినిధి ఒకరు మాట్లాడుతూ... ‘ప్రస్తుతం గృహ అవసరాలకు మాత్రమే పైప్ లైన్ ద్వారా గ్యాస్‌ను సరఫరా చేస్తున్నాం, ప్రభుత్వం నుంచి అనుమతి లభిస్తే వాణిజ్య అవసరాలకు సంబంధించి కూడా గ్యాస్‌ను సరఫరా చేస్తాం. 2017 ఫిబ్రవరిలోపు నగరంలోని 25 వేల మందికి పైప్ ద్వారా గ్యాస్‌ను అందజేయాలన్నది లక్ష్యంగా నిర్ణయించుకున్నాం.’ అని పేర్కొన్నారు.