న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ గ్యాస్ దిగ్గజం గెయిల్ (ఇండియా) భారీ స్థాయిలో కార్యకలాపాలు విస్తరించనుంది. వచ్చే మూడేళ్లలో రూ. 30,000 కోట్లు ఇన్వెస్ట్ చేయనుంది. గెయిల్ (ఇండియా) వార్షిక సర్వ సభ్య సమావేశంలో పాల్గొన్న సందర్భంగా చైర్మన్ సందీప్ కుమార్ గుప్తా ఈ విషయాలు వెల్లడించారు. 2022–23 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ రూ. 10,000 కోట్ల మేర పెట్టుబడి వ్యయాలు చేసినట్లు వివరించారు. (ఉబెర్ 'గ్రూప్ రైడ్స్' ఫీచర్: ఎగిరి గంతేస్తున్న రైడర్లు)
రాబోయే మూడేళ్లలో పైప్‌లైన్ల ఏర్పాటు, ప్రస్తుతం కొనసాగుతున్న పెట్రోకెమికల్ ప్రాజెక్టులు, నిర్వహణపరమైన పెట్టుబడులు, గ్రూప్ కంపెనీల్లో పెట్టుబడులు మొదలైన వాటి కోసం రూ. 30,000 కోట్లు ఇన్వెస్ట్ చేయనున్నట్లు గుప్తా చెప్పారు. ఇటీవలే కొనుగోలు చేసిన ప్రైవేట్ రంగ జేబీఎఫ్ పెట్రోకెమికల్స్‌తో తమ పోర్ట్‌ఫోలియోలో మరో కొత్త రసాయన ఉత్పత్తి (ప్యూరిఫైడ్ టెరిఫ్తాలిక్ యాసిడ్ – పీటీఏ) చేరినట్లు ఆయన తెలిపారు.
మహారాష్ట్రలోని ఉసార్‌లో తాము తొలిసారిగా 50,000 టన్నుల ఐసోప్రొపైల్ ఆల్కహాల్ (ఐపీఏ) ఉత్పత్తి సామర్థ్యంతో స్పెషాలిటీ కెమికల్ ప్లాంటును ఏర్పాటు చేస్తున్నట్లు గుప్తా చెప్పారు. ఇలాంటి వాటి తోడ్పాటుతో తమ పెట్రోకెమికల్స్ / కెమికల్స్ పోర్ట్‌ఫోలియో సామర్థ్యం వార్షికంగా 3 మిలియన్ టన్నులకు చేరగలదని వివరించారు. అంతర్జాతీయంగా ఎల్‌ఎన్‌జీ (ద్రవీకృత సహజ వాయువు) దిగ్గజాల నుంచి దీర్ఘకాలికంగా కొనుగోళ్లు జరిపే అంశంపై కసరత్తు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. అటు సహజ వాయువులో హైడ్రోజన్‌ను ఏయే స్థాయిలో కలిపితే ఫలితాలు ఎలా ఉంటాయనే దానిపై అధ్యయనం చేస్తున్నట్లు గుప్తా చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment